Showing posts with label soundarya. Show all posts
Showing posts with label soundarya. Show all posts

Thursday, December 22, 2011

బిగ్ స్టోరీ: బాలీవుడ్ పొమ్మంది.. టాలీవుడ్ రమ్మంది!!

రెండు దశాబ్దాల నుంచీ తెలుగులో పరభాషా హీరోయిన్‌లే రాజ్యం చేస్తున్నారని మనకు తెలుసు. కన్నడ నటి సౌందర్యను మినహాయిస్తే మిగిలినవాళ్లలో ఎక్కువమంది బాలీవుడ్ తిరస్కారానికి గురై అక్కడి నుంచి వచ్చినవాళ్లే కావడం గమనార్హం. నిన్న మొన్నటిదాకా తెలుగు తెరపై నగ్మా, అంజలా ఝవేరీ, సిమ్రాన్, సోనాలీ బెంద్రే, ఆర్తీ అగర్వాల్, శ్రియ, రీమాసేన్, జెనీలియా ఓ వెలుగు వెలగగా ఇప్పుడు కాజల్ అగర్వాల్, తమన్నా, హన్సిక, శ్రుతిహాసన్ రాణులుగా చలామణీ అవుతున్నారు.
ఎనభైల చివర్లో బాలీవుడ్ భామల్ని నిర్మాతలు తెలుగులోకి తీసుకు రావడమనే ట్రెండ్ మొదలైంది. దాంతో పాటే హీరోయిన్‌కూ, వ్యాంప్‌కూ మధ్య ఉండే గీత చెరిగిపోయి, హీరోయిన్‌లో వ్యాంప్ మిళితమైపోయింది. వ్యాంప్ వేసే పొట్టి దుస్తులు హీరోయిన్ వొంటిమీదకు చేరాయి. హీరో సరసన ఓ 'ఆడబొమ్మ'గా రూపుదాల్చిందామె. 'కలియుగ పాండవులు' (1986)తో ఖుష్బూ, 'కిరాయి దాదా' (1987)తో అమల, 'సామ్రాట్' (1987)తో సోనం టాలీవుడ్‌కు పరిచయమై బాలీవుడ్ నుంచి హీరోయిన్ల దిగుమతి అనే ధోరణికి తెరతీశారు. అప్పట్నించీ టాలీవుడ్‌లో బాలీవుడ్ తారల ప్రవాహం మొదలైంది. 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమాతో దేశవ్యాప్తంగా యువతరంలో గుబులురేపిన జుహీ చావ్లా  'ముగ్గురు కొడుకులు' (1988)లో నటించి, తెలుగు ప్రేక్షకుల ఆదరణని చూరగొంది. రాజీవ్ రాయ్ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్ సినిమా 'విశ్వాత్మ'తో హీరోయిన్‌గా పరిచయమైనా, ప్రేక్షకుల గుర్తింపుపొందని దివ్య భారతి 'బొబ్బిలి రాజా' సినిమాతో టాలీవుడ్‌లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తమ తొలి హిందీ సినిమాల్లో పేరు తెచ్చుకోకముందే తెలుగులో ప్రీతీ జింటా 'ప్రేమంటే ఇదేరా'తో, అమీషా పటేల్ 'బద్రి'తో తెలుగులో సక్సెస్ సాధించారు. వీరిలో కొంతమంది తారలు అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ రాణించగా, కొంతమంది తారలు బాలీవుడ్‌లో ఫయిలై, తెలుగులో టాప్ స్టార్లుగా రాణిస్తూ వచ్చారు. పర్ఫార్మెన్స్ కంటే గ్లామర్, ఎక్స్‌పోజింగ్ హీరోయిన్‌కు ప్రాథమిక అర్హత కావడంతో కొత్త ధోరణికి ద్వారాలు తెరుచుకున్నాయి. దివ్యభారతి తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా నగ్మా పేరు తెచ్చుకుంది. సల్మాన్‌ఖాన్ సరసన 'బాజీ' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె 'పెద్దింటల్లుడు' (1991) చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి కనిపించింది. 'కిల్లర్', 'ఘరానా మొగుడు' (1992) సినిమాలతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అప్పట్నించీ బాలీవుడ్ భామలకు తెలుగులో మరింత గిరాకీ. 
