Showing posts with label ali. Show all posts
Showing posts with label ali. Show all posts

Saturday, August 13, 2011

న్యూస్: 'బ్యాచిలర్స్ 2' గెలుస్తారా?

సినీ డైరెక్టర్‌గా మారిన లాయర్ సానా యాదిరెడ్డి 2002లో తీసిన 'బ్యాచిలర్స్' సినిమా మంచి హిట్టయ్యింది. అందులో శివాజీ, మాన్య, సుమిత్ రాయ్, జాకిర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఆ జాకిర్ ఆ సినిమాకి సీక్వెల్‌గా 'బ్యాచిలర్స్ 2' తీశాడు. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అతను అందులో ఓ మెయిన్ హీరోగానూ చేశాడు. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు విహార యాత్రకి వెళ్లే కొంతమంది బ్యాచిలర్స్‌కి రోడ్ మీద ఎదురయ్యే సంఘటనలే ఈ సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెద్ద పీట వేసి ఈ సినిమా తీసినట్లు జాకిర్ చెప్పాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. జాకిర్‌తో పాటు ఎవిన్, బాషా, రాజశేఖర్ బ్యాచిలర్స్‌గా నటించిన ఈ సినిమాలో తృప్తి శర్మ హీరోయిన్. అలీ కూడా కామెడీ పంచే ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న జాకిర్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లేని సమకూర్చాడు. "మొదటి బ్యాచిలర్స్‌తో నటుడిగా గుర్తింపు వచ్చిన నాకు ఈ సీక్వెల్‌తో డైరెక్టర్‌గా గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నా" అని చెప్పాడు జాకిర్. అతడి ఆశ నెరవేరుతుందో, లేదో చూడాలి.

Saturday, July 30, 2011

న్యూస్: వేణుమాధవ్ హవా ఏమైంది?

ఆమధ్య కాలంలో సినీ రంగానికి సంబంధించి అడ్డూ, ఆపూ లేని నోరెవరిదయ్యా అంటే అందరి వేళ్లూ కమెడియన్ వేణుమాధవ్‌నే చూపించేవి. తను యాంకర్‌గా వ్యవహరించే లేదా తను పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ అతను తన నోటితో ముతక హాస్యాన్ని కురిపించేవాడు. హాస్యమంటే అతడి దృష్టిలో సెక్సు జోకులు వేయడంగానే కనిపించేది. అట్లా కొంత కాలం అతడి రాజ్యం నడిచింది. కమెడియన్‌గా యమ బిజీ కావడమే దీనికి కారణం. ఒక యేడాది బ్రహ్మానందం, అలీ, సునీల్ వంటి కమెడియన్లను సైతం వెనక్కి నెట్టి 47 సినిమాల్లో నటించడమే గాక అందరి కంటే ఎక్కువ ఆదాయాన్నీ గడించిన చరిత్ర అతడిది. అట్లాంటిది ఇప్పుడు అతడి హవా ఏ మాత్రం కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో ఏ కార్యక్రమంలోనూ అతడు యాంకర్‌గా కనిపించలేదు. సినిమా ఫంక్షన్లలోనూ చాలా అరుదుగా కనిపిస్తున్నాడు. అప్పటి జోరు కూడా అతడి మాటల్లో ఉండటం లేదు. సినిమాలు తగ్గిపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. ఒకప్పుడు టాప్ కమెడియన్‌గా కొనసాగిన కాలంలో నిర్మాతలు, దర్శకుల్ని అతడు పెట్టిన ఇబ్బందులు, ప్రదర్శించిన అహంభావమే ఇప్పుడతనికి చేటు తెచ్చాయంటున్నారు. 'హంగామా'లో అలీతో పాటు హీరోగా నటించిన అతను సోలో హీరోగా 'భూకైలాస్'లో నటించాడు. ఆ సమయంలో అతడి డిమాండ్లకూ, చేష్టలకూ దర్శకుడు శివనాగేశ్వరరావు విసిగిపోయాడు. ఆ తర్వాత స్వయంగా వేణుమాధవ్ 'ప్రేమాభిషేకం' సినిమాని హీరోగా నటిస్తూ నిర్మించాడు. అది బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అనడంతో మళ్లీ ప్రొడక్షన్ జోలికి పోలేదు. అతడి డిమాండ్ల కారణంగా నిర్మాతలు ఇతర కమెడియన్ల వైపు చూపు సారిస్తున్నారు. దాంతో వేషాలూ తగ్గిపోతున్నాయి. ఎదిగే కొద్దీ వొదిగి ఉండాలనే సత్యాన్ని విస్మరించడం వల్లే అతడికి ఈ స్థితి తలెత్తిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ సంగతి గ్రహించి మసలుకుంటే అతడు మళ్లీ పూర్వ వైభవం పొందడం అసాధ్యమేమీ కాదు. కానీ మన సినిమా వాళ్లు అంత తేలిగ్గా మారతారా?

Tuesday, April 12, 2011

హిట్.. హిట్.. హుర్రే..!: ఆది (రెండో భాగం)

సీన్ 1
ఎన్నడో చిన్నతనంలో వొదిలేసిన ఊళ్లోకి చాలా కాలం తర్వాత అడుగుపెట్ట్టాడు ఆదికేశవరెడ్డి ఉరఫ్ ఆది. దాహం వేస్తోంది. బావి దగ్గర నీళ్లు తోడుతున్న కొంతమంది స్త్రీలు కనిపించారు. జీపు దిగి ఒకామెనడిగి నీళ్లు తాగాడు.
ఆకాశం వంక చూస్తా "వా.. ఏం పెట్టావ్‌రా ఈ నేలలో. నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతోంది" అని సెల్యూట్ చేసి, తనకి మంచినీళ్లు పోసిన స్త్రీతో "ఈ నేల తాకి, ఈ నీళ్లు తాగి పద్నాలుగేళ్లయ్యింది. వస్తానమ్మా" అన్నాడు నమస్కరిస్తా.
"ఎవరు బాబూ నువ్వు?" అనడిగింది ఆ పక్కనే ఉన్న మరొకామె.
"ఆదికేశవరెడ్డి గారి మనవణ్ణి" అనాడు అదే పేరున్న ఆది. అంతే. అక్కడున్న అందరు స్త్రీలూ అతడికి దణ్ణం పెట్టారు. ఆదికి మంచినీళ్లు పోసినామె అతడికి బొట్టు పెట్టింది.
"ఇక నుంచీ మీలో ఒకడిగా ఈ ఊళ్లోనే ఉంటాను" చెప్పాడు ఆది.
సీన్ 2
విజయదశమిలోపు తన ఆస్తులన్నీ తనకి హేండోవర్ చెయ్యమనీ, లేదంటే ఎనిమిదేళ్ల వయసులోనే బాంబులేసిన తనకు ఇప్పుడెయ్యడం పెద్ద కష్టం కాదనీ వార్నింగ్ ఇచ్చి వెళ్తున్న ఆది జీపుని బాంబుతో పేల్చేశాడు నాగిరెడ్డి.
"రేయ్. సీమంటే ఇట్టుంటుందిరా. పో. ఎక్కడో చోట హాయిగా బతుకు. లేదూ. ఇక్కడే బతుకుతానంటావా. ఉండటానికి ఇల్లిస్తా. పదెకరాల పొలమిస్తా. నా ముందు తలదించుకుని బతకాలి. తల ఎత్తావో నరికేస్తా" అన్నాడు నాగిరెడ్డి, కళ్లల్లో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ.
చాలా మామూలుగా "ఊ.. ఇంకా" అన్నాడు ఆది.
"ఏందిరా.. ఏందిరా ఇంకా" అని రంకె వేశాడు నాగిరెడ్డి.
"చాలా ఉంది" అంటా విజిలేశాడు ఆది. బయట నాగిరెడ్డి సుమోలు నాలుగు ఒకేసారి గాల్లోకి లేచి పేలిపోయాయి. ఈసారి చిటికేశాడు ఆది. ట్రాక్టరు పైకి లేచి, ముక్కలు ముక్కలైంది.
"ఏంట్రా అన్నావ్. నీ ముందు తలదించుకుని బతకాలా. తలదించే వంశలో పుట్టలేదురా. తొడగొట్టే వంశంలో పుట్టా. ఆ.." అని గట్టిగా తొడగొట్టాడు ఆది.
ఇందులో మొదటి సన్నివేశం సీమలోని నీళ్లు సైతం అక్కడి పౌరుషాన్ని ప్రతిబింబిస్తాయని చెబితే, రెండో సన్నివేశం ఆది ఎలాంటివాడో పట్టిస్తుంది. సినిమా అంటేనే డ్రామా. 'ఆది' వంటి ఎమోషనల్ డ్రామాని పండించాలంటే ఎమోషనల్ డైలాగులు తప్పనిసరి. ఇవి ఆయా సన్నివేశాల్లో ఉద్వేగాన్ని ప్రేరేపించడం కోసం ఉపయోగించినవిగానే మనం చూడాలి. మనిషిలోని భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకోవడం సరికాదనే విమర్శకులూ ఉన్నారు. అది వేరే సంగతి. అయితే ఆ ఉద్వేగభరిత సంభాషణలూ సందర్భోచితంగానే ఉండాలనేది గుర్తుంచుకోవాలి. అప్పుడే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అవసరానికి మించిన సంభాషణలూ, సందర్భరహిత మాటలూ ప్రేక్షకుణ్ణి చికాకు పరుస్తాయి. అపహాస్యానికి గురవుతాయి. అందుకు ఆ తర్వాత వచ్చిన ఎన్నో రాయలసీమ నేపథ్య చిత్రాలే నిదర్శనం.
ఉరకలెత్తే ఉద్వేగభరిత కథనం
'ఆది' సినిమా విజయానికి ప్రధానంగా దోహదం చేసింది ఎమోషనల్ డ్రామానే. ఆ డ్రామాని వినాయక్ పండించిన తీరు చూస్తే, ఆ చిత్రాన్ని ఒక కొత్త దర్శకుడు కాక, కాకలు తీరిన దర్శకుడు తీశాడనే అభిప్రాయం కలుగుతుంది. తన తల్లిదండ్రుల్ని కిరాతకంగా హత్యచేసిన నాగిరెడ్డి (రాజన్ పి. దేవ్) అనే ఫ్యాక్షనిస్టుపై ఆదికేశవరెడ్డి అనే ఇరవై రెండేళ్ల కుర్రాడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే చిన్న అంశాన్ని సరిగ్గా రెండున్నర గంటలసేపు చిక్కనైన స్క్రీన్‌ప్లేతో తెరమీద రసవత్తరంగా నడిపి భేష్ అనిపించుకున్నాడు వినాయక్. ఆది పాత్రనూ, దానికి వ్యతిరేకమైన నాగిరెడ్డి పాత్రనూ బలంగా రూపొందించి ఉద్వేగభరిత సన్నివేశాలతో కథను పరుగులెత్తించాడు. ఆది పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో, అతని చిన్నప్పటి సన్నివేశంతోనే రుచి చూపించాడు. ఆది తల్లిదండ్రుల్ని నాగిరెడ్డి హత్య చేసే సమయానికి ఆది ఎనిమిదేళ్ల పిల్లాడు. నాగిరెడ్డి బారినుంచి తప్పించుకోవాలంటే అతడికి దొరక్కుండా పారిపోవడం ఒక్కటే కర్తవ్యం. ఆ సమయంలో ఎర్రన్న (చలపతిరావు) అనే అతను ఆదిని తీసుకుని పారిపోతుంటాడు. నాగిరెడ్డి మనుషులు వాళ్ల వెంట పడతారు. వాళ్లమీద బాంబులు వేస్తాడు ఎనిమిదేళ్ల పిలగాడు ఆది. అది చూసి "నాన్నా. నీ పేరేమిటి?" అనడుగుతాడు అప్పటిదాకా ఆ పిల్లాడి పేరు తెలీని ఎర్రన్న.
ఆది.. ఆదికేశవరెడ్డి" అని చెబుతాడు ఆది, పళ్లు బిగించి. అమెరికా నుంచి వచ్చినా, పసివాడైనా ఆదిలో సీమ పౌరుషం ఉరకలెత్తుతున్నదని ఆ సన్నివేశంతో తెలియజేశాడు స్క్రీన్‌ప్లే రచయిత కూడా అయిన వినాయక్. ఈ కథ కూడా అతనిదే. ఆది పెరిగి పెద్దవాడై, హైదరాబాద్‌లో కాలేజీ స్టూడెంట్ అయిన అతను చెప్పే తొలి డైలాగ్ "మాది రాయలసీమన్నా. అమ్మతోడు. ఎంతమందొస్తే అంతమందినీ అడ్డంగా నరికేస్తా". అలా అని ఆదికి ఎప్పుడూ కొట్లాటలే అనుకుంటే పొరబాటే. స్వతహాగా అతను సరదా కుర్రాడు. అందుకే 'చికు చికు బంబం చికు చికు బంబం చిదులు వేసే వయసేలే' అని పాడతాడు. ఆ పాటలోనే 'వేటకి వేటా మన ఆటా వేటుకి వేటూ మన బాటా' అని తన స్వభావాన్ని తెలియజేస్తాడు.
కొన్ని లోపాలూ లేకపోలేదు
చాలా సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలోనూ అతను ప్రేమించింది విలన్ కూతుర్నే. నాగిరెడ్డి కూతురే నందిని (కీర్తి చావ్లా) అని తెలిసినప్పుడు ఆమెని మరచిపోవాలని అనుకుంటాడు ఆది. కానీ ఏ పాపమూ తెలీని ఆమె ప్రేమని వొదులుకోవద్దని ఎర్రన్న చెప్పడంతో ఆమెని మనసారా తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. అలాంటి ఆది ఓ సందర్భంలో ఆమెతో అన్న మాటలు ఆ పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీసేట్లు ఉంటాయి.
"మీ అమ్మానాన్నల్ని చంపింది మా నాన్నే అని నాకెందుకు చెప్పలేదు?" అని నందిని అడిగితే "బయటి విషయాలు భార్యలతో డిస్కస్ చేసే అలవాటు మాకు లేదు" అంటాడు ఆది. అంటే ఆది తల్లిదండ్రుల్ని నందిని తండ్రి చంపడం బయటి విషయమా? దాన్ని ప్రేయసికి చెప్పకూడదా? ఆది స్వభావానికి సరితూగే డైలాగ్ కాదు అది. రచయిత అప్రమత్తంగా ఉంటే ఈ తప్పు దొర్లేది కాదు.
ఈ సినిమాలో కనిపించే మరో తప్పు నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా కనిపించిన గంగిరెడ్డి (రఘుబాబు) పాత్ర చిత్రణ. వీరారెడ్డి (ఆది తండ్రి) పేదలకి భూములు పంచాలనుకుంటే, అతడికి విరుద్ధంగా నాగిరెడ్డిని ఎగదోసేది గంగిరెడ్డే. ఇంకోసారి తనని గంగిరెడ్డి బృందం చంపుతున్నప్పుడు 'ఒరేయ్ మేం కష్టపడుతున్నది మీ అందరికీ పొలాలు ఇవ్వడం కోసమేరా' అంటాడు ఎర్రన్న. 'వాడి మాటలు వినకండిరో' అంటూ తన మనుషుల్ని ఉసిగొల్పి, ఎర్రన్నని చంపుతాడు గందిరెడ్డి. ఎర్రన్నని అలా చంపాలని ప్లాన్ చేసేదీ అతనే. అలాంటి అతను క్లైమాక్సులో హఠాత్తుగా మంచివాడిగా మారిపోవడం పెద్ద వింత!
'గంగిరెడ్డీ.. మీరన్నా చావండి. ఆణ్ణన్నా చంపండి' అని నాగిరెడ్డి ఆజ్ఞాపిస్తే, 'నీ కోసం మేమెందుకు చావాలన్నా?' అని ప్రశ్నించి నాగిరెడ్డినే కాక, ప్రేక్షకుణ్ణీ ఆశ్చర్యపరుస్తాడు గంగిరెడ్డి. ఇలాంటి కొన్ని లోపాలు మినహాయిస్తే 'ఆది' ఆద్యంతమూ జనరంజక చిత్రం. ఇరవై రెండేళ్ల ఆది పాత్రలో పద్దెనిమిదేళ్ల ఎన్‌టీఆర్ వయసుకు మించిన అభినయ సామర్థ్యాన్ని ప్రదర్శించి, అచ్చెరువు కలిగించాడు. సినిమానంతా తన భుజాల మీద మోశాడు. భావోద్వేగ సన్నివేశాల్లో హావభావ విన్యాసాలతో, డైలాగ్ డిక్షన్‌తో ఆకట్టుకున్నాడు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో, పాటల్లో చెలరేగిపోయాడు. నందిని పాత్రలో హీరోయిన్‌గా కీర్తి చావ్లా అటు అందం విషయంలోనూ, ఇటు అభినయం విషయంలోనూ ఏ కాస్త మెరుగ్గా ఉన్నా 'ఆది' మరింత హిట్టయ్యేది. ఈ చిత్రంలో మిగతా అందరూ పరిధుల మేరకు రాణిస్తే ఫెయిలైన ఒకే ఒక్క నటి కీర్తి చావ్లా. రాజన్ పి. దేవ్, చలపతిరావు, రఘుబాబు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. అలీ, వేణుమాధవ్ కొద్దిసేపు నవ్వించారు.
ఆ కాలంలో ఉచ్ఛస్థితిలో ఉన్న మణిశర్మ కీ బోర్డు నుంచి జాలువారిన మరో పాపులర్ ఆడియో ఆల్బం 'ఆది'. దర్శకుడు వినాయక్ చెప్పినట్లు 'నీ నవ్వుల తెల్లదనాన్నీ నాగమల్లీ అప్పడిగిందీ' పాట చక్కని మెలోడీతో ఆహ్లాదం కలిగిస్తే, 'చికు చికు బంబం చికు చికు బంబం చిందులు వేసే వయసేలే', 'తొలి పిలుపే నీ తొలి పిలుపే', 'అయ్యోరామ ఆంజనేయా ఎంత పని చేశావు', 'సున్నుండ తీసుకో సిగ్గుపడక తీసుకో' పాటలూ జనరంజకమయ్యాయి. సి. రాంప్రసాద్ ఛాయాగ్రహణం, విక్రంధర్మా, స్టన్ శివల స్టంట్స్, గౌతంరాజు ఎడిటింగ్ 'ఆది'కి బలమయ్యాయి. అన్నింటికీ మించి 'ఆది'కి అసలైన హీరో వి.వి. వినాయక్. ఎన్‌టీఆర్‌ని అతను తెరమీద ఆవిష్కరించిన తీరే పాతిక కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాగా దీన్ని నిలిపింది. ఎన్‌టీఆర్‌కి స్టార్‌డంని తీసుకొచ్చి, వినాయక్ భవిష్యత్ అగ్ర దర్శకుల్లో ఒకడిగా నిలిచే క్రమంలో పునాది అయ్యింది.

'ఆది' నాటి ధైర్యం ఇప్పుడు లేదు
-వి.వి. వినాయక్
ఎన్‌టీఆర్ ఈ కథ ఓకే చెయ్యగానే మా నాన్నకి ఫోన్ చేశా. ఓ స్నేహితుడిలా ఆయనతో అన్నీ చర్చించేవాణ్ణి. 'ఆది' రిలీజయ్యాక నాకు హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ఆఫర్ వస్తుందని గట్టి నమ్మకంతో చెప్పా. నా ఆత్మవిశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నిజంగానే సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు గారు అప్పట్లో అందరికంటే అత్యధిక పారితోషికం ఆఫర్ చేశారు.
'ఆది' అంటే నా ఒక్కడికే కాదు, దానికి సంబంధించిన వాళ్లందరికీ ప్రత్యేక ప్రేమ. నా జీవితంలో మరపురాని, మరవలేని సినిమా. ఎన్ని సినిమాలు తీసినా 'ఆది' ఆదే. ఆ సినిమా చేసిన ఆత్మవిశ్వాసం, అప్పటి పొగరు, ఆ ధైర్యం ఆ తర్వాత నాకు లేకుండా పోయాయి. అది అంత హిట్టవడమే కారణం. ఈ చిత్రంలో యాక్టర్లు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, నేను కోరుకున్నవాళ్లే వచ్చారు. నిర్మాతలు ఆ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాకు తెలిసి కొత్త దర్శకుల్లో అంటే తొలి సినిమాకే పూర్తి స్వేచ్ఛతో, ఏదంటే అది చేయగలిగింది నేనొక్కణ్ణే.
'అన్నయ్యా' అని పిలుస్తూ తన కుటుంబంలో మనిషిగా నాకు గౌరవాన్నిచ్చాడు ఎన్‌టీఆర్. అంత శక్తివంతమైన పాత్రని అంత చిన్న వయసులో మెప్పించడం మామూలు సంగతి కాదు. యువ హీరోల్లో ఎవరికీ లేనటువంటి డైలాగ్ డిక్షన్ ఎన్‌టీఆర్ సొంతం. ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడంలో మరీ. డాన్సుల్లోనూ, ఎనర్జీ లెవల్స్‌లోనూ అతనిది పైస్థాయి. పైగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముణ్ణి జనం ఆ అబ్బాయిలో చూడటం కూడా సినిమా విజయానికి కారణం. 'ఆది' పాత్రని నా ఊహకి మించి గొప్పగా చేశాడు. అతను ఆల్‌రౌండర్. 'బార్న్ ఆర్టిస్ట్'. యాక్షన్ సీన్లలో, డాన్సుల్లో పక్కవాళ్ల కో-ఆర్డినేషన్ కుదరక రెండు మూడు టేకులు ఎప్పుడన్నా తీసుకున్నాడేమో గానీ, తనకు సంబంధించిన సన్నివేశాల్లో రెండో టేక్ తీసిన సందర్భమేదీ నాకు జ్ఞాపకం లేదు. ఇది రాయలసీమ కథ అయినప్పటికీ క్లైమాక్స్ సన్నివేశాల్ని విజయనగరంలోని సైనిక్ స్కూల్లో చేశాం. క్లైమాక్స్ తీసేప్పుడు ఎన్‌టీఆర్ చేతికి గ్లాస్ తగిలి గాయమైంది. 'ఆది' హిట్టయ్యాక ఏ సినిమాలో ఎన్‌టీఆర్‌కి దెబ్బ తగిలితే ఆ సినిమా హిట్టవుద్దనే సెంటిమెంట్ ఏర్పడింది.
ఈ సినిమాకి సంబంధించి చెప్పుకోవాల్సిన మరో అంశం మణిశర్మ సంగీతం. ఆయన సినీ జీవితంలోని గొప్ప పాటల్లో 'నీ నవ్వుల తెల్లదనాన్ని' పాట తప్పకుండా ఉంటుంది. ఈ పాట రాసింది చంద్రబోస్. 'ఆది' తీయడానికి రెండేళ్ల ముందే ఈ పాటని నాకు వినిపించాడు. దాన్ని ఎవరికీ ఇవ్వొద్దనీ, నా సినిమాలో అది ఉండాలనీ అడిగా. సరేనని, మాట మీద నిలబడ్డాడు.

(వచ్చే వారం 'సంతోషం' సంగతులు)

Friday, April 1, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: ఆది

తారాగణం: ఎన్‌టీఆర్, కీర్తి చావ్లా, రాజన్ పి. దేవ్, చలపతిరావు, రఘుబాబు, అలీ, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం, రాజీవ్ కనకాల, వేణుమాధవ్, ఆహుతి ప్రసాద్, నారాయణరావు, సంగీత, హరిత, బెంగుళూరు పద్మ, రమ్యశ్రీ, మాస్టర్ నందన్, విజయ్, ప్రసన్నకుమార్, చిత్రం శ్రీను
మాటలు: పరుచూరి బ్రదర్స్
పాటలు: చంద్రబోస్, భువనచంద్ర, పోతుల రవికిరణ్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్
కూర్పు: గౌతంరాజు
స్టంట్స్: విక్రం ధర్మా
నృత్యాలు: రాఘవేంద్ర లారెన్స్, అమ్మ రాజశేఖర్, ప్రదీప్ ఆంథోని
కళ: పార్థసారథి వర్మ
డీటీఎస్ మిక్సింగ్: మధుసూదన్‌రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
నిర్మాత: పి. నాగలక్ష్మి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి. వినాయక్
బేనర్: శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
నిడివి: 2.30 గంటలు
విడుదల తేది: 28 మార్చి 2002

