'తార' అంటే చులకనెందుకు?
సినీ తారల్ని, అందులోనూ హీరోయిన్‌లను వాళ్ల హవా నడిచినంత కాలం బ్రహ్మాండంగా పొగుడుతూ ఆకాశానికెత్తేస్తారు. వాళ్ల ప్రాభవం తగ్గుతున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా విమర్శించి అవతలకి విసిరేస్తారు. అలా ఓ వైపు ప్రశంసలూ, మరోవైపు విమర్శలతో కూడుకున్న వాళ్ల జీవితాలు కులాసాగా ఉంటాయనీ, వాళ్లు సులభంగా డబ్బు సంపాదిస్తూ జల్సాగా పబ్బులకూ, పార్టీలకూ తిరుగుతుంటారనీ సాధారణంగా ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అయితే అది కేవలం అపోహ అని చెప్పాలి.హీరో పాత్ర చుట్టూ ఎంత తిరిగినా నాయిక పాత్ర లేకపోతే ఆ సినిమా రస విహీనంగా ఉంటుందనేది నిజం. సినీ తార తన నేర్పునూ, చాకచక్యాన్నీ ప్రదర్శించి తన పాత్రలకు జీవం పోస్తోంది. ప్రతిభావంతులైన తారలు మహత్తరమైన స్త్రీ పాత్రలు - సీత, ద్రౌపది, రుద్రమదేవి, రాములమ్మ వంటివి - పోషించారు. మన పురాణాలు, చరిత్రల్లోని వీర నారీమణుల్ని సజీవంగా కళ్లముందుంచింది నటీమణులే. పాశ్చాత్య వ్యామోహంలో పడి మన పురాణ (పుక్కిటి పురాణలైనా అవి మన వారసత్వ సంపద), చారిత్రక గాథల్ని మర్చిపోయే స్థితిలోకి వచ్చాం. ముందు తరాలవాళ్లకు ఈ గొప్ప గాథలూ, పాత్రలూ కనిపించకుండా పోతాయనే దుస్థితికి దిగజారిపోయాం. ఇటీవలే 'రుద్రమదేవి'గా నటించిన అనుష్క ఆ వీరనారిని మరోసారి ప్రజలకు పరిచయం చేసింది. ప్రజల్లోని సాంఘిక దురాచారాల్ని అనేక స్త్రీపాత్రలు యెత్తి చూపించాయి. ఏ ఇతర మాధ్యమంలోనూ ఇలాంటి మహత్తర సంచలనం ప్రజల్లో తీసుకురావడం కష్టం. 'ఒసేయ్ రాములమ్మా'లో నాయిక భూస్వాముల్నీ, దొరల్నీ ఎదిరించి వారి పీచమణచి ప్రజలకు విముక్తి కలిగించడం చూశాం. ప్రజలకు కంటకంగా మారిన దుష్టశక్తిని అంతమొందించిన 'అరుంధతి'కి జేజేలు పలికాం.
సినిమాలు అభివృద్ధి చెందటంతో పాటు పాటలకూ ప్రాధాన్యం పెరిగింది. మధురంగా పాడుతున్న గాయనీమణుల గాత్రం సామాన్య ప్రజల్ని సైతం ఆకర్షించి ఆనందింపజేస్తోంది. లయ, సంగీతం ప్రజల హృదయాల్లో నాటుకుపోయేట్లు నేటి గాయకురాళ్లు తమ ప్రతిభాపాటవాల్ని ప్రదర్శిస్తున్నారు. ఇంటిపనులతో అలసిన స్త్రీలకు వాళ్ల పాటలు హాయినిస్తున్నాయి. సంగీతమనేది కేవలం విద్వాంసుల సొత్తేననీ, అది సాధించడం కష్టతరమనీ సాధారణంగా ఉండే అభిప్రాయం తప్పని ఇవాళ అనేకమంది గాయకురాళ్లు నిరూపిస్తున్నారు. టీవీలో వచ్చే పాటల కార్యక్రమాలు ఎంత ఆదరణ పొందుతున్నదీ చూస్తున్నాం. వీటివల్ల ఎంతోమంది గాయనీమణులకు అవకాశాలు ఏర్పడ్డాయి.
నిజంగా ఇలాంటి అభివృద్ధి కలగడానికి ఎక్కువగా తోడ్పడింది సినిమాలే అని చెప్పక తప్పదు. సినిమాల్లో ప్రోత్సాహం లేకపోతే భరతనాట్యం, కథకళి, మణిపురి, కథక్, కూచిపూడి వంటి నాట్యరీతులు ఎక్కడ పుట్టాయో అక్కడే ఉండేవి కానీ, ఇవాళున్నంతగా వృద్ధిచెందేవి కావు. ఈ నాట్యాలన్నీ భారతీయ సంస్కృతిలో ఓ భాగంగా గుర్తింపుకు నోచుకోవడం మనమంతా గర్వించాల్సిన విషయం. సినిమాల ద్వారా సినీనటి ఈ నాట్యరీతులన్నింటినీ ప్రజలకు అందించిందనేది ఒప్పుకుని తీరాలి.
దేశంలో స్త్రీల సాంఘిక జీవితంలో గొప్ప మార్పుల్ని తేగలిగింది సినీతార. సౌందర్యం విషయమైనా, హక్కుల విషయంలోనైనా తనను తాను తెలుసుకొనేటట్లు చేసింది నటి. ఒకప్పటి భారతీయ స్త్రీకీ, నేటి స్త్రీకీ నడకలో, అలంకరణల్లో హస్తిమశకాంతర భేదం కనిపించడంలో సినీనటి పాత్ర ఎంతో ఉంది. ఫలానా వాణిశ్రీలా నేనూ కనిపించాలి, ఫలానా సౌందర్యలా నేనూ చీర కట్టుకోవాలి, ఫలానా అనుష్కలా లావణ్యంగా కనిపించాలనే కోరిక స్త్రీలలో ఉండటం గమనిస్తూనే ఉన్నాం. దుస్తుల్లో, తలకట్టులో, కాలిజోళ్లలో మార్పులు బాహ్య రూపాన్ని మార్చివేస్తే, స్త్రీ తన కాళ్లపై తను నిలబడగలదనే ధైర్యాన్ని ఇవ్వడంలో పలు సినిమాల్లో సినీతారలు పోషించిన పాత్రలు కూడా దోహదం చేశాయి.
ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా ఉన్న రోజుల్లో స్త్రీలు తమంత తాము స్వతంత్రంగా బతకడానికీ లేదా కుటుంబానికి ఆసరాగా ఉండటానికీ సినీ నటి ఒక నూతన మార్గం చూపించిందనాలి. ఏ ఇతర సంస్థల్లోనూ కనిపించని ఆదాయం సినీ రంగంలో కనిపిస్తుంది. తెలివైన స్త్రీలకు ఈ రంగంలో పైకి రావడానికి అనేక అవకాశాలున్నాయి. కేవలం నటే కానవసరం లేదు. ఇందులో స్త్రీలు పనిచేసే అనేక ఇతర శాఖలున్నాయి. దర్శకురాళ్లుగా, సినిమాటోగ్రాఫర్లుగా, సంగీత దర్శకురాళ్లుగా, నృత్య దర్శకురాళ్లుగా, రచయిత్రులుగా తమను తాము నిరూపించుకోవచ్చు.
ఎక్కడ ఏ కష్టం కలిగినా, ఏదేనా సంస్థకు ఆర్థిక సాయం కావాల్సినా తారలే ముందుంటున్నారు. ఇవాళ చాలమంది తారలు ఎంజీవోలకు మద్దతుగా నిలుస్తున్నారు. లేదంటే అలాంటి సంస్థలు నడుపుతున్నారు. విరాళాల సేకరణలో అలనాటి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి నుంచి నేటి సమంత దాకా ఎంతోమంది తమవంతు కృషి చేస్తూనే ఉన్నారు.
ప్రభుత్వానికి జమయ్యే వినోదపన్నులో సినిమాల ద్వారా, తారల ద్వారా, చిత్ర పరిశ్రమ ద్వారా వచ్చేదే అధికం. అలాంటి ఈ పరిశ్రమలో నటిది చాలా ముఖ్యమైన పాత్ర. ఈ పరిశ్రమకే మూలాధారం నటి. దీని అభివృద్ధికై ఆమె చేసే సేవ చాలా గొప్పది. చిత్రంగా సంఘం దృష్టిలో ఆమె స్థానం అధమం. ఎక్కడ చూసినా ఆమె కేరక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడేవాళ్లే. అయినా అదేమీ లక్ష్యపెట్టకుండా పరిశ్రమలోని అందరితో కలిసి దాని అభివృద్ధికి ఆమె పాటుపడుతూనే ఉంది. దాని కోసం ఆమె ఎప్పుడూ సంసిద్ధమే.
No comments:
Post a Comment