Showing posts with label ramakrishna. Show all posts
Showing posts with label ramakrishna. Show all posts

Saturday, January 2, 2016

Synopsis of the movie CHIRANJEEVI (1969)

'చిరంజీవి' (1969) చిత్ర కథాంశం

బాలకృష్ణ నర్సింగ్ హోంలో 7వ నెంబర్ వార్డులోని ముగ్గురు రోగులు - సత్యం (చలం), మధు (రామకృష్ణ), వెంకటప్పయ్య (అల్లు రామలింగయ్య). సత్యం అనాథ. ఊపిరితిత్తుల వ్యాధితో బతికేది కొద్ది రోజులే అయినా అది తెలియక అందర్నీ నవ్విస్తూ, కవ్విస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. మధు పేరుపొందిన ఫుట్‌బాల్ ఛాంపియన్. ప్రపంచ ఖ్యాతి వచ్చిందని సంబరపడేంతలోనే కాలు విరిగి తన భవిష్యత్ అంధకారబంధురమైందని బాధపడుతుంటాడు. ఇక వెంకటప్పయ్యకు కడుపులో పుండు. డాక్టర్‌కు తెలీకుండా దొరికిన ప్రతిదీ తింటుండే మూర్ఖుడు.
మృత్యువు సమీపంలో ఉన్న సత్యం డాక్టర్ ఇందిరాదేవి (సావిత్రి), మధు మధ్య ప్రేమను కలిగిస్తాడు. తనకు మందు ఇచ్చే నర్సు స్టెల్లా (మీనాకుమారి)ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు. రోగుల్ని కన్నతండ్రిగా చూసే డాక్టర్ బాలకృష్ణ (ప్రభాకరరెడ్డి)నీ, ఇందిరాదేవినీ అవసరమున్నా లేకపోయినా మాటిమాటికీ కంగారుపెడుతుంటాడు. కానీ తాను ఎక్కువ కాలం బతకననే నిజం డాక్టర్ నోట రహస్యంగా విన్న సత్యం జీవితంలో నిజమైన బాధను తొలిసారి అనుభవిస్తాడు. జీవితం అంటే ఏమితో తొలిసారిగా అప్పుడే అర్థమవుతుంది. చనిపోయేలోగా తానూ ఒక మంచిపని చేసి చనిపోవాలనుకుంటాడు. ఆ మంచిపని మధు, ఇందిర పెళ్లనేది అతని అభిప్రాయం.
సత్యం జీవితం ముగిసిపోయే క్షణం రానే వచ్చింది. డాక్టర్ కోసం కాలింగ్ బెల్ నొక్కుతాడు. ఇదీ వేళాకోళానికేనని భావించిన ఇందిర నిర్లక్ష్యం చేస్తుంది. చివరకు పెద్ద డాక్టర్ వచ్చినా ఫలితం ఉండదు. మధు చేతిలో సత్యం కన్ను మూస్తాడు. చనిపోయే ముందు డాక్టర్ బాలకృష్ణ మనసు మార్చి ఆయన కూతురు ఇందిరను కుంటివాడైన మధుకు ఇవ్వడానికి ఒప్పిస్తాడు. ఇదివరకు తండ్రి వ్యతిరేకించా మధు ప్రేమ కోసమే విదేశాల్లో విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పిన ఇందిర, ఇప్పుడు సత్యం మరణంతో మనసు మార్చుకుంటుంది. విదేశాలకు వెళ్లి కేన్సర్ స్పెషలిస్టయి సత్యంలాంటి అభాగ్యుల్ని చిరంజీవులను చేయాలనుకుంటుంది. ఆమె నిర్ణయాన్ని మనసారా అభినందిస్తాడు మధు. తన యావదాస్తినీ ఆమె ఆస్పత్రికి దానం చేస్తానని మాటిస్తాడు.

తారాగణం: సావిత్రి, ప్రభాకరరెడ్డి, చలం, రామకృష్ణ, అల్లు రామలింగయ్య, మీనాకుమారి
సంగీతం: టి. చలపతిరావు
నిర్మాత: ఎ.కె. వేలన్
దర్శకురాలు: సావిత్రి

Thursday, November 19, 2015

Synopsis of the movie AGGI MEEDA GUGGILAM (1968)

'అగ్గిమీద గుగ్గిలం' చిత్ర కథాంశం:


