Showing posts with label mana charitra. Show all posts
Showing posts with label mana charitra. Show all posts

Tuesday, August 16, 2011

మన చరిత్ర: ఆంధ్రరాష్ట్ర ఉద్యమం

ఆంధ్రరాష్ట్ర నిర్మాణావశ్యకత ఓ ఉద్యమంగా జనంలో పాకుతోంది. రాజమండ్రిలో జరిగిన ఓ సభలో టంగుటూరి శ్రీరాములు, మరికొంతమంది ఈ ఉద్యమం తమిళులతో కలిసి ఉండటంవల్ల కలిగే మంచిని గమనించక లేవదీసిందంటూ ప్రసంగించారు. దాంతో సభలో ఉన్న చిలకమర్తి లక్ష్మీనరసింహం చాలా ఉద్వేగంతో వారి వాదాన్ని ఖండిస్తూ ఆంధ్ర జనాభ్యుదయానికి ఆంధ్రరాష్ట్ర నిర్మాణం అత్యవసరమని గట్టిగా నొక్కి చెప్పారు. దాంతో ఆ సభాసదులందరూ అంగీకరించక తప్పింది కాదు.
1914 వేసవిలో విశాఖపట్నంలో మూడవ ఆంధ్ర మహాసభ అప్పటి కేంద్ర శాసనసభలో సభ్యులైన పానుగంటి రామారాయణిం అధ్యక్షతన జరిగింది. ఈ సభ ఆంధ్రరాష్ట్రాన్ని నిర్మాణం చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. ఈ ఆంధ్ర మహాసభ మోచర్ల రామచంద్రరావు, వరాహగిరి జోగయ్య, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా; కొండా వెంకటప్పయ్య కార్యదర్శిగా ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేసింది.
1915లో కాకినాడలో నాలుగో ఆంధ్ర మహాసభలు జరిగాయి. మోచర్ల రామచంద్రరావు అధ్యక్షత వహించారు. విశాఖపట్నం సభలవరకూ వీరు ఆంధ్రరాష్ట్ర నిర్మాణ ఉద్యమ విషయంలో అనుమానాలు వ్యక్తపరుస్తున్నా, కాకినాడ సభల నాటికి పూర్తిగా ఉద్యమాన్ని బలపర్చేవారుగా మారారు. సభలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి.
1916లో నెల్లూరు పట్టణంలో 5వ ఆంధ్రరాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సభలకు కొండా వెంకటప్పయ్య అధ్యక్షత వహించారు. వంగోలు వెంకటరంగయ్య పూనికతో సభల్ని నిర్వహించారు. సభలో ఆంధ్రరాష్ట్రానికి ప్రతికూలురు కూడా ఉన్నారు. అత్యధిక మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర తీర్మానం నెగ్గింది. కోడి రామ్మూర్తి, బయ్యా నరసింహేశ్వరశర్మ తదితరులు చాలా కృషిచేసి తీర్మానాన్ని నెగ్గించారు.
1917లో ఆరో ఆంధ్ర మహాసభ కడపలో జరిగింది. ఈ సభలకు నెమిలి పట్టాభిరామారావు అధ్యక్షత వహించారు. చాలా జయప్రదంగానే సభలు ముగిశాయి. ఈలోగా ఆంధ్రరాష్ట్ర నిర్మాణావశ్యకతను వివరిస్తూ, మొత్తం దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించడం అవసరమంటూ ఆంధ్రరాష్ట్ర స్థాయీ సంఘం పక్షాన న్యాపతి సుబ్బారావు, కొండా వెంకటప్పయ్య ఒక నివేదికను మాంటేగుకు సమర్పించారు.
1935లో ఆంగ్లేయులు సింధ్, ఒరిస్సాలను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేసేంతవరకూ ఇక్కడి ఆంధ్రరాష్ట్ర ఉద్యమంలో స్తబ్దత వచ్చింది. జాతీయోద్యమం సాగుతున్నా ఇది అంతగా ప్రస్ఫుటం కాకపోవడం గమనించాల్సిన విషయం.

Monday, August 15, 2011

మన చరిత్ర: ప్రథమాంధ్ర మహాసభ

జొన్నవిత్తుల గుర్నాధం సహాయంతో కొండా వెంకటప్పయ్య 'ఆంధ్రోద్యమము' అనే ఓ చిన్న పుస్తకాన్ని ఇంగ్లీషు, తెలుగుల్లో రాశారు. తెలుగుదేశంలో ప్రజల్ని స్వరాష్ట్ర వాంఛకు అనుకూలంగా తయారుచేయడానికి కొండా వెంకటప్పయ్య పర్యటన చేశారు.
పర్యవసానంగా బాపట్లలో 1913 ఎండాకాలంలో ప్రథమాంధ్ర మహాసభగా అవతరించింది. 800 మంది ప్రతినిథులొచ్చారు. ఈ సభలకు బయ్యా నరసింహేశ్వరశర్మ అధ్యక్షత వహించారు. తర్వాత ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని గూర్చి వేమవరపు రామదాసు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభలో చాలా కలకలం పుట్టింది. న్యాపతి సుబ్బారావు, మోచర్ల రామచంద్రరావు, గుత్తి కేశవపిళ్లె వంటివారు ప్రతికూలంగా ప్రసంగించారు. ఈ ముగ్గురూ వ్యతిరేకిస్తే ఈ ఉద్యమం ముందుకెళ్లదని సభ అభిప్రాయపడింది. ప్రజల్లో కూడా దీని గురించి మరింత విస్తృతంగా ప్రచారం జరగాలనీ, ఆ తర్వాత ఇలాంటి తీర్మానం చేస్తే ఉద్యమం బాగా వేళ్లూనుతుందనీ అందరూ అనడంతో దాన్నే తీర్మాన రూపంలో అంగీకరించడం జరిగింది. దీని ప్రచారకులు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, వల్లూరి సూర్యనారాయణరావు, కొండా వెంకటప్పయ్య. వీరు 1913 డిసెంబరులో తెలుగుదేశమంతా పర్యటించారు.
1914 ఎండాకాలంలో బెజవాడలో రెండో ఆంధ్ర మహాసభ జరిగింది. పెద్దిభోట్ల వీరయ్య, అయ్యదేవర కాళేశ్వరరావ్, అయ్యంకి వెంకటరమణయ్య తదితరులు దీనికి నడుంకట్టారు. హఠాత్తుగా వచ్చిన గాలివానతో బ్రహ్మాండమైన సభాస్థలి రెండుసార్లు నేలకూలింది. అయినా చివరకు సభలు ఉత్సాహపూరిత వాతావరణంలో న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన జరిగాయి. వేలాదిమంది ప్రతినిథులొచ్చారు. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని గూర్చీ, కొన్ని కాలేజీల్ని స్థాపించాలనీ, ఉద్యోగాల్లో ఆంధ్రులకు ఎక్కువ అవకాశాలివ్వాలనీ తెలిపే అనేక తీర్మానాల్ని సభ ఆమోదించింది. జోరున కురుస్తున్న వానను సైతం లెక్కచేయకుండా ప్రతినిథులు గొడుగులేసుకుని ఈ తీర్మానాల అంగీకారం వరకూ ఉండి ఆంధ్రరాష్ట్ర నిర్మాణం యెడల తమ దీక్షను ప్రకటించడం ఈ సభల ప్రత్యేకత. రాష్ట్ర ఉద్యమపథంలో ఇదో మైలురాయి.

Saturday, August 13, 2011

మన చరిత్ర: ఆంధ్ర రాష్ట్ర నిర్మాణావశ్యకత

బెంగాల్ విభజన ఆ రాష్ట్రవాసుల్లో ఉద్విగ్నతను రేపింది. ఆంగ్లేయులు ఉద్దేశపూర్వకంగా దేశీయులని చీల్చి సమైక్యతను నాశనం చేయడం చూసిన బిపిన్ చంద్రపాల్ దేశపర్యటనకు బయల్దేరాడు. జాతి జనుల్లో సంఘటిత శక్తీ, పోరాట పటిమా పెంచడం, విదేశీయుల దురన్యాయాల్ని ప్రజల దృష్టికి తేవడం ఆయన పర్యటనలో ఉద్దేశం. ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రజల్లో భాషా రాష్ట్రాల యెడ సుహృద్భావం అంకురించింది. అప్పటికే తెలుగునాట ఆంధ్రకేసరి, కృష్ణా పత్రిక వంటి కొన్ని పత్రికలు స్వరాష్ట్ర వాంఛను వ్యాసాల రూపంలో వెల్లడించనారంభించాయి. న్యాపతి నారాయణరావు భాసా ప్రాతిపదికపై ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచాలని మేల్ పత్రికలో ఒక లేఖ రాశాడు. కొండా వెంకటప్పయ్య ఆధ్వర్యంలో కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు కలిసి హైదరాబాద్‌లో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్థాపించారు. భాషాపరమైన రాష్ట్రాల గురించీ, జాతీయోద్యమాన్ని గురించీ సభలూ, సమావేశాలూ, చర్చలూ సాగిస్తుండేవారు. వారి కార్యక్రమంలో భాగంగా 1910లో 'ఆంధ్రుల చరిత్ర'ను ప్రకటించారు. తర్వాత గుంటూరు ఆంధ్ర యువజన సాహిత్య సంఘం వారు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణావశ్యకతను నొక్కి చెబుతూ ఓ తీర్మానం చేశారు.
1911 - ఆ మధ్యకాలంలో గుంటూరు, నెల్లూరు మెట్టభూములు వర్షాలు లేక పండలేదు. క్షామబాధ అధికమైంది. గుంటూరు జిల్లాలో తేలుకుట్ల దగ్గర కృష్ణకు ఆనకట్ట కట్టి, అక్కడనుండి కాలువలు తవ్వి పినాకినితో కలిపితే ఈ రెండు జిల్లాల మధ్య భాగం ఎప్పటికీ క్షామానికి గురికాదని ప్రజలు భావించారు. దీన్ని 'కృష్ణా రిజర్వాయర్ ప్రాజెక్ట్' అని పేరుపెట్టి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అనేక చర్యలు, విమర్శల తర్వాత ప్రభుత్వం దీనికి 7 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్లానులు, అంచనాలు సిద్ధమై పనులు ఆరంభానికి రంగమతా ఏర్పడింది. ఆ సమయంలో మెట్టూరు దగ్గర ఓ ఆనకట్ట 4 కోట్లతో కట్టడం అవసరమని చెబుతూ దాన్ని కొనసాగించాలని మద్రాసు శాసనసభ తీర్మానించింది. తెలుగు శాసన సభ్యులు కూడా తలవంచారు. దీంతో ప్రజల్లో క్రోధావేశాలు పెల్లుబికాయి.
ఆ సమయంలోనే నిడదవోలులో కొన్ని ఆంధ్ర మహాసభలు జరిగాయి. అప్పటికి గుంటూరు, కృష్ణా గోదావరి మండలాలన్నిటికీ కలిపి ఒకే కాంగ్రెస్ సంఘం ఉండేది. ఆ కాంగ్రెస్ సభ, సంఘ సంస్కరణ సభ, ఆంధ్ర ఆస్తిక సభలు జరపడానికి నిడదవోలు తయారైంది. ఆ కాంగ్రెస్ సభలకెళ్లినవాళ్లు గుంటూరు జిల్లాకొక ప్రత్యేక సంఘం ఉండాలని పట్టుబట్టారు. సభ అంగీకరించింది. అప్పుడే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణావశ్యకతను గూర్చి ఒక తీర్మానం వచ్చింది. అధ్యక్షులుగా ఉన్న వేమవరపు రామదాసు పంతులు ఇది విషయ నిర్ణయ సభ ద్వారా రాలేదు గనుక చర్చించరాదని తోసేశారు.

Wednesday, August 10, 2011

మన చరిత్ర: మొలకెత్తిన స్వరాష్ట్ర భావనలు

ప్రజలు మాట్లాడే భాషలో ప్రభుత్వాలు నడుస్తుంటే ప్రజలకూ, ప్రభుత్వానికీ మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. తమ దేశాన్ని తామే పరిపాలించుకోవాలన్న భావనలోనుండే తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవాలన్నది వచ్చింది. మరి ప్రాంతాల విభజన ఎలా జరగాలి అన్నప్పుడు ప్రజలు మాట్లాడే భాషాపరంగా అన్నది ఆచరణ యోగ్యం. ఆంగ్లేయుల పాలనా కాలంలో భారతదేశాన్ని తమ పాలనా సౌకర్యాన్ననుసరించీ, విభజించి పాలించాలన్న కుటిలనీతికి అనుగుణంగానూ, ఒకే భాష మాట్లాడే ఒకే జాతి ప్రజల్ని ముక్కచెక్కలుగా చీల్చి వివిధ ప్రాంతాలుగా విభజించారు.
ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష పెరుగుతున్న కొద్దీ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావాన్ని కూడా ఆశించడం ఆరంభమైంది. 1907లో సూరత్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో స్వరాజ్య సాధనే రాజకీయ పరమావధిగా ఉండాలని దాదాభాయి నౌరోజీ అన్నారు. సూరత్ సభలకు కాంగ్రెస్ చరిత్రలో ప్రధాన స్థానం ఉంది. మితవాద వర్గాలు ఫిరోజ్‌షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, గోఖలేల నాయకత్వాన ఉంటుండేవి. మహారష్ట్రలో తిలక్, పంజాబ్‌లో లాలాలజపతి రాయ్, బెంగాల్‌లో బిపిన్ చంద్రపాల్‌తో పాటు అనేకమంది వీరులు అతివాదులుగా స్వరాజ్య నినాదంతో చెదురు మదురుగా ఉంటుండేవారు. తిలక్ నాయకత్వాన సూరత్‌లో కాంగ్రెస్‌లోని అతివాదులు సమీకృతులయ్యారు. మితవాదులు సూరత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రాస్‌విహారీ ఘోష్ పేరును ప్రతిపాదిస్తే, వెంటనే తిలక్ లేచి లజపతిరాయ్ పేరును ప్రత్యామ్నాయంగా సూచించాడు. అప్పటివరకూ కాంగ్రెసే మెహతా, మెహతాయే కాంగ్రెస్ అనే భావన ఉండేది. అది బద్దలైంది. ఈ సభలకు మద్రాసు ప్రాంతం నుండి టంగుటూరి ప్రకాశం, వి. కృష్ణస్వామయ్యర్, నటేశన్, దొరస్వామయ్యర్, చక్రయ్యశెట్టి తదితరులు అనేకులు వెళ్లారు. ఎప్పుడైతే ప్రత్యామ్నాయ సూచన తిలక్ చేశారో సభలో గందరగోళం, అలజడి చెలరేగింది. సభ్యులు బాహాబాహీ తలపడ్డారు. కుర్చీలు విసురుకున్నారు. తలలు పగిలాయి. మితవాదులు కంగుతిన్నారు. అతివాదులు పుంజుకున్నారు. అయినా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ మితవాదుల కొద్దిపాటి ప్రభావం కిందే తర్వాత లక్నో కాంగ్రెస్ దాకా నడిచింది.
బీహార్, బెంగాల్ విభజన.. అటు దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్నీ, ఇటు లోలోపల రగుల్కుంటున్న తెలుగువారిలోని స్వరాష్ట్ర భావాలనూ జ్వాలామానం చేసింది. అప్పటివరకూ కాంగ్రెస్‌లోని వర్గాలు స్వల్ప సంస్కరణల కోసం అంటే నిర్బంధోచిత ప్రారంభ విద్య, న్యాయశాఖా కార్య నిర్వాహక శాఖల విభజన, దేశీయులకు ఉన్నతోద్యోగాలివ్వమని ప్రాధేయపడటం, శాసన సభల్లో సభ్యుల సంఖ్య పెంచమని అర్థించడం, ఐ.సి.ఎస్. పరీక్షల్ని ఇండియాలో కూడా జరిపించమని మహజర్లు పెట్టడంలాంటి పనులతోనే సరిపుచ్చుకునేవి. క్రమంగా తిలక్, దాదాభాయి నౌరోజీ చొరవతో కొంత అతివాదం వైపు మొగ్గింది. ఐతే అది 1917 దాకా స్థిరరూపం దాల్చలేదు. కాంగ్రెస్‌లో ఉంటున్న తెలుగు వ్యక్తుల్లో స్వరాష్ట్ర కాంక్ష ఈ మధ్యకాలంలోనే నారుబోసుకుంటోంది. అదే 1917లో ఆంధ్ర ప్రాంతాలకు ప్రత్యేకంగా రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ఏర్పాటుకు దారితీసింది.
రిఫరెన్స్: టంగుటూరి ప్రకాశం 'నా జీవిత యాత్ర'.

Tuesday, August 9, 2011

మన చరిత్ర: అందరిదారీ అ.ర.సం. వైపే!

1943 వేసవిలో బొంబాయిలో అఖిలభారత అభ్యుదయ రచయితల సభలూ, ప్రజా నాట్యమండలి సభలూ జరిగాయి. అక్కడున్న కొయాజీ జహంగీర్ హాలులో జరిగిన ఈ సభలకు తెలుగు నాట నుండి పెద్ద ప్రతినిథి వర్గమే వెళ్లింది. సెట్టి ఈశ్వరరావు, కె.ఎస్. ప్రకాశరవు, చదలవాడ పిచ్చయ్య, కొడవటిగంటి కుటుంబరావు, తుమ్మల వెంకటరామయ్య తదితరులెందరో ఆ ప్రతినిథివర్గంలో ఉన్నారు. అఖిలభారతంగా ఉండే ప్రముఖ రచయితలందరూ వచ్చారు.
అప్పటినుండీ క్రమంగా అభ్యుదయ రచయితల ఉద్యమం ఆంధ్రలో బాగా వేళ్లూనింది. 1944 రెండవ మహసభల్లో చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయ చరిత్రను ప్రకటించి వారికి బహూకరించింది. తెలికచర్ల వెంకటరత్నం, అడివి బాపిరాజు వంటి వాళ్లతో సహా మొత్తం నవ్య సాహిత్య పరిషత్తు అంతా ఇందులో కలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపత్తి పెరిగింది. 'తెలుగు తల్లి' పత్రికను తీసికొని నడిపారు. 1946లో పెదపూడి (తూ.గో. జిల్లా)లో సాహిత్య పాఠశాల నిర్వహించారు. దాన్ని 'ప్రజా విశ్వవిద్యాలయం'గా నాడు రచయితలు ప్రశంసించారు. సాహితీరంగంలో ప్రసిద్ధులందరూ పాల్గొన్నారు.
1946లో దేవలపల్లి కృష్ణశాస్త్రి అధ్యక్షతన, శ్రీశ్రీ ప్రారంభకులుగా రాజమండ్రిలో మూడవ మహాసభలు జరిగాయి. జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి వంటి వ్యక్తులు ఖాకీ నిక్కరు తొడుక్కుని వలంటీర్లుగా ఆ సభల్లో పనిచేశారు. 1946 నుండే సంఘం 'అభ్యుదయ' పత్రికను నిర్వహించడం మొదులుపెట్టింది. 1947లో నాలుగో మహాసభలు మద్రాసులో జరిగాయి. రాజమన్నారులాంటి వ్యక్తులు ఉద్యమంలోకి వచ్చారు. పల్లెకోన (గుంటూరు జిల్లా)లో 1947లోనే సాహిత్య పాఠశాల జరిగింది.
1955లో సంఘం ఐదవ మహాసభలు విజయవాడలో జూలై 30, 31 తేదీల్లో జరిగాయి. ఉప్పల లక్ష్మణరావు ఆహ్వాన సంఘాధ్యక్షులు. సభలకు శ్రీశ్రీ అధ్యక్షత వహించారు. తెలుగుదేశంలో రచయితలూ, కవులూ, కళాకారులందరూ వచ్చారు. ఈ సభలు చేసిన అనేక తీర్మానాల్లో వ్యావహారిక భాషావ్యాప్తికి ఓ సంఘాన్ని వేసి విశ్వవిద్యాలయాల్లో దానికోసం పోరాడాలన్నది ఓ తీర్మానం. ఆ ఉపసంఘలో తాపీ ధర్మారావు, గిడుగు సీతాపతి, తెలికచర్ల వెంకటరత్నం, కొడవటిగండి సభ్యులు. శ్రీశ్రీ కన్వీనర్.

Sunday, August 7, 2011

మన చరిత్ర: తెలుగునాట ఆభ్యుదయ రచయితల సంఘ ఆవిర్భావం

1936 నాటికి తెలుగుదేశంలో కమ్యూనిస్టు భావాలు ప్రచారంలో ఉన్నాయి. అబ్బూరి రామకృష్ణారావు తదితరులు మొదట ఏర్పడ్డ కమ్యూనిస్టు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. సాహిత్యపరంగా భావ కవిత్వం ఉచ్ఛ దశలో ఉంది. నవ్య సాహిత్య పరిషత్తు ఆరంభమైంది. కొత్త గాలులు వీస్తున్నాయి. 'ప్రతిభ' పత్రిక మొదలైంది. భాషాపరంగా గిడుగు రామ్మూర్తి ఉద్యమం తీవ్రదశకెళ్లింది. చలన చిత్రాలు ఆవిర్భవించాయి. రాజకీయంగా ఫ్యూడలిజం భావాలున్న పక్షాలు జాతీయ వ్యతిరేక వైఖరితో నగ్నంగా తెలుగు జనం ముందు నిల్చున్నాయి. దిన పత్రికా రచనలో మార్పూ మొదలైంది. ఇలాంటి రంగంలో కొత్త తాత్విక చింతన, సమసమాజ భావాలు, తెలుగునాట మొలకెత్తాయి.
1938-39 లలో కాంగ్రెస్ సభలకొచ్చిన రచయితలనుద్దేశించి సరోజినీ నాయుడు ప్రసంగించింది. దేశవ్యాప్తంగా అభ్యుదయ రచయితల సంఘ నిర్మాణానికి రాష్ట్రాలకు బాధ్యుల్ని ఆ సభ నిర్ణయించింది. అందులో క్రొవ్విడి లింగరాజు, తుమ్మల వెంకటరామయ్యకు ఆంధ్ర ప్రాంతం కేటాయించారు. వీరు తెలుగుదేశంలో తిరిగి రచయితల్ని అభ్యుదయ రచయితల సంఘ నిర్మాణానికి సుముఖులుగా చేయడం ఆరంభించారు. రెండవ ప్రపంచ యుద్ధం రావడం, నాజీ భావాల్ని తిరస్కరించాలన్న భావానికి దృఢత్వం కలగడంతో పాటు, సోషలిజం రావాలన్న ఆశయం కూడా రచయితల్లో వేళ్లూనింది. దేశ స్వాతంత్ర్యం అనే అంశం మీద భావకవిత్వం రాసేవారూ, వామపక్ష భావాలున్న రచయితలూ అందరూ సమైక్యమయ్యారు. 1942 డిసెంబరులో అభ్యుదయ రచయితల మహాసభలకు ఆహ్వాన సంఘం ఏర్పడి ప్రచారం ఆరంభించింది. కవితా సమితిలోని వాళ్లూ, నవ్యసాహితీ పరిషత్తులోని వాళ్లూ, అప్పటివరకూ ఏ సంఘంలోనూ సభ్యులుగా లేనివాళ్లూ, కమ్యూనిస్టు భావాలున్న రచయితలూ, కవులూ ఈ సంఘ స్థాపనలో కలిసొచ్చారు. 1943లో తెనాలిలో ఫిబ్రవరి 3, 4 తేదీల్లో మొదటి మహాసభలు జరిగాయి. తాపీ ధర్మారావు అధ్యక్షత వహించారు. 61 మంది సభ్యులుగానూ, 34 మంది ప్రతినిథులుగానూ హాజరయ్యారు. రాయిస్టులుగా ఉండే గోపీచంద్, బైరాగి వంటివాళ్లు సభలో గొడవచెయ్యాలని చూశారు. సభలకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచారు. కానీ స్థానికులు రావి అమ్మయ్య తదితరులు వాళ్ల ఆటల్ని సాగనివ్వలేదు. నిరాటంకంగా సభలు జరిగాయి. ఈ సభలకు శ్రీశ్రీ హాజరు కాలేదు.
రిఫరెన్స్: ఆంధ్ర అభ్యుదయ రచయితల మహాసభల సంచిక, 1943 మార్చి.

Saturday, August 6, 2011

మన చరిత్ర: అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం

రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో, అందులోనూ సామ్రాజ్యవాద దేశాల్లో ఆర్థికంగా చాలా వత్తిడులూ, కుదుపులూ కలిగాయి. వాటి దుష్పరిణామాలు, ప్రభావాలు సాహిత్య కళారంగాల మీద కూడా ప్రసరించాయి. పలాయన వాదం, ఫాసిజాలు, శుద్ధకళావాదాలు, నైరూప్య సిద్ధాంతాలూ ప్రచారంలో ఉండేవి. ఇవి ప్రజల మానసిక ఆరోగ్యానికి చాలా ప్రమాదకరాలుగా గుర్తించిన రచయితలు, కళాకారులు వీటినుండి విముక్తి కావడానికి ప్రయత్నించారు. అందుకు ఓ ఉద్యమం అవసరమన్న అంశాన్ని గుర్తించారు.
సరిగ్గా ఇదే కాలంలో, అంటే 1935లో 'సంస్కృతీ రంగంలో కమ్యూనిస్టుల పోరాటం' అనే వ్యాసం బయటకు వచ్చింది. దీని రచయిత జార్జ్ డిమిట్రోవ్. బ్రిటీషు కార్మిక వర్గం ఆర్థిక సంక్షోభ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొంటూనే దాన్ని ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమంగా మార్చి ఐక్య సంఘటనగా ముందుకెళ్లాలని భావించింది. ఇవే భావాలు ప్రపంచంలో వలస రాజ్యాల్లోని, సామ్రాజ్యవాద దేశాల్లోని అభ్యుదయ కాముకుల్లో ఉండేవి. అలాంటి సాహితీవేత్తల సమావేశం 1935లో లండన్‌లోని ఓ చైనా వారి హోటల్లో జరిగింది. ఆ సమావేశంలో రాల్ఫ్ ఫాక్స్ లాంటి ప్రముఖ రచయితలతో పాటు భారతీయ రచయితలు సజ్జాద్ జహీర్, ముల్క్‌రాజ్ ఆనంద్, ఫైజ్ అహ్మద్ ఫైజ్ కూడా హాజరయ్యారు. వీళ్లంతా ఆ సంవత్సరం ఓ చిన్న ప్రణాళికను తయారు చేశారు. ఇంగ్లీషులో దాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
సమాజ పరిస్థుతుల్ని నిరాకరించే పలాయనవాద సాహిత్యానికీ, సామ్రాజ్యవాదానికీ, ఫాసిజానికీ వ్యతిరేకంగా నిల్చునే సాహిత్య సృష్టి చేయడం, భారతదేశంలో సామ్రాజ్యవాద పాలనకు వ్యతిరేకంగా రచయితల్ని సమీకరించడం, సాహిత్యంలో వాస్తవికతకు పునాదులు వెయ్యడం ఈ ప్రణాళిక లక్ష్యాలు.
ఈ లక్ష్యాల్ని చర్చించి ఓ సంఘానికి నిర్మాణ రూపం ఇచ్చేందుకు 1936లో ఫ్రాన్సులో సమావేశమవుతున్న రచయితల సభలకు వెళ్లాలనుకున్న ముల్క్‌రాజ్ ఆనంద్, సజ్జాద్ జహీర్‌లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించి పి.ఇ.ఎన్. (పొయెట్స్, ఎస్సేయిస్ట్స్ అండ్ నావలిస్ట్స్) సభ్యులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ సంఘంలో సభ్యులు ఓరకంగా మితవాదులు.
ఈ పరిస్థితుల్లో లక్నోలో 1936లో మున్షీ ప్రేంచంద్ అధ్యక్షతన అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరీ, నాజీ-ఫాసిస్టు వ్యతిరేక వైఖరీ ఉంటూ దేశ స్వాతంత్ర్య పోరాట భావాలతో జనాన్ని కదిలించాలి అనే భావాలున్న అనేకమంది రచయితలు ఆ సభలకెళ్లారు. ఆంధ్ర ప్రాంతం నుండి అబ్బూరి రామకృష్ణారావు, సోమంచి యజ్ఞన్నశాస్త్రి ఆ సభల్లో పాల్గొని వచ్చారు.
రిఫరెన్స్: ఏ.బి.కె. ప్రసాద్ వ్యాసం, శ్రీశ్రీ షష్ఠిపూర్తి సన్మాన సంచిక - విశాఖపట్నం, 1970.