''సీతాకోక చిలుకలు రెండు స్నేహం చేశాయి' (చంటిగాడు), 'ఆడదానికి ఆస్తులంటే పసుపు కుంకుమలమ్మా' (ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు), 'బ్రహ్మే ఎదురుగ వచ్చి ఒక వరమే కోరమంటే అమ్మేలేని నాకు బామ్మ ఒడి చాలంటాను' (గుండమ్మగారి మనవడు), 'ఎక్కడపడితే అక్కడ నువు కనపడుతూ ఉంటే' (జాజిమల్లి)... ఇలాంటి చక్కటి పాటల రచయిత పైడిశెట్టి రాం. సినీ రంగంలో కెరీర్ చూసుకోవాలనే విషయంలో అమ్మానాన్నలతో గొడవపడి, వాళ్ల అభీష్టానికి వ్యతిరేకంగా విజయనగరం నుంచి హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌కు వచ్చి ఆర్థిక ఇబ్బందులు పడుతూనే నెమ్మదిగా ఒక్కో మెట్టూ పైకెక్కుతూ ప్రస్తుతం నందమూరి తారకరత్న సినిమా 'నందీశ్వరుడు'కు సింగిల్ కార్డ్ రాసే స్థికి ఎదిగిన పైడిశెట్టి రాం అంతరంగ భాషణ...
సినిమాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు?
చిన్నప్పట్నించీ సినిమాలు బాగా చూసేవాణ్ణి. నటనంటే ఎక్కువ ఇష్టం. నటించాలని కోరికుండేది. మాది విజయనగరంలో ఓ వ్యవసాయ కుటుంబం. నిజం చెప్పాలంటే రాయిపని చేసుకు బతికేవాళ్లం. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ. అందుకే నేను కూడా ఆ పనిలో ఉంటే తమకి ఆసరా అవుతుందని నాన్న భావించారు. కానీ నా దృష్టంతా సినిమాల మీదుంది. ఎమ్మెస్సీ బోటనీ చేశాక సినిమాల్లో నటించాలనే తపనతో ఇంట్లోవాళ్లతో గొడవపడి మరీ కృష్ణానగర్‌కి వచ్చా. డిగ్రీ వరకు గురుకులాల్లోనే చదువుకోవడం వల్ల తెలుగు, సంస్కృత భాషలు బాగా వచ్చు. అప్పటికే సొంతంగా పాటలు రాయడం అలవాటు. వాటిని విన్నవాళ్లంతా నటనపై కంటే పాటలపై దృష్టి పెట్టమన్నారు.
తొలి అవకాశం ఎలా వచ్చింది?
హైదరాబాద్‌కి నాతో పాటు నా స్నేహితులు మరో ఇద్దరు కూడా వచ్చారు. వాళ్లు తలో ఇరవై వేలు తీసుకొస్తే, నేను తెచ్చుకుంది కేవలం ఇరవై రూపాయలే. ఇప్పుడు వాళ్లు లేరు. ఆ డబ్బులయిపోయాక మా ఊరికి వెళ్లిపోయారు. నేను వేషాల కోసం తిరుగుతూనే పాటలు పాడుకుంటూ ఉండేవాణ్ణి. దాంతో నా ఫ్రెండ్స్, మరికొంతమది వేషాల బదులు పాటల అవకాశాల కోసం ప్రయత్నిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అదీ బాగానే ఉందనిపించింది. సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్‌గారు కొత్తవాళ్లకి అవకాశాలిస్తారని విని, ఆయన్ని కలుసుకోవాలని అన్నా ల్యాబ్స్‌కి వెళ్లా. అప్పుడే కారులోంచి దిగుతున్న ఆయన్ని పరిచయం చేసుకున్నా. ఓ పాట పాడమన్నారు. ల్యాబ్ బయటనే నేను రాసుకున్న ఓ పాట పాడా. అప్పుడే అక్కడకి 'చంటిగాడు' సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వచ్చిన డైరెక్టర్ జయ బి. గారు కూడా నా పాట విన్నారు. నన్ను ఎల్లారెడ్డిగూడలోని తమ ఆఫీసుకి రమ్మన్నారు. అక్కడికి వెళితే దాదాపు 20 మంది రచయితలు కనిపించారు. అందరికీ క్లైమాక్స్ సందర్భం చెప్పి, నాలుగు రోజుల్లో పాట రాయమన్నారు. 'సీతాకోక చిలుకలు రెండు స్నేహం చేశాయి' అంటూ నేను రాసిన పాటని సెలక్ట్‌చేసి, దానికి అప్పటికప్పుడు రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారు. ఆ పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి చేత పాడించడం నేను మర్చిపోలేని అనుభవం. ఆ పాటకి మంచి స్పదన వచ్చింది.
అప్పుడు బాలు గారిని కలిశారా? ఆ అనుభవం గురించి చెప్పండి..
నిజానికి అప్పుడు నేను ఇటు ఆనందాన్నీ, అటు బాధనీ రెండూ అనుభవించా. అదెట్లాగంటే.. ఆ పాట రికార్డింగ్‌కి ఉదయం 8 గంటలకి రికార్డింగ్ థియేటర్‌కి రమ్మని జయ మేడం చెప్పారు. నాకు అప్పటిదాకా అనుభవం లేకపోవడంతో తాపీగా 10 గంటలకి వెళ్లా. అప్పట్లో నాకు ఎలాంటి ఫోన్ సౌకర్యం లేదు. నా కోసమే ఎదురు చూస్తూ కనిపించారు జయ మేడం. నేను రాసిన పాటలో ఓ పదం తప్పుగా అనిపించింది బాలు గారికి. అది తప్పని చెప్పి, దాన్ని మారిస్తే కానీ పాట పాడనని ఆయన భీష్మించారు. దాంతో నాకోసం అంతా ఎదురు చూస్తున్నారు. నాకు చాలా సిగ్గనిపించింది. నేను రాసిన పదం గురించి చెప్పి, దాన్ని మార్చాలనీ లేకపోతే బాలుగారు పాడరనీ జయగారు చెప్పారు. నిజానికి నా తొలిపాటకి బాలుగారైతే బాగా న్యాయం చేస్తారనే అభిప్రాయంతో ఆయనతో పాడించమని జయగార్ని రిక్వెస్ట్ చేసింది నేనే. ఇప్పుడు సడన్‌గా ఓ పదం మార్చమని అడిగేసరికి నా మైండ్ బ్లాంకయిపోయింది. నాకేమీ తోచలేదు. ఆ స్థితిలో నాకు పాటా వద్దూ, ఏమీ వద్దనీ, దాన్ని కేన్సిల్ చేసుకొమ్మనీ దాదాపు ఏడుస్తున్నట్లే జయగారికి చెప్పా. ఆమె అధైర్యపడొద్దని, తనే ఆ పదం బదులు వేరే పదం పెట్టి, ఆ పాటని బాలుగారితో పాడించారు. బాలుగారు కూడా పాట చాలా బాగా రాశావంటూ భుజంతట్టి, నాతో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. అది మర్చిపోలేని అనుభవం.
ఇప్పటిదాకా ఎన్ని సినిమాలకి రాశారు?
ఇప్పటివరకు 47 సినిమాలకి పాటలు రాశా. పాటల సంఖ్య వంద చేరువలో ఉంది. బాలుగారు పాడిన నా తొలి పాటతో పాటు, 'ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు' చిత్రానికి నేను రాసిన రెండో పాట 'ఆడదానికి ఆస్తులంటే పసుపు కుంకుమలమ్మా' (జేసుదాస్‌గారు పాడింది) కూడా మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత జయ గారు డైరెక్ట్ చేసిన 'గుండమ్మగారి మనవడు'లో నాలుగు పాటలు రాశా. వాటిలో 'బ్రహ్మే ఎదురుగ వచ్చి ఒక వరమే కోరమంటే అమ్మేలేని నాకు బామ్మ ఒడి చాలంటాను' అనే పాటకి మంచి ఆదరణ లభించింది. అలాగే 'జాజిమల్లి'లోని 'ఎక్కడపడితే అక్కడ నువు కనపడుతూ ఉంటే' పాట రింగ్‌టోన్‌గా బాగా ఆదరణ పొందింది. చెప్పాలంటే నేను రాసిన పాటలన్నీ నాకిష్టమే.
ఇప్పటివరకు పనిచేసిన సంగీత దర్శకుల్లో ఎవరు మీకు సౌకర్యంగా అనిపించారు?
అలా ఎవరో ఒకర్ని ప్రత్యేకించి చెప్పలేను. ఎందుకంటే అందరు సంగీత దర్శకులూ నన్ను ప్రోత్సహించినవాళ్లే. వందేమాతరం, చక్రి, ఆర్పీ పట్నాయక్, చిన్నా వంటి సంగీత దర్శకులతో పనిచేశా. అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. అందరితోనూ సౌకర్యంగా ఫీలయ్యా. వాళ్లు మనకి ట్యూన్ ఇచ్చినా రాయడం వచ్చుండాలి, లేదా ట్యూన్ లేకపోయినా రాయడం తెలిసుండాలి. నేను రెండు రకాలుగా రాశా.
లాబీయింగ్‌తో అవకాశాలు వస్తాయా?
ప్రతిభ ఉండాలే గానీ పోటీ ఎంతున్నా ముందుకెళ్తామనేది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న వాస్తవం. ప్రతిభ లేకుండా ఎంత లాబీయింగ్ చేసినా ఉపయోగముండదు. సంగీత దర్శకులైనా, దర్శకులైనా ప్రతిభ ఉన్న వాళ్లనే ప్రోత్సహిస్తుంటారు. ఆల్రెడీ ప్రతిభ నిరూపించుకున్నవాళ్లకి ఎక్కువ అవకాశాలు రావడం సహజం. దానికి బాధపడ్డం నెగటివ్ థింకింగ్ అవుతుంది.
మీ రాబోతున్న సినిమాలేవి?
రాబోయే సినిమాల్లో తారకరత్న, జగపతిబాబు కలిసి నటిస్తున్న 'నందీశ్వరుడు'కి ఎనిమిది పాటలు సింగిల్ కార్డ్ రాశా. అలాగే రాజశేఖర్‌గారి సినిమా 'మహంకాళి'కీ, శ్రీకాంత్ సినిమాలు 'దేవరాయ', 'సేవకుడు'కీ, శ్రీహరి, సాయిరాం శంకర్ సినిమా 'యమహో యమః'కీ, 'దునియా'కీ రాశా. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న 'క్రేజీ కృష్ణ'కి సింగిల్ కార్డ్ రాశా.
మీ భాషని మెరుగుపర్చుకోడానికి ఎలాంటి కృషి చేస్తారు?
ప్రాచీన సాహిత్యమైన అష్టాదశ పురాణాలూ, రామయణ భారతాలను అధ్యయనం చేయడంతో పాటు తెలుగు చిత్రసీమలో ప్రసిద్ధులైన ఆనాటి గేయ రచయితల నుంచి ఈ నాటి రచయితల దాకా - వారి పాటల్ని అధ్యయనం చేశా. ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. అలా నా భాషని నిరంతరం మెరుగు పరచుకుంటున్నా. ఎక్కువగా దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆత్రేయ, సీతారామశాస్త్రి, చంద్రబోస్ పాటలంటే ఇష్టం.
ఇప్పుడు మీ అమ్మానాన్నలు ఎలా ఫీలవుతున్నారు?
నేను పది సినిమాలకి పాటలు రాసేదాకా కూడా మా ఇంట్లో వ్యతిరేకత ఉండేది. ఉద్యోగం చేసుకోకుండా ఇక్కడికొచ్చి కష్టాలు పడటమెందుకనేది అమ్మానాన్నల అభిప్రాయం. ఇప్పుడు నా పురోగతి చూసి వాళ్లు ఆనందపడుతున్నారు. ప్రోత్సహిస్తున్నారు. దాంతో టెన్షన్ లేకుండా నా పని చేసుకోగలుగుతున్నా. అలాగే ఇండస్ట్రీ వ్యక్తులు చాలామంది నేను పాటలు బాగా రాస్తున్నానని ప్రోత్సహిస్తున్నారు. నెలకి సగటున రెండు పాటలు తక్కువ కాకుండా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను అగ్ర హీరోలకు రాయాలని తపనపడ్తున్నా.
No comments:
Post a Comment