Showing posts with label poetry. Show all posts
Showing posts with label poetry. Show all posts

Sunday, July 3, 2016

Poetry: Handloom

మగ్గం ఆడుతుంటే...

రోజంతా మగ్గం ఆడుతున్న చప్పుడు వింటాను
ఆ బక్కపలుచని చెక్కల నిర్మాణం ఎంత సుందరం!
నిలువుగా రెండు.. అడ్డంగా రెండు..
ఉక్కు కండల చేతులూ కాళ్లలా.. చెక్కలు!!
ఒక చేత్తో పలక, ఇంతో చేత్తో పిడి..
మగ్గంలో కూర్చున్న నాన్నని అపురూపంగా చూస్తుంటాను
లయబద్ధంగా నాట్యం చేస్తున్న నటరాజే జ్ఞాపకమొస్తాడు
పోగు పక్కన ఇంకో పోగు - పడుగు
పోగు మీద ఇంకో పోగు - పేక
సొరుగుల్లోంచి చకచకా అట్నించి ఇటు తిరిగే నాడి
వడివడిగా దూసుకొచ్చే జలతారు పోగులు
ఒక పావుచెక్క కిందికి దిగితే
ఇంకో పావుచెక్క పైకి లేస్తుంది
అచ్చులో సగం పోగులు కిందికీ
ఇంకో సగం పోగులు పైకీ
పోగులు చిక్కుబడకుండా
కచ్చిబద్దలు కాపలా కాస్తుంటాయి సైనికుల్లాగా
బట్ట బిగువు సడలిపోకుండా
చేళ్లు చేతులు చాపి పట్టుకుంటాయి రక్షకుల్లాగా
బుటా తర్వాత ఇంకో జరీ బుటా
సెల్ఫు తర్వాత ఇంకో పూల సెల్ఫు
పడుగు పైన పట్టు పాగళ్లు
గుడ్డమీద రంగుల సీతాకోకలవుతుంటాయి
నెమ్మదిగా చీకటి చిక్కనవుతుంటే
కిరసనాయిలు బుడ్డీలు
మగ్గం రెండుపక్కలా వెలుగుతాయి
మగ్గం చప్పుడు ఆగదు
పడుగు-పేక పరిమళాలు వదలవు
పదకొండు కొట్టేదాకా మగ్గం విశ్రమించదు
ఒక దోనె ఖాళీ అవుతుంటే
ఇంకో దోనె నిండు కుండవుతుంటుంది
ఒక తాను పుట్టాక
ఇంకో తాను పురుడు పోసుకోవడం మొదలవుతుంది!
టకటకమనే పలక చప్పుడులో
చెమట చుక్కల పాట సమ్మగా వినిపిస్తుంటుంది!!

-ఆంధ్రజ్యోతి 'వివిధ', 4 అక్టోబర్ 2010

Tuesday, May 10, 2016

Poetry: Break

విరామం

ఒక్కో షిఫ్టులో మాకు రెండు అరగంట బ్రేకులుంటాయి
పెడళ్లను తొక్కడం మేం ఆపగానే అంతంత భారీ యంత్రాలు
గోలపెట్టడం ఆపి నిశ్శబ్దమవుతాయి
మా చేతుల్లోనే అక్కడి లోహపు గొలుసులు పురుడు పోసుకుంటాయి
వాటిని వొంచుతాం, వొత్తుతాం, వెల్డింగ్ చేస్తాం,
సైజుల వారీగా ట్రిమ్మింగ్ చేస్తాం
యంత్రాల వేగంతో మా చేతులు పోటీపడుతుంటాయి
గొలుసు పుట్టాక నాణ్యతను పరీక్షిస్తాం
ప్యాకింగ్ చేసి ఫ్యాక్టరీ నుంచి సాగనంపుతాం
మా ఎమ్డీ విశాలమైన ఏసీ ఆఫీస్ పక్కనే
ఇరుకు కాంక్రీట్ నడవాలోంచి కిందుగా ఉండే గదికి
ఒకర్నొకరం నెట్టుకుంటూ పోతాం
మేం మనస్ఫూర్తిగా యంత్రాల్ని తాకాలనుకొనేది అక్కడే
మా కోసమే అవి ఎదురు చూస్తుంటాయి, కూనిరాగాలు ఆలపిస్తుంటాయి
ఆ యంత్రాలు మా వేళ్లను తెగ్గొట్టాలనుకోవు, నలగ్గొట్టాలనుకోవు
అక్కడి యంత్రాలు మాకు నీళ్లనిస్తాయి,
చాయ్ సమోసా బిస్కెట్‌నిస్తాయి
మా జేబుల్లోని వేడి వేడి నాణేల్ని మార్చుకోవడంలో
మా చేతులు తగిలి ఆ ఇత్తడి చక్రాలు మురికవుతాయి
లంచ్ బెల్ మోగిందంటే కాస్త ఊపిరి సలుపుతుంది
కొన్నిసార్లు మేం ఫ్యాక్టరీలోని వేడి, మడ్డి, జిడ్డుకు దూరంగా
తింటానికీ, 'టీ'కీ బయటకు వెళ్తుంటాం
టీ తాగి, తాజా చార్మినార్ సిగరెట్ దమ్ములు లాగి
మరి కొన్ని గంటల పాటు పని చెయ్యడానికి శక్తి నింపుకుంటాం
మళ్లీ రణగొణ ధ్వనుల ఫ్యాక్టరీకొచ్చేస్తాం
మా మెదడులేని శరీరాలు ఎప్పట్లాగే ఒకే రకమైన పని చేస్తుంటాయి
మోటార్ సైకిళ్ల గొలుసులు, భారీ యంత్రాల గొలుసులు పుట్టిస్తుంటాయి
మరుసటి రోజూ అదే పని మా కోసం ఎదురుచూస్తుంటే
మేం మొదటి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంటాం.

- కవి సంగమం, 5 ఏప్రిల్ 2016.

Wednesday, March 30, 2016

Saturday, March 19, 2016

Poetry: Nippu Kanam (Fire Cell)

నిప్పుకణం

నీది ఆత్మహత్య అయినా
రాజ్యం చేసిన హత్య అయినా
నీది సాదాసీదా మరణం కాదు
దేశం దేశాన్నే జ్వలింపజేసిన 
నిప్పుకణిక నీ మరణం

మొదట్లో నేనూ అనుకున్నాను
యుద్ధం మధ్యలో వెన్నుచూపిన భీరువువని
చావు తప్ప పరిష్కారం లేదనుకున్న పిరికివాడివని
ఇప్పుడు కళ్లకు కడుతోంది వీరుడా
యుద్ధం మధ్యలో ఆత్మాహుతి అంటే ఏమిటో
ప్రత్యర్థి వెన్నులో చలి పుట్టించడమంటే ఏమిటో

పుట్టుక నుంచే పెరిగిన ఇంటినుంచే
వివక్షను ఎదుర్కొన్నవాడివి
విశ్వవిద్యాలయంలో వివక్ష
నీకు పెద్దలెక్కలోనిది కాదు
అయినా నీ ఊపిరి నువ్వే తీసుకున్నావంటే
అన్యాయపు వేర్లు ఎక్కడిదాకా విస్తరించాయో
తెలిసొచ్చి నిర్లిప్తుడవై నిస్పృహుడవయ్యావేమో
కట్టలుగా పుట్టలుగా అడ్డుపడుతున్న
అవరోధాల్ని ఈడ్చిపారేయలేనని అనుకున్నావేమో

నువ్వు లేకపోయినా 
నీ మరణం ఎట్లాంటి జ్వాలను రేపిందో చూడు
ఎన్ని ప్రశ్నల్ని లేవనెత్తిందో చూడు
విద్యాలయాల్లో విద్యకు బదులు మితిమీరుతున్న 
రాజకీయాల జాడలు దిగ్భ్రాంతిపరుస్తున్నాయి
దుర్మార్గ దోపిడీ శక్తులు దట్టంగా అల్లుతున్న 
కులసూత్రాలు సాలెపురుగులా చంపుకుతింటున్నాయి 
చదువు కోసం వెళ్లిన కొడుకులు
క్షేమంగా ఇంటికొస్తాడో లేదోనని
అమ్మలు ఆందోళనపడుతున్నారు

నువ్వు అర్ధంతరంగా లోకాన్ని వదిలేశావు
పడమటి సూర్యుడిలా మాయమయ్యావు
నీకు తెలీదు.. నువ్విప్పుడు ఎంతమంది గుండెల్లో చిరంజీవివో
ఎంతమందిని ధీరులుగా మార్చేస్తున్నావో
నీకు తెలీదు.. నువ్వు గోడలో పాతుకొన్న రావిమొక్కవు
ఎన్నిసార్లు తుంచినా తిరిగి చిగురిస్తావు
నువ్విప్పుడు ఓటమిని ఒప్పుకున్న పరాజితుడివి కాదు
సహచరులకు యుద్ధాన్ని కొనసాగించే తెగింపునిచ్చిన విజేతవు

- 'స్వాప్నికుడి మరణం' పుస్తకం నుంచి

Poetry: Nimisham (One Minute)

