Wednesday, November 16, 2011
ఆ యువ నటుడు ఎవరు?
ఇటీవల 'శ్రీరామరాజ్యం' ఆడియో అభినందన సభలో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన ఆ మాటల్ని రాంచరణ్‌ని ఉద్దేశించి అన్నాడంటూ ఓ టీవీ చానల్ చేసిన హంగామా వివాదాన్ని సృష్టించింది. దాంతో తాను ఆ మాటల్ని రాంచరణ్‌ని ఉద్దేశించి అనలేదనీ, ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలు అన్నానో చిరంజీవి, మోహన్‌బాబుకు తెలుసనీ వివరణ ఇచ్చుకున్నారు బాలకృష్ణ. ఇంతకీ 'శ్రీరామరాజ్యం' సభలో ఆయన ఏమన్నారు? "ఈమధ్య ఓ యువ నటుడు మన తెలుగు సినిమాల గురించీ, దర్శకుల గురించీ అవమానకరంగా మాట్లాడాడు. టాలీవుడ్ దర్శకులు తెలుగు సినిమాల్లో ప్రయోగాలు చేయరని అన్నాడు. చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దనీ, బాపు వంటి గొప్ప దర్శకులు మనకు ఉన్నారని నేను అన్నాను. వారు ఎన్నో క్లాసిక్ సినిమాల్ని తీశారనీ, నేను కూడా 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాననీ చెప్పాను. ఇంకా ఎక్కువగా మాట్లాడితే పళ్లూడగొడతానని హెచ్చరించా" అని ఆయన చెప్పారు. అంటే ఏమిటి? ఆ యువ నటుడు బాలకృష్ణ సమక్షంలోనే తెలుగు దర్శకుల్ని తూలనాడితే, బాలకృష్ణ అతణ్ణి హెచ్చరించాడని ఇట్టే అర్థమైపోతోంది. కానీ వివాదం సృష్టించిన చానల్ దీన్ని గమనించకుండా కొద్ది రోజుల క్రితం దాసరి నారాయణరావుని ఉద్దేశించి రాంచరణ్ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు బాలకృష్ణ కౌంటర్ ఇచ్చినట్లుగా ఊహించుకొని స్టోరీ అల్లేసింది. అందుకే బాలకృష్ణ "ఏదో ఫంక్షన్‌లో షాట్స్ చూపించి నేను చరణ్‌ను ఉద్దేశించి అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. నేను అన్నది చరణ్‌ని ఉద్దేశించి కాదని సవినయంగా మనవి చేస్తున్నా. నేను ఆ మాటలు ఆ వ్యక్తితో నేరుగానే అన్నాను. కానీ చరణ్‌ను నేను కలిసి నాలుగైదు నెలలు అయింది. చిరంజీవి పిల్లలకు నేనంటే ఎంతో వాత్సల్యం. అలాగే వారన్నా నాకు ఎంతో వాత్సల్యం" అని తేల్చిచెప్పారు. బాలకృష్ణ ఇచ్చిన ఈ వివరణని సైతం సదరు చానల్ మరోరకంగా వాడుకొంది. అదలా ఉంచితే బాలకృష్ణ చేత పళ్లూడగొడతాననని అనిపించుకున్న ఆ యువ నటుడు ఎవరన్న చర్చ మొదలైంది చిత్రసీమలో. కొంతమంది ఈ మధ్య కాలంలో ఇలా మాట్లాడుతున్నది హీరో నాని అనీ, అతడితోటే బాలయ్య ఆ మాటలు అని ఉంటారని ఊహిస్తున్నారు. తను ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలన్నదీ చిరంజీవి, మోహన్‌బబుకు తెలుసని బాలకృష్ణ అనడాన్ని బట్టి మరికొంతమందికీ ఈ సంగతి తెలిసే ఉంటుంది. ఎవరో ఆ యువ నటుడు?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment