ఎన్నడూ లేనివిధంగా తెలుగు కథానాయకులు మూకుమ్మడిగా కొత్తదనం కోసం సిన్సియర్‌గా ప్రయత్నిస్తున్నారు. ఇదివరలో అడపాదడపా మాత్రమే మన హీరోలు కొత్త రూపంతో ప్రేక్షకుల ముందుకు ప్రత్యక్షమయ్యేవారు. ఇప్పుడు అలా కాదు. దాదాపు ప్రతి హీరో మూస పాత్రల నుంచి బయటపడి, కొత్త రూపంతో, కొత్త పాత్రతో ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. హిందీ, తమిళ, మలయాళ చిత్రాలతో పోలిస్తే తెలుగు చిత్రాల్లో ప్రయోగాలు తక్కువ, కొత్తదనం తక్కువ, వాస్తవికత తక్కువ... అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే హీరోల దృక్పథాల్లో మార్పు వస్తోంది. దర్శకులు కమర్షియల్ కథల్లోనే కొద్దిగానైనా కొత్తదనం ఉండే పాత్రల చిత్రణ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా తెలుగు హీరోలు కొత్త రూపాలతో దర్శనమిస్తున్నారు.
పవన్ కల్యాణ్
ఈ నెల 9న వస్తున్న 'పంజా' చిత్రం పట్ల అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. కారణం, అది పవన్ కల్యాణ్ చిత్రం కావడం, అందునా ఆయన ఇదివరకెన్నడూ కనిపించని రీతిలో గడ్డంతో కనిపిస్తుండటం. తెలుగువాడైనప్పటికీ చెన్నైలో స్థిరపడి తమిళ చిత్రాలతో పాపులర్ అయిన విష్ణువర్ధన్ ఈ సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్‌గా పరిచయమవుతున్నాడు. స్టయిలిష్ టేకింగ్‌తో సినిమాలు రూపొందిస్తాడనే పేరున్న విష్ణు స్టయిలిష్ హీరోగా పేరున్న పవన్‌ను ఇప్పుడు 'పంజా'లో మాఫియా గ్యాంగ్ మెంబర్ జయదేవ్ పాత్రలో గడ్డంతో కొత్తగా చూపిస్తున్నాడు. ఈ కొత్త రూపంలో పవన్ మరింత స్టయిల్‌గా, సరికొత్త అందంతో కనిపిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
నాగార్జున
సమకాలీన హీరోలతో పోలిస్తే భిన్నమైన రూపాలతో ఎక్కువగా కనిపిస్తూ వస్తున్న హీరో నాగార్జున. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' పాత్రలతో మెప్పించిన ఆయన ఇప్పుడు తెలంగాణ పోరాట యోధుడు 'రాజన్న'గా ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన మెలితిప్పిన మీసం, పొడవాటి కేశాలు, నుదుటన పొడవాటి తిలకం, మెడలో కండువాతో కొత్త రూపంతో కనిపిస్తున్నారు. స్వాతంత్య్ర పూర్వ కాలం నాటి నేపథ్యంతో తయారైన ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రం కాబోతోంది.
బాలకృష్ణ
ప్రయోగాలంటే నందమూరి బాలకృష్ణకు ఎంతో ప్రియం. 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' చిత్రాలు అందుకు మంచి ఉదాహరణలు. వాటితో పాటు కొన్ని చారిత్రక పాత్రలు, పౌరాణిక పాత్రలూ ఆయన ధరించారు. మొన్నటికి మొన్న 'సింహా'గా పొడవాటి బుర్ర మీసాలతో కనిపించి, ఆ పాత్రలో గొప్పగా రాణించిన ఆయన నిన్నటికి నిన్న 'శ్రీరామరాజ్యం'లో శ్రీరాముని పాత్రను అద్భుతంగా పోషించి, నేటి కాలంలో పౌరాణిక పాత్రలకు తను మినహా మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించారు. ఇప్పుడు జనవరిలో రాబోతున్న 'అధినాయకుడు' చిత్రంలో తాత, తండ్రి, మనవడుగా త్రిపాత్రాభినయం చేస్తూ ప్రేక్షక లోకంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముఖ్యంగా తాత గెటప్‌లో బాలకృష్ణ ఆహార్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
రాజశేఖర్
భావోద్వేగపూరిత పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ తన కెరీర్‌లో 'ఓంకారం', 'శేషు' వంటి చిత్రాల్లో వైవిధ్య పాత్రలు పోషించారు. తాజాగా ఆయన 'అర్జున'లో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం. కన్మణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్యనారాయణ అనే సామాన్య రైతుగా రాజశేఖర్ కనిపించబోతున్నారు. కొడుకు అర్జున్ సాయంతో సమాజానికి ఆయన ఏం చేంశాడనేది ఇందులోని ప్రధానాంశం. సూర్యనారాయణ పాత్రలో రాజశేఖర్ ప్రదర్శించే భావోద్వేగాలు సినిమాకి హైలైట్ అంటున్నారు.
జగపతిబాబు
కుటుంబ కథాచిత్రాల నాయకుడిగా పేరుపొందిన జగపతిబాబు ఆ ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలనెన్నింటినో పోషించారు. 'గాయం', 'హోమం' వంటివి అందుకు ఉదాహరణలు. ఇప్పుడు 'క్షేత్రం' చిత్రంలో ఆయన చేస్తున్న వీరనరసింహ రాయలు అనే పాత్ర అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మెలి తిప్పిన పొడవాటి బుర్ర మీసాలతో ఆయన కొత్తగా, భిన్నంగా కనిపిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జగపతిబాబు పాత్ర ప్రత్యేకాకర్షణ అనేది దర్శకుడు టి. వేణుగోపాల్ మాట.
రాజేంద్రప్రసాద్
పేరుకి హాస్య చిత్రాల కథానాయకుడే అయినా తన సుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఆల్‌రౌండర్ అనిపించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్. 'ఎర్ర మందారం', 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాలు ఆయన నటనా వైదుష్యానికి నిదర్శనాలు. ఇటీవలే 'క్విక్‌గన్ మురుగన్'గా ప్రపంచ ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఇప్పుడు 'డ్రీమ్' చిత్రంలో సరికొత్త గెట ప్‌తో ఆకట్టుకుంటున్నారు. నూతన దర్శకుడు భవానీ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంతో రాజేంద్రప్రసాద్ భిన్నమైన హెయిర్ స్టయిల్‌తో మరో ప్రయోగం చేస్తున్నారు.
రానా
ప్రయోగాలకు సీనియర్లే కాదు కుర్ర హీరోలు కూడా సై అంటున్నారు. అనేకమంది నేటి తరం హీరోలు సినిమా సినిమాకీ రూపం మార్చుకుంటూ వస్తుంటే తనూ అదే దారిలో పయనిస్తున్నానంటున్నారు రానా. 'లీడర్', 'నేను నా రాక్షసి' చిత్రాల్లో గడ్డంతో ఓ రకంగా కనిపించిన ఆయన ఇప్పుడు 'నా ఇష్టం' చిత్రంలో షేవ్ చేసిన గడ్డం, మీసంతో కొత్త రూపంతో కనిపించబోతున్నారు. జెనీలియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రకాశ్ తోలేటి దర్శకుడు.
1 comment:
What youth and students have to learn from these cinemas. Crime rate is increasing.
Post a Comment