Showing posts with label rudramadevi. Show all posts
Showing posts with label rudramadevi. Show all posts

Thursday, December 24, 2015

Show respect on Actress

'తార' అంటే చులకనెందుకు?

సినీ తారల్ని, అందులోనూ హీరోయిన్‌లను వాళ్ల హవా నడిచినంత కాలం బ్రహ్మాండంగా పొగుడుతూ ఆకాశానికెత్తేస్తారు. వాళ్ల ప్రాభవం తగ్గుతున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా విమర్శించి అవతలకి విసిరేస్తారు. అలా ఓ వైపు ప్రశంసలూ, మరోవైపు విమర్శలతో కూడుకున్న వాళ్ల జీవితాలు కులాసాగా ఉంటాయనీ, వాళ్లు సులభంగా డబ్బు సంపాదిస్తూ జల్సాగా పబ్బులకూ, పార్టీలకూ తిరుగుతుంటారనీ సాధారణంగా ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అయితే అది కేవలం అపోహ అని చెప్పాలి.
హీరో పాత్ర చుట్టూ ఎంత తిరిగినా నాయిక పాత్ర లేకపోతే ఆ సినిమా రస విహీనంగా ఉంటుందనేది నిజం. సినీ తార తన నేర్పునూ, చాకచక్యాన్నీ ప్రదర్శించి తన పాత్రలకు జీవం పోస్తోంది. ప్రతిభావంతులైన తారలు మహత్తరమైన స్త్రీ పాత్రలు - సీత, ద్రౌపది, రుద్రమదేవి, రాములమ్మ వంటివి - పోషించారు. మన పురాణాలు, చరిత్రల్లోని వీర నారీమణుల్ని సజీవంగా కళ్లముందుంచింది నటీమణులే. పాశ్చాత్య వ్యామోహంలో పడి మన పురాణ (పుక్కిటి పురాణలైనా అవి మన వారసత్వ సంపద), చారిత్రక గాథల్ని మర్చిపోయే స్థితిలోకి వచ్చాం. ముందు తరాలవాళ్లకు ఈ గొప్ప గాథలూ, పాత్రలూ కనిపించకుండా పోతాయనే దుస్థితికి దిగజారిపోయాం. ఇటీవలే 'రుద్రమదేవి'గా నటించిన అనుష్క ఆ వీరనారిని మరోసారి ప్రజలకు పరిచయం చేసింది. ప్రజల్లోని సాంఘిక దురాచారాల్ని అనేక స్త్రీపాత్రలు యెత్తి చూపించాయి. ఏ ఇతర మాధ్యమంలోనూ ఇలాంటి మహత్తర సంచలనం ప్రజల్లో తీసుకురావడం కష్టం. 'ఒసేయ్ రాములమ్మా'లో నాయిక భూస్వాముల్నీ, దొరల్నీ ఎదిరించి వారి పీచమణచి ప్రజలకు విముక్తి కలిగించడం చూశాం. ప్రజలకు కంటకంగా మారిన దుష్టశక్తిని అంతమొందించిన 'అరుంధతి'కి జేజేలు పలికాం.
సినిమాలు అభివృద్ధి చెందటంతో పాటు పాటలకూ ప్రాధాన్యం పెరిగింది. మధురంగా పాడుతున్న గాయనీమణుల గాత్రం సామాన్య ప్రజల్ని సైతం ఆకర్షించి ఆనందింపజేస్తోంది. లయ, సంగీతం ప్రజల హృదయాల్లో నాటుకుపోయేట్లు నేటి గాయకురాళ్లు తమ ప్రతిభాపాటవాల్ని ప్రదర్శిస్తున్నారు. ఇంటిపనులతో అలసిన స్త్రీలకు వాళ్ల పాటలు హాయినిస్తున్నాయి. సంగీతమనేది కేవలం విద్వాంసుల సొత్తేననీ, అది సాధించడం కష్టతరమనీ సాధారణంగా ఉండే అభిప్రాయం తప్పని ఇవాళ అనేకమంది గాయకురాళ్లు నిరూపిస్తున్నారు. టీవీలో వచ్చే పాటల కార్యక్రమాలు ఎంత ఆదరణ పొందుతున్నదీ చూస్తున్నాం. వీటివల్ల ఎంతోమంది గాయనీమణులకు అవకాశాలు ఏర్పడ్డాయి.
నిజంగా ఇలాంటి అభివృద్ధి కలగడానికి ఎక్కువగా తోడ్పడింది సినిమాలే అని చెప్పక తప్పదు. సినిమాల్లో ప్రోత్సాహం లేకపోతే భరతనాట్యం, కథకళి, మణిపురి, కథక్, కూచిపూడి వంటి నాట్యరీతులు ఎక్కడ పుట్టాయో అక్కడే ఉండేవి కానీ, ఇవాళున్నంతగా వృద్ధిచెందేవి కావు. ఈ నాట్యాలన్నీ భారతీయ సంస్కృతిలో ఓ భాగంగా గుర్తింపుకు నోచుకోవడం మనమంతా గర్వించాల్సిన విషయం. సినిమాల ద్వారా సినీనటి ఈ నాట్యరీతులన్నింటినీ ప్రజలకు అందించిందనేది ఒప్పుకుని తీరాలి.
దేశంలో స్త్రీల సాంఘిక జీవితంలో గొప్ప మార్పుల్ని తేగలిగింది సినీతార. సౌందర్యం విషయమైనా, హక్కుల విషయంలోనైనా తనను తాను తెలుసుకొనేటట్లు చేసింది నటి. ఒకప్పటి భారతీయ స్త్రీకీ, నేటి స్త్రీకీ నడకలో, అలంకరణల్లో హస్తిమశకాంతర భేదం కనిపించడంలో సినీనటి పాత్ర ఎంతో ఉంది. ఫలానా వాణిశ్రీలా నేనూ కనిపించాలి, ఫలానా సౌందర్యలా నేనూ చీర కట్టుకోవాలి, ఫలానా అనుష్కలా లావణ్యంగా కనిపించాలనే కోరిక స్త్రీలలో ఉండటం గమనిస్తూనే ఉన్నాం. దుస్తుల్లో, తలకట్టులో, కాలిజోళ్లలో మార్పులు బాహ్య రూపాన్ని మార్చివేస్తే, స్త్రీ తన కాళ్లపై తను నిలబడగలదనే ధైర్యాన్ని ఇవ్వడంలో పలు సినిమాల్లో సినీతారలు పోషించిన పాత్రలు కూడా దోహదం చేశాయి.
ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా ఉన్న రోజుల్లో స్త్రీలు  తమంత తాము స్వతంత్రంగా బతకడానికీ లేదా కుటుంబానికి ఆసరాగా ఉండటానికీ సినీ నటి ఒక నూతన మార్గం చూపించిందనాలి. ఏ ఇతర సంస్థల్లోనూ కనిపించని ఆదాయం సినీ రంగంలో కనిపిస్తుంది. తెలివైన స్త్రీలకు ఈ రంగంలో పైకి రావడానికి అనేక అవకాశాలున్నాయి. కేవలం నటే కానవసరం లేదు. ఇందులో స్త్రీలు పనిచేసే అనేక ఇతర శాఖలున్నాయి. దర్శకురాళ్లుగా, సినిమాటోగ్రాఫర్లుగా, సంగీత దర్శకురాళ్లుగా, నృత్య దర్శకురాళ్లుగా, రచయిత్రులుగా తమను తాము నిరూపించుకోవచ్చు.
ఎక్కడ ఏ కష్టం కలిగినా, ఏదేనా సంస్థకు ఆర్థిక సాయం కావాల్సినా తారలే ముందుంటున్నారు. ఇవాళ చాలమంది తారలు ఎంజీవోలకు మద్దతుగా నిలుస్తున్నారు. లేదంటే అలాంటి సంస్థలు నడుపుతున్నారు. విరాళాల సేకరణలో అలనాటి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి నుంచి నేటి సమంత దాకా ఎంతోమంది తమవంతు  కృషి చేస్తూనే ఉన్నారు.
ప్రభుత్వానికి జమయ్యే వినోదపన్నులో సినిమాల ద్వారా, తారల ద్వారా, చిత్ర పరిశ్రమ ద్వారా వచ్చేదే అధికం. అలాంటి ఈ పరిశ్రమలో నటిది చాలా ముఖ్యమైన పాత్ర. ఈ పరిశ్రమకే మూలాధారం నటి. దీని అభివృద్ధికై ఆమె చేసే సేవ చాలా గొప్పది. చిత్రంగా సంఘం దృష్టిలో ఆమె స్థానం అధమం. ఎక్కడ చూసినా ఆమె కేరక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడేవాళ్లే. అయినా అదేమీ లక్ష్యపెట్టకుండా పరిశ్రమలోని అందరితో కలిసి దాని అభివృద్ధికి ఆమె పాటుపడుతూనే ఉంది. దాని కోసం ఆమె ఎప్పుడూ సంసిద్ధమే.

Monday, November 16, 2015

Main Reason For RUDRAMADEVI Failure

'రుద్రమదేవి' ఫ్లాపవడానికి కారణం అదేనా?

గుణశేఖర్ డ్రీం ప్రాజెక్ట్ 'రుద్రమదేవి' వసూళ్లు రూ. 50 కోట్లకు చేరుకుంటున్నాయి. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు చేయడం టాలీవుడ్‌లో ఇదే ప్రథమం. ఇంత చేసినా 'రుద్రమదేవి' ఫ్లాప్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోనుండటం విచారకరం. రూ. 80 కోట్లు వసూలైతేనే కానీ ఆర్థిక ఇబ్బందుల నుంచి గుణశేఖర్ బయటపడే స్థితిలేదు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ రూ. 42 కోట్లు, హిందీ, తమిళ, మలయాళ వెర్షన్లు కలిపి రూ. 6 కోట్లు వసూలు చేశాయి. ఫుల్ రన్‌తో ఇంకో రెండు కోట్లు వస్తాయని అంచనా. దీన్నిబట్టి థియేటర్ కలెక్షన్ పరంగా రూ. 30 కోట్లు డెఫిసిట్ వచ్చే అవకాశాలున్నాయి. శాటిలైట్ హక్కులు తీసేస్తే ఈ నష్టం కొత తగ్గుతుంది. దీంతో తెచ్చిన అప్పులను గుణశేఖర్ ఎలా తీరుస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఆస్తులన్నీ అమ్ముకోవడంతో ఆయన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
'రుద్రమదేవి' కథాంశంలో గుణశేఖర్ మరింత శ్రద్ధపెట్టి పనిచేసినట్లయితే వంద కోట్ల ప్రాజెక్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'రుద్రమదేవి' సినిమాలో రుద్రమదేవి పాత్ర హైలైట్ కాకుండా గోన గన్నారెడ్డి పాత్ర ఆకర్షణీయంగా కనిపించడంతోనే, ఈ సినిమా విషయంలో గుణశేఖర్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. రుద్రమదేవిని వీరనారిగా, మహా సామ్రాజ్ఞిగా చూపించడానికి బదులుగా ఎంతసేపూ ఆమె లైంగికతపైనే దృష్టి సారించడంతో ప్రేక్షకులను ఆ పాత్ర ఆశించిన రీతిలో ఆకట్టుకోలేదనేది నిజం. చిన్ననాటి నుంచి మగవాడిగా పెరిగిన రుద్రమదేవి యుక్తవయసు వచ్చాక తాను ఒక స్త్రీనని తెలుసుకోవడంతో మొదలైన ఈ లైంగిక కోణంపైనే చివరాఖరి వరకూ సినిమా నడవడం ప్రేక్షకుల్లో ఒకవిధమైన వ్యతిరేక భావన ఏర్పడటానికి దోహదం చేసింది. అలా కాకుండా రుద్రమదేవి ప్రదర్శించిన వీరత్వం, ఆమె రాజనీతిజ్ఞత, ప్రజల్ని పరిపాలించిన విధానంపై దృష్టి నిలిపినట్లయితే ఆమె పాత్రకు న్యాయం చేసినట్లయ్యేది.
సీనియర్ నటి విజయశాంతి గనుక ఈ సినిమా చేసినట్లయితే, ఆమె ఫోకస్ అంతా రుద్రమదేవి శక్తియుకుల మీదే ఉండేది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తెలిపారు. "ఇప్పుడొచ్చిన 'రుద్రమదేవి' లైన్ వేరు. మేము ఎంచుకున్న లైన్ వేరు. మా కథ రుద్రమదేవి పట్టాభిషేకంతో మదలై ఆమె 83వ యేట వరకూ నడుస్తుంది. ఆ వయసులోనూ శత్రువులపై పోరాడిన వీరనారి ఆమె" అని చెప్పారామె. తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పాల్గొనడం వల్ల సినిమా చేయడానికి కుదరలేదనేది ఆమె మాట. లేనట్లయితే రుద్రమదేవిగా విజయశాంతి ఈ సరికే మనకు కనిపించి ఉండేవారు. ఆమె చెప్పినట్లుగా పట్టాభిషేకం తర్వాత నుంచే రుద్రమదేవి కథను చెప్పినట్లయితే ఈ సినిమా ఫలితం వేరుగా ఉండేదని విశ్లేషకులు నమ్ముతున్నారు. రుద్రమదేవికి సీక్వెల్‌గా 'ప్రతాపరుద్రుడు' తీయాలని గుణశేఖర్ భావిస్తున్నప్పటికీ, ఆయన కోరిక తీరే అవకాశాలు చాలా స్వల్పంగానే ఉన్నాయి.

Thursday, October 8, 2015