'వింధ్యరాణి' (1948) చిత్ర కథాంశం
వింధ్యరాజు ఒక ప్రత్యేక ఉన్మత్త మనస్తత్వం కలిగినవాడు. స్వప్రయోజనం కోసం నీతినియమాల్ని పాటించడు. నీతిబోధలన్నా, మంచిమాటలన్నా అతనికి విసుగు. వందిమాగధుల ప్రశంసలకు ఉబ్బిపోడు. స్తోత్రాలలోని వాస్తవమెంతో తెలిసినవాడు. అలా అని ఎదుటివాళ్ల ప్రశంసల్ని ఆశించని అమాయకుడు కాడు. స్త్రీద్వేషి కాకపోయినా వాళ్లంటే గౌరవం లేనివాడు. కామంతో రగిలిపోయే భోగలాలసుడు. అయితే బలహీనులైన స్త్రీలంటే అతనికి రోత. తనకు తగ్గ దృఢవంతురాలై, తన అధికార పరాక్రమానికి ఎదురునిల్చి, బుసలుకొట్టే మహాక్రోధ అయిన స్త్రీని చేజిక్కించుకొని, చెరబట్టి, లొంగదీసుకోవడంలోనే అతనికి మహానందం.
అలాంటి స్త్రీ ఒకామె అతనికి తారసిల్లింది. ఆమే వింధ్యరాణి. ఆమెను ఉడికించి, రెచ్చగొట్టి, ఆమెలో ఎంత విషమున్నదో దాన్నంతా కక్కించేదాకా అతనికి నిద్రపట్టదు. నిద్రపోతున్న తనను ఆమె చాకుతో పొడిచినా కూడా, ఆమె ధైర్యసాహసాలను మెచ్చుకుంటాడే తప్ప ద్వేషించడు. నీతిమంతంగా ఉండేవాళ్లను అతను సహించడు. అలాంటి వాళ్లు అతని దృష్టిలో పిరికిపందలు. వాళ్లను రెచ్చగొట్టి, వాళ్లలోని ఉద్రేకాలని బయటకుతీసి, అంతలోనే వాళ్ల నెత్తిపై చరిచి, తిరిగి వాళ్లను యథాస్థానంలోకి కుచించుకుపోయేట్లు చేయడం అతనికి సరదా.
శివశ్రీని అలాగే ఉడికించాడు. కానీ శివశ్రీ ధర్మమార్గ పరాయణుడు, అహింసామార్గానువర్తి. వింధ్యరాజు అసహాయంగా చేత చిక్కినప్పుడు, అతడు తన శత్రువైనప్పటికీ హింసించకుండా క్షమించి విడిచిపెట్టి, పరితాపాగ్నిలో ముంచేశాడు. ఆ పరితాపాగ్ని అతని స్వభావంలోని చెడుని దహించివేసి, సహజంగా అతనిలో ఉన్న మంచిని ప్రేరేపించి, ఇతరుల మంచినికోరే యోగిగా అతణ్ణి మార్చేస్తుంది.
తారాగణం: పుష్పవల్లి, డీవీ సుబ్బారావు, రమణారావు, వరలక్ష్మి, రేలంగి, పండితరావు, ఏవీ సుబ్బారావు
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య
బేనర్: వైజయంతి ఫిలిమ్స్
విడుదల తేదీ: 14 జనవరి
No comments:
Post a Comment