రానా హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుం'. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో డిసెంబర్ 14న జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి డా.డి.రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వెంకటేష్ క్లాప్‌నిచ్చారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
క్రిష్ మాట్లాడుతూ "ఈ కథకు సంబంధించిన పాయింట్ స్ఫురించగానే రానాకు ఫోన్ చేసి చెప్పాను. మా ఇద్దరి గమనం, గతిని మార్చే సినిమా ఇది. ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. బీటెక్ బాబుగా రానా నటించనున్నారు. అతని ఆరున్నర అడుగుల కటౌట్‌ను పూర్తిగా వాడుకోవాలని నిర్ణయించుకున్నాను. సాయిమాధవ్ డైలాగులు బావుంటాయి. మంచి టీమ్‌తో ముందుకు వెళ్తున్నాం. హీరోయిన్‌ను రెండు మూడు రోజుల్లో ఎంపిక చేస్తాం. వెంటనే షెడ్యూల్ మొదలవుతుంది. యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమిది. కృష్ణుడిని మించిన మాస్ పాత్ర నాకు కనిపించలేదు. ఈ సినిమా అదే తరహాలో ఉంటుంది'' అని అన్నారు.
రానా మాట్లాడుతూ "ఇది నేను చేస్తున్న ఆరో చిత్రం. గతంలో దర్శకులు సృష్టించిన పాత్రల్లోకి నేవెళ్ళి చేశాను. ఈ సినిమాలో నాకోసం రూపొందించిన పాత్రలో నటించబోతున్నాను. హీరో జర్నీకి సంబంధించిన చిత్రమిది. వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళంలో 'వడక్కు చెన్నై'లో నటిస్తున్నాను'' అని అన్నారు.
కథను నమ్మి సినిమా తీసే దర్శకుడు క్రిష్ అని పోసాని కితాబిచ్చారు. మంచి పాత్రలో నటిస్తున్నట్టు ఎల్బీశ్రీరామ్ అన్నారు. కథ మెప్పిస్తుందని వెంకటేష్ చక్రవర్తి చెప్పారు. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేస్తానని సాయిమాధవ్ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ "మంచి కథ. రానా పాత్ర మెప్పిస్తుంది. లొకేషన్‌లు, స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్తాం'' అని చెప్పారు.
బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, పోసాని, రఘుబాబు, ఎల్బీ శ్రీరామ్, సత్యం రాజేష్, నాగినీడు, రవి ప్రకాష్, జె.వి.ఆర్., హేమ, శ్రీనిజ తదితరులు ఇతర పాత్రధారులు. కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: క్రిష్, స్క్రిప్ట్ కన్సల్టంట్: వెంకటేష్ చక్రవర్తి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కూర్పు: శ్రావణ్.కె, కెమెరా: జ్ఞాన శేఖర్.వి.ఎస్., సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్‌రెడ్డి.
No comments:
Post a Comment