రెండు దశాబ్దాల నుంచీ తెలుగులో పరభాషా హీరోయిన్‌లే రాజ్యం చేస్తున్నారని మనకు తెలుసు. కన్నడ నటి సౌందర్యను మినహాయిస్తే మిగిలినవాళ్లలో ఎక్కువమంది బాలీవుడ్ తిరస్కారానికి గురై అక్కడి నుంచి వచ్చినవాళ్లే కావడం గమనార్హం. నిన్న మొన్నటిదాకా తెలుగు తెరపై నగ్మా, అంజలా ఝవేరీ, సిమ్రాన్, సోనాలీ బెంద్రే, ఆర్తీ అగర్వాల్, శ్రియ, రీమాసేన్, జెనీలియా ఓ వెలుగు వెలగగా ఇప్పుడు కాజల్ అగర్వాల్, తమన్నా, హన్సిక, శ్రుతిహాసన్ రాణులుగా చలామణీ అవుతున్నారు.
ఎనభైల చివర్లో బాలీవుడ్ భామల్ని నిర్మాతలు తెలుగులోకి తీసుకు రావడమనే ట్రెండ్ మొదలైంది. దాంతో పాటే హీరోయిన్‌కూ, వ్యాంప్‌కూ మధ్య ఉండే గీత చెరిగిపోయి, హీరోయిన్‌లో వ్యాంప్ మిళితమైపోయింది. వ్యాంప్ వేసే పొట్టి దుస్తులు హీరోయిన్ వొంటిమీదకు చేరాయి. హీరో సరసన ఓ 'ఆడబొమ్మ'గా రూపుదాల్చిందామె. 'కలియుగ పాండవులు' (1986)తో ఖుష్బూ, 'కిరాయి దాదా' (1987)తో అమల, 'సామ్రాట్' (1987)తో సోనం టాలీవుడ్‌కు పరిచయమై బాలీవుడ్ నుంచి హీరోయిన్ల దిగుమతి అనే ధోరణికి తెరతీశారు. అప్పట్నించీ టాలీవుడ్‌లో బాలీవుడ్ తారల ప్రవాహం మొదలైంది. 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమాతో దేశవ్యాప్తంగా యువతరంలో గుబులురేపిన జుహీ చావ్లా 'ముగ్గురు కొడుకులు' (1988)లో నటించి, తెలుగు ప్రేక్షకుల ఆదరణని చూరగొంది. రాజీవ్ రాయ్ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్ సినిమా 'విశ్వాత్మ'తో హీరోయిన్‌గా పరిచయమైనా, ప్రేక్షకుల గుర్తింపుపొందని దివ్య భారతి 'బొబ్బిలి రాజా' సినిమాతో టాలీవుడ్‌లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తమ తొలి హిందీ సినిమాల్లో పేరు తెచ్చుకోకముందే తెలుగులో ప్రీతీ జింటా 'ప్రేమంటే ఇదేరా'తో, అమీషా పటేల్ 'బద్రి'తో తెలుగులో సక్సెస్ సాధించారు. వీరిలో కొంతమంది తారలు అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ రాణించగా, కొంతమంది తారలు బాలీవుడ్‌లో ఫయిలై, తెలుగులో టాప్ స్టార్లుగా రాణిస్తూ వచ్చారు. పర్ఫార్మెన్స్ కంటే గ్లామర్, ఎక్స్‌పోజింగ్ హీరోయిన్‌కు ప్రాథమిక అర్హత కావడంతో కొత్త ధోరణికి ద్వారాలు తెరుచుకున్నాయి. దివ్యభారతి తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా నగ్మా పేరు తెచ్చుకుంది. సల్మాన్‌ఖాన్ సరసన 'బాజీ' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె 'పెద్దింటల్లుడు' (1991) చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి కనిపించింది. 'కిల్లర్', 'ఘరానా మొగుడు' (1992) సినిమాలతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అప్పట్నించీ బాలీవుడ్ భామలకు తెలుగులో మరింత గిరాకీ.
మధుబాల, అంజలా ఝవేరీ, సాక్షి శివానంద్, సిమ్రాన్, రీమాసేన్, శ్రియ, ఆర్తీ అగర్వాల్ వంటివాళ్లు తెలుగు తెరకు పరిచయమై వరుస అవకాశాలు పొందుతూ వచ్చారు. హిందీలో 'తేరే మేరే సప్నే' తర్వాత సరైన అవకాశాలు రాని సిమ్రాన్ తమిళంలో సక్సెస్ సాధించి, తెలుగులో 'కలిసుందాం రా' (2000) వంటి సూపర్ హిట్ సినిమాతో తారాపథానికెగసింది.
ఇక 'ఇష్టం' వంటి ఫ్లాప్ సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన శ్రియ 'సంతోషం' హిట్టయ్యాక వెనుతిరిగి చూడలేదు. కానీ బాలీవుడ్‌లో స్థానం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సోనాలీ బెంద్రేకు హిందీలో 'సర్ఫరోష్' మినహా చెప్పుకోవడానికి మరో సినిమా ఏదీ లేదు. కానీ తెలుగులో తొలిసారి 'మురారి' సినిమాలో నటించాక ఆమెకు ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక్క 'పలనాటి బ్రహ్మనాయుడు' తప్పితే ఆమె నటించిన తెలుగు సినిమాలన్నీ విజయం సాధించాయి.
'చిత్రం', 'మనసంతా నువ్వే' సినిమాల్లో మంచి పాత్రలు చేసి, యువతరాన్ని ఉర్రూతలూగించిన రీమాసేన్ అనంతరం సెక్స్ సింబల్‌గా పేరు తెచ్చుకుంది. ఫర్దీన్‌ఖాన్ సరసన ఆమె చేసిన హిందీ సినిమా 'హం హో గయే ఆప్కే' డిజాస్టర్ కావడంతో బాలీవుడ్‌లో ఆమెకు చోటు లభించలేదు. హిందీలో 'పాగల్‌పన్'తో తెరంగేట్రం చేసిన ఆర్తీ అగర్వాల్‌కు మరో బాలీవుడ్ అవకాశం అందని ద్రాక్షే అయింది. కానీ తెలుగులో చేసిన తొలి సినిమా 'నువ్వు నాకు నచ్చావ్'తో ఇక్కడి యువత ఆరాధ్య తారగా మారింది. ఇప్పుడు వీళ్లంతా కళా విహీనమైతే వారి స్థానాల్లో జెనీలియా, కాజల్ అగర్వాల్, హన్సిక, తమన్నా, శ్రుతిహాసన్ వచ్చారు.
'తుఝే మేరీ కసం'తో జెనీలియా, 'క్యూన్.. హో గయా నా'తో కాజల్ అగర్వాల్, 'ఆప్ కా సురూర్'తో హన్సిక, 'చాంద్ సా రోషన్ చెహ్రా'తో తమన్నా, 'లక్'తో శ్రుతిహాసన్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అయితే ఆ సినిమాల తర్వాత వారికి అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో దక్షిణాదివైపు చూపు సారించారు. తెలుగులో వరుస అవకాశాలతో యూత్ ఐకాన్స్‌గా మారిపోయారు. ఈ అయిదుగురిలో కాజల్, తమన్నా చక్కని అవకాశాలతో అగ్ర నాయిక రేసులో దూసుకుపోతున్నారు. జెనీలియాకు పదేళ్ల తర్వాత బాలీవుడ్ ఛాన్సులు తలుపు తడుతున్నాయి. కమలహాసన్ కూతురు శ్రుతిహాసన్‌కు ఇప్పుడిప్పుడే అగ్ర హీరోలతో పనిచేసే అవకాశాలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆమె టాప్ స్టార్‌గా అవతరించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
బాలీవుడ్ నుంచి ఇంతమంది వెల్లువగా వస్తుంటే, మన తెలుగు తారల సంగతేంటి? సహజంగానే ఈ పరభాషా తారలతో మనవాళ్లు పోటీపడలేక పోతున్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే మన హీరోలే వాళ్లకు తమ సరసన చోటు కల్పించేందుకు ముందుకు రావడం లేదు. అందువల్లే తెలుగమ్మాయిలు అర్చన, మాధవీలత, స్వాతి, బిందుమాధవి కెరీర్ 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్నట్లు ఉంది. తెలుగులో రాణిస్తున్న ఉత్తర భారతీయ అమ్మాయిలు బాలీవుడ్‌లో రాణించలేకపోతుంటే, మన తెలుగు తారలు తెలుగులోనే కాదు ఇంకెక్కడా కూడా రాణించలేక పోతున్నారు. ఇద్దరి మధ్యా కనిపిస్తున్న తేడా అదే.
No comments:
Post a Comment