కేవలం పద్దెనిమిదేళ్ల కుర్రాడు సినిమానంతా తన భుజాల మీద మోసి. 'ఆది'గా బాక్సాఫీసు వద్ద చెలరేగిన తీరు చూసి ముక్కుమీద వేలేసుకుని ఆశ్చర్యపడని వాళ్లు లేరు. ఆ కుర్రాడు జూనియర్ ఎన్‌టీఆర్. తాత నందమూరి తారక రామారావు పేరునే పెట్టుకున్న అతను మొదట 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా పరిచయమై, పరాజయాన్ని పొందాడు. కానీ రెండో సినిమా 'స్టూడెంట్ నెం.1'తో ప్రేక్షకుల మన్ననల్ని పొందడంలో విజయం సాధించాడు. ఇక మూడో సినిమా 'ఆది'తో స్టార్ హీరో అయిపోయాడు (గుణశేఖర్ రూపొందించిన 'రామాయణం'ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే అప్పటికి ఎన్‌టీఆర్ బాలనటుడు). వి.వి. వినాయక్ అనే ఇరవై ఆరేళ్ల కొత్త దర్శకుడు ఎలా గమనించాడో ఏమో కానీ, ఎన్‌టీఆర్‌లోని మాస్ పొటెన్షియాలిటీని వెలికితీసి, ప్రపంచానికి తొలిగా రుచి చూపించాడు. అందుకే 2002 మార్చిలో విడుదలైన ఆ చిత్రం ఆ ఇద్దరి కెరీర్‌కి బంగారు బాట వేసింది. 105 కేంద్రాల్లో విడుదలైన 'ఆది' అన్ని కేంద్రాల్లోనూ యాభై రోజులు, 98 కేంద్రాల్లో వంద రోజులు ఆడటం విశేషం కాక మరేమిటి! కేవలం రెండున్నర కోట్ల రూపాయలతో రూపొందించిన ఆ చిత్రం ఏకంగా పాతిక కోట్ల రూపాయల్ని వసూలు చేసి, ఆ ఘనతని సాధించిన తొలి తెలుగు చిత్రంగా బాక్సాఫీసు చరిత్రకెక్కింది! అంటే వ్యయానికి పది రెట్ల ఆదాయాన్ని సంపాదించి పెట్టాడు 'ఆది'.
అలాంటి 'ఆది'కి బీజం ఎలా పడింది? "నేను 'చెప్పాలని ఉంది' సినిమాకి కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు, దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరైన బుజ్జి (నల్లమలుపు శ్రీనివాస్) నన్ను కథ చెప్పమన్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో శివుని బొమ్మ దగ్గర కూర్చొని ఓ కథ చెప్పా. అది ఆయనకి బాగా నచ్చింది. అప్పట్లో సినీ పాత్రికేయుడిగా ఉన్న నేటి సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమర్‌ని పిలిచి 'మా బేనర్‌లో తర్వాతి సినిమాని వినయ్‌తో చేస్తున్నామ'ని చెప్పాడు బుజ్జి. నేను భాస్కరభట్లతో నా పేరుని వి.వి. వినాయక్‌గా రాయమని చెప్పా. నేను బుజ్జికి కథ చెప్పింది 'ఆనందం' హీరో ఆకాశ్‌ని దృష్టిలో పెట్టుకుని. మేం 'చెప్పాలని వుంది' పాటల కోసం స్విట్జర్లాడ్ వెళ్లినప్పుడు అప్పటికే 'స్టూడెంట్ నెం.1' పాటల కోసం అక్కడ ఉన్నాడు ఎన్‌టీఆర్. బుజ్జి అతనితో నా గురించి చెప్పాడు. హైదరాబాద్ వచ్చాక నా కథ విన్నాడు. నచ్చిందని చెప్పాడు. అయితే తర్వాత లవ్ స్టోరీ కాకుండా మంచి మాస్ కథ ఉంటే చెప్పమన్నాడు. మాస్ స్టోరీకి సంబంధించి, నా మనసులో రెండు సీన్లు మాత్రమే ఉన్నాయి. కానీ వచ్చిన అవకాశం పోతుందేమోననే టెన్షన్‌లోనే రెండంటే రెండు రోజుల్లో అరవై సీన్లతో కథ తయారుచేశా. ఆ కథ చెప్పగానే ఉద్వేగానికి గురయ్యాడు ఎన్‌టీఆర్. 'అన్నా. ఈ కథతో మనం సినిమా చేస్తున్నాం' అన్నాడు. అలా 'ఆది' తెరమీదకి వచ్చింది" అని చెప్పుకొచ్చారు వి.వి. వినాయక్.
తన తల్లిదండ్రుల్ని తలనరికి కిరాతకంగా హత్య చేసిన నాగిరెడ్డి అనే ఫ్యాక్షనిస్టుపై ప్రతీకారం తీర్చుకునే 'ఆది'కేశవరెడ్డి అనే రాయలసీమ కుర్రాడిగా ఎన్‌టీఆర్ తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాడు. 'పిట్ట కొంచెం కూత ఘనం' నానుడిని నిజంచేస్తూ ఆ సినిమాతో అతను అగ్ర యువ కథానాయకుల్లో ఒకడిగా పేరుపొందాడు. ఒక కొత్త దర్శకుడిలోని కసికీ, మాస్ హీరోగా తాత పేరుని నిలబెట్టాలనే ఓ కుర్రాడి తాపత్రయానికీ దక్కిన ఈ విజయంలో అప్పట్లో 'పీక్ స్టేజ్'లో ఉన్న మణిశర్మ సంగీతానికీ ప్రధాన భాగముంది. అతని సినీ జీవితంలో ఎన్నదగిన పాటల్లో ఒకటైన 'నీ నవ్వుల తెల్లదనాన్నీ నాగమల్లీ అప్పడిగిందీ ఇవ్వొద్దూ ఇవ్వొద్దూ' పాట ఈ చిత్రంలోనిదే. ఆ పాట జాలువారింది చంద్రబోస్ కలం నుంచి. ఈ చిత్రంలోని భావోద్వేగపూరిత డైలాగులు కూడా బాగా పాపులర్. ఎన్‌టీఆర్ నోట పలికిన 'తలదించే వంశంలో పుట్టలేదురా. తొడగొట్టే వంశంలో పుట్టా', 'అరవకు. అమ్మతోడు. అడ్డంగా నరికేస్తా' వంటి డైలాగులకి థియేటర్లలో మోగిన చప్పట్లు చాలామందికి జ్ఞాపకముండే ఉంటాయ్.
కథాసంగ్రహం
అమెరికా నుంచి కడపకు వచ్చిన వీరారెడ్డి (ఆహుతి ప్రసాద్)తో అతనికి చెందిన భూములన్నింటినీ నాగిరెడ్డి (రాజన్ పి. దేవ్) ఆక్రమించేశాడనీ, ఈ వేల ఎకరాల బంజరు భూమిని పేదలకిస్తే తమ చెమటని చిందించి, ఈ నేలను తడిపి, నాలుగు మెతుకులు తింటారనీ చెబుతాడు ఎర్రన్న (చలపతిరావు). సరేనంటాడు వీరారెడ్డి. అయితే ఈ భూముల్ని పేదోళ్లకి పంచిపెడితే, రాజకీయంగా తనకు పుట్టగతులు వుండవని భావించిన నాగిరెడ్డి ఓ రాత్రివేళ దాడిచేసి వీరారెడ్డినీ, అతని భార్యనీ తలనరికి చంపేస్తాడు. పిల్లవాడైన ఆదికేశవరెడ్డిని తీసుకుని హైదరాబాద్ పారిపోతాడు ఎర్రన్న. హత్యానేరాన్ని వీరారెడ్డి మనుషులపైనే మోపి, వాళ్లని జైలుపాలు చేస్తాడు నాగిరెడ్డి.
పన్నెండేళ్లు గడిచిపోతాయి. నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఆది (ఎన్‌టీఆర్), నందిని (కీర్తి చావ్లా) ప్రేమలో పడతారు. కడప జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న తమ మనుషుల వద్దకు ఆదిని తీసుకుపోతాడు ఎర్రన్న. అతడి తల్లిదండ్రుల్ని నాగిరెడ్డి ఎట్లా చంపి, తమ మీద నెరం మోపి, జైలుపాలు చేశాడో చెబుతారు వాళ్లు. నాగిరెడ్డిని అప్పుడే చంపాలన్నంత ఆవేశానికి గురవుతాడు ఆది. నందిని ఎవరో కాదు, నాగిరెడ్డి కూతురనే సంగతి తెలిసి, బాధపడతాడు. ఆమెని మరచిపోదామనుకుంటాడు. కానీ ఏ పాపమూ తెలీని ఆమె ప్రేమని వొదలొద్దని చెబుతాడు ఎర్రన్న.
తండ్రికి ఆదితో తన ప్రేమ సంగతి చెబుతుంది నందిని. అతణ్ణి రమ్మనమనీ, తనకి నచ్చితే పెళ్లి చేస్తాననీ అంటాడు నాగిరెడ్డి. నందిని చెప్పడంతో కడపకు వస్తాడు ఆది. అతణ్ణి తండ్రికి పరిచయం చేస్తుంది నందిని. "వాహ్. ఏం తేజస్సు బిడ్డా. కోహినూర్ వజ్రం గురించి వినడమే కానీ ఎప్పుడూ చూళ్లేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. బాగా నచ్చావ్" అంటాడు నాగిరెడ్డి. అప్పుడు "నా పేరు ఆదికేశవరెడ్డి" అంటాడు ఆది. అతడి తాత పేరు కూడా అదే. తనెవరో తెలిసిన నాగిరెడ్డితో "నేనెవరో తెలిశాక నీ పరువుగా ఫీలయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యవని నాకు బాగా తెలుసు. కానీ, నువ్వు చేసినా, చెయ్యకపోయినా నీ పరువుకి తాళికట్టేది నేనే" అంటాడు ధైర్యంగా. విజయదశమి వరకు టైమిస్తున్నాననీ, ఈలోపు తన ఆస్తులు మొత్తం తనకు అప్పగించమనీ, లేదంటే ఎనిమిదేళ్ల వయసులోనే బాంబులు వేసిన తనకు ఇప్పుడెయ్యడం పెద్ద కష్టం కాదనీ హెచ్చరిస్తాడు. పాడుబడిపోయిన తమ ఇంటికి వెళ్తాడు. ఊరి జనమంతా అక్కడికి వచ్చి తామంతా అతని వెనకాల ఉంటామని చెబుతారు.
నందినికి పులివెందుల నుంచి ఓ సంబంధం మాట్లాడుకుని వస్తాడు నాగిరెడ్డి. ఆది వద్దకు రాత్రి పూట వస్తుంది నందిని. అది తెలిసి అక్కడకు వస్తాడు నాగిరెడ్డి. అతడి ముందే ఆమె నుదుటిమీద ముద్దు పెట్టుకుంటాడు ఆది. ఇంటికెళ్లాక తనని చంపినా ఆది మీద ప్రేమపోదని తండ్రితో అంటుంది నందిని. ఆమె రమ్మంటున్నదని తప్పుడు సమాచారమిచ్చి, ఒక్కణ్ణే రప్పించి, ఎర్రన్నని చంపుతారు నాగిరెడ్డి ప్రధాన అనుచరుడైన గంగిరెడ్డి (రఘుబాబు), అతని మనుషులు. తను బాబాయ్‌గా పిలుచుకునే తన సర్వస్వమైన ఎర్రన్నని చంపడంతో మహోగ్రుడవుతాడు ఆది. తల్లిని తండ్రి మెడకొరికి చంపబోతుండటంతో అతడు చూసిన సంబంధం చేసుకుంటానని ఏడుస్తుంది నందిని. హడావిడిగా పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు నాగిరెడ్డి. పెళ్లి వేదిక వద్దకు వస్తాడు ఆది. పెళ్లికొడుకు తాళి తీసుకుని వచ్చి, ఆదికి ఇస్తాడు. ఆదిని పిస్టల్‌తో పొట్టమీద కాలుస్తాడు నాగిరెడ్డి. కానీ చలించని ఆది అతణ్ణి బతికుండగానే అప్పటికే అతడి కోసమే తవ్వించిన గుంటలో పడేస్తాడు. మొదటగా నాగిరెడ్డి భార్యాకొడుకులే అతడి మీద మట్టిపోస్తారు. జనమంతా అతణ్ణి సజీవ సమాధి చేసేస్తారు.

