Showing posts with label corruption. Show all posts
Showing posts with label corruption. Show all posts

Friday, January 1, 2016

Society: We and Our Responisibility

మనం - మన బాధ్యత

ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వాన్ని ప్రజలే నిర్మించుకుంటారు. మాతృదేశాన్ని సంరక్షించుకుంటూ ప్రపంచంలో తమ దేశానికి మహోన్నతమైన స్థానాన్ని సంపాదించి పెట్టేందుకు కృషి చేస్తారు. ఇదే ప్రజల బాధ్యత. కానీ మనదేశంలో ప్రజలు చాలావరకు తమ బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. లంచగొండితనం, బంధుప్రీతి, స్వకుల పక్షపాతం, పార్టీ నియంతృత్వం విస్తృతమైపోతున్నది. లంచాలిస్తున్న వాళ్లెవరు? ఓట్లకు నోట్లు తీసుకుంటున్న వాళ్లెవరు? నాయకుల్ని ఎన్నుకుంటున్న వాళ్లెవరు? ప్రజలే!
అసమర్థులైన నాయకుల్ని ఎన్నుకోకుండా నీతీ నిజాయితీ కలిగినవాళ్లను ఎన్నుకుంటే మేలు జరక్కపోయినా వ్యవస్థకు ప్రమాదమైతే ఉండదు. నోట్లు తీసుకొని ఓట్లు వేసే జనం, లంచాలిచ్చి పనులు చేయించుకునే పెద్ద మనుషులు, లంచాలు తీసుకోవడమే వృత్తిగా పెట్టుకొని, నాయకులకు నీడలాగా తిరుగుతూ అయిన దానికీ, కాని దానికీ రాజకీయ ఏజెంట్లుగా బతుకుతున్న చెంచాలూ, ఈ చెంచాల అడుగులకు మడుగులొత్తే ఉప నాయకులూ ప్రజల్లోనే ఉన్నారు. కాబట్టే ప్రజలు కష్టాలకు గురవుతున్నారు. దేశమంతటా జరుగుతున్న అన్యాయాల్నీ, అక్రమాల్నీ, అరాచకాల్నీ, అత్యాచారాల్నీ, అవినీతినీ కళ్లారా చూస్తూ నిర్లక్ష్యంతో, నిర్లిప్తంతో ఉన్నవాళ్లూ ప్రజలే.
ప్రజల ప్రతిబింబమే ప్రభుత్వం. వాళ్లు సృష్టించుకున్నదే ప్రభుత్వం. కాబట్టి ప్రజలు తమ బాధ్యతల్ని గ్రహించుకొని ప్రవర్తించినప్పుడే నీతీ నిజాయితీ కలిగిన పార్టీలు ఏర్పడతాయి. అప్పుడే మహోన్నతమైన నాయకత్వం లభిస్తుంది. మహా శక్తిమంతమైన ప్రభుత్వం నెలకొంటుంది. దేశం బాగుపడుతుంది. ప్రజల్లో నైతిక శక్తి కొరవడితే ప్రజలెన్నుకొన్న పార్టీల్లో అవినీతి పెరిగిపోతుంది. అవినీతికి ఆశ్రయమిచ్చే పార్టీలు నెలకొల్పే ప్రభుత్వాలు అన్యాయాన్ని అవలంబిస్తాయి. దీనివల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుంది. దేశం అధోగతిలోకి వెళ్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తన బాధ్యతను గుర్తించి, తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.

Friday, December 25, 2015

Society: People need heroes

ప్రజా నాయకులు రావాలి

నేడు దేశంలో అధిక లాభార్జనపరులు, అక్రమ నిల్వదారులు, బ్లాక్ మార్కెటీర్లు, కల్తీదారులు, దురాశాపరులైన వడ్డీ వ్యాపారులు, పచ్చి నిరంకుశులైన భూస్వాములు, అవినీతిపరులైన అధికారులు, స్వప్రయోజనాల కోసం ఎంతటి నీచానికైనా ఒడికట్టే రాజకీయ నాయకులు విశృంఖలంగా స్వైర విహారం సాగిస్తూ ప్రజా జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు.
నేటి దోపిడీదారి వ్యవస్థకు ఎప్పుడు కాలం చెల్లుతుందో తెలీకుండా ఉంది. ప్రజల్లో అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉన్నా, దాన్నుంచి విముక్తి చెందాలనే కాంక్ష బలంగా ఉన్నా దిశా నిర్దేశం చేసి, వాళ్లకు నాయకత్వం వహించే ధైర్యవంతులే లేకుండా పోయారు. దోపిడీదారులకు ఒక న్యాయం, వాళ్లను ఎదిరించి పోరాడుతూ ప్రజల పక్షాన నిలిచిన వాళ్లకు మరొక న్యాయం జరుగుతూ వస్తుండటం వల్ల ప్రజా నాయకుల్లో ఒక రకమైన స్తబ్దత ఏర్పడినట్లు కనిపిస్తోంది.
అయినా అక్రమంతో, నిరంకుశత్వంతో రాజీపడటం, సహించి ఊరుకోవడం ప్రజలపై చూపించే ఘోర అపచారమే అవుతుంది. రాజీలేని పోరాట మార్గాన్ని అనుసరిస్తూ అరాచక శక్తుల దౌర్జన్యాల్ని ఎదుర్కోగల నాయకులు ప్రజల నుంచి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.