'బొమ్మలు చెప్పిన కథ' (1969) చిత్ర కథాంశం
అమరావతీ నగర మహారాజు (ధూళిపాళ) బావమరిది వీరసేనుడి (ప్రభాకరరెడ్డి) ఇద్దరు కుమార్తెల్లో ఒకరు మరొకరి మరణానికి కారకులవుతారని బొమ్మలు చెపుతాయి. ఇది విన్న వీరసేనుడు చిన్న కూతుర్ని కాళీ ఆలయంలో వదిలేసి వెళ్తాడు. ఆ అమ్మాయి చంప (విజయనిర్మల) పేరుతో ఓ గొర్రెల కాపరి వద్ద పెరుగుతుంది. పెద్దమ్మాయి సుజాత (విజయలలిత) రాజ ప్రసాదంలో పెరిగి యువరాజు ప్రతాప్ (కాంతారావు)పై మనసు పడుతుంది.
రాజ్యంలో బందిపోట్ల అరాచకాల్ని అణచాలని అడవికి వెళ్లిన ప్రతాప్ బందిపోట్ల చేతుల్లో దెబ్బలుతిని అక్కడ చంప ఆశ్రయంలో తేరుకొంటాడు. ఆమెను ప్రేమించి పెళ్లాడి అంతఃపురానికి తెస్తాడు. తను ప్రేమించినవాణ్ణి వలలో వేసుకొని పెళ్లి చేసుకుందనే కక్షతో చంపను ఏడిపిస్తూ ఉంటుంది సుజాత. విషమిచ్చి చంపటానికి సైతం ప్రయత్నిస్తుంది. అది విఫలం కావడంతో పగతో రగిలిపోతూ ఉంటుంది. ఈలోగా బందిపోటు మంగు (కృష్ణ) అనుచరుణ్ణి యువరాజు పట్టుకొని ఉరితీయించాడనే వార్త బందిపోటు దొంగల్లో కలవరం కలిగిస్తుంది. ప్రతాప్‌ను చంపడానికి అర్ధరాత్రి అంతఃపురానికి వెళ్లిన మంగూను తన అన్నగా గుర్తిస్తుంది చంప.
ఇంతలో యువరాజు మేల్కొని వెన్నంటి తరమగా గాయపడిన మంగు కాళికాలయం చేరి, అక్కడ బొమ్మలు చెప్పిన మరో కథ వింటాడు. చంప శ్రీమంతం నాటి రాత్రి ఒక కాలనాగు యువరాజును కాటువేస్తుంది. ఈలోగా చంప తన భర్త గుండెల్లో గాయంచేసి ఆ రక్తంతో నుదుట తిలకం దిద్దుకుంటే యువరాజు బతుకుతాడు. ఈ రహస్యం ఆమె బయటపెడితే భర్త శిలగా మారిపోతాడు. ఈ కథ వినడంతో యువరాజు రక్షణకు సిద్ధమవుతాడు మంగు. అదును కోసం వేచిచూస్తున్న సుజాత, ఇదే సమయమని మంగూ చంపలకు రంకు అంటగట్టి యువరాజును హత్యచేయడానికి ప్రయత్నించిందని చంపపై అభియోగం మోపుతుంది. విచారణలో చంపకు నిజం చెప్పక తప్పలేదు. ఫలితంగా యువరాజు శిలైపోతాడు. చంపను మాయలమారిగా నిర్ణయించి శిక్ష విధిస్తారు. అప్పుడే రాజును బంధించి సింహాసం ఆక్రమిస్తాడు మంత్రి.
ఈ చిక్కును విడదీసే ఉపాయాన్ని సైతం బొమ్మలే చెబుతాయి. మంగు సాహసంతో, సుజాత ఆత్మ పరిత్యాగంతో కథ నిర్ణీత ప్రకారం సుఖాంతమవుతుంది. మంగు ఎవరో కాదు, వీరసేనుడి కుమారుడేనని తేలుతుంది.
తారాగణం: కాంతారావు, కృష్ణ, విజయనిర్మల, విజయలలిత, సంధ్యారాణి, గీతాంజలి, ధూళిపాళ, ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ, మిక్కిలినేని, రాజబాబు
సంగీతం: మాస్టర్ వేణు
నిర్మాత: డి. రామానాయుడు
దర్శకుడు: జి. విశ్వనాథం
బేనర్: సురేశ్ మూవీస్
విడుదల తేదీ: 4 ఏప్రిల్
1 comment:
Awesome story. Alas, there is no video of this anywhere online for posterity.
Post a Comment