Showing posts with label telugu film industry. Show all posts
Showing posts with label telugu film industry. Show all posts

Thursday, November 26, 2015

Government Role for Telangana Cinema

తెలంగాణ సినిమా రావాలంటే...?

"చిత్ర పరిశ్రమ అవసరాలు ప్రభుత్వానికి తెలుసు. ఈ పరిశ్రమలోని అన్ని శాఖలూ అభివృద్ధి చెందడానికి సలహాలు ఇచ్చినట్లయితే ప్రభుత్వం సహాయం చేస్తుందని హామీ ఇస్తున్నాం. ప్రభుత్వమూ, సినీ పరిశ్రమ చేయీ చేయీ కలిపి పనిచేస్తే ఎంతో సాధించగలుగుతాం."
"ప్రజల అభిప్రాయాలపై సినిమాల ప్రభావం చాలా ఉండటం వల్ల మంచి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోట్ల మంది జనం సినిమాలకు వినోదం కోసమే వెళ్తున్నారనే విషయం గుర్తుంచుకొనే, ఆ వినోదాన్నిస్తూనే ప్రేక్షకుల నైతిక, సాంఘిక అభివృద్ధికి తోడ్పడే సినిమాలు తియ్యాలి."
ఇలాంటి మాటలు ప్రభుత్వాధినేతల నుంచి  ఇటీవల తరచూ వింటున్నాం. అయితే ఆ మాటలన్నీ కంటితుడుపువి అనేది నిజం. కొన్నేళ్లుగా మనం చూస్తూ ఉన్న తెలుగు సినిమాలు ఎంత దుర్బలంగా, అవినీతికరంగా, అసభ్యకరంగా ఉంటున్నాయో తెలిసిందే. వినోదం, వ్యాపార స్వేచ్ఛ అనే వాటిని అడ్డం పెట్టుకొని నిర్మాతలు, దర్శకులు తీస్తున్న అసహ్య, అసభ్య సినిమాలు సమాజ ఉన్నతిని ఎంతగా దిగజార్చుతున్నాయో అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇరుకు మనసులు కలిగినవాళ్ల సినిమాలు అభ్యుదయ నిరోధకంగా ఉంటున్నందున, అలాంటి సినిమాలపై కత్తి ఝళిపించాల్సిందే. కానీ ఆ పని చేయాల్సిన సెన్సార్ బోర్డులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోవడమే విచారకరం.
సమష్టి ప్రయోజనం కోసం సమష్టి పరిశ్రమ అనే ప్రాతిపదికమీదే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. సమష్టి పరిశ్రమలో వ్యష్టి త్యాగం అనేది అంతర్భాగం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధిక లాభాల కోసం వ్యాపారం చేసే వ్యక్తులు చూస్తూ చూస్తూ ఎలా త్యాగం చేస్తారు? అందువల్ల సమష్టి శ్రేయస్సు కోసం ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. సినీ పరిశ్రమ క్షేమం కోసం కొంతమంది వ్యక్తుల్లో పెచ్చుమీరిపోతున్న అవినీతిని అరికట్టేందుకైనా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంది. ఇండస్ట్రీలో నెలకొని ఉన్న అక్రమ వ్యాపారాన్ని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని కోసం శాసనాలు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడకూడదు. థియేటర్ల లీజు విషయంలో ఇంతవరకు సర్కార్లు ఎలాంటి జోక్యం చేసుకోకుండా చూస్తూ ఊరుకుంటున్నాయంటే లోపం ఎక్కడ ఉందో ఊహించుకోవాల్సిందే.
ఇప్పటికీ కాలం మించిపోలేదు. అవకాశాలు చెయ్యిదాటిపోలేదు. ప్రజల జీవితాల్లో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినీ పరిశ్రమను ప్రభుత్వపు అజమాయిషీ కింద ఉంచుకొని కళను పోషించాల్సిన అవసరం చాలా ఉంది. చలన చిత్రాలకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్రంలో ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయ్యాల్సిందిగా దేశానికి స్వతంత్రం వచ్చిన కొద్ది కాలానికే విఖ్యాత దర్శకుడు వి. శాంతారాం ప్రభుత్వానికి సూచించారు. అయితే నేటికీ అది సాఫల్యం కాకపోవడం శోచనీయం. సినిమాలు ఇప్పటికీ కేంద్రంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో భాగంగానే ఉంటున్నాయి. హైదరాబద్‌లో తెలుగు సినీ పరిశ్రమ వేళ్లూనుకున్నాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఓ భాగంగా ఉంటూ వచ్చిన ఆ శాఖ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో భాగమైంది.
సినీ పరిశ్రమలోని సమస్యల్ని, అక్కడి పరిస్థితుల్ని అర్థంచేసుకొని పరిశ్రమను నడిపిస్తూ, అవసరమైన సహాయం చేయడం ఈ మంత్రిత్వ శాఖ ఉద్దేశంగా ఉండాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అనేకసార్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో తెలుగు నిర్మాతల మండలి వాళ్లు, తెలంగాణ నిర్మాతల మండలి వాళ్లు తమ సాధక బాధకాలు చెప్పుకున్నా, ఇంతవరకు పరిశ్రమకు మేలు చేసే దిశగా ఒక్క చర్యా తీసుకోలేదు. తెలంగాణ సినిమా రావాలంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరమని ఒకటిన్నరేళ్లుగా తెలంగాణ సినిమా రూపకర్తలు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా ఆ వైపుగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తెలంగాణ సినిమా వృద్ధి చెందకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రయోజనం ఏమిటని ఇక్కడి నిర్మాతలు, దర్శకులు ప్రశ్నిస్తున్నారు.  ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి పనిచెయ్యకపోతే తెలంగాణ సినీ పరిశ్రమ అనేది వేళ్లూనుకోవడంలో చాలా జాప్యం జరిగే అవకాశం ఉంది. దీని విషయమై తెలంగాణ సినిమావాళ్లతో పాటు తెలంగాణ ప్రజా సమూహమంతా ఆందోళన చెయ్యాల్సి ఉంది.

Friday, November 20, 2015

Government Interference in Film Industry

చిత్ర పరిశ్రమ - ప్రభుత్వ జోక్యం

సినీ పరిశ్రమలో ప్రభుత్వ జోక్యం ఎంతవరకు ఉండాలి, అసలు ఉండవచ్చా? అనే చర్చ చాలా కాలంగా ఉంది. న్యాయానికి ఈ చర్చ రావలసింది కాదు. ఎందుకంటే, చిత్ర పరిశ్రమ ఇతర పరిశ్రమల మాదిరిగా నిత్యావసర వస్తువుల్ని ఉత్పత్తి చేసే పరిశ్రమ కాదు. వినోదం ప్రధానంగా ప్రజల్లో ఉన్నతాభిరుచులు పెంపొందించడానికి ఉపకరించేది. అంటే సాహిత్యంతో పోలినదన్న మాట. అయితే సాహిత్యం విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని మనం ఏ రకంగానూ ఒప్పుకోం. ఒప్పుకుంటే సాహిత్యకారుల ప్రతిభా పాటవాలూ, పరిశీలనా దృష్టి పనికిరాకుండా పోతాయి. కానీ చిత్ర పరిశ్రమలో ఈ సమస్య వచ్చింది. ఇందులో ప్రభుత్వ జోక్యం ఎంతవరకూ, ఏ విధంగా ఉండాలనేది చూడాలి. ఇవాళ సినిమాలు తీసేవాళ్లలో నూటికి 95% మందికి ధనార్జనే లక్ష్యం. మిగతా 5% మంది కళాత్మక దృష్టి ఉన్నవాళ్లు. చక్కని సినిమాలు తీసి, చరిత్రలో నిలిచిపోవాలనేది వాళ్ల ఆశయం.
ప్రభుత్వం ఈ పరిశ్రంలో జోక్యం చేసుకోవడం అంటే, నిర్మాతలకు అండగా ఉండి, వాళ్లకు చేయూతనివ్వాలి. ఇవాళ నిర్మాతలకున్న లోటుపాట్లు ప్రధానంగా పెట్టుబడి, థియేటర్ల లభ్యత. ఈ రెండింటి విషయంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనే భరోసా ఉంటే, నిర్మాతలు సమధికోత్సాహంతో చక్కని సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు. ఆ ప్రకారం ప్రజల్లో నూతన భావాల వ్యాప్తికీ, ఉన్నతాభిరుచులు కలగడానికీ ప్రభుత్వం దోహదమవ్వాలి.
ప్రభుత్వం ఆ భరోసా కలిగించినా నిర్మాతలు ఇప్పటిలాగే మూస ప్రేమకథలు, మూస వినోదాత్మక చిత్రాలు, బకరా కంటెంట్ సినిమాలు తీస్తూనే ఉంటారనే సందేహం రావచ్చు. అదే జరుగుతుంది కూడా. అందుకని నిర్మాతలు తమ బాధ్యతల్ని గుర్తించేట్లు నిబంధనలు, నిషేధాలు పెట్టవచ్చు. ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించిన మీడియాపైనే అలాంటి నిబంధనలు ఉన్నాయి కదా.
ఈ సందర్భంగా మీడియా ఎలాగైతే సమష్టిగా కొన్ని నియమ నిబంధనల్ని ఏర్పరచుకుందో, నిర్మాతలు కూడా అలాంటివి ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీనికి ఫిల్మ్ చాంబర్ కానీ, నిర్మాతల మండలి కానీ పెద్దరికం వహించవచ్చు. అలా చేస్తే నిర్మాతలపై ప్రభుత్వం విధి నిషేధాలు పెట్టే అవసరమే కలగకపోవచ్చు. ఏదేమైనా భావ స్వేచ్ఛకూ, సినీ పరిశ్రమ అభివృద్ధికీ భంగం కలగని రీతిలోనే ప్రభుత్వ జోక్యం ఉండాలి.
సినిమాల వసూళ్ల విషయంలో థియేటర్ల లీజుదారులు/యజమానులు, సినిమాల ఏజెంట్లూ కలిసి నిర్మాతల్ని మోసం చేస్తున్నారనీ, థియేటర్‌లోని ప్రేక్షకుల సంఖ్యకూ, వసూళ్లకూ మధ్య భారీ తేడా కనిపిస్తుంటున్నదనీ తరచూ ఆరోపణలు వస్తున్నాయి. అంటే నిజంగా వసూలైన దానికంటే నిర్మాతకు లేదా డిస్ట్రిబ్యూటర్‌కు తక్కువగా వసూలైనట్లు లెక్కలు చెబుతున్నారనేది ఆరోపణ. ఈ విషయాన్ని నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు నిర్మాతలు చెప్పి బాధపడ్డారు.
దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఆన్‌లైన్ టికెటింగ్ ఒక్కటే మార్గమని అంటున్నారు. అందులో నిజముంది కానీ, మళ్లీ దానిపేరిట సర్వీస్ చార్జ్ అని అదనంగా ప్రేక్షకుల నుంచి వసూలు చేయకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత.

Wednesday, August 14, 2013

మంచి కాలం వస్తుంది

చాలామంది విజ్ఞులు, సంస్కారవంతులు, పాత్రికేయులు, పెద్దలు, నిజంగా ఈ సినిమా పరిశ్రమ పట్ల ప్రేమాభిమానాలు కలవాళ్లు 'రోజు రోజుకీ రాసి హెచ్చుతున్నప్పటికీ వాసి తరిగిపోతోంది' అని బాధ పడుతున్నారు. నిజమే. తెలుగులో ఓ సామెత ఉండనే ఉంది - మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుందని. అందుచేత, సినిమాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వాటిలో సరుకు తగ్గడం సహజమే. ముఖ్యంగా పాశ్చాత్య చిత్రాలలోని హింసా, అశ్లీల శృంగార ప్రభావం మన చిత్రాల్లో బలంగా పాదుకుపోయాయి. ఇది మనకు బాధాకరమైన విషయమే. ఈ అనారోగ్యకరమైన పరిణామాలకు చిత్ర పరిశ్రమ బయట ఉన్న శ్రేయోభిలాషులు, హితులు ఎంతగా బాధపడుతున్నారో, ప్రతినిత్యం పరిశ్రంలో ఉండి పనిచేస్తున్న పలువురు పెద్దలూ బాధపడుతున్నారు.
అయితే క్రమక్రమంగా సినిమాలు చూసేవారి దృక్పథంలోనూ, తీసేవారి దృక్పథంలోనూ మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం కొద్దిమందైనా చక్కని మానవత్వపు విలువలున్న కథల్నీ, ప్రయోజనాత్మకమైన ఇతివృత్తాల్నీ ఎన్నుకొని, అత్యుత్తమమైన చిత్రాల్ని తీస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం. కొండ కొనకు చేరుకున్నది ఏదైనా కింద పడిపోక తప్పదు. ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్న అశ్లీల శృంగార, హింసా చిత్రాల గతి కూడా అంతే. పరిణామ సిద్ధాంతం ప్రకారం మంచి కాలం వస్తుందనే ఆశిద్దాం.