Saturday, March 19, 2016

Poetry: Nippu Kanam (Fire Cell)

నిప్పుకణం

నీది ఆత్మహత్య అయినా
రాజ్యం చేసిన హత్య అయినా
నీది సాదాసీదా మరణం కాదు
దేశం దేశాన్నే జ్వలింపజేసిన 
నిప్పుకణిక నీ మరణం

మొదట్లో నేనూ అనుకున్నాను
యుద్ధం మధ్యలో వెన్నుచూపిన భీరువువని
చావు తప్ప పరిష్కారం లేదనుకున్న పిరికివాడివని
ఇప్పుడు కళ్లకు కడుతోంది వీరుడా
యుద్ధం మధ్యలో ఆత్మాహుతి అంటే ఏమిటో
ప్రత్యర్థి వెన్నులో చలి పుట్టించడమంటే ఏమిటో

పుట్టుక నుంచే పెరిగిన ఇంటినుంచే
వివక్షను ఎదుర్కొన్నవాడివి
విశ్వవిద్యాలయంలో వివక్ష
నీకు పెద్దలెక్కలోనిది కాదు
అయినా నీ ఊపిరి నువ్వే తీసుకున్నావంటే
అన్యాయపు వేర్లు ఎక్కడిదాకా విస్తరించాయో
తెలిసొచ్చి నిర్లిప్తుడవై నిస్పృహుడవయ్యావేమో
కట్టలుగా పుట్టలుగా అడ్డుపడుతున్న
అవరోధాల్ని ఈడ్చిపారేయలేనని అనుకున్నావేమో

నువ్వు లేకపోయినా 
నీ మరణం ఎట్లాంటి జ్వాలను రేపిందో చూడు
ఎన్ని ప్రశ్నల్ని లేవనెత్తిందో చూడు
విద్యాలయాల్లో విద్యకు బదులు మితిమీరుతున్న 
రాజకీయాల జాడలు దిగ్భ్రాంతిపరుస్తున్నాయి
దుర్మార్గ దోపిడీ శక్తులు దట్టంగా అల్లుతున్న 
కులసూత్రాలు సాలెపురుగులా చంపుకుతింటున్నాయి 
చదువు కోసం వెళ్లిన కొడుకులు
క్షేమంగా ఇంటికొస్తాడో లేదోనని
అమ్మలు ఆందోళనపడుతున్నారు

నువ్వు అర్ధంతరంగా లోకాన్ని వదిలేశావు
పడమటి సూర్యుడిలా మాయమయ్యావు
నీకు తెలీదు.. నువ్విప్పుడు ఎంతమంది గుండెల్లో చిరంజీవివో
ఎంతమందిని ధీరులుగా మార్చేస్తున్నావో
నీకు తెలీదు.. నువ్వు గోడలో పాతుకొన్న రావిమొక్కవు
ఎన్నిసార్లు తుంచినా తిరిగి చిగురిస్తావు
నువ్విప్పుడు ఓటమిని ఒప్పుకున్న పరాజితుడివి కాదు
సహచరులకు యుద్ధాన్ని కొనసాగించే తెగింపునిచ్చిన విజేతవు

- 'స్వాప్నికుడి మరణం' పుస్తకం నుంచి

No comments: