Tuesday, May 10, 2016

Poetry: Break

విరామం

ఒక్కో షిఫ్టులో మాకు రెండు అరగంట బ్రేకులుంటాయి
పెడళ్లను తొక్కడం మేం ఆపగానే అంతంత భారీ యంత్రాలు
గోలపెట్టడం ఆపి నిశ్శబ్దమవుతాయి
మా చేతుల్లోనే అక్కడి లోహపు గొలుసులు పురుడు పోసుకుంటాయి
వాటిని వొంచుతాం, వొత్తుతాం, వెల్డింగ్ చేస్తాం,
సైజుల వారీగా ట్రిమ్మింగ్ చేస్తాం
యంత్రాల వేగంతో మా చేతులు పోటీపడుతుంటాయి
గొలుసు పుట్టాక నాణ్యతను పరీక్షిస్తాం
ప్యాకింగ్ చేసి ఫ్యాక్టరీ నుంచి సాగనంపుతాం
మా ఎమ్డీ విశాలమైన ఏసీ ఆఫీస్ పక్కనే
ఇరుకు కాంక్రీట్ నడవాలోంచి కిందుగా ఉండే గదికి
ఒకర్నొకరం నెట్టుకుంటూ పోతాం
మేం మనస్ఫూర్తిగా యంత్రాల్ని తాకాలనుకొనేది అక్కడే
మా కోసమే అవి ఎదురు చూస్తుంటాయి, కూనిరాగాలు ఆలపిస్తుంటాయి
ఆ యంత్రాలు మా వేళ్లను తెగ్గొట్టాలనుకోవు, నలగ్గొట్టాలనుకోవు
అక్కడి యంత్రాలు మాకు నీళ్లనిస్తాయి,
చాయ్ సమోసా బిస్కెట్‌నిస్తాయి
మా జేబుల్లోని వేడి వేడి నాణేల్ని మార్చుకోవడంలో
మా చేతులు తగిలి ఆ ఇత్తడి చక్రాలు మురికవుతాయి
లంచ్ బెల్ మోగిందంటే కాస్త ఊపిరి సలుపుతుంది
కొన్నిసార్లు మేం ఫ్యాక్టరీలోని వేడి, మడ్డి, జిడ్డుకు దూరంగా
తింటానికీ, 'టీ'కీ బయటకు వెళ్తుంటాం
టీ తాగి, తాజా చార్మినార్ సిగరెట్ దమ్ములు లాగి
మరి కొన్ని గంటల పాటు పని చెయ్యడానికి శక్తి నింపుకుంటాం
మళ్లీ రణగొణ ధ్వనుల ఫ్యాక్టరీకొచ్చేస్తాం
మా మెదడులేని శరీరాలు ఎప్పట్లాగే ఒకే రకమైన పని చేస్తుంటాయి
మోటార్ సైకిళ్ల గొలుసులు, భారీ యంత్రాల గొలుసులు పుట్టిస్తుంటాయి
మరుసటి రోజూ అదే పని మా కోసం ఎదురుచూస్తుంటే
మేం మొదటి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంటాం.

- కవి సంగమం, 5 ఏప్రిల్ 2016.

No comments: