Showing posts with label devulapalli krishna sastry. Show all posts
Showing posts with label devulapalli krishna sastry. Show all posts

Wednesday, February 18, 2015

Literature: Women's Telugu Monthly Anasuya

ఆనాటి స్త్రీని మేల్కొలిపిన 'అనసూయ'

తెలుగులో స్త్రీల కోసం స్థాపించిన మొదటి పత్రిక సతీహితబోధిని. దాన్ని స్థాపించినది కందుకూరి వీరేశలింగం పంతులు. గొప్ప సంఘసంస్కర్తగా పేరు తెచ్చుకున్న ఆయనకు స్త్రీలపట్ల ఉన్నవన్నీ గొప్ప భావాలు కావు. ఆయన దృష్టిలో స్త్రీ అవలక్షణాల పుట్ట. అలాంటి స్త్రీని బాగుచేసి ఆదర్శ గృహిణిగా నిలపడం గొప్ప సంస్కరణ కింద ఆయన భావించారు. అప్పట్లో సంస్కర్తలమనుకునే వాళ్లకి ఇలాంటి అభిప్రాయమే ఉండేదని తోస్తుంది.
స్వాతంత్ర్యానికి పూర్వమే స్త్రీల సంపాదకత్వంలో పత్రికలు వెలువడటం గొప్ప విషయమైతే అందులో కొన్ని పత్రికలు స్త్రీవిద్య కోసం, తద్వారా స్త్రీలలో చైతన్యం పెంపొందటం కోసం కృషి చేయడం మరింత విశేషమనే చెప్పాలి.
'హిందూసుందరి' స్త్రీ సంపాదకత్వంలో వెలువడిన తొలి తెలుగు పత్రిక. శ్రీమతి మొసలికంటి రమాబాయి సంపాదకత్వంలో 1902లోనే ఈ పత్రిక ప్రారంభమైంది. అప్పట్లో 'హిందూసుందరి' పత్రిక వెలువడటం తెలుగుదేశంలో పెద్ద సంచలనం. ఇంతటి పేరు తెచ్చుకోకపోయినా స్త్రీ విద్యపైనా, సమాజంలో ఆనాడు ఉన్న సంఘ దురాచారాలపైనా వచ్చిన మరో పత్రిక 'అనసూయ'. 1917లో ప్రారంభమైన ఈ పత్రికకు సంపాదకురాలు శ్రీమతి వింజమూరి వెంకటరత్నమ్మ. 'అనసూయ' కంటే ముందు వచ్చిన స్త్రీల పత్రికలు 'హిందూసుందరి' కాక 'సావిత్రి', 'జనానా', 'గృహలక్ష్మి' అనేవి. వీటిలో 'హిందూసుందరి' మినహా మిగతా మూడూ 'అనసూయ' వచ్చేనాటికి మాయమయ్యాయి.
"స్త్రీలెచ్చట నుచ్ఛస్థితిలో నుందురో యాదేశ మభివృద్ధిలోనున్న మాటయే. అట్లుండుటకు వారి యజ్ఞానాంధకారము పారద్రోలబడవలయును. వారు పురుషులతో సర్వవిధముల సమానలని యెన్నుకొనబడు నవస్థ రావలయును." (వింజమూరి వెంకటరత్నమ్మ, 1920 జనవరి సంచిక) అనే భావాన్ని వ్యక్తం చేయడం నిజంగా అప్పట్లో సంచలమే. సాహిత్యలోకంలో గొప్ప సంచలనాన్నీ, ప్రకంపనల్నీ పుట్టించిన 'స్త్రీ'ని చలం రచించింది 1925 ప్రాంతంలో కాగా, అంతకు అయిదు సంవత్సరాల మునుపే పురుషులతో పాటు స్త్రీలు అన్ని విధాలా సమానమనే సమాజం రావాలని వీరు పేర్కొనడం విశేషమే.
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో సర్ నారాయణచంద్ర వార్కర్ రచించిన ఒక వ్యాసాన్ని వెంకటరత్నమ్మ 'ఇరువురు మాలకన్నియలు' పేరుతో అనువదించి 1919 జూలై-ఆగస్టు సంచికలో ప్రచురించారు. అందులో మాలకన్య హూవి, తండ్రి తనకి పెళ్లి చేస్తాననీ, పెళ్లివలన సుఖంగా ఉండొచ్చనీ చెబితే, తండ్రితో "సుఖమా? భర్తలకును సుఖమునకును ఎంతో సంబంధముండునట్లు మాట్లాడుచున్నావే" అంటుంది. హూవి తల్లి భర్తను విడిచిపెట్టి వెళ్లిపోతుంది. అందుకని తండ్రి హూవితో "నీ తల్లిని నేను విడిచిపెట్టలేదనియు, అదియే నన్ను విడిచిపోయేనియు నీవెరుగుదువా?" అని అన్నప్పుడు "అట్లామె నిన్ను విడిచినదని విని నేను గర్వపడుచున్నాను. మా యాడువాండ్రు నీవు త్రోలి డబ్బును గడియించు గుర్రమువంటి వారు కాదని నిదర్శనపూర్వకముగా నీకామె చూపినది" అని సమాధానమిస్తుంది హూవి. మరో సందర్భంలో "కులము నారికి నాయందముతో జోక్యము లేదు. నేనడగుటయే తడవుగ వరులు నాకు లభింతురని నీవనుచుంటివి. కాని వధువులంత చులకనగ లభ్యము కారని నేను జూపింపదలచుకున్నాను" అనేందుకు సాహసిస్తుంది హూవి. ఇప్పటి పరిస్థితుల్లోనూ హూవిలా ధైర్యంగా చెప్పగలిగే యువతులు లేరు. కాని అప్పట్లోనే అలాంటి భావాల్ని పత్రికలో వ్యక్తం చేయడం అంటే సామాన్యం కాదు.
పూర్వకాలంలో మనదేశంలో ఉన్న ఘోషాపద్ధతి మూలంగా పురుషుల మాదిరిగా స్త్రీలు బయటకి వచ్చి చదువుకోడానికి వీల్లేకుండా ఉండేది. అయితే అవకాశమిస్తే మేధాపరంగా వారు పురుషులకేమాత్రం తీసిపోరు అన్న అంశంతో వెంకటరత్నమ్మ ఒక వ్యాసంలో బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయినిలుగా స్త్రీలను మాత్రమే నియమించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థినులు తయారవుతారని ఆమె భావన. 20వ శతాబ్దంలో మొదటి మూడు దశాబ్దాల కాలం వరకూ బాల్య వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. వితంతువుల కష్టనష్టాలను గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ దురాచారాలపై యుద్దం ప్రకటిస్తూ గోపిశెట్టి సూర్యనారాయణమ్మ తన 'స్త్రీవిద్య' వ్యాసంలో "ఏమాత్రము వివేకమున్నను స్త్రీలు తమ బిడ్డలకు బాల్య వివాహము చేయనిత్తురా? బిడ్డలకు జేయు పెండ్లిండ్ల వ్యయములో నాల్గవవంతు స్త్రీవిద్యకి వెచ్చించిన, నమూల్యమగు సంతతిని దేశమున నిల్పవచ్చునే" అని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
ఏ మాత్రం విలువలు పాటించని రాజకీయ నాయకులు మైకుముందు ఎలా మాట్లాడతారో, మైకు దాటి బయటకు వచ్చి ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలుసు. అట్లాంటి నాయకుల్ని ఆనాడే వసంతరావు అమ్మన్న ఒక వ్యాసంలో ఎండగట్టారు. అప్పటి వారసత్వం రాజకీయ నాయకుల్లో ఇప్పటికీ కొనసాగుతోంది కదా!
ఆ నాటి సంఘంలో స్త్రీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదంటే.. "ఆ కాలంలో స్త్రీల స్థితి చాలా హైన్యంగా ఉండేది. మూర్ఖత్వానికి స్త్రీలు పుట్టినిండ్లుగా ఉండేవారు. వితంతువుల నిర్బంధనలు, కోడంట్రికములు చాలా ఎక్కువగా ఉండేవి.. ఇంతలో వరకట్నాలొకటి వచ్చి పడ్డాయి. వీటి మూలంగా ఆడపిల్లల అభివృద్ధి ఆగిపోయింది. ఆడపిల్ల పుట్టిందంటే పెళ్లి ఎలా చేస్తుమాని విచారిస్తున్నారు.. మా కాలంలో ఆడపిల్లలను కన్న దరిద్రులెవరన్నా ఉంటే ఏ ముసలికో, ముతక్కో ఇచ్చి చేసేవారు. అంతే కానీ ఈ మాదిరిగా బేరంపెట్టి మర్యాదస్తులు, ధనవంతులు, పరువు గలవారు కూడా మగపిల్లలను అమ్ముకోవడం యెరగం. ఆత్మగౌరవం గల విద్యార్థులు ఈ అమ్ముడుబోవడానికి ఎలా ఒప్పుకుంటున్నారో తెలియదు." ('అప్పుడు-ఇప్పుడు'- వృద్ధురాలు - 1920 మార్చి సంచిక). ఇప్పుడూ ఆ విద్యార్థుల ఆత్మగౌరవంలో మార్పేమీ లేదు కదా!
స్త్రీలలో ఎప్పటికీ మారని గుణం ఒకటుంది. అది తమ జాతిని తామే దూషించడం. ఇట్లాంటివి వద్దంటుంది గుడిపూడి ఇందుమతీ దేవి తన 'బ్రాహ్మణ కన్యా వివాహ ప్రహసనము'లో. ఇందులో ఓ చోట చారుమతి అంటుంది - "మన జాతిని మనమే దూషించితే, పురుషులేమనవలె? మనకు సరియైన విద్య లేకనే మనకీ మూర్ఖత్వము వదలకున్నది". ఇదే కథానికలో మంగమ్మ "తెలియక మనవాళ్లు పోట్లాడుతారు గాని మూర్ఖాచారం వదిలితే దేశమే బాగుపడును. ముందొక నాచారమును కొత్తగా నాచరణలోనికి దెచ్చువారు ప్రథమమున చాలా ఇక్కట్లకు తలయొగ్గవలె. తర్వాత అందరూ చేస్తారు" అంటుంది.
మొత్తానికి 'అనసూయ'లో స్త్రీలను చైతన్యవంతులను చేయాలనే తాపత్రయం కనిపిస్తుంది. విద్యవలనే అది సాధ్యమవుతుందనే అభిప్రాయం అందులో స్పష్టమవుతుంది. 'అనసూయ'కు కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా రచనలు పంపేవారు. కృష్ణశాస్త్రి కవితలు కూడా కొన్ని వచ్చాయి. 'అన్వేషణము', 'అనుతాపము' లాంటి కవితలు వాటిలో ఉన్నాయి. విజ్ఞానదాయకమైన వ్యాసాలెన్నింటినో వెంకటరత్నమ్మ తన పత్రికలో ప్రచురించేవారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యమధ్యలో పత్రిక రావడం ఆలస్యమైనా భరించి రెండు నెలలకు కలిపి ఒక సంచికను తీసుకువచ్చేవారామె.
1917లో మొదలైన పత్రిక ఎప్పటివరకూ వచ్చిందో కచ్చితంగా తెలీదు కానీ 1924 జూలై సంచిక వరకు లభ్యమవుతున్నది. ఆర్థిక ఇబ్బందుల మూలంగానే ఆ పాత్రిక ఆగిపోయిందనుకోవచ్చు. ఏదేమైనా స్త్రీవిద్య, సమానత్వం కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే ఓ స్త్రీ సంపాదకత్వంలో వచ్చిన ఓ గొప్ప మాస పత్రికగా 'అనసూయ'కు స్థానం ఉంటుంది.

- బుద్ధి యజ్ఞమూర్తి

- ఆంధ్రభూమి డైలీ, 12 ఏప్రిల్ 1996.

Tuesday, December 20, 2011

బిగ్ స్టోరీ: ఆరు పదుల వెన్నెల సౌరభం మల్లీశ్వరి

మల్లీశ్వరి... తెలుగు సినీ జగత్తులో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కళాఖండం. దర్శకుడిగా బి.ఎన్. రెడ్డినీ, గేయ రచయితగా కృష్ణశాస్త్రినీ, సంగీత దర్శకుడిగా సాలూరు రాజేశ్వరరావునీ చిరస్మరణీయం చేసిన అజరామర చిత్రం. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై సెట్టింగులు, వస్త్రాలంకరణ పరంగా ప్రఖ్యాత 'మొఘల్-ఎ-ఆజమ్'కు ఏమాత్రం తీసిపోదని విమర్శకుల అభినందనల్ని అందుకున్న ఆణిముత్యం. అందుకే విడుదలై అరవై సంవత్సరాలైనా 'మల్లీశ్వరి' నిత్యనూతనం.
మిగతా దర్శకులతో పోలిస్తే బి.ఎన్. రెడ్డి భిన్నంగా కనిపిస్తారు. ఆయన తీసిన ప్రతి చిత్రమూ కళాఖండమన్న పేరు ఆర్జించింది. కేవలం పదకొండు చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. అన్నిట్లోనూ 'మల్లీశ్వరి' పెద్ద ఖ్యాతిని తెచ్చుకుంది. భారతి మాసపత్రిక 1944 మే సంచికలో ప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు రాసిన 'రాయల కరుణకృత్యం' అనే నాటిక ఆ తర్వాత రేడియోలో ప్రసారమైంది. దాన్ని విన్న బి.ఎన్. రెడ్డి దాని ఆధారంగా సినిమా తీయాలనుకున్నారు. అలాగే ఆ సమయంలోనే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రికలో దివాన్ షరార్ రాసిన 'ది ఎంపరర్ అండ్ ద స్లేవ్ గర్ల్' కథ కూడా ఆయనకు నచ్చింది. ఆ నాటికనూ, ఈ కథనూ మేళవించి ఆయన 'మల్లీశ్వరి' కథను తయారు చేయించారు. ఈ సినిమా కోసం బి.ఎన్. అహోరాత్రాలూ పడిన క్షోభ ఓ తపస్సు. అందుకే ఆయనతో పనిచేసిన వారంతా - ఈ మాట ఆయన 'రాయించు'కున్నారు, ఈ పాట ఆయన 'చేయించు'కున్నారు, 'పాడించు'కున్నారు - అనే అంటారు గౌరవ పురస్సరంగా.
కథాంశం
ఈ చిత్ర కథాంశాన్ని ఓసారి మననం చేసుకుందాం. హంపీ విజయనగర సామ్రాజ్యంలోని వీరాపుర గ్రామంలో బావామరదళ్లయిన నాగరాజు, మల్లీశ్వరికి ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఆర్థికంగా కాస్త పైచేయి అయిన మల్లి తల్లి నాగమ్మకు వారి పెళ్లి ఇష్టంలేదు. దాంతో డబ్బు సంపాదించడానికి నగరానికి వెళ్తాడు నాగరాజు. ఒక వర్షపు రాత్రి సత్రంలో మల్లి నాట్యాన్ని మారువేషంలో తిలకించిన శ్రీకృష్ణదేవరాయలు ఆమె ఇంటికి పల్లకీ పంపించి రాణివాసానికి రప్పిస్తాడు. రాణివాసంలోని స్త్రీలను పరపురుషులెవరూ చూడరాదనేది నియమం. డబ్బు సంపాదించి వచ్చిన నాగరాజుకు మల్లి రాణివాసానికి వెళ్లిపోయిన సంగతి తెలిసి పిచ్చివాడైపోతాడు. ఆమె రూపాన్ని శిల్పాలుగా చెక్కుతాడు. నాగరాజు పనితనం చూసి ఆస్థాన శిల్పాచారి అతణ్ణి నందనోద్యానవనంలో శిల్పాల్ని చెక్కేందుకు నియమిస్తాడు. అనుకోకుండా ఒకరోజు తోటలో కలుసుకున్న నాగరాజు, మల్లి అక్కణ్ణించి పారిపోవాలనుకుంటారు. అదే సమయానికి ఉషా పరిణయం నృత్యగానంలో మల్లి పాల్గొనాల్సి వస్తుంది. సాహసంతో అంతఃపుర ప్రవేశం చేసిన నాగరాజును సైనికులు బంధించి ఖైదుచేస్తారు. విచారణ జరిపిన మహారాజు ప్రేమికులిద్దర్నీ ఒకటిచేసి, వారికి స్వేచ్ఛాజీవితం ప్రసాదిస్తాడు.
అందరూ అపురూప తారలే
నాగరాజు, మల్లీశ్వరి పాత్రల్లో ఎన్టీ రామారావు, భానుమతి అపూర్వ అభినయం ప్రదర్శించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్రవేశారు. వారి చిన్నప్పటి పాత్రలు వేసింది వెంకటరమణ, మల్లిక. ఈ వెంకటరమణ సుప్రసిద్ధ చిత్రకారుడు, దర్శకుడు బాపుకు స్వయాన బావమరిది. నిజానికి మల్లి పాత్రకు మొదట ఎవరైనా కొత్త తారను తీసుకుందామని రేవతి అనే అమ్మాయిని ఎంపిక చేసుకుని కూడా, బరువైన ఆ పాత్రకి ఆమె న్యాయం చేయలేదని భావించారు బి.ఎన్. అప్పటికే దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందుతున్న భానుమతి వైపు మొగ్గుచూపారు. ఆయన నమ్మకాన్ని భానుమతి ఈ స్థాయిలో నిలబెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదివరకు 'షావుకారు'లో జానకి తండ్రిగా వేసిన శ్రీవత్స ఇందులో శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో గంభీరంగా నటించారు. మల్లి తండ్రి నారప్పగా దొరస్వామి, మల్లి మావయ్య హనుమంతప్పగా వంగర వెంకటసుబ్బయ్య, మల్లి తల్లి నాగమ్మగా ఋష్యేంద్రమణి, నాగరాజు తల్లి గోవిందమ్మగా వెంకుమాంబ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. రేడియోలో వచ్చిన 'రాయల కరుణకృత్యం' నాటికలో మల్లీశ్వరిగా నటించిన టి.జి. కమలాదేవి 'మల్లీశ్వరి'లో భానుమతి నెచ్చెలి జలజ పాత్ర చేయడం విశేషం. అప్పట్లో రేడియోలో బాగా పాపులర్ అయిన 'బాలానందం' కార్యక్రమాన్ని నిర్వహించే 'బాలన్నయ్య' న్యాపతి రాఘవరావు ఇందులో రాయల ఆస్థానకవి పాత్రలో నటించారు. అదివరకు వాహినీ సంస్థ తీసిన ప్రతి చిత్రంలోనూ నటించిన చిత్తూరు నాగయ్య ఇందులో కనిపించరు. ఈ సినిమా షూటింగయ్యాక ఇందులో తను నటించలేదనే బాధను నాగయ్య వ్యక్తం చేయడంతో బి.ఎన్. ఆయన్ను మరో రకంగా సంతృప్తిపరిచారు. సినిమా ఆరంభంలో వచ్చే నేపథ్య వ్యాఖ్యానం చెప్పింది నాగయ్యే.

పోటీపడ్డ సాహిత్యం, సంగీతం
తొలిసారిగా ఈ చిత్రానికి మాటలు, పాటలు రాశారు దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఆయన సినీ జీవితంలో మాటలు రాసిన ఒకే ఒక చిత్రమిది. 'మల్లీశ్వరి' విడుదలైనప్పుడు ఆ చిత్రాన్ని ప్రజామిత్ర పత్రికలో సమీక్షిస్తూ "ఈ చిత్రంలో పాటలకు సాహిత్య గౌరవం లభించింది'' అని ప్రశంసించారు ప్రసిద్ధ రచయిత తాపీ ధర్మారావు. నిజమే. అప్పటిదాకా వచ్చిన సినిమా పాటలకంటే భిన్నంగా 'మల్లీశ్వరి' పాటల్ని సాహితీ సౌరభంతో ప్రబంధ శృంగార సారాన్ని సినీ సాహిత్యపరంగా మలిచిన విశిష్ట రచయిత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఇందులోని గీతాలు ప్రణయ భావపరంపరకు పట్టంగట్టిన నిత్యనూతన సౌరభాల్ని వెదజల్లిన మల్లెల మాలికలు. కృష్ణశాస్త్రి రాసిన పాటలకు సాలూరు రాజేశ్వరరావు బాణీలు కట్టారు. మ్యూజిక్ కంపోజింగ్‌కు ఆయన ఆరు నెలల సమయం తీసుకున్నారు. బాణీలు సాలూరువి అయితే, ఆర్కెస్ట్రా నిర్వహించింది అద్దేపల్లి రామారావు. అందుకే టైటిల్స్‌లో సంగీత దర్శకులుగా ఇద్దరి పేర్లూ ఉంటాయి. సాలూరు తన కెరీర్ మొత్తం మీద అపురూపంగా చెప్పుకున్న చిత్రాలు రెండే. ఒకటి 'చంద్రలేఖ', రెండు 'మల్లీశ్వరి'. హంపీ విజయనగర సామ్రాజ్య వైభవానికి అద్దంపట్టే ఈ చిత్రంలో అసలు కథానాయిక సంగీతమేనంటే అతిశయోక్తి కాదు. 'మనసున మల్లెల మాలలూగెనే', 'కోతీ బావకు పెళ్లంట', 'పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి', 'ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు', 'నెల రాజా వెన్నెల రాజా', 'ఎందుకే నీకింత తొందర' వంటి పాటలన్నీ అపురూప రాగ హారాలే. కాఫీ రాగంలో భానుమతి ఆలపించిన 'పిలచిన బిగువటరా..' తెలుగు సినిమా పాటల్లో చిరస్థాయిని సాధించింది. మల్లీశ్వరిని రాణివాసానికి పంపే ఘట్టం తెలుగు సినిమా చరిత్రలోనే గుండెలు బరువెక్కించే అద్భుత కరుణ రసాత్మక భాష్పగంగా మణికర్ణికా ఘట్టం. దాన్ని అలా చిత్రించిన బి.ఎన్. రెడ్డినీ, ఆ ఘట్టంలో అభినయించిన దొరస్వామి, ఋష్యేంద్రమణి, భానుమతి, వెంకుమాంబనీ, ఆ సెట్‌ని రూపొందించిన ఎ.కె. శేఖర్‌నీ, అన్నింటికీ మించి హంపీ విజయనగర శిల్పవీణలు ఆ సన్నివేశాలకి నేపథ్యంగా మూర్ఛనలు చేస్తున్నాయా అనిపించే నేపథ్య సంగీతం, అందులో రాజేశ్వరరావు చూపిన ప్రతిభ, చరిత్ర జ్ఞానం తెలుగువారు మరవలేనివి. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆది ఎం. ఇరానీ పక్షవాతంతో కెమెరాని హ్యాండిల్ చేసే స్థితిలో లేకపోవడంతో ఆపరేటివ్ కెమెరామన్‌గా బి.ఎన్. సోదరుడు కొండారెడ్డి అద్భుత పనితీరు కనపర్చారు.
ఈ చిత్ర నిర్మాణానికి అయిన వ్యయం రూ. ఆరు లక్షలు. అప్పట్లో అది అత్యంత భారీ బడ్జెట్. 1951 డిసెంబర్ 20న తొలిసారి విడుదలై ఒక్క విజయవాడలో మాత్రమే వంద రోజులు ఆడిన ఈ సినిమా మూడేళ్ల తర్వాత రెండో విడుదలలో మరింత విజయం సాధించింది. ఆంధ్రదేశంలో కంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 'మల్లీశ్వరి'కి ఎక్కువ ఆదరణ లభించింది. బీజింగ్‌లో జరిగిన తూర్పు ఆసియా చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై ప్రశంసలు పొందిన ఈ చిత్రం 1953 మార్చి 14న చైనీస్ సబ్ టైటిల్స్‌తో 15 ప్రింట్లతో చైనాలో విడుదలై ఆ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు పుటల్లో నిలిచింది.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 20, 2011