- సూర్య దినపత్రిక, 14 మార్చి 2016

Monday, January 18, 2016

Poetry: Cobweb to be amputated

సాలెగూడు ఛేదించాలి


నేను కాలాన్ని కరిగిస్తున్నవాణ్ణి
సంఘసేవకు వద్దామనే ఉంది
ఏమేమో చేద్దామనీ ఉంది

మనసులో భావాల వరదలు పొర్లుతున్నయ్
గుండెలో ఆవేశాల నురగలు రాగాలు పాడుతున్నయ్
కట్టలుగా పుట్టలుగా అడ్డుపడే అవరోధాలు
అధిగమించాలని ఉంది అవతలకి తోసేయాలని ఉంది

మొదటి కునుకు ఎలాగొస్తుందో కనిపెట్టలేను
ఉదయపు మెలకువ వరకూ వదలవు సినిమా కలలు
నా దారినిపోయే వేళ నాక్కనిపించే అమ్మాయిలు
అదేం ఖర్మమో అందరూ అందగత్తెలు
నా దారినిపోయే వేళ నాక్కనిపించే బిచ్చగాళ్లు
గుండెల్లో మెత్త జాగాలు తడతారు

సంజవేళ సంచరించు ఒంటరి కంకాళం
సందు చూసుకొని సంద్రంలో దూకేస్తుంది
ఆధారం అగుపించని అనుమానం
గుండెలో మండు కుంపటి పెడుతుంది
అమ్మాయిల వెంటపడే తుంటరి వెధవల జాతిని
తన్ని తగలేయాలని ఉంది తుడిచిపెట్టేయాలని ఉంది

మిత్రమా లాభం లేదు
నన్ను నిందించి ప్రయోజనం లేదు
దుర్మార్గ దోపిడీ శక్తులేవో
డబ్బు సూత్రాలు దట్టంగా అల్లుతున్నాయి
సాలెపురుగులా చంపుకు తినాలనుకుంటున్నాయి
సారీ.. నిన్ననుసరించలేను
నీ అడుగులో నా కాలిడలేను
సాలెగూటిలో చిక్కుకోలేను

Friday, January 8, 2016

Poetry: The Writer

రాతగాడు


రాయడం అందరికీ అలవడే విద్యకాదు
రాయడం ఒక నేర్పు, రాత ఒక మత్తు
నేనున్నాననీ, నేను కవిత్వం అల్లగలననీ
రుజువుచెయ్యడానికి రాస్తాడు
తనను తాను ఆవిష్కరించుకుంటాడు
ఒకాయన అగ్గిపుల్ల మీద రాస్తాడు
ఇంకొకాయన క్రికెట్ బ్యాట్ మీద రాస్తాడు
వేరొకాయన ప్రభుత్వానేధినేతను
ఆయనకే తెలీని గొప్పలతో కీర్తిస్తూ రాస్తాడు
మరొకాయన పెళ్లాం మీదా, పిల్లల మీదా
నిజ జీవితంలో కురిపించని ప్రేమనంతా ఒలకబోస్తూ రాస్తాడు
ఏది రాసినా నేర్పున్నోడే రాస్తాడు
ఏం రాయాలనే కిటుకు తెలిసినోడే రాస్తాడు

Saturday, January 2, 2016

Poetry: The Kiss

ముద్దు

అనంత విశ్వంలోని ఆనందం
ముద్దులోని మాధుర్యం
అనుభవానికి తెచ్చే పెదవులు

ముద్దు
ఒక సముజ్వల వాంఛ
రెండు ప్రాణ వాయువుల్ని
పెనగలిపితే వచ్చే పరవశత్వం

ముద్దు
ప్రేమికుల ప్రాథమిక హక్కు
రెండు హృదయాల నుంచి మొదలై
పెదాల ద్వారా ఉద్భవించే
ఉత్కృష్ట భావం

ముద్దు
ఒక ప్రణయ బాధ
ఒక మూగ వేదన
పుట్టిన ప్రతివాడూ గిట్టేలోగా
ఎప్పుడో ఒకప్పుడు
ముద్దు మాధుర్యాన్ని
చవిచూసే తీరతాడు

Thursday, December 17, 2015

Poetry: That is what we

మేమింతే!


అక్కడ బొమ్మరిల్లులో కూర్చున్నాం
తనూ నేనూ
శిశిరమూ హేమంతమూ వెళ్లిపోయాయి

బొమ్మరిల్లు కాలి నుసిగా మారి
మట్టిలో కలిసిపోయింది
తనూ నేనూ
మట్టిని తిరగేసినా దొరకలేదేమీ

బూడిదైపోయిన విశ్వాసాన్ని
తను తిరిగి పొందలేదు
చ్యుతిపొందిన ఆనందాన్ని
నేనూ మళ్లీ పొందలేదు
ఇక మేమింతే!

Tuesday, December 15, 2015

Poetry: Where is my village?

ఏదీ నా పల్లె?

దేశ సౌభాగ్యానికే మూలమనే 
నా పల్లె అందమేమైపోయింది?