క్షుద్రవిద్యల్ని సొంతం చేసుకున్న మాయాపురం మాంత్రికుడు (రాజనాల) శ్రీపుర మహారాణి భట్టిణి (జూనియర్ శ్రీరంజని)ని అపహరించుకుపోయి, తన మాయా మందిరంలో బంధించి, ఆమెను వశపరచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ అవమాన భారంతో మహారాజు (గుమ్మడి) కుంగిపోతాడు. రాణి ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మరణించిందని ప్రకటిస్తాడు. అయితే తన రహస్య మందిరంలో అహోరాత్రులూ కఠోర దీక్షలో మునిగిపోయి యక్షిణిని ప్రసన్నం చేసుకుంటాడు. అపూర్వ మంత్రశక్తుల్ని సాధిస్తాడు. ఈ శక్తులతో మాంత్రికుడి పీచమణచి, రాణిని బంధవిముక్తి చేయడానికి ఎదురు చూస్తుంటాడు.
రాజు వైమనస్యాన్ని అవకాశంగా తీసుకొని మంత్రి చండవర్మ (ధూళిపాళ) రహస్యంగా సైన్యాధిపతిని హతమార్చి తన కుమారుడు శకటాలు (సత్యనారాయణ)కు ఆ పదవిని కట్టపెట్టాలని పన్నాగం పన్నుతాడు. ఈ ప్రమాదాన్ని శంకించిన రాజు అందుకు అంగీకరించక పోటీలు ఏర్పాటుచేసి, వాటిలో నెగ్గిన వీరునికే ఆ పదవి ఇవ్వాలని ఆదేశిస్తాడు.
ఆ పోటీల్లో వీరేంద్ర (కాంతారావు) నెగ్గుతాడు. అయితే సైన్యాధిపతి పదవిని నిరాకరిస్తాడు. అతని శౌర్యపరాక్రమాలకు ముగ్ధురాలైన రాకుమారి చంద్రప్రభాదేవి (రాజశ్రీ) అతనికి తన హృదయాన్ని అర్పిస్తుంది. వీరేంద్రుడు అరణ్యంలో తన చెల్లి అరుణ (విజయలలిత), తాత (కాశీనాథ్ తాత)తో నివసిస్తూ ఉంటాడు. రాకుమారి మారువేషంతో అక్కడకు వెళ్లి సైన్యాధిపత్యానికి అతణ్ణి ఒప్పిస్తుంది. వీరేంద్రుని చెల్లి అరుణ ఒకరోజు విచిత్ర పరిస్థితుల్లో కామపురి యువరాజు అరిందముడి (రామకృష్ణ)ని కలుసుకొని ప్రేమలో పడుతుంది.
ఈ కథలో ఇంకో ఉపకథ వస్తుంది. నిజానికి వీరేంద్రుడు కామపురి యువరాజనీ, అరిందముడి తండ్రి కామపాలుడు వీరేంద్రుని తండ్రి అయిన రాజును హతమార్చి, పిల్లల్ని కూడా చంపాలనుకుంటుండగా, పసికందుల్ని తాను రక్షించి అరణ్యానికి తెచ్చినట్లు తాత చెబుతాడు. శ్రీపురంలో వీరేంద్రుని భక్తి విశ్వాసాల్ని పరీక్షించిన మహారాజు అతడ్ని రహస్య మందిరానికి తీసుకెళ్లి, తన వృత్తాంతమంతా అతనికి వివరిస్తాడు. మాంత్రికునిపై పోరాటానికి బయల్దేరి, అతనికి బందీ అవుతాడు. అడవిలో వెళ్తున్న అరిందముడిపై శకటాలు బలగం దాడిచేస్తుంది. వీరేంద్రుడు అతనికి సాయపడతాడు. ఆ పోరులో స్పృహతప్పిన అరిందముడిని తన ఇంటికి తీసుకుపోతాడు. తాత ద్వారా తన తండ్రి చేసిన రాజద్రోహాన్ని తెలుసుకుంటాడు అరిందముడు. తండ్రి అక్రమాల్ని వ్యతిరేకిస్తాడు. దాంతో కొడుకుని బంధించమంటాడు కామపాలుడు. భటుల నుంచి తప్పించుకొని పారిపోతాడు అరిందముడు.
మహారాజును వీరేంద్రుడు హత్యచేశాడని చండవర్మ ప్రచారం చేస్తాడు. ఫలితంగా ప్రియుణ్ణి అనుమానించి కారాగారంలో వేయిస్తుంది రాకుమారి. అక్కణ్ణించి వీరేంద్రుడు తప్పించుకొని మహారాజు కోసం మాంత్రికుని వద్దకు బయలుదేరుతాడు. కామపాలునితో కలిసి కుట్ర పన్నిన చండవర్మ శ్రీపుర రాజ్యాపహరణకు ప్రయత్నిస్తాడు. రాకుమారి, అరుణ పారిపోతుండగా పట్టుకొని బంధిస్తారు. మాంత్రికుని స్థావరం చేరిన వీరేంద్రుడు, అక్కడ ఆకాశ బేతాళుడికి సాయపడి, అతని సాయంతో మాంత్రికుడి ప్రాణాలుండే కప్పను చేజిక్కించుకుంటాడు. దాంతో కథ సుఖాంతం.
తారాగణం: కాంతారావు, రాజశ్రీ, రామకృష్ణ, విజయలలిత, రాజనాల, గుమ్మడి, ధూళిపాళ, సత్యనారాయణ, రాజబాబు, జ్యోతిలక్ష్మి
సంగీతం: సత్యం
నిర్మాతలు: పి.యస్. ప్రకాశరావు, ఎ. పూర్ణచంద్రరావు
దర్శకుడు: జి. విశ్వనాథం
బేనర్: నవభారత్ ఫిలిమ్స్
విడుదల తేదీ: 26 సెప్టెంబర్

Friday, November 12, 2010

సినిమా: మాంగల్యం (1960)

తారాగణం: కాంతారావు, రామకృష్ణ, దేవిక, రాజనాల, బాలకృష్ణ (అంజి), రాజశ్రీ, హేమలత
రచన: ఆత్రేయ
నిర్మాత: ఎం.ఎ. వేణు
దర్శకుడు: బి.ఎస్. నారాయణ
బేనర్: ఎం.ఎ.వి. పిక్చర్స్
విడుదల తేది: అక్టోబర్ 13
కథ: ఎంబీబీయస్ డాక్టర్ కుమార్ (కాంతారావు) పనిపిల్ల సరళ (దేవిక)ను గాఢంగా ప్రేమించి పెద్దలకు తెలీకుండా గాంధర్వ వివాహం చేసుకుంటాడు. కాని అతడి తల్లి (హేమలత) కక్షతో ఇద్దరినీ విడదీస్తుంది. అమాయక సరళ చిమ్మ చీకటిలో దోవతప్పి ఎక్కడికో వెళ్లిపోతుంది. ఒక నాటక కంపెనీలో చేరి, డాక్టరంత అంతస్థు సంపాదించి, డాక్టర్ అర్థాంగి కావడానికి అంతా సిద్ధం చేసుకుంటుంది. కాని కంపెనీ యజమాని (రాజనాల) రివాల్వర్ దెబ్బ ఆ ఆశను ఒక్క అడుగుదూరంలో అడుగంటింపజేస్తుంది. కుమార్ మాంగల్యం కట్టడం సరళ కడసారి కోర్కె అని ఎవరో చెప్పగా విన్న కుమార్ మాంగల్యం కడతాడు కానీ పెళ్లి పీటల మీదే పెళ్లి కూతురు వొరిగిపోతుంది. విడి, తిరిగి ముడివడిన జంట, చివరికి శాశ్వతంగా విడిపోతుంది.
విశేషాలు: దర్శకుడు బి.ఎస్. నారాయణకు ఇది తొలి చిత్రం.

Friday, November 5, 2010

సినిమా: రమాసుందరి (1960)

తారాగణం: కాంతారావు, రామకృష్ణ, కృష్ణకుమారి, గిరిజ, పేకేటి శివరాం, ఎ.వి. సుబ్బారావు, కేవీఎస్ శర్మ
మాటలు: మద్దిపట్ల సూరి
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాత: జి. భావనారాయణ
దర్శకత్వం: హోసూర్ కృష్ణమూర్తి
బేనర్: మహేశ్వరి ప్రొడక్షన్స్
కథ: రమాసుందరి (కృష్ణకుమారి), వింద (గిరిజ)ల స్నేహ జీవితంపై ఇద్దరు యువకుల (రామకృష్ణ, కాంతారావు) ప్రభావం పడి ఇద్దరూ తూర్పు పడమరలై పోతారు. వింద సర్వకాలమూ రమ వినాశనానికి వినియోగించి ఆమె ప్రియుని (రామకృష్ణ)కి కాలజ్ఞానం లేకుండా చేసివేస్తుంది. తన ప్రేయసికి లోకజ్ఞానం కలిగించేందుకు ప్రియుడు (కాంతారావు) ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ ప్రయోజనం శూన్యం. చివరకి రమ తన పాతివ్రత్య మహిమ వల్లనైతేనేమి, శివభక్తి ప్రభావం వల్లనైతేనేమి విందకు వివేకోదయం కలిగిస్తుంది. తూర్పున వివేక భానూదయం జరిగాక, విడిన రెండు జంటలూ అక్కడ ఏకమవుతాయి.