Saturday, November 5, 2011

ఇంటర్వ్యూ: పైడిశెట్టి రాం

''సీతాకోక చిలుకలు రెండు స్నేహం చేశాయి' (చంటిగాడు), 'ఆడదానికి ఆస్తులంటే పసుపు కుంకుమలమ్మా' (ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు), 'బ్రహ్మే ఎదురుగ వచ్చి ఒక వరమే కోరమంటే అమ్మేలేని నాకు బామ్మ ఒడి చాలంటాను' (గుండమ్మగారి మనవడు), 'ఎక్కడపడితే అక్కడ నువు కనపడుతూ ఉంటే' (జాజిమల్లి)... ఇలాంటి చక్కటి పాటల రచయిత పైడిశెట్టి రాం. సినీ రంగంలో కెరీర్ చూసుకోవాలనే విషయంలో అమ్మానాన్నలతో గొడవపడి, వాళ్ల అభీష్టానికి వ్యతిరేకంగా విజయనగరం నుంచి హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌కు వచ్చి ఆర్థిక ఇబ్బందులు పడుతూనే నెమ్మదిగా ఒక్కో మెట్టూ పైకెక్కుతూ ప్రస్తుతం నందమూరి తారకరత్న సినిమా 'నందీశ్వరుడు'కు సింగిల్ కార్డ్ రాసే స్థికి ఎదిగిన పైడిశెట్టి రాం అంతరంగ భాషణ...
సినిమాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు?
చిన్నప్పట్నించీ సినిమాలు బాగా చూసేవాణ్ణి. నటనంటే ఎక్కువ ఇష్టం. నటించాలని కోరికుండేది. మాది విజయనగరంలో ఓ వ్యవసాయ కుటుంబం. నిజం చెప్పాలంటే రాయిపని చేసుకు బతికేవాళ్లం. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ. అందుకే నేను కూడా ఆ పనిలో ఉంటే తమకి ఆసరా అవుతుందని నాన్న భావించారు. కానీ నా దృష్టంతా సినిమాల మీదుంది. ఎమ్మెస్సీ బోటనీ చేశాక సినిమాల్లో నటించాలనే తపనతో ఇంట్లోవాళ్లతో గొడవపడి మరీ కృష్ణానగర్‌కి వచ్చా. డిగ్రీ వరకు గురుకులాల్లోనే చదువుకోవడం వల్ల తెలుగు, సంస్కృత భాషలు బాగా వచ్చు. అప్పటికే సొంతంగా పాటలు రాయడం అలవాటు. వాటిని విన్నవాళ్లంతా నటనపై కంటే పాటలపై దృష్టి పెట్టమన్నారు.
తొలి అవకాశం ఎలా వచ్చింది?
హైదరాబాద్‌కి నాతో పాటు నా స్నేహితులు మరో ఇద్దరు కూడా వచ్చారు. వాళ్లు తలో ఇరవై వేలు తీసుకొస్తే, నేను తెచ్చుకుంది కేవలం ఇరవై రూపాయలే. ఇప్పుడు వాళ్లు లేరు. ఆ డబ్బులయిపోయాక మా ఊరికి వెళ్లిపోయారు. నేను వేషాల కోసం తిరుగుతూనే పాటలు పాడుకుంటూ ఉండేవాణ్ణి. దాంతో నా ఫ్రెండ్స్, మరికొంతమది వేషాల బదులు పాటల అవకాశాల కోసం ప్రయత్నిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అదీ బాగానే ఉందనిపించింది. సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్‌గారు కొత్తవాళ్లకి అవకాశాలిస్తారని విని, ఆయన్ని కలుసుకోవాలని అన్నా ల్యాబ్స్‌కి వెళ్లా. అప్పుడే కారులోంచి దిగుతున్న ఆయన్ని పరిచయం చేసుకున్నా. ఓ పాట పాడమన్నారు. ల్యాబ్ బయటనే నేను రాసుకున్న ఓ పాట పాడా. అప్పుడే అక్కడకి 'చంటిగాడు' సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వచ్చిన డైరెక్టర్ జయ బి. గారు కూడా నా పాట విన్నారు. నన్ను ఎల్లారెడ్డిగూడలోని తమ ఆఫీసుకి రమ్మన్నారు. అక్కడికి వెళితే దాదాపు 20 మంది రచయితలు కనిపించారు. అందరికీ క్లైమాక్స్ సందర్భం చెప్పి, నాలుగు రోజుల్లో పాట రాయమన్నారు. 'సీతాకోక చిలుకలు రెండు స్నేహం చేశాయి' అంటూ నేను రాసిన పాటని సెలక్ట్‌చేసి, దానికి అప్పటికప్పుడు రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారు. ఆ పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి చేత పాడించడం నేను మర్చిపోలేని అనుభవం. ఆ పాటకి మంచి స్పదన వచ్చింది.
అప్పుడు బాలు గారిని కలిశారా? ఆ అనుభవం గురించి చెప్పండి..
నిజానికి అప్పుడు నేను ఇటు ఆనందాన్నీ, అటు బాధనీ రెండూ అనుభవించా. అదెట్లాగంటే.. ఆ పాట రికార్డింగ్‌కి ఉదయం 8 గంటలకి రికార్డింగ్ థియేటర్‌కి రమ్మని జయ మేడం చెప్పారు. నాకు అప్పటిదాకా అనుభవం లేకపోవడంతో తాపీగా 10 గంటలకి వెళ్లా. అప్పట్లో నాకు ఎలాంటి ఫోన్ సౌకర్యం లేదు. నా కోసమే ఎదురు చూస్తూ కనిపించారు జయ మేడం. నేను రాసిన పాటలో ఓ పదం తప్పుగా అనిపించింది బాలు గారికి. అది తప్పని చెప్పి, దాన్ని మారిస్తే కానీ పాట పాడనని ఆయన భీష్మించారు. దాంతో నాకోసం అంతా ఎదురు చూస్తున్నారు. నాకు చాలా సిగ్గనిపించింది. నేను రాసిన పదం గురించి చెప్పి, దాన్ని మార్చాలనీ లేకపోతే బాలుగారు పాడరనీ జయగారు చెప్పారు. నిజానికి నా తొలిపాటకి