కొత్త తారల్లో నిలిచే తార ఎవరు? అసలు ఎవరైనా ఉన్నారా? చాలామందిని తొలుస్తున్న ప్రశ్నలివి. ఇప్పుడు ఏ తారని చూసినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవాళ్లే. కేవలం గ్లామర్‌ని నమ్ముకొని వస్తున్నందునే వాళ్లు ఎక్కువ కాలం వెండితెర మీద వెలగలేక పోతున్నారు. అందం ఏ కాస్త చెదిరినా వాళ్లకి మరో అవకాశమే ఉండటం లేదు. అంటే 'ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్' అనే మాట ఇక తెలుగు సినిసీమలో వినిపించే అవకాశాలు కూడా తక్కువే. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు చివరి ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున స్ఫురించే పేరు సౌందర్య. అవును. సౌందర్యతోటే తెలుగు సినిమా అసలు సిసలైన నాయిక కూడా మాయమైపోయింది.
అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా పరిశ్రమలోనూ మేల్ డామినేషన్ చాలా చాలా ఎక్కువ. నిర్మాతలు, సాంకేతిక నిపుణుల్లో ఆడవాళ్లని వేళ్లమీద లెక్కించవచ్చు. సినిమా అన్నాక హీరోయిన్‌తో పాటు అక్క, చెల్లి, వదిన, అమ్మ, అత్త, బామ్మ వంటి పాత్రలు వుంటాయి కాబట్టి, వాటిని మగాళ్లతో చేయించడం బాగోదు కాబట్టి, ఆ పాత్రల్లో ఆడవాళ్లని చూస్తున్నాం. ఇతర పాత్రల సంగతలా వుంచితే హీరోయిన్ పాత్రల్లో చాలా కాలం నుంచి రాణిస్తున్న నటి ఎవరు? అని భూతద్దం పెట్టి వెతికినా ఒక్కరూ అగుపించరు. దానికితోడు పేరుపొందిన హీరోలంతా ఎప్పటికప్పుడు కొత్త రుచులు కావాలన్నట్లు కొత్త తారల్నే కోరుకుంటున్నారు. ఫలితం.. రెండు మూడేళ్లలో ఆరేడు సినిమాల్లో కనిపించిన తారలంతా 'ఫేడవుట్' అయిపోతున్నారు.
ప్రస్తుత హీరోయిన్ల సంగతే చూసుకుంటే శ్రియ, త్రిష, జెనీలియా, ఛార్మి, ప్రియమణి, నయనతార, అనుష్క, కాజల్ అగర్వాల్, ఇలియానా వంటి తారల్లో ఏ ఒక్కర్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ అనలేం. ఛార్మి, అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో రాణించినా అది ఒకట్రెండు సినిమాలకే పరిమితమయ్యింది. 'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' సినిమాల్లో రాణించిన ఛార్మికి ఆ తర్వాత అన్నీ పరాజయాలే ఎదురవుతూ వస్తున్నాయి. అందుకు 'సై ఆట' పెద్ద ఉదాహరణ. 'అరుంధతి'తో సూపర్ హీరోయిన్ అయ్యిందనుకున్న అనుష్క సైతం ఆ తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోతోంది. 'పంచాక్షరి' ఫ్లాపవడం దీనికి నిదర్శనం. 'ఖలేజా'లో అయితే మహేశ్‌కి ఆమె సరైన జోడీ కాలేకపోయిందనే విమర్శలే ఎక్కువ. 'బొమ్మరిల్లు' సినిమాని తన భుజాలమీద లాక్కెళ్లిన జెనీలియా అంతకుముందు, ఆ తర్వాత కూడా అలాంటి ఫీట్ ప్రదర్శించలేకపోయింది. (ఇంకావుంది)
No comments:
Post a Comment