Showing posts with label india. Show all posts
Showing posts with label india. Show all posts

Saturday, March 19, 2016

Poetry: Nippu Kanam (Fire Cell)

నిప్పుకణం

నీది ఆత్మహత్య అయినా
రాజ్యం చేసిన హత్య అయినా
నీది సాదాసీదా మరణం కాదు
దేశం దేశాన్నే జ్వలింపజేసిన 
నిప్పుకణిక నీ మరణం

మొదట్లో నేనూ అనుకున్నాను
యుద్ధం మధ్యలో వెన్నుచూపిన భీరువువని
చావు తప్ప పరిష్కారం లేదనుకున్న పిరికివాడివని
ఇప్పుడు కళ్లకు కడుతోంది వీరుడా
యుద్ధం మధ్యలో ఆత్మాహుతి అంటే ఏమిటో
ప్రత్యర్థి వెన్నులో చలి పుట్టించడమంటే ఏమిటో

పుట్టుక నుంచే పెరిగిన ఇంటినుంచే
వివక్షను ఎదుర్కొన్నవాడివి
విశ్వవిద్యాలయంలో వివక్ష
నీకు పెద్దలెక్కలోనిది కాదు
అయినా నీ ఊపిరి నువ్వే తీసుకున్నావంటే
అన్యాయపు వేర్లు ఎక్కడిదాకా విస్తరించాయో
తెలిసొచ్చి నిర్లిప్తుడవై నిస్పృహుడవయ్యావేమో
కట్టలుగా పుట్టలుగా అడ్డుపడుతున్న
అవరోధాల్ని ఈడ్చిపారేయలేనని అనుకున్నావేమో

నువ్వు లేకపోయినా 
నీ మరణం ఎట్లాంటి జ్వాలను రేపిందో చూడు
ఎన్ని ప్రశ్నల్ని లేవనెత్తిందో చూడు
విద్యాలయాల్లో విద్యకు బదులు మితిమీరుతున్న 
రాజకీయాల జాడలు దిగ్భ్రాంతిపరుస్తున్నాయి
దుర్మార్గ దోపిడీ శక్తులు దట్టంగా అల్లుతున్న 
కులసూత్రాలు సాలెపురుగులా చంపుకుతింటున్నాయి 
చదువు కోసం వెళ్లిన కొడుకులు
క్షేమంగా ఇంటికొస్తాడో లేదోనని
అమ్మలు ఆందోళనపడుతున్నారు

నువ్వు అర్ధంతరంగా లోకాన్ని వదిలేశావు
పడమటి సూర్యుడిలా మాయమయ్యావు
నీకు తెలీదు.. నువ్విప్పుడు ఎంతమంది గుండెల్లో చిరంజీవివో
ఎంతమందిని ధీరులుగా మార్చేస్తున్నావో
నీకు తెలీదు.. నువ్వు గోడలో పాతుకొన్న రావిమొక్కవు
ఎన్నిసార్లు తుంచినా తిరిగి చిగురిస్తావు
నువ్విప్పుడు ఓటమిని ఒప్పుకున్న పరాజితుడివి కాదు
సహచరులకు యుద్ధాన్ని కొనసాగించే తెగింపునిచ్చిన విజేతవు

- 'స్వాప్నికుడి మరణం' పుస్తకం నుంచి

Wednesday, December 23, 2015

Utilize the Self Energy

స్వయం శక్తిని ఉపయోగపెట్టేదెప్పుడు?

మనం స్వతంత్రంగా వ్యవహరిస్తే తగినంత విదేశీ సహాయం మనకు లభించదు. విదేశీ సహాయంపై ఆధారపడిన రోజు స్వతంత్రంగా వ్యవహరించడానికి తగిన శక్తి మనకుండదు. విదేశీ సహాయం వల్ల జరిగే అభివృద్ధి విదేశాల ప్రయోజనాలకు భంగం కలగని విధానంలో జరుగుతుంది కానీ మన ఆర్థిక పరాధీనత మాత్రం తొలగదు. మనకు కావాల్సినత అంగబలం, అర్థ బలం ఉంది. సరైన ఆర్థిక విధానం ద్వారా ఈ అంగబలాన్ని అర్థబలంతో సమన్వయం చేస్తే ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం మనకు ఉండదు. ప్రజలకు పని కల్పించని, దేశంలోని అర్థబలాన్ని సమీకరించడానికి పూనుకోని ప్రణాళికలు తమ ప్రయోజనాన్ని సాధించలేవు.
విదేశీ సంస్థలు లాభాలుగా గడించిన కోట్లాది రూపాయలు దేశంనుంచి బయటకు వెళ్లిపోతున్నాయి. మనదేశంలోని పారిశ్రామిక సంస్థలు సంపాదించిన అధిక లాభాల్లో తగినంత భాగం తిరిగి ఉత్పత్తిని అభివృద్ధి చేసేందుకు వినియోగపడ్డం లేదు. దేశాభివృద్ధికి ఉపయోగపడకుండా వ్యర్థమవుతున్న ఈ అర్థబలం కొంతభాగమైనా ప్రణాళికా నిర్వహణకు సేకరించగలిగినప్పుడే ఏదైనా సాధించేందుకు వీలవుతుంది. కొనుగోలు శక్తి క్షీణించి ఇప్పటి ఉత్పత్తినే అనుభవించలేని స్థితిలో ప్రజలు ఉన్నప్పుడు ధరలు పెరిగితే వాళ్ల జీవన స్థాయి ఇంకా తగ్గుతుంది. ధరల్ని అదుపులో పెట్టడానికి తగిన పరిపాలనా సౌష్టవం మనకులేదనే సంగతి పప్పు ధాన్యాలు, ఉల్లిపాయలు, బియ్యం వంటి ఆహార పదార్థాల విషయంలో మనకు అనుభవమే. ప్రభుత్వం వడ్డీలకు రుణాల్ని తెస్తూ రకరకాల పన్నుల రూపంలో ప్రజల నుంచి వాటిని వసూలు చేస్తోంది. ఉన్నవాళ్ల సంపదను పెంచి, లేనివాళ్ల లేమిని పెంచే ఈ విధానం లోపభూయిస్థంగా ఉందనేది నిశ్చయం.
ప్రజల ఆదాయం పెరగాలంటే వ్యవసాయం వృద్ధి చెందాలి. నిరుద్యోగం పోవాలి. కానీ మనవద్ద ఈ రెండూ జరగడం లేదు. వ్యవసాయం లాభసాటి వృత్తిగా మారడం అటుంచి, రుణాల ఊబిలో చిక్కుకుపోతూ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఏటా వందలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘోరాన్ని చూస్తున్నాం. ఇక మనవద్ద ఉపాధి ఆశించిన మేరకు కనిపించకపోవడంతో ప్రతిభావంతులైన సాఫ్ట్‌వేర్, ఆర్థిక రంగ నిపుణులు ఇతర దేశాలకు తరలిపోతుండం మనకు ప్రత్యక్ష అనుభవం. సామాన్య ప్రజల వద్ద ఉన్నది శ్రమశక్తి మాత్రమే. దాన్నయినా వినియోగించుకోడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. శ్రమశక్తిని సంపదగా ప్రభుత్వం మార్చుకోగలిగితే, ఆ సంపదలో కొంతభాగం తిరిగి జాతీయాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గుర్తించాలి.