‘‘వృత్తిపరమైన జీవితాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ బ్యాలెన్స చేసుకోవడం క్లిష్టంగానే ఉంటోంది. ఎందుకంటే మా అమ్మానాన్నలు చెన్నైలో ఉంటారు. నేను అటూ ఇటూ చక్కర్లు కొడుతుంటాను. వాళ్లకు నేనొక్కదాన్నే కూతుర్ని. ఇంట్లో అమ్మానాన్నలతో పాటు రెండు పిల్లులు కూడా ఉంటాయి. నా గురించి ‘నాకు ఒక్క కూతురే కానీ పదిమంది ఉన్నట్లుంటుంది’ అంటుంది అమ్మ. అలా అని బాగా అల్లరి పిల్లననుకునేరు. కాదు. కాకపోతే హైపర్ కిడ్‌ను. ఎక్కడా కాసేపు కూర్చోలేను. ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాను. కొత్త సినిమా మొదలైనప్పుడు అమ్మ నాతో పాటు వచ్చి ఓ వారం రోజులుండి చెన్నై వెళ్లిపోతుంది. నాన్ననూ, పిల్లుల్నీ చూసుకోవాలి కదా. ఆ తర్వాత నా విషయాలు నేనే చూసుకుంటాను.
నాన్న గవర్నమెంట్ ఉద్యోగిగా రిటైరయ్యి, సొంతంగా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. చెన్నైలో ఉంటే అమ్మ చేతి వంట తినడానికే ప్రాముఖ్యం ఇస్తా. హైదరాబాద్‌లో నన్ను కలవడానికి వచ్చే స్నేహితులు ఏవైనా తినడానికి తెస్తుంటారు. వాటిని ఎంత ఆప్యాయంగా తింటానో. హోటల్ భోజనం తినీ తినీ మొహం మొత్తిపోతుంటుంది. అందుకని వాళ్లు తెచ్చే వంటకాలే పరమాన్నం. బయట తిండి ఎక్కువ రోజులు తినాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు అమ్మ చేతి వంట తిందామా అని గుండె కొట్టుకుపోతుంది. పోయినేడాది అయితే షూటింగుల కారణంగా బయటే ఎక్కువగా గడపాల్సి రావడంతో నెల రోజులు కూడా అమ్మ వంటకాల్ని తినలేకపోయా.
మర్చిపోలేని క్షణాలు
మా స్వస్థలం చెన్నై. అక్కడే పుట్టి పెరిగాను. అక్కడి విమెన్స క్రిస్టియన కాలేజీ (డబ్ల్యుసీసీ)లో బీయస్సీ సైకాలజీ చేశాను. కాలేజీ వదిలిన ఐదేళ్ల తర్వాత ఇటీవల అక్కడ జరిగిన కల్చరల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లడం ఇప్పట్లో మర్చిపోలేను. ఆ రోజు ఎంత ఆనందంగా గడిచిపోయిందో! ప్రిన్సిపాల్, లెక్చరర్స్ చూపించిన ఆప్యాయతకు కళ్లు చెమర్చాయి. నిజానికి కాలేజీలో నేను బాగా అల్లరి చేసేదాన్ని. ఐదేళ్ల తర్వాత నన్ను చూసి నాకంటే వాళ్లే ఎక్కువ ఆనందపడ్డారు. చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యారు. వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే నా కళ్లూ తడయ్యాయి. అయితే అవి ఆనందభాష్పాలు. ఆ క్షణాల్ని ఎలా వర్ణించాలో తెలీడం లేదు నాకు. నేను అతిథిగా వెళ్లిన ప్రోగ్రామ్ పూర్తయి, వేరే ప్రోగామ్ జరుగుతున్నా, కదలాలనిపించక అక్కడే ఉండిపోయా. ఎవరి జీవితంలోనైనా కాలేజీ లైఫ్ అంత మధురమైన దశ ఇంకోటి ఉండదని ఎందుకంటారో ఆ క్షణాన నాకు అనుభవంలోకి వచ్చింది. మా ప్రిన్సిపాల్ ‘‘ఏంటే నువ్వు ఇలా తయారయ్యావ్? ఈ సల్వార్ ఏమిటి? ఈ జుట్టేమిటి? ఈ మేకప్పేమిటి? నిజంగా సెలబ్రిటీ అనిపించావ్’’ అని ఆశ్చర్యపోయింది. అప్పట్లో కాలేజీకి నేను షర్ట్, జీన్సలోనే వెళ్లేదాన్ని. చాలా కాజువల్‌గా కనిపించేదాన్ని.
స్నేహానికి ప్రాధాన్యం
నా జీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్లు డబ్ల్యుసీసీలోని నా క్లాస్‌మేట్సే. వాళ్లకు చాలా ప్రాముఖ్యం ఇస్తాను. ఇటీవల జనవరిలోనే ఓ ఫ్రెండ్ పెళ్లయింది. త్వరలో ఇంకో ఫ్రెండ్ పెళ్లి కాబోతోంది. మా ఫ్రెండ్స్ అందరం రెగ్యులర్‌గా వాట్స్‌పలో మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో మాదో గ్రూప్ ఉంది. నా సినిమా రిలీజయితే, ఎక్కడున్నా వెళ్లి సినిమా చూస్తారు. లేదంటే యూట్యూబ్‌లో చూస్తారు. వాళ్లెవరికీ తెలుగు తెలీదు. సబ్‌టైటిల్స్ చూసి అర్థం చేసుకుంటారు. సినిమాలో నేనెలా నటించానో, నా పాత్ర ఎలా ఉందో నిర్మొహమాటంగా చెబుతుంటారు. ‘ఆ సినిమాలో ఫలానా సీనలో నువ్వేసుకున్న డ్రస్ నచ్చలేదే’ అని కూడా చెప్పేస్తుంటారు. నాకు ఒంటరితనం లేకుండా చేసేది వాళ్లే. ఏమాత్రం తీరిగ్గా ఉన్నా, వాట్స్‌పలో వాళ్లతో మాట్లాడుతుంటా. నాకేదైనా సలహా కావాలనుకుంటే వాళ్లనే అడుగుతుంటా. వాళ్లు నన్ను ‘డ్రామా క్వీన’ అని ఆటపట్టిస్తుంటారు. ఎందుకంటే కాలేజీలో నేను చాలా నాటికలు, నాటకాల్లో నటించాను. పుస్తకాలు కూడా నాకు మంచి మిత్రులే. వీలున్నప్పుడల్లా పుస్తకాలు చదువుతుంటా. లేటె్‌స్టగా పాలో కొయిలో పుస్తకం ‘11 మినిట్స్’ పూర్తి చేశాను. కొయిలో పుస్తకాలంటే బాగా ఇష్టం. ఇంటర్‌లో ఉన్నప్పుడే ఆయన ప్రసిద్ధ రచన ‘అల్కెమిస్ట్’ చదివేశా. ఆయన లేటెస్ట్ బుక్ ‘అడల్టరీ’నీ చదివా.
ట్రెక్కింగ్ చేస్తాను
చదువుకునే రోజుల్నించీ నాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. చదువునూ, ఆటల్నీ సమన్వయం చేసుకునేదాన్ని. హైస్కూల్లో నేను స్కూల్ పీపుల్ లీడర్ (ఎస్‌పీఎల్)ని. బాస్కెట్‌బాల్ అడేదాన్ని. కేవలం చదువే లోకంగా బతక్కుండా అన్నింటికీ ప్రాముఖ్యం ఇవ్వాలని అమ్మ నేర్పించింది. అలాగే ఉండేదాన్ని. ఇప్పుడు చూస్తే.. పిల్లలకు చదువు తప్ప ఇంకో లోకం ఉండకూడదన్నట్లుగా చూస్తున్నారు తల్లిదండ్రులు. దాంతో చిన్నప్పట్నించే పిల్లలకు సోడాబుడ్డి కళ్లద్దాలు వచ్చేస్తున్నాయ్. అలా కాకుండా చదువుతో పాటు ఆర్ట్స్‌లో, స్పోర్ట్స్‌లో కూడా ఆసక్తి కలిగేలా చేస్తే మంచి వికాసంతో పెరుగుతారు. బేసికల్‌గా నాకు సాహస క్రీడలంటే ఇష్టం. ఇప్పుడు నటిని అయినా కూడా ట్రెక్కింగ్‌కు వెళ్తుంటాను. నల్లగొండ అడవుల్లో, తిరుపతి దగ్గర ఉన్న తడ అడవుల్లో ట్రెక్కింగ్ చేశాను. ఈ మధ్య మా ఫ్రెండ్ పెళ్లికని మేఘాలయకు వెళ్లినప్పుడు అక్కడ టూరా అడవుల్లో ట్రెక్కింగ్ చేశాను. 2800 మీటర్ల ఎత్తులో ఉన్న కొండల్ని ఎక్కడం ఓ మంచి జ్ఞాపకం. అక్కడి అల్లం, మిర్చి, టమోటా తోటల్లో ప్లకింగ్ చేశాను. అలాగే హాలిడేస్ దొరికితే చెన్నైలో సర్ఫింగ్‌కు, స్కూబా డైవింగ్‌కు వెళ్తుంటా.
పెద్ద కుటుంబానికి కోడలిగా
నేను మన సంప్రదాయాల్ని గౌరవిస్తాను. మనకు తెలీని అతీంద్రియ శక్తి ఉందని నమ్ముతాను. చర్చికి వెళ్తుంటాను. సహ జీవనంలో నాకు నమ్మకం లేదు. అందరి సమక్షంలో సంప్రదాయబద్ధంగా చేసుకునే పెళ్లిలో ఎంత ఆనందం, సందడి ఉంటాయి! అలాంటి సందడిని నేను ఇష్టపడతాను. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు కానీ పెళ్లి చేసుకుంటే పెద్ద కుటుంబం ఉన్న ఇంటికి కోడలిగా వెళ్లాలనేది నా కోరిక. అక్కడ తోడి కోడళ్లు, ఆడబిడ్డలు, మరుదులు వంటివాళ్లంతా ఉండి ఇల్లు కళకళలాడుతూ ఉండాలి. మాది చిన్న కుటుంబం కాబట్టి ఇలాంటి కోరిక ఏర్పడిందేమో తెలీదు. జగమంత కుటుంబానికి కోడలు అయితే బావుంటుందన్నది నా ఆశ.
No comments:
Post a Comment