Thursday, December 10, 2015

Synopsis of the movie KALASINA MANASULU (1968)

'కలసిన మనసులు' (1968) చిత్ర కథాంశం


రామాపురం గ్రామంలో మోతుబరి వెంకటరత్నం (రేలంగి). కొడుకు శేఖర్ (జగ్గయ్య), మనవరాలు లక్ష్మి (బేబీ శంతికళ) తప్ప ఆ ఇంట్లో మరో ప్రాణి లేదు. లక్ష్మి బాగోగులు చూసేందుకు ఆయాగా నిర్మల (వాణిశ్రీ) వస్తుంది. నిర్మల అన్నయ్య రాము (శోభన్‌బాబు) పట్నంలో వెంకటరత్నం దయాధర్మాలతో చదువుతుంటాడు. ఆ ఊళ్లోనే ఉండే రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోరికల కొండలరావు (అల్లు రామలింగయ్య) ఏకైక పుత్రిక లీల (భారతి) పంతులమ్మగా పనిచేస్తుంటుంది. రాము, లీల చిన్ననాటి చెలిమితో పెద్దయ్యాక ప్రేమలో పడ్డారు. కోరికల కొండలరావుకు కోరికలు జాస్తి. తనకు కాబోయే అల్లుడు అర్హతలంటూ బ్లాక్‌బోర్డుపై ఓ దండకం రాసి వాటిని కూతురి చేత నిత్య పారాయణం చేయిస్తూ ఉంటాడు.
పట్నంలో బీకాం పరీక్ష రాసిన రాము ఇంటికి వస్తూ దారిలో మూర్తీ అండ్ కంపెనీ మేనేజర్ ఆనంద్ (రామ్మోహన్)ను దొంగల బారి నుండి కాపాడటమే కాక ఆస్పత్రిలో తన రక్తం ఇచ్చి ప్రాణదానం చేస్తాడు. రాము నిజాయితీకి, త్యాగనిరతికి ఆకర్షితుడైన ఆ కంపెనీ యజమాని రాముకు తన కంపెనీలో ఉద్యోగం ఇస్తాడు.
రాము ఆహ్వానంపై అతని ఇంటికి వచ్చిన ఆనంద్, అక్కడ లీలను చూసి, ఆమెను రాము చెల్లెలు నిర్మలగా భ్రమించి ప్రేమిస్తాడు. ప్రేమ పర్యవసానం - ఆనంద్, నిర్మల వివాహం. తీరా తాళికట్టబోయే సమయంలో నిర్మలను చూసిన ఆనంద్ 'ఇదంతా మోసం' అంటూ పెళ్లిపీటల మీదనుంచి లేచిపోతాడు. ఆ అవమానం కలిగించిన దుఃఖంతో నిర్మల తల్లి మరణిస్తుంది. పచ్చని కల్యాణమంటపం శోకానికి నిలయం కాగా, నిర్మలకు పెళ్లి చేశాకే తను వివాహం చేసుకుంటానని చివరి క్షణాల్లో తల్లికి మాటిస్తాడు రాము.
ఎందుకిలా చేశావని ఆనంద్‌ను నిలదీస్తాడు రాము. పేరు ఏదైనా తను చూసిందీ, ప్రేమించిందీ లీలననీ, ఆమె కూడా తనను ప్రేమించిందనీ, దానికి నిదర్శనం కూడా ఉందనీ దబాయిస్తాడు ఆనంద్. దీంతో నిర్ఘాంతపోయిన రాము భగ్న ప్రేమికుడిలా బాధను అనుభవిస్తుంటాడు. లీలను ఆనంద్ ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న అతని తల్లి కోర్కెల కొండలరావుతో మాట్లాడి లీల, ఆనంద్ పెళ్లి నిశ్చయం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న లీల తన హృదయంలో రాముకు తప్ప మరొకరికి చోటులేదని ఆనంద్‌కు తేల్చిచెప్పి, ఆనంద్ తన ప్రేమకానుకను ఇచ్చింది నిర్మలకేనని రుజువుచేస్తుంది. దాంతో కథ సుఖాంతం.

తారాగణం: శోభన్‌బాబు, భారతి, వాణిశ్రీ, జగ్గయ్య, రామ్మోహన్, రేలంగి, అల్లు రామలింగయ్య, హేమలత, రావి కొండలరావు, గుంటూరు వెంకటేశ్, బేబీ శాంతికళ
సంగీతం: మాస్టర్ వేణు
నిర్మాత: ఎమ్మెస్ రెడ్డి
దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు
బేనర్: కౌముది పిక్చర్స్
విడుదల తేదీ: 11 అక్టోబర్

No comments: