Showing posts with label shyam. Show all posts
Showing posts with label shyam. Show all posts

Sunday, August 21, 2011

న్యూస్: తెలుగులో మరిన్ని అవకాశాల కోసం...

మొదట 'కిక్'లో, తర్వాత 'కల్యాణ్‌రాం కత్తి'లో, తిరిగి 'వీర'లో తన పాత్రలతో ఆకట్టుకున్న తమిళ నటుడు శ్యాం అసలు పేరేమిటో తెలుసా? షంషుద్దీన్ ఇబ్రహీం. అవును అతను ముస్లిం. తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ అందాల నటుడు తెలుగులో రవితేజతో 'కిక్', 'వీర' సినిమాలు చేశాక అతనికి మంచి స్నేహితుడైపోయాడు. అయితే రవితేజని తాను 'భయ్యా' అని పిలుస్తానని అతను తెలిపాడు. తనకి ఇక నుంచీ పోలీసు పాత్రలు కాకుండా వేరే ఇంకేవైనా పాత్రలు ఇవ్వమని తెలుగు దర్శకుల్ని కోరుతున్నాడు. "కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు చేయడానికి నాకు అభ్యంతరం లేదుకానీ కంప్లీట్ విలన్ రోల్స్ అంటే చెన్నైలోని నా లేడీ ఫాన్స్ ఫీలవుతారు. వాళ్లు నన్ను లవర్ బాయ్‌గా చూడాలనుకుంటూ ఉంటారు" అని నవ్వేస్తాడు శ్యాం.
'కల్యాణ్‌రాం కత్తి'లో తను చేసిన ఎమోషనల్ సీన్లు చాలా బాగా వచ్చాయనీ, కానీ ఫైనల్ ఎడిటింగ్‌లో వాటిని కత్తిరించేశారని కాస్త బాధని వ్యక్తం చేశాడు. అయితే దాని గురించి అతడేమీ నెగటివ్‌గా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ సినిమా ఎప్పుడో జనం ముందుకు వచ్చేసింది. అతను మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని ఆశిస్తున్నాడు. అయితే 'క్షేత్రం', 'బెజవాడ రౌడీలు' కాదనుకున్నాడు. ప్రస్తుతం అతను ఎన్టీఆర్ సినిమా 'ఊసరవెల్లి'లో చేస్తున్నాడు. 'కిక్'లో చేసేప్పుడు డైరెక్టర్ సురేందర్‌రెడ్డితో ఏర్పడిన స్నేహమే ఈ సినిమా అవకాశాన్నిచ్చింది. "సెప్టెంబర్ తర్వాత తెలుగు సినిమాలకు ఎక్కువ కాల్షీట్లు ఇద్దామనుకుంటున్నా" అని చెప్పాడు శ్యాం. 'ఊసరవెల్లి'తో పాటు '6' అనే ద్విభాషా చిత్రాన్ని అతను చేస్తున్నాడు. ఆ సినిమాని అతని కజినే నిర్మిస్తున్నాడు. 7 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో తయారవుతున్న ఈ సినిమాకి దురై దర్శకుడు. ఇదివరకు అతను శింబు హీరోగా 'తొట్టిజయ'ని డైరెక్ట్ చేశాడు. "ఈ సినిమాలో నేను నాలుగు గెటప్పుల్లో కనిపిస్తా. ఇందులోని కేరక్టర్ కోసం 15 కిలోల బరువు తగ్గా" అని చెబుతున్న శ్యాం తెలుగులో మరిన్ని అవకాశాలతో మరింత మంచి పేరు తెచ్చుకుంటాడేమో చూద్దాం.