శతదినోత్సవం చెయ్యకపోవడం వెలితి
-నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
దివంగత ఎన్‌టీ రామారావు అంటే నాకు విపరీత అభిమానం. అదే పేరున్న ఆయన మనవడు నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని' విడుదలైనప్పుడు మనోడు కదా, ఎలా చేశాడో చూద్దామని వెళ్లా. క్లైమాక్సులోని ఎమోషనల్ సీన్‌ని అతడు చేసిన తీరుకి చాలా ఆశ్చర్యమేసింది. అతడితో సినిమా తీయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. మేం తీసిన 'చెప్పాలని ఉంది' సినిమాకి వినయ్ (వి.వి. వినాయక్) కో-డైరెక్టరుగా పనిచేశాడు. చాలా తక్కువ కాలంలో నాకు సన్నిహితమయ్యాడు. అతడు చెప్పిన కథ నచ్చి, దాన్ని ఎన్‌టీఆర్‌కి చెప్పించా. అది అతనికి నచ్చింది కానీ మాస్ కథ కావాలన్నాడు. అప్పుడు వినయ్ 'ఆది' కథ చెప్పాడు. వెంటనే ఓకే అనేశాడు ఎన్‌టీఆర్.
క్లైమాక్స్ సీన్ చేసేప్పుడు గాజు ముక్క కోసుకుని ఎన్‌టీఆర్ కుడి చేతికి పెద్ద గాయమైంది. చాలా రక్తం పోయింది. అతను మొండోడు. చేతికి కట్టు కట్టుకుని మిగతా సీన్లు చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్టయి, దీని మీద ఆధారపడిన చాలా మంది జీవితాల్ని నిలబెట్టింది. ఎన్‌టీఆర్ స్టామినా ఏమిటో లోకానికి తెలిపింది. 98 సెంటర్లలో వంద రోజులు నడిచింది. వినయ్‌కీ, బెల్లంకొండ సురేశ్‌కీ, నాకూ మంచి బ్రేక్‌నిచ్చింది. అయితే శతదినోత్సవం జరపకపోవడం ఇప్పటికీ నా జీవితంలో వెలితిగానే అనిపిస్తుంటుంది. ఈ సినిమాలో యాక్టర్లు గానీ, టెక్నీషియన్లు గానీ వినయ్ కోరుకున్నవాళ్లే చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వినయ్ సినిమా. మొత్తం స్క్రిప్టు అతనిదే. పరుచూరి బ్రదర్స్‌కి డైలాగ్ రైటర్స్‌గా క్రెడిట్ ఇచ్చినా, డైలాగ్ వెర్షన్ సహా అంతా తనే తయారుచేసుకున్నాడు. అందుకే ఈ సినిమా క్రెడిట్ అంతా అతనిదే. ఎన్‌టీఆర్‌తో అతని కాంబినేషన్‌ని కుదిర్చిన ఘనత మాత్రం నాది.
అల్లరి చేసే పద్దెనిమిదేళ్ల వయసులో ఎన్‌టీఆర్ 'ఆది'గా ఏం చేశాడండీ! అతను పెద్దాయన (దివంగత ఎన్‌టీఆర్) అంశతోనే పుట్టాడని అనిపిస్తుంటుంది. అన్ని సీన్లూ సింగిల్ టేక్‌లో చేసేవాడు. 'ఆది'కి పనిచేయడం 'ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మై లైఫ్'.
(వచ్చే వారం 'ఆది' విజయానికి దోహదం చేసిన అంశాలు)