తొలికోడి కూతతో తెలతెలవారుతుంటే
పొలాల్లో రైతులు కనిపించరేమి?
పడుచుపిల్లలు కడవలు చేతబట్టి
పాకాల బావిని చేరే దృశ్యమేదీ?

బర్రెల మందలు గొర్రెల మందలు
మేతకు పోవడం కనిపించదేమి?
ఆవుల అంబాలు  మేకల మేమేలు
మేళవించెడి పాట వినపడదేమి?

జలజలా పారే సెలయేటి నీళ్లలో
ఆడేపాడే పిల్లలేరీ?
లోతు నూతుల్లో ఏతాము తోడే
రైతు కుర్రాళ్ల రీతి ఏదీ?

మర్రె ఊడల్ని పట్టుకొని విర్రవీగుతూ
ఉయ్యాలలూగే పిల్లలెక్కడ?
బర్రెల వీపుపై గర్వంతో ఎక్కి
కుర్రకారు చేసే స్వారి కనిపించదేమి?

కంచాలు చేసి గెంతుతూ గోళీలాట ఆడే
చిట్టితండ్రుల సంబరమేదీ?
కొమ్మ కొమ్మలు దాటి కోతికొమ్మచ్చులాడే
వేడుక కనిపించదేమి?

కొండ కిందకుపోయి నిండుగా
కట్టెలని కొట్టే సన్నివేశమెక్కడ?
పొన్నచెట్టుపైన పొందుగా పాడే
చిన్నిగొల్ల మురళి వినిపించదేమి?

Sunday, December 13, 2015

Poetry: Rain Coming

వాన వచ్చె


గగన చుంబిత ప్రాసాదాగ్రములపై తరుణ అరుణుడు
కావికాంతుల దరహాస నయనముల విచ్చుచుండె

తెల్లవారెనో లేదోయనే సంకోచముతో
కోయిలలు తీయని కూతలు కూయసాగె

భిక్షకుని వాణి సుఖనిద్రారతములగు
నగర హర్మ్యముల మారుమోగుచుండె

గతరాత్రి మైమరపించిన మనోహరిణి
పుష్పమాలికలు వసివాడి జారి నలిగిపోవుచుండె

మేఘములు ఆత్మత్యాగ మొనర్చుకొని
వర్షధారల నొసగుచుండె

Saturday, July 31, 2010

Poetry: Bathukuporu

బతుకుపోరు

ముంచెత్తబోయే వరదని వంతెన మాటున
నొక్కిపట్టి
కొత్త కలలకు రెక్కలు మొలిపించుకుంటూ
ఆశగా
"నా రైతుని బతికించుకోవాలి" అంది
నేలతల్లి!
అక్కడ
ఎదుగుతున్న వరినారు బేలగా ఎండిపోయి
అప్పు కుప్పలుగా పేరుకుంది
కరువు కాలికింద
రైతు బతుకు చితికిపోయింది
కరువునిస్తా లేదంటే
వరదనిస్తా అనే ప్రకృతిని
నారు పోసినంత తేలిక్కాదు కదా
అదుపు చేయడం!
నిజం
రైతుకేం ఇవ్వాలో తెలీని
ప్రకృతిని
అంత సులువుకాదు వంచడం!
రైతుకు కచ్చితంగా తెలుసు
పంటా కావాలి
అందుకు తగ్గ ధరా కావాలి.. అని!
అప్పటికే ప్రతి రుతువూ మోసం చేసినా కూడా
శిలువ మోస్తున్న రైతుకు అనిపిస్తూనే వుంది
ఈ యేడు పంట ఎండినా
వచ్చే యేడు పండుద్దని
బతికే ధైర్యాన్నిస్తుందని
అతణ్ణి నిలువునా కోసినా
నేలతల్లినే కలవరిస్తుంటాడు!
ఎన్ని తరాలైనా ఎడతెగని
ఈ బతుకుపోరులో
చీడపురుగు పట్టిన వ్యవస్థ
ధైర్యాన్ని హరిస్తూనే వుంది
ఆత్మహత్యల్ని ఆపలేకపోతూనే వుంది
అవును.. అవునవును..
ఒకడుపోయి ఇంకొకడు వస్తాడు
అధికారానికి
ఫలితం మాత్రం ఒక్కటే
ఇది
రైతులు బతికే కాలం కాదు
రాబందుల కాలం
అందుకే రైతన్నాడు
"ఆగండి.. వంచన మాటలు చెప్పకండి
ముందు నన్ను పురుగులమందు
తాగనివ్వండి
చావు పొత్తిళ్లలో సేదతీరనివ్వండి"..!

-ప్రస్థానం, డిసెంబర్ 2009-జనవరి 2010