స్వయం శక్తిని ఉపయోగపెట్టేదెప్పుడు?
మనం స్వతంత్రంగా వ్యవహరిస్తే తగినంత విదేశీ సహాయం మనకు లభించదు. విదేశీ సహాయంపై ఆధారపడిన రోజు స్వతంత్రంగా వ్యవహరించడానికి తగిన శక్తి మనకుండదు. విదేశీ సహాయం వల్ల జరిగే అభివృద్ధి విదేశాల ప్రయోజనాలకు భంగం కలగని విధానంలో జరుగుతుంది కానీ మన ఆర్థిక పరాధీనత మాత్రం తొలగదు. మనకు కావాల్సినత అంగబలం, అర్థ బలం ఉంది. సరైన ఆర్థిక విధానం ద్వారా ఈ అంగబలాన్ని అర్థబలంతో సమన్వయం చేస్తే ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం మనకు ఉండదు. ప్రజలకు పని కల్పించని, దేశంలోని అర్థబలాన్ని సమీకరించడానికి పూనుకోని ప్రణాళికలు తమ ప్రయోజనాన్ని సాధించలేవు.విదేశీ సంస్థలు లాభాలుగా గడించిన కోట్లాది రూపాయలు దేశంనుంచి బయటకు వెళ్లిపోతున్నాయి. మనదేశంలోని పారిశ్రామిక సంస్థలు సంపాదించిన అధిక లాభాల్లో తగినంత భాగం తిరిగి ఉత్పత్తిని అభివృద్ధి చేసేందుకు వినియోగపడ్డం లేదు. దేశాభివృద్ధికి ఉపయోగపడకుండా వ్యర్థమవుతున్న ఈ అర్థబలం కొంతభాగమైనా ప్రణాళికా నిర్వహణకు సేకరించగలిగినప్పుడే ఏదైనా సాధించేందుకు వీలవుతుంది. కొనుగోలు శక్తి క్షీణించి ఇప్పటి ఉత్పత్తినే అనుభవించలేని స్థితిలో ప్రజలు ఉన్నప్పుడు ధరలు పెరిగితే వాళ్ల జీవన స్థాయి ఇంకా తగ్గుతుంది. ధరల్ని అదుపులో పెట్టడానికి తగిన పరిపాలనా సౌష్టవం మనకులేదనే సంగతి పప్పు ధాన్యాలు, ఉల్లిపాయలు, బియ్యం వంటి ఆహార పదార్థాల విషయంలో మనకు అనుభవమే. ప్రభుత్వం వడ్డీలకు రుణాల్ని తెస్తూ రకరకాల పన్నుల రూపంలో ప్రజల నుంచి వాటిని వసూలు చేస్తోంది. ఉన్నవాళ్ల సంపదను పెంచి, లేనివాళ్ల లేమిని పెంచే ఈ విధానం లోపభూయిస్థంగా ఉందనేది నిశ్చయం.
ప్రజల ఆదాయం పెరగాలంటే వ్యవసాయం వృద్ధి చెందాలి. నిరుద్యోగం పోవాలి. కానీ మనవద్ద ఈ రెండూ జరగడం లేదు. వ్యవసాయం లాభసాటి వృత్తిగా మారడం అటుంచి, రుణాల ఊబిలో చిక్కుకుపోతూ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఏటా వందలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘోరాన్ని చూస్తున్నాం. ఇక మనవద్ద ఉపాధి ఆశించిన మేరకు కనిపించకపోవడంతో ప్రతిభావంతులైన సాఫ్ట్‌వేర్, ఆర్థిక రంగ నిపుణులు ఇతర దేశాలకు తరలిపోతుండం మనకు ప్రత్యక్ష అనుభవం. సామాన్య ప్రజల వద్ద ఉన్నది శ్రమశక్తి మాత్రమే. దాన్నయినా వినియోగించుకోడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. శ్రమశక్తిని సంపదగా ప్రభుత్వం మార్చుకోగలిగితే, ఆ సంపదలో కొంతభాగం తిరిగి జాతీయాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గుర్తించాలి.
No comments:
Post a Comment