బాలుగారైతే బాగా న్యాయం చేస్తారనే అభిప్రాయంతో ఆయనతో పాడించమని జయగార్ని రిక్వెస్ట్ చేసింది నేనే. ఇప్పుడు సడన్‌గా ఓ పదం మార్చమని అడిగేసరికి నా మైండ్ బ్లాంకయిపోయింది. నాకేమీ తోచలేదు. ఆ స్థితిలో నాకు పాటా వద్దూ, ఏమీ వద్దనీ, దాన్ని కేన్సిల్ చేసుకొమ్మనీ దాదాపు ఏడుస్తున్నట్లే జయగారికి చెప్పా. ఆమె అధైర్యపడొద్దని, తనే ఆ పదం బదులు వేరే పదం పెట్టి, ఆ పాటని బాలుగారితో పాడించారు. బాలుగారు కూడా పాట చాలా బాగా రాశావంటూ భుజంతట్టి, నాతో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. అది మర్చిపోలేని అనుభవం.
ఇప్పటిదాకా ఎన్ని సినిమాలకి రాశారు?
ఇప్పటివరకు 47 సినిమాలకి పాటలు రాశా. పాటల సంఖ్య వంద చేరువలో ఉంది. బాలుగారు పాడిన నా తొలి పాటతో పాటు, 'ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు' చిత్రానికి నేను రాసిన రెండో పాట 'ఆడదానికి ఆస్తులంటే పసుపు కుంకుమలమ్మా' (జేసుదాస్‌గారు పాడింది) కూడా మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత జయ గారు డైరెక్ట్ చేసిన 'గుండమ్మగారి మనవడు'లో నాలుగు పాటలు రాశా. వాటిలో 'బ్రహ్మే ఎదురుగ వచ్చి ఒక వరమే కోరమంటే అమ్మేలేని నాకు బామ్మ ఒడి చాలంటాను' అనే పాటకి మంచి ఆదరణ లభించింది. అలాగే 'జాజిమల్లి'లోని 'ఎక్కడపడితే అక్కడ నువు కనపడుతూ ఉంటే' పాట రింగ్‌టోన్‌గా బాగా ఆదరణ పొందింది. చెప్పాలంటే నేను రాసిన పాటలన్నీ నాకిష్టమే.
ఇప్పటివరకు పనిచేసిన సంగీత దర్శకుల్లో ఎవరు మీకు సౌకర్యంగా అనిపించారు?
అలా ఎవరో ఒకర్ని ప్రత్యేకించి చెప్పలేను. ఎందుకంటే అందరు సంగీత దర్శకులూ నన్ను ప్రోత్సహించినవాళ్లే. వందేమాతరం, చక్రి, ఆర్పీ పట్నాయక్, చిన్నా వంటి సంగీత దర్శకులతో పనిచేశా. అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. అందరితోనూ సౌకర్యంగా ఫీలయ్యా. వాళ్లు మనకి ట్యూన్ ఇచ్చినా రాయడం వచ్చుండాలి, లేదా ట్యూన్ లేకపోయినా రాయడం తెలిసుండాలి. నేను రెండు రకాలుగా రాశా. 
లాబీయింగ్‌తో అవకాశాలు వస్తాయా?
ప్రతిభ ఉండాలే గానీ పోటీ ఎంతున్నా ముందుకెళ్తామనేది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న వాస్తవం. ప్రతిభ లేకుండా ఎంత లాబీయింగ్ చేసినా ఉపయోగముండదు. సంగీత దర్శకులైనా, దర్శకులైనా ప్రతిభ ఉన్న వాళ్లనే ప్రోత్సహిస్తుంటారు. ఆల్రెడీ ప్రతిభ నిరూపించుకున్నవాళ్లకి ఎక్కువ అవకాశాలు రావడం సహజం. దానికి బాధపడ్డం నెగటివ్ థింకింగ్ అవుతుంది.
మీ రాబోతున్న సినిమాలేవి?
రాబోయే సినిమాల్లో తారకరత్న, జగపతిబాబు కలిసి నటిస్తున్న 'నందీశ్వరుడు'కి ఎనిమిది పాటలు సింగిల్ కార్డ్ రాశా. అలాగే రాజశేఖర్‌గారి సినిమా 'మహంకాళి'కీ, శ్రీకాంత్ సినిమాలు 'దేవరాయ', 'సేవకుడు'కీ, శ్రీహరి, సాయిరాం శంకర్ సినిమా 'యమహో యమః'కీ, 'దునియా'కీ రాశా. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న 'క్రేజీ కృష్ణ'కి సింగిల్ కార్డ్ రాశా.
మీ భాషని మెరుగుపర్చుకోడానికి ఎలాంటి కృషి చేస్తారు?
ప్రాచీన సాహిత్యమైన అష్టాదశ పురాణాలూ, రామయణ భారతాలను అధ్యయనం చేయడంతో పాటు తెలుగు చిత్రసీమలో ప్రసిద్ధులైన ఆనాటి గేయ రచయితల నుంచి ఈ నాటి రచయితల దాకా - వారి పాటల్ని అధ్యయనం చేశా. ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. అలా నా భాషని నిరంతరం మెరుగు పరచుకుంటున్నా. ఎక్కువగా దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆత్రేయ, సీతారామశాస్త్రి, చంద్రబోస్ పాటలంటే ఇష్టం.
ఇప్పుడు మీ అమ్మానాన్నలు ఎలా ఫీలవుతున్నారు?
నేను పది సినిమాలకి పాటలు రాసేదాకా కూడా మా ఇంట్లో వ్యతిరేకత ఉండేది. ఉద్యోగం చేసుకోకుండా ఇక్కడికొచ్చి కష్టాలు పడటమెందుకనేది అమ్మానాన్నల అభిప్రాయం. ఇప్పుడు నా పురోగతి చూసి వాళ్లు ఆనందపడుతున్నారు. ప్రోత్సహిస్తున్నారు. దాంతో టెన్షన్ లేకుండా నా పని చేసుకోగలుగుతున్నా. అలాగే ఇండస్ట్రీ వ్యక్తులు చాలామంది నేను పాటలు బాగా రాస్తున్నానని ప్రోత్సహిస్తున్నారు. నెలకి సగటున రెండు పాటలు తక్కువ కాకుండా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను అగ్ర హీరోలకు రాయాలని తపనపడ్తున్నా.

Tuesday, August 9, 2011

మన చరిత్ర: అందరిదారీ అ.ర.సం. వైపే!

1943 వేసవిలో బొంబాయిలో అఖిలభారత అభ్యుదయ రచయితల సభలూ, ప్రజా నాట్యమండలి సభలూ జరిగాయి. అక్కడున్న కొయాజీ జహంగీర్ హాలులో జరిగిన ఈ సభలకు తెలుగు నాట నుండి పెద్ద ప్రతినిథి వర్గమే వెళ్లింది. సెట్టి ఈశ్వరరావు, కె.ఎస్. ప్రకాశరవు, చదలవాడ పిచ్చయ్య, కొడవటిగంటి కుటుంబరావు, తుమ్మల వెంకటరామయ్య తదితరులెందరో ఆ ప్రతినిథివర్గంలో ఉన్నారు. అఖిలభారతంగా ఉండే ప్రముఖ రచయితలందరూ వచ్చారు.
అప్పటినుండీ క్రమంగా అభ్యుదయ రచయితల ఉద్యమం ఆంధ్రలో బాగా వేళ్లూనింది. 1944 రెండవ మహసభల్లో చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయ చరిత్రను ప్రకటించి వారికి బహూకరించింది. తెలికచర్ల వెంకటరత్నం, అడివి బాపిరాజు వంటి వాళ్లతో సహా మొత్తం నవ్య సాహిత్య పరిషత్తు అంతా ఇందులో కలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపత్తి పెరిగింది. 'తెలుగు తల్లి' పత్రికను తీసికొని నడిపారు. 1946లో పెదపూడి (తూ.గో. జిల్లా)లో సాహిత్య పాఠశాల నిర్వహించారు. దాన్ని 'ప్రజా విశ్వవిద్యాలయం'గా నాడు రచయితలు ప్రశంసించారు. సాహితీరంగంలో ప్రసిద్ధులందరూ పాల్గొన్నారు.
1946లో దేవలపల్లి కృష్ణశాస్త్రి అధ్యక్షతన, శ్రీశ్రీ ప్రారంభకులుగా రాజమండ్రిలో మూడవ మహాసభలు జరిగాయి. జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి వంటి వ్యక్తులు ఖాకీ నిక్కరు తొడుక్కుని వలంటీర్లుగా ఆ సభల్లో పనిచేశారు. 1946 నుండే సంఘం 'అభ్యుదయ' పత్రికను నిర్వహించడం మొదులుపెట్టింది. 1947లో నాలుగో మహాసభలు మద్రాసులో జరిగాయి. రాజమన్నారులాంటి వ్యక్తులు ఉద్యమంలోకి వచ్చారు. పల్లెకోన (గుంటూరు జిల్లా)లో 1947లోనే సాహిత్య పాఠశాల జరిగింది.
1955లో సంఘం ఐదవ మహాసభలు విజయవాడలో జూలై 30, 31 తేదీల్లో జరిగాయి. ఉప్పల లక్ష్మణరావు ఆహ్వాన సంఘాధ్యక్షులు. సభలకు శ్రీశ్రీ అధ్యక్షత వహించారు. తెలుగుదేశంలో రచయితలూ, కవులూ, కళాకారులందరూ వచ్చారు. ఈ సభలు చేసిన అనేక తీర్మానాల్లో వ్యావహారిక భాషావ్యాప్తికి ఓ సంఘాన్ని వేసి విశ్వవిద్యాలయాల్లో దానికోసం పోరాడాలన్నది ఓ తీర్మానం. ఆ ఉపసంఘలో తాపీ ధర్మారావు, గిడుగు సీతాపతి, తెలికచర్ల వెంకటరత్నం, కొడవటిగండి సభ్యులు. శ్రీశ్రీ కన్వీనర్.

Saturday, October 30, 2010

నేటి పాట: సడిసేయకో గాలి (రాజమకుటం)

చిత్రం: రాజమకుటం (1960)
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: మాస్టర్ వేణు
గానం: పి. లీల

పల్లవి:
సడిసేయకో గాలి! సడిసేయబోకే!
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే
సడిసేయకే..
చరణం 1:
రత్నపీఠిక లేని రారాజు నా స్వామి!
మణికిరీటము లేని మహరాజు గాకేమి!
చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే!
సడిసేయకే..
చరణం 2:
ఏటి గలగలలకే ఎగిరి లేచేనే!
ఆకు కదలికలకే అదరి చూసేనే!
నిదుర చెదరిందంటే నేనూరుకోనే!
సడిసేయకే..
చరణం 3:
పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే!
నీలిమబ్బుల దాగు నిదుర తేరాదే!
విరుల వీవన పూని విసిరిపోరాదే!
సడిసేయకే గాలి సడిసేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే
సడిసేయకో గాలి..