మధుబాల, అంజలా ఝవేరీ, సాక్షి శివానంద్, సిమ్రాన్, రీమాసేన్, శ్రియ, ఆర్తీ అగర్వాల్ వంటివాళ్లు తెలుగు తెరకు పరిచయమై వరుస అవకాశాలు పొందుతూ వచ్చారు. హిందీలో 'తేరే మేరే సప్నే' తర్వాత సరైన అవకాశాలు రాని సిమ్రాన్ తమిళంలో సక్సెస్ సాధించి, తెలుగులో 'కలిసుందాం రా' (2000) వంటి సూపర్ హిట్ సినిమాతో తారాపథానికెగసింది.
ఇక 'ఇష్టం' వంటి ఫ్లాప్ సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన శ్రియ 'సంతోషం' హిట్టయ్యాక వెనుతిరిగి చూడలేదు. కానీ బాలీవుడ్‌లో స్థానం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సోనాలీ బెంద్రేకు హిందీలో 'సర్ఫరోష్' మినహా చెప్పుకోవడానికి మరో సినిమా ఏదీ లేదు. కానీ తెలుగులో తొలిసారి 'మురారి' సినిమాలో నటించాక ఆమెకు  ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక్క 'పలనాటి బ్రహ్మనాయుడు' తప్పితే ఆమె నటించిన తెలుగు సినిమాలన్నీ విజయం సాధించాయి. 
'చిత్రం', 'మనసంతా నువ్వే' సినిమాల్లో మంచి పాత్రలు చేసి, యువతరాన్ని ఉర్రూతలూగించిన రీమాసేన్ అనంతరం సెక్స్ సింబల్‌గా పేరు తెచ్చుకుంది. ఫర్దీన్‌ఖాన్ సరసన ఆమె చేసిన హిందీ సినిమా 'హం హో గయే ఆప్కే' డిజాస్టర్ కావడంతో బాలీవుడ్‌లో ఆమెకు చోటు లభించలేదు. హిందీలో 'పాగల్‌పన్'తో తెరంగేట్రం చేసిన ఆర్తీ అగర్వాల్‌కు మరో బాలీవుడ్ అవకాశం అందని ద్రాక్షే అయింది. కానీ తెలుగులో చేసిన తొలి సినిమా 'నువ్వు నాకు నచ్చావ్'తో ఇక్కడి యువత ఆరాధ్య తారగా మారింది. ఇప్పుడు వీళ్లంతా కళా విహీనమైతే వారి స్థానాల్లో జెనీలియా, కాజల్ అగర్వాల్, హన్సిక, తమన్నా, శ్రుతిహాసన్ వచ్చారు. 
'తుఝే మేరీ కసం'తో జెనీలియా, 'క్యూన్.. హో గయా నా'తో కాజల్ అగర్వాల్, 'ఆప్ కా సురూర్'తో హన్సిక, 'చాంద్ సా రోషన్ చెహ్రా'తో తమన్నా, 'లక్'తో శ్రుతిహాసన్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అయితే ఆ సినిమాల తర్వాత వారికి అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో దక్షిణాదివైపు చూపు సారించారు. తెలుగులో వరుస అవకాశాలతో యూత్ ఐకాన్స్‌గా మారిపోయారు. ఈ అయిదుగురిలో కాజల్, తమన్నా చక్కని అవకాశాలతో అగ్ర నాయిక రేసులో దూసుకుపోతున్నారు. జెనీలియాకు పదేళ్ల తర్వాత బాలీవుడ్ ఛాన్సులు తలుపు తడుతున్నాయి. కమలహాసన్ కూతురు శ్రుతిహాసన్‌కు ఇప్పుడిప్పుడే అగ్ర హీరోలతో పనిచేసే అవకాశాలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆమె టాప్ స్టార్‌గా అవతరించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
బాలీవుడ్ నుంచి ఇంతమంది వెల్లువగా వస్తుంటే, మన తెలుగు తారల సంగతేంటి? సహజంగానే ఈ పరభాషా తారలతో మనవాళ్లు పోటీపడలేక పోతున్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే మన హీరోలే వాళ్లకు తమ సరసన చోటు కల్పించేందుకు ముందుకు రావడం లేదు. అందువల్లే తెలుగమ్మాయిలు అర్చన, మాధవీలత, స్వాతి, బిందుమాధవి కెరీర్ 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్నట్లు ఉంది. తెలుగులో రాణిస్తున్న ఉత్తర భారతీయ అమ్మాయిలు బాలీవుడ్‌లో రాణించలేకపోతుంటే, మన తెలుగు తారలు తెలుగులోనే కాదు ఇంకెక్కడా కూడా రాణించలేక పోతున్నారు. ఇద్దరి మధ్యా కనిపిస్తున్న తేడా అదే. 

Saturday, July 30, 2011

న్యూస్: ఇండస్ట్రీలో సౌందర్యలు ఎంతమంది?

టాలీవుడ్‌లో సావిత్రులు, సౌందర్యలు ఎంతమందున్నారో లెక్క తేలడం లేదు. అవును మరి. ప్రతి హీరోయిన్నీ ఎవరో ఒకరు సౌందర్యతోటో, సావిత్రితోటో, లేదంటే జయసుధతోటో పోల్చడం పరిపాటైపోయింది. ఇటీవల 'తెలుగమ్మాయి' ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా హీరోయిన్ సలోనిని సొందర్య అంతటి నటంటూ ఆకాశానికెత్తేశాడు సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఆయన పోలికని అదే ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన గురువు దాసరి నారాయణరావు సున్నితంగా తోసిపుచ్చడం గమనార్హం. "రామకృష్ణా అప్పుడే ఎందుకు తొందర. సౌందర్యకి ఎవరూ పోలిక కారు" అని ఆయన సున్నితంగా శిష్యుణ్ణి మందలించారు. కోడి రామకృష్ణ ఏ సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్నా ఆ సినిమాకి సంబంధించిన వాళ్లని ఊహాతీతంగా పొగడ్తల వర్షంలో ముంచెత్తడం అలవాటే. ఆయన సంగతి అలా పక్కన పెడదాం.
సొందర్య ప్రమాదవశాత్తూ మృతి చెందాక మొదట స్నేహని ఆమెతో పోల్చడంతో ఈ పోలికల గొడవ ఎక్కువవుతూ వచ్చింది. 'అన్నమయ్య', 'రాధా గోపాలం' సినిమాలు చేసిన ఆమెని సౌందర్య అంతటి నటిగా కొంతమంది ప్రశంసల్లో ముంచెత్తారు. కానీ ఆమె ఆ సినిమాల తర్వాత సరిగా రాణించలేక పోయింది. తెలుగులో ఆమె కెరీర్ ఎదగలేదు. ఆమధ్య 'కలవరమాయే మదిలో' సినిమా చేసిన స్వాతిని ఆ చిత్ర నిర్మాత మోహన్ వడ్లపట్ల "సావిత్రి తర్వాత అంతటి నటి స్వాతే" అని తీర్మానించేశారు. అంటే వాణిశ్రీ, జయసుధ, సుహాసిని, విజయశంతి, సౌందర్య కూడా స్వాతి ముందు దిగదుడుపే అని ఆయన పరోక్షంగా చెప్పాడన్న మాట. ఆ సినిమానే కాదు, ఆ తర్వాత కూడా స్వాతి చెప్పుకోదగ్గ రీతిలో తెలుగులో రాణించలేదు. భూమిక, ఛార్మి, అనుష్క వంటి వాళ్లని కూడా సౌందర్యతో మనవాళ్లు పోల్చిన సందర్భాలున్నాయి. కొద్ది రోజుల క్రితం 'అలా మొదలైంది' నాయిక నిత్యమీనన్‌ని కూడా కొంతమంది సౌందర్యతోటీ, జయసుధతోటీ పోల్చారు. నో డౌట్. ఆ సినిమాలో నిత్య నటించలేదు, బిహేవ్ చేసింది. అయినా ఆమెని సౌందర్యతో పోల్చలేం. ఇలా చాలామంది సౌందర్యలను మనవాళ్లు తమ మాటల ద్వారా సృష్టించారు. కానీ ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ మరో సౌందర్య రాలేదన్నది నిఖార్సయిన నిజం. సినిమావాళ్లు ఊరికే సౌందర్యతో ఇతర తారల్ని పోల్చడం మానితే బెటర్.

Saturday, November 20, 2010

ఫోకస్: నిలిచే తార ఎవరు? (తొలి భాగం)

కొత్త తారల్లో నిలిచే తార ఎవరు? అసలు ఎవరైనా ఉన్నారా? చాలామందిని తొలుస్తున్న ప్రశ్నలివి. ఇప్పుడు ఏ తారని చూసినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవాళ్లే. కేవలం గ్లామర్‌ని నమ్ముకొని వస్తున్నందునే వాళ్లు ఎక్కువ కాలం వెండితెర మీద వెలగలేక పోతున్నారు. అందం ఏ కాస్త చెదిరినా వాళ్లకి మరో అవకాశమే ఉండటం లేదు. అంటే 'ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్' అనే మాట ఇక తెలుగు సినిసీమలో వినిపించే అవకాశాలు కూడా తక్కువే. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు చివరి ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున స్ఫురించే పేరు సౌందర్య. అవును. సౌందర్యతోటే తెలుగు సినిమా అసలు సిసలైన నాయిక కూడా మాయమైపోయింది.  
అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా పరిశ్రమలోనూ మేల్ డామినేషన్ చాలా చాలా ఎక్కువ. నిర్మాతలు, సాంకేతిక నిపుణుల్లో ఆడవాళ్లని వేళ్లమీద లెక్కించవచ్చు. సినిమా అన్నాక హీరోయిన్‌తో పాటు అక్క, చెల్లి, వదిన, అమ్మ, అత్త, బామ్మ వంటి పాత్రలు వుంటాయి కాబట్టి, వాటిని మగాళ్లతో చేయించడం బాగోదు కాబట్టి, ఆ పాత్రల్లో ఆడవాళ్లని చూస్తున్నాం. ఇతర పాత్రల సంగతలా వుంచితే హీరోయిన్ పాత్రల్లో చాలా కాలం నుంచి రాణిస్తున్న నటి ఎవరు? అని భూతద్దం పెట్టి వెతికినా ఒక్కరూ అగుపించరు. దానికితోడు పేరుపొందిన హీరోలంతా ఎప్పటికప్పుడు కొత్త రుచులు కావాలన్నట్లు కొత్త తారల్నే కోరుకుంటున్నారు. ఫలితం.. రెండు మూడేళ్లలో ఆరేడు సినిమాల్లో కనిపించిన తారలంతా 'ఫేడవుట్' అయిపోతున్నారు.
ప్రస్తుత హీరోయిన్ల సంగతే చూసుకుంటే శ్రియ, త్రిష, జెనీలియా, ఛార్మి, ప్రియమణి, నయనతార, అనుష్క, కాజల్ అగర్వాల్, ఇలియానా వంటి తారల్లో ఏ ఒక్కర్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ అనలేం. ఛార్మి, అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో రాణించినా అది ఒకట్రెండు సినిమాలకే పరిమితమయ్యింది. 'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' సినిమాల్లో రాణించిన ఛార్మికి ఆ తర్వాత అన్నీ పరాజయాలే ఎదురవుతూ వస్తున్నాయి. అందుకు 'సై ఆట' పెద్ద ఉదాహరణ. 'అరుంధతి'తో సూపర్ హీరోయిన్ అయ్యిందనుకున్న అనుష్క సైతం ఆ తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోతోంది. 'పంచాక్షరి' ఫ్లాపవడం దీనికి నిదర్శనం. 'ఖలేజా'లో అయితే మహేశ్‌కి ఆమె సరైన జోడీ కాలేకపోయిందనే విమర్శలే ఎక్కువ. 'బొమ్మరిల్లు' సినిమాని తన భుజాలమీద లాక్కెళ్లిన జెనీలియా అంతకుముందు, ఆ తర్వాత కూడా అలాంటి ఫీట్ ప్రదర్శించలేకపోయింది. (ఇంకావుంది)

Friday, September 24, 2010

సినిమా: సౌందర్యలాంటి నటి కావాలి

"అప్పట్లో నా దర్శకత్వంలో 'నర్తనశాల' మొదలుపెట్టా. సౌందర్య చనిపోవడంతో ఆ ప్రాజెక్టు కాస్తా ఆగిపోయింది. ద్రౌపది పాత్రే ఆ సినిమాకి కీలకం. సౌందర్య వంటి ఆర్టిస్టు కావాలి. ఆమె తర్వాత ఇంకెవ్వరూ నాకు కనిపించడం లేదు. నా మనసులో దర్శకత్వమనే బీజం ఇప్పటికే పడిపోయింది కాబట్టి, అది రోజురోజుకీ పెరిగి పెద్దదవుతూనే ఉంది. ద్రౌపది పాత్రకు సరైన నాయిక దొరికితే - ఆ క్షణమే 'నర్తనశాల' మొదలుపెడతా. ఎవరిని పడితే వారిని పెట్టి ఆ సినిమా చేయకూడదు. ఒక్క మిస్ కాస్టింగ్ చాలు - సినిమా పోవడానికి. అలా నా కెరీరులో మిస్ కస్టింగ్ వల్ల పోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి" అన్నారు బాలకృష్ణ.