Saturday, February 12, 2011

హిట్.. హిట్.. హుర్రే..!: ఖుషి-2

శ్రద్ధగా చదువుకుంటోన్న మధు వద్దకొచ్చి పలకరించాడు సిద్ధు. 'డోంట్ డిస్టర్బ్. చదువుకుంటున్నా' అంది మధు. సరేనంటూ అవతలకి వెళ్లి కూర్చుని, తానూ పుస్తకం తెరిచాడు సిద్ధు. చూపు పుస్తకం మీద నిలవనంటోంది. ఆమె వంక చూశాడు. అప్పుడే గాలికి పైట తొలగి తెల్లని, అందమైన మధు నడుము, పొట్ట మధ్యలో చిన్న నాభి కనిపించాయి. అసలే నల్లని చీర కావడంతో ఆచ్ఛాదన లేని ఆమె నడుము భాగం మరింత తెల్లగా కనిపించింది. చూపు తిప్పుకోలేకపోయాడు. ఎందుకో అతడివంక చూసింది మధు. చప్పున తల తిప్పేసుకున్నాడు. ఆమె మళ్లీ పుస్తకం వేపు దృష్టి పెట్టింది. గాలి వీస్తూనే ఉంది. మధు నడుము అనాచ్ఛాదితంగా కనిపిస్తూనే ఉంది. అతడి చూపులు అటువేపు పోతూనే వున్నాయి. అతడి గొంతు తడారిపోతోంది. గుటకలు మింగుతున్నాడు. నాలుగైదు సార్లు అతడి చూపులు గమనించాక, అప్పుడు అర్థమైంది, అతడు ఎక్కడ, ఏం చూస్తున్నాడో.
"సిద్ధు.. ఇదేం బాలేదు" కోపంగా అంది.
"ఏంటీ?" అడిగాడు సిద్ధు ఏం ఎరగనట్లు.
"నువ్వు చేసే పని"
"నేనేం చేశాను?"
"నీ చూపు గురించి మాట్లాడుతున్నా"
"నేనేం చూశాను?"
"నువ్వు నా నడుం చూశావు"
"లేదు"
"నువ్వు చూశావు. నువ్వు చూసింది నేను చూశాను"
"లేదు. చూడలేదు"
"చూశావు. పదిసార్లన్నా చూసుంటావు"
ఇద్దరూ గొడవపడ్డారు. ప్రతిసారీ తనని అపార్థం చేసుకుంటున్నావని అనాడు సిద్ధు. 'పెద్ద అందగత్తెవని పెద్ద ఫీలింగ్' అని కూడా అన్నాడు. బలవంతాన కోపం అణచుకుంటూ, పళ్లు బిగించి "నువ్వు నడుం చూశావా లేదా?" అని మళ్లీ గటిగా అడిగింది మధు. దానికి సమాధానం చెప్పకుండా "నువ్వు నన్ను లవ్ చేశావా, లేదా?" అడిగాడు సిద్ధు. "లేదు" అంది మధు. "నేనూ నీ నడుం చూడలేదు" అని జవాబిచ్చాడు సిద్ధు. మళ్లీ పోట్లాట. "అసలిలాంటి అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేయను. ఒకవేళ చేసినా అది లవ్ దాకా రాదు. వచ్చినా మ్యారేజ్ దాకా వెళ్లదు. ఖర్మకాలి నన్ను బలవంతంగా పెళ్లికి దింపినా కానీ, 'ఇలాంటమ్మాయి వొద్దు' అని లెటర్ రాసి పారిపోతా" అన్నాడు సిద్ధు. దాంతో ఏడుస్తూ "సిద్ధు అనేవాణ్ణి లైఫ్‌లో కలవలేదనే అనుకుంటా. మనమధ్య ఏమీ లేదు. నథింగ్ బిట్వీన్ యు అండ్ మి" అని అక్కణ్ణించి విసవిసా వెళ్లిపోయింది మధు.
'ఇగో' (అహం) అనేది ఇద్దరు యువతీ యువకుల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుందనే దానికి చక్కని ఉదాహరణ ఈ సన్నివేశం. 'ఖుషి' చిత్రం మొత్తానికీ కీలకమైన సన్నివేశం ఇది. మిగతా సినిమా అంతా ఆధారపడింది ఈ సన్నివేశం మీదే. ఈ సన్నివేశం వల్లే మధు, సిద్ధు ఎడమొహం పెడమొహం అయ్యారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ ఎలా ఒకటయ్యారనేదే మిగతా కథ.
ఈ సన్నివేశాన్ని రాసిన తీరూ, తెరమీద దాన్ని చిత్రీకరించిన తీరూ ఉన్నత స్థాయికి చెందుతాయి. అప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో నాయికా నాయకుల మధ్య గొడవలకు ఇతరేతర గొడవలెన్నో కారణంగా కనిపిస్తూ వచ్చాయి. హీరోయిన్ 'బెత్తెడంత నడుము'ని హీరో చూసినందువల్ల గొడవ వచ్చి, వాళ్లు దూరమవడమనేది కొత్త. లాజికల్‌గా చూస్తే, హీరో మీద ప్రేమవున్న (నోరుతెరచి చెప్పకపోయినా) నాయిక తన నడుముని నాయకుడు చూశాడని కోప్పడి, అతడికి దూరమవ్వాలనుకోవడం హాస్యాస్పదం అనిపిస్తుంది. అయితే అలాంటి భావన సగటు ప్రేక్షకుడికి కలగకపోవడమే ఈ సినిమా సాధించిన విజయం. అందుకు దోహదం చేసినవి బిగువైన స్క్రీన్‌ప్లే, ఉలాసభరితమైన సన్నివేశాల కల్పన. ఆ ఘనత స్క్రీన్‌ప్లేనీ సమకూర్చిన దర్శకుడు ఎస్.జె. సూర్యదే. అంతేకాదు, ఆ సన్నివేశం ఏమాత్రం అసభ్యకరంగా లేకుండా 'క్యూట్'గా రావడానికి కారణం, పి.సి. శ్రీరాం ఛాయాగ్రహణ ప్రతిభ. ఆ సన్నివేశంతో పాటు ఆద్యంతం తన కెమెరా పనితనంతో చిత్రాన్ని 'విజువల్ ఫీస్ట్'గా తయారుచేశాడు శ్రీరాం. ఆయా సన్నివేశాల్లో సందర్భానుసారం చక్కగా అమరిన సంభాషణలనీ తక్కువ చేయలేం. రాజేంద్రకుమార్ రాసిన సంభాషణలు కథనంలో కావలసినంత 'టెంపో'ని తీసుకొచ్చాయి.
ఇక సిద్ధు, మధు మధ్య దూరం మరింత పెరిగే సన్నివేశంలో పవన్ కల్యాణ్ నోటివెంట పలికే డైలాగుల్ని ప్రేక్షకులు ఎంతగా అస్వాదించారో! గుడుంబా ప్యాకెట్ల కోసం మోషే (అలీ) బయటకు వెళితే అప్పటికే గుడుంబా మత్తులో ఉన్న సిద్ధు గోడమీది బొమ్మలో మధుని చూస్తూ "ఏంటి చూస్తున్నావ్ చెప్పు. నాకు చెప్పాల్సిందే. బాగా.. పెద్ద పెద్ద రెండు గుడ్లగూబల్లాంటి కళ్లు పెట్టుకుని ఎందుకలా చూస్తున్నావో చెప్పవే. (నడుము సైజు చేతితో కొలుస్తూ) బెత్తెడంత చోటు లేదు. దీన్ని మేం చూశామంట. నువ్వు పెద్ద అందగత్తెవి. పిడతంత ముఖం, చుంచులాంటి ముక్కు, గండుచీమ కుట్టి వాచినట్లుండే చిన్ని పెదిం. ఆ.. ఏదో.. చూడాలనిపించే చిన్ని నడుం. నల్ల చీర కట్టుకుని ఒళ్లంతా కప్పుకుని కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు రంగులో.. ఓ.. నిమ్మపండు పసుపురంగులో ఉంటుంది కదూ. ఓ.. ఎరుపు, పసుపు మిక్సయిపోయి చిన్ని రొమాంటిక్ కలర్లో.. చిన్ని ఏరియా కనిపించినప్పుడు కళ్లు ఆటోమేటిగ్గా చూస్తాయి. అది దాని ('అవి వాటి' అని వుండాలి) నైజం. అది నువ్వు చూపించకుండా వుండాల్సింది. ముఖం నీ వొంట్లో భాగమే. నడుం నీ వొంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు. నడుం చూస్తే కోపం వచ్చింది. ఎందుకు? ఎందుకని నేను ప్రశ్నిస్తున్నానంతే. ఇప్పుడు నీ నడుమే కాదు. నీ ఫుల్ బాడీ చూస్తాను. అసలు నువ్వు నా పక్కన నిల్చునే అర్హత కోల్పోయావ్' అని మధు బొమ్మని చింపేస్తాడు. దాన్ని మధు చూసి కోపంతో వెళ్తున్నప్పుడే మెళ్లో గుడుంబా పాకెట్ల దండ వేసుకుని ఎదురు వస్తుంటాడు మోషే.
"ఓరి బాబూ మోషయ్యో. కుత్తే. నా బతుకును బుగ్గిపాలు చేశావు కదరా నీయయ్య. నా ప్రేమను బుగ్గిపాలు చేశావు కదరా.. రాయ్యా రారా.. ఈ సచ్చినోడు కలకత్తా నుంచి నా ప్రేమను పాడు చేయడానికొచ్చాడు సచ్చినోడు.. నీ జిమ్మడిపోను.." అంటూ బాధపడతాడు సిద్ధు. ఈ సన్నివేశాన్నీ, సిద్ధు పాత్ర పలికే డైలాగుల్నీ, ఆ డైలాగుల్ని కృష్ణా జిల్లా యాసలో పవన్ కల్యాణ్ చెప్పే తీరునీ ఆస్వాదించని వాళ్లెవరు? ప్రేక్షకుల్ని బాగా అలరించిన సన్నివేశాల్లో ఇది ముఖ్యమైన సన్నివేశం. కథ అత్యధిక భాగం సిద్ధు, మధు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రల్లో పవన్ కల్యాణ్, భూమిక అలవోకగా ఇమిడిపోయారు. నిజమైన ప్రేమికులే గొడవ పడుతున్నంత సహజంగా పాత్ర పోషణ చేశారు ఆ ఇద్దరూ. కల్యాణ్‌కి సిద్ధు పాత్రలాగా అంత బాగా అమరిన పాత్ర 'ఖుషి'కి ముందు కానీ, తర్వాత కానీ మరొకటి లేదు. మధు పాత్రలో భూమిక కూడా అంతే. అందుకే 'క్యూట్ పెయిర్' అనిపించుకుంది ఆ జంట.
ఇక సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన మరో అంశం సంగీతం. మణిశర్మ బాణీలు అందించిన ఆరు పాటలూ ఇప్పటికీ ప్రేక్షకుల పెదాలపై ఆడుతూనే ఉన్నాయి. 'యే మేరా జహా యే మేరా ఘర్ మేరా ఆషియా', 'ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా', 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా', 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే', 'చెలియ చెలియా చిరుకోపమా', 'గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో' పాటలు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్. వీటిలో పింగళి పాట 'ఆడువారి మాటలకు అర్థాలే'తో పాటు తొలి రెండు పాటల కాన్సెప్టు కల్యాణ్‌దే. ఇక సన్నివేశాలకి ఇచ్చిన నేపథ్య సంగీతాన్నీ ప్రశంసించకుండా ఉండలేం. హీరో హీరోయిన్లతో పాటు మిగతా నటుల హావభావాలతో సైతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కచ్చితంగా సింక్ అవడం ముచ్చటగా అనిపిస్తుంది. ఇన్ని అంశాలు పక్కాగా కుదిరినందునే కుర్రకారుని అంతగా ఆకట్టుకుంది 'ఖుషి'. చివరకు ముసలాళ్లు కూడా ఈ సినిమా చూస్తూ తమ కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోయి, కుర్రాళ్ల మాదిరిగా ఆస్వాదించారన్నది నిజం.

అది అద్భుతమైన సీన్
-రాజేంద్రకుమార్
తమిళంలో ఈ సినిమా చేసేప్పుడే నన్ను పిలిపించారు. సెట్స్ మీదే సూర్య నాతో చర్చించేవారు. సంభాషణల్లో తెలుగుదనం ఉట్టిపడాలని చెప్పేవారు. తెలుగు నుడికారంతో మాటలు రాయగలిగా. క్లుప్తమైన సంభాషణలు బాగా వర్కవుట్ అయ్యాయి. కథనాన్ని సూర్య అద్భుతంగా నడిపారు. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌కి కూడా ప్రాధాన్యతనివ్వడం చిత్రానికి జీవాన్ని తెచ్చింది. దానికి కాంప్రమైజ్ కాని నిర్మాణం తోడైంది.
'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి' చేసిన పవన్ కల్యాణ్‌కి యూత్‌లో గొప్ప ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ 'ఖుషి'కి బాగా హెల్పయ్యింది. ఫైట్స్, సాంగ్స్ అతనే కంపోజ్ చేశాడు. ఒరిజినల్ తమిళ సినిమాలో కోల్‌కతా ఎపిసోడ్ లేదు. తెలుగులో దాన్ని తెచ్చింది కల్యాణ్. గుళ్లో దీపం ఆరిపోతుంటే హీరో హీరోయిన్లు ఒకేసారి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం అద్భుతమైన సీన్. అలాగే భూమిక నడుముని కల్యాణ్ చూసే సన్నివేశం ఎలాంటి అసభ్యతకి తావులేకుండా సున్నితంగా తీయడం గొప్ప విషయం. ఇలాంటి స్క్రిప్టు అంతదాకా రాలేదు. రీ-రికార్డింగ్ కూడా అద్భుతం. చివరలో ట్రైన్‌లో వెళ్లేప్పుడు రాజ్‌కపూర్ 'మేరా నాం జోకర్'లోని మ్యూజికల్ బిట్‌ని ఉపయోగించారు. అది బాగా కుదిరింది.
రైటర్‌గా నేను చెప్పుకోదగ్గ సినిమా. ఈ సినిమాకి భాగస్వామిని కావడం నా అదృష్టం.

నా పాట గ్రాండ్ హిట్
-సుద్దాల అశోక్‌తేజ
ఓ పాట కోసం నిర్మాత రత్నం చెన్నైకి పిలిపించారు. అక్కడే దర్శకుడు సూర్యనీ కలిశా. సందర్భం చెప్పి పాట ఎరోటిగ్గా ఉండాలన్నారు సూర్య. ఓ పాట రాసిచ్చి వచ్చేశా. దాన్ని హీరో పవన్ కల్యాణ్ విని, మళ్లీ చెన్నై పిలిపించారు. బాగుందని చెబుతూనే 'మొదలు నుంచి చివరి దాకా అమ్మాయి శరీరాన్ని ఎక్కడా మీ 'నిబ్' టచ్ చేయకుండా పాట రాయగలరా? ఆ ఊపు, కవ్వింపు మాత్రం తప్పనిసరిగా ఉండాలి' అన్నారు. దాంతో పాటు ఏదైనా హిట్ సాంగ్ తీసుకుని దాన్ని అనుసరించి రాయమన్నారు. అప్పుడు మళ్లీ రాశా. 'హోలి.. హోలిలో రంగ హోలీ.. చమకేళిల హోలీ' అనే జానపద పాట పల్లవిని తీసుకుని 'ఏకవీర', 'రోషనార' వంటి పదాలు మధ్యమధ్యలో ఉపయోగిస్తూ 'గజ్జె ఘల్లుమన్నాదిరో.. గుండె ఝల్లుమన్నాదిరో' అంటూ రాశా. గ్రాండ్ హిట్. దాని చిత్రీకరణ కూడా అంత బాగానూ వచ్చింది. కల్యాణ్ సినిమాకి నేను రాసిన తొలిపాట ఇదే. ఇప్పటి దాకా మళ్లీ రాయలేదు.
(వచ్చేవారం 'నువ్వు నాకు నచ్చావ్' విశేషాలు) 

Saturday, February 5, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: ఖుషి

తారాగణం: పవన్‌కల్యాణ్, భూమిక, అలీ, సుధాకర్, శివాజీ, విజయ్‌కుమార్, నాజర్, రాజన్ పి. దేవ్, సుధ, ముంతాజ్, జానకి, డింపుల్, ఎస్.జె. సూర్య (అతిథి పాత్ర)
మాటలు: రాజేంద్ర కుమార్
పాటలు: పింగళి, ఎ.ఎం. రత్నం, చంద్రబోస్, సుద్దాల అశోక్‌తేజ, అబ్బాస్ టైర్‌వాలా
సాంగ్స్ కాన్సెప్ట్: పవన్‌కల్యాణ్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరాం
కూర్పు: బి. లెనిన్, వి.టి. విజయన్, కోలా భాస్కర్
యాక్షన్: విజయ్
యాక్షన్ సీక్వెన్సెస్ రూపకల్పన: పవన్‌కల్యాణ్
కొరియోగ్రఫీ: బృంద, హరీశ్‌పాయ్
ఆడియోగ్రఫీ: హెచ్. శ్రీధర్
ఆర్ట్: ఆనంద్‌సాయి
పబ్లిసిటీ డిజైనర్: లంక భాస్కర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అళహరి రఘురాం
నిర్మాత: ఎ.ఎం. రత్నం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.జె. సూర్య
బేనర్: శ్రీ సూర్యా మూవీస్
విడుదల తేది: 27 ఏప్రిల్, 2001

చిరంజీవికి అసలు సిసలు వారసుడు వచ్చాడు.. అందరినోటా ఈ మాట అనిపించేట్లు చేసిన సినిమా 'ఖుషి'. అప్పటికే  'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి' చిత్రాల విజయాలతో మంచి జోష్ మీదున్న పవన్‌కల్యాణ్ ఇమేజ్‌ని అమాంతం శిఖరం మీద నిలిపిన చిత్రం 'ఖుషి'. ఈ సినిమాతో యువతరంలో తిరుగులేని ఆరాధ్యతారగా రాపుదాల్చాడు పవన్‌కల్యాణ్.  
నిజం చెప్పాలంటే మెగాస్టార్‌గా నెంబర్‌వన్ హోదాని అనుభవిస్తోన్న చిరంజీవినే సవాలుచేసే స్థాయికి ఆయన్ని చేర్చింది ఈ సినిమా. 79 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన 'ఖుషి', ఐదు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. వాణిజ్యపరంగా కానీ, అభినయపరంగా కానీ కల్యాణ్ కెరీర్‌లో ఇప్పటివరకు అత్యుత్తమ చిత్రం ఇదే. పైగా ఇది ఆయనలోని సృజనాత్మక ప్రతిభని కూడా బయటపెట్టిన తొలి సినిమా. ఇందులోని యాక్షన్ సన్నివేశాలన్నింటినీ డిజైన్ చేసింది ఆయనే. అంతేనా, ఆరింటిలో మూడు పాటల కాన్సెప్ట్ ఆయనదే. మామూలుగా మనం చూసే ఫైట్లకీ, పాటలకీ అవి ఎంత భిన్నంగా ఉన్నాయో, అంత బాగానూ అవి ఆకట్టుకున్నాయి. అలరించాయి. ఇక పవన్‌కల్యాణ్, భూమిక జోడీ 'క్యూట్ పెయిర్'గా పేరు తెచ్చుకుని యువతలో అపూర్వమైన క్రేజ్ సంపాదించుకోవడం మనలో చాలామందికి తెలిసిందే. అలాగే ఆ రోజుల్లో ఎక్కడ విన్నా 'ఖుషి' పాటలే. ఆరుకి ఆరూ సూపర్ హిట్. 'మిస్సమ్మ'లోని 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' పాట రీమిక్స్ సైతం ఇన్‌స్టంట్ హిట్. 
అలాంటి ఈ సినిమా రీమేక్ కావడం గమనార్హం. దీని మాతృక తమిళంలో విజయ్, జ్యోతిక జంటగా నటించగా 2000 సంవత్సరంలో విడుదలై ఘనవిజయం సాధించిన 'ఖుషి' చిత్రం. చెప్పుకోదగ్గ విశేషమేమంటే ఒరిజినల్ సాధించిన విజయన్ని మించి తెలుగు రీమేక్ మరింత పెద్ద విజయం సాధించడం. మాతృకని రూపొందించిన ఎస్.జె. సూర్య ఈ రీమేక్‌నీ డైరెక్ట్ చేశాడు. శ్రీ సూర్యా మూవీస్ బేనర్‌పై ఎన్నో ప్రతిష్ఠాత్మక చిత్రాల్ని అందించిన ఎ.ఎం. రత్నం ఈ సినిమాకి నిర్మాత. సినిమా ఆద్యంతం 'రిచ్'గా కనిపించిందంటే - అందుకు కారణం సూర్య దర్శకత్వ ప్రతిభకి రత్నం ఉన్నతస్థాయి నిర్మాణ విలువలు తోడవడమే. పేరుకి రీమేక్ అయినా మాతృకని మించిన 'నవ్యత' తెలుగు 'ఖుషి'లో అడుగడుగునా గోచరిస్తుంది. ఫైట్లు, పాటల విషయంలోనే కాక సన్నివేశాల కల్పనకూ ఇది వర్తిస్తుంది. అందుకే "ఇది తమిళ వెర్షన్‌ని మక్కీకి మక్కీ కాపీ చేసిన సినిమా కాదు. తమిళం కంటే తెలుగు సినిమా మరింత సృజనాత్మకంగా, మరింత వైవిధ్యంగా ఉంటుంది" అని చెప్పారు పవన్‌కల్యాణ్. చాలామందికి తెలీని సంగతి ఇంకోటుంది. సంభాషణల రచయిత రాజేంద్రకుమార్ మాటల్లో చెప్పాలంటే "తమిళ వెర్షన్‌లో కోల్‌కతా ఎపిసోడ్ లేదు. అక్కడ ఆ ఎపిసోడ్ వేరేవిధంగా ఉంటుంది. కోల్‌కతా నేపథ్యంలో ఆ ఎపిసోడ్ తెచ్చింది కల్యాణే".
'ఖుషి' యువతరాన్ని ఇంత గొప్పగా ఆకట్టుకోవడానికి కారణమేంటి? కథ పరంగా చూస్తే చెప్పుకోడానికి ఏమీలేదు. అతి సన్నని లైను మీద అల్లుకున్న సన్నివేశాల సమాహారం మాత్రమే. ఏమిటా లైను. మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న ఇద్దరు యువతీ యువకుల మధ్య సున్నితంగా నడిచే ప్రేమ వ్యవహారం. అదీ కూడా చివరి రీలులో తప్ప ఇద్దరూ తమ ప్రేమని ఎదుటివాళ్ల వద్ద వ్యక్తం చేయరు. ఎప్పుడూ 'అహం' (ఇగో) ప్రదర్శిస్తూ గొడవపడుతూనే ఉంటారు. అయినా ఒకరంటే ఒకరికి ఎనలేని అనురాగం. అలాంటి ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య సున్నితంగా సాగే రొమాన్స్‌ని ఇంకెంత సున్నితంగా నడపాలి! పాత 'మిస్సమ్మ' గుర్తుంది కదా. ఎన్‌టీఆర్, సావిత్రి పాత్రలు గుర్తున్నాయి కదా. అందులో ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత అనురాగం. కానీ దాన్ని బయటపెట్టడానికి ఇద్దరికీ 'అహం' అడ్డు వస్తుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 'ఖుషి'లో పవన్‌కల్యాణ్, భూమిక పోషించిన సిద్ధార్థ్‌రాయ్, మధుమతి పాత్రలు వాటికి కొనసాగింపు. నాటి పాత్రల స్వభావాన్ని అందిపుచ్చుకుని నేటి పాత్రల్ని మలచాడు సూర్య. అదీ, అత్యంత ఆకర్షణీయంగా. అందుకే ఆ పాత్రల్లో తమని తాము చూసుకున్నారు కాలేజీ యువత. ఆ పాత్రలతో సహానుభూతి చెందారు. 'ఖుషి' చేసుకున్నారు. వాళ్లని అంతగా ఆకట్టుకున్న సిద్ధార్థ్‌రాయ్, మధుమతి కథేమిటో ఓసారి చూద్దాం. 

కథాసంగ్రహం:
కోల్‌కతాలో సిద్ధార్థ్‌రాయ్ అలియాస్ సిద్ధు (పవన్‌కల్యాణ్), కైకలూరులో మధుమతి అలియాస్ మధు (భూమిక) దాదాపు ఒకే సమయంలో పుడతారు. కాలేజీలో సిద్ధుకి బెంగాల్ టైగర్ అని పేరు. అతని తండ్రి తెలుగువాడైతే, తల్లి బెంగాలీ. మాస్టర్స్ డిగ్రీ కోసం కెనడాకి వెళ్లాలనేది సిద్ధు కోరిక. తల్లికి ఇష్టముండదు. ఎమ్మెస్ చదవాలనేది మధు లక్ష్యం. తండ్రి బాపిరాజు (విజయ్‌కుమార్) ఒప్పుకోడు. 'మా అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవాలి' అంటూ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తండ్రిని చూసి పెళ్లికి సరేనంటుంది మధు. పెళ్లిరోజు 'ఇంతకు ముందే నేనో అమ్మాయిని ప్రేమించా. ఆమె ఆత్మహత్యకు సిద్ధపడింది. ఆమె వద్దకి వెళ్తున్నా. నన్ను క్షమించండి' అంటూ ఆ కనిపించని వరుడు ఉత్తరం రాసి వెళ్లిపోతాడు.
కెనడాకని కారులో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సిద్ధు రోడ్డు మీద సిగ్నల్స్ వద్ద అడ్డం వచ్చిన ఓ యువకుణ్ణి (ఎస్.జె. సూర్య) తప్పించబోయి, ఇంకో కారుని గుద్దేస్తాడు. హాస్పిటల్లో తేలతాడు. రెండు నెల్లు బెడ్ రెస్ట్ తప్పదంటారు డాక్టర్లు. పెళ్లి తప్పిన మధు, కెనడా ప్రయాణం ఆగిన సిద్ధు హైదరాబాద్ నిజాం కాలేజీలో అడుగుపెడతారు. అక్కడ సిద్ధుకి స్నేహితుడైన బాబు (శివాజీ), మధుకి ఫ్రెండయిన శాంతి (డిపుల్) ప్రేమలో పడతారు. బాబు అనాథ అయితే శాంతి పేరుపొందిన గూండా గుడుంబా సత్తి (రాజన్ పి. దేవ్) కూతురు. ఆ ఇద్దరికీ సిద్ధు, మధు సాయపడుతుంటారు. ఆ రకంగా ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితమవుతారు. ఓసారి చదువుకుంటున్న మధు వద్దకు వచ్చి పలకరిస్తాడు సిద్ధు. 'డోంట్ డిస్టర్బ్. చదువుకుంటున్నా' అంటుంది మధు. కొద్ది దూరంలో కూర్చుని సిద్ధు ఆమె వంక చూస్తే గాలికి పైట తొలగి అనాచ్చాదితమైన ఆమె నడుము, నాభి.. చూపు తిప్పుకోలేకపోతాడు. మధు తనవైపు చూడగానే తల తిప్పుకుంటాడు. ఇలా మూడు నాలుగుసార్లు జరగడంతో సిద్ధు ఏం చూస్తున్నాడో అర్థమై అతడితో గొడవపెట్టుకుంటుంది మధు. 'నువ్వు నా నడుం చూశావు' అని మధు అంటే 'లేదు' అంటాడు సిద్ధు. ఇద్దరి మధ్యా వాదన జరుగుతుంది. "అసలిలాంటి అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చెయ్యను. ఒకవేళ చేసినా అది లవ్‌దాకా రాదు. వచ్చినా అది మ్యారేజ్ దాకా వెళ్లదు. ఖర్మకాలి నన్ను బలవంతంగా పెళ్లికి దింపినా కానీ, ఇలాంటమ్మాయి వొద్దని లెటర్‌రాసి పారిపోతా" అనికూడా అంటాడు. దాంతో ఏడుస్తూ "సిద్ధు అనేవాణ్ణి లైఫ్‌లో కలవలేదనే అనుకుంటా. నథింగ్ బిట్వీన్ యు అండ్ మి" అంటా వెళ్లిపోతుంది మధు. 
బాబు, శాంతికి సిద్ధు సాయపడుతుండటంతో అతడిమీద సత్తి మనుషులు ఎటాక్ చేస్తారు. ఒకడు సిద్ధుని కత్తితో పొడవబోవడం చూసిన మధు ఆ కత్తిని చేతితో గట్టిగా పట్టుకుని గాయపడుతుంది. ఆమెని హాస్పిటల్లో చేరుస్తాడు సిద్ధు. ఇద్దరూ మళ్లీ దగ్గరవుతున్నట్లే వుంటారు కానీ ఇగోలు తగ్గవు. శాంతికి పెళ్లి నిశ్చయం చేస్తాడు సత్తి. దాంతో శాంతి, బాబుకు గుళ్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు సిద్ధు. సత్తి, అతని అనుచరులు అక్కడికి వస్తుంటే మధ్యలో అటకాయించి, వాళకి తన కత్తి పదును రుచి చూపిస్తాడు. స్నేహితులమైన మేమే వాళ్ల పెళ్లికి సాయపడుతుంటే, తండ్రివైన నీవెందుకు వాళ్ల పెళ్లిని అడ్డుకుంటున్నావని అడుగుతాడు సత్తిని. అతని మంచి మాటలతో రియలైజ్ అయిన సత్తి మంచివాడిగా మారిపోయి, వధూవరుల మీద అక్షింతలు చల్లుతాడు. ఎవరిదారిన వాళ్లు ఆనందంగా వెళ్లిపోతారు. చదువులు అయిపోతాయి. విడిపోవాల్సిన సమయం వచ్చేసింది. సూట్‌కేసులు సర్దుకుంటుంటే మధు, సిద్ధు హృదయాలు ఆవేదనాభరితం అవుతాయి. ఒకరి మనసులోని భావం మరొకరికి చెప్పుకోవాలనుకుంటారు. కుదరదు. సిద్ధు ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌కి వెళ్తున్నాడని మధుకీ, మధు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లబోతున్నదని సిద్ధుకీ తెలుస్తుంది. స్టేషన్‌లో మధు కోసం గౌతమిలో సిద్ధు, అతని కోసం ఫలక్‌నామాలో మధు వెతుకుతారు. కనిపించకపోయేసరికి మధుకివ్వమని సిద్ధు, సిద్ధుకివ్వమని మధు పక్క సీట్లలో ఉన్నవారికి ఓ లెటర్ ఇచ్చి వాళ్లు వచ్చాక ఇవ్వమంటారు. రైలుబళ్లు కదులుతాయి. ఉత్తరాలు అందుతాయి. 'ఐ లవ్ యు మధు' అని సిద్ధు, 'ఐ లవ్ యు సిద్ధు' అని మధు రాసుకుంటారు. 'నన్ను ప్రేమించడానికీ, నాతో గొడవపడ్డానికీ నువ్వు కావాలి సిద్ధూ' అని కూడా రాస్తుంది మధు.

తెలుగు 'ఖుషి' మరింత సృజనాత్మకం
-పవన్‌కల్యాణ్
రీమేక్ అంటే రీమేకే. కథ విషయానికి వస్తే 'ఖుషి' ఒరిజినల్ కాకపోవచ్చు. కానీ చాలా సన్నివేశాల్లో, ఫ్రేముల్లో ఒరిజినాలిటీ ఉంది. పాటలు, ఫైట్లు కొత్తగా డిజైన్ చేశాం. రెండు భాషల్లోనూ 'ఖుషి' చూస్తే ఆ సంగతి మీకు అర్థమవుతుంది. అంటే తమిళ మాతృకని మేం మక్కీకి మక్కీ కాపీ చేయలేదు. సృజనాత్మకత పరంగా చూస్తే చిత్రంలో చాలా కొత్త ఐడియాలు ప్రవేశపెట్టాం. మాతృక కంటే తెలుగు వెర్షన్ మరింత సృజనాత్మకంగా, మరింత వైవిధ్యంగా ఉంటుందనే సంగతి తెలుస్తుంది.
దర్శకుడు సూర్యలో ఏదైనా కొత్తగా చేయాలనే తపన అధికం. నేనూ అలాంటి నావెల్టీనే కోరుకుంటా కాబట్టి మామధ్య మంచి అండర్‌స్టాండింగ్ కుదిరింది. అందువల్లే ఫైట్స్‌నీ, కొన్ని పాటల్నీ నేను డిజైన్ చేశా. కొన్ని సన్నివేశాల్నీ సమన్వయంతో చేసుకుపోయాం. ఈ సినిమాకి రత్నం నిర్మాత కావడం పెద్ద ప్లస్ పాయింట్. దేనికీ ఆయన 'నో' చెప్పలేదు. 

(వచ్చేవారం 'ఖుషి' ఘనవిజయానికి దోహదం చేసిన అంశాలు)