Saturday, February 12, 2011

హిట్.. హిట్.. హుర్రే..!: ఖుషి-2

శ్రద్ధగా చదువుకుంటోన్న మధు వద్దకొచ్చి పలకరించాడు సిద్ధు. 'డోంట్ డిస్టర్బ్. చదువుకుంటున్నా' అంది మధు. సరేనంటూ అవతలకి వెళ్లి కూర్చుని, తానూ పుస్తకం తెరిచాడు సిద్ధు. చూపు పుస్తకం మీద నిలవనంటోంది. ఆమె వంక చూశాడు. అప్పుడే గాలికి పైట తొలగి తెల్లని, అందమైన మధు నడుము, పొట్ట మధ్యలో చిన్న నాభి కనిపించాయి. అసలే నల్లని చీర కావడంతో ఆచ్ఛాదన లేని ఆమె నడుము భాగం మరింత తెల్లగా కనిపించింది. చూపు తిప్పుకోలేకపోయాడు. ఎందుకో అతడివంక చూసింది మధు. చప్పున తల తిప్పేసుకున్నాడు. ఆమె మళ్లీ పుస్తకం వేపు దృష్టి పెట్టింది. గాలి వీస్తూనే ఉంది. మధు నడుము అనాచ్ఛాదితంగా కనిపిస్తూనే ఉంది. అతడి చూపులు అటువేపు పోతూనే వున్నాయి. అతడి గొంతు తడారిపోతోంది. గుటకలు మింగుతున్నాడు. నాలుగైదు సార్లు అతడి చూపులు గమనించాక, అప్పుడు అర్థమైంది, అతడు ఎక్కడ, ఏం చూస్తున్నాడో.
"సిద్ధు.. ఇదేం బాలేదు" కోపంగా అంది.
"ఏంటీ?" అడిగాడు సిద్ధు ఏం ఎరగనట్లు.
"నువ్వు చేసే పని"
"నేనేం చేశాను?"
"నీ చూపు గురించి మాట్లాడుతున్నా"
"నేనేం చూశాను?"
"నువ్వు నా నడుం చూశావు"
"లేదు"
"నువ్వు చూశావు. నువ్వు చూసింది నేను చూశాను"
"లేదు. చూడలేదు"
"చూశావు. పదిసార్లన్నా చూసుంటావు"
ఇద్దరూ గొడవపడ్డారు. ప్రతిసారీ తనని అపార్థం చేసుకుంటున్నావని అనాడు సిద్ధు. 'పెద్ద అందగత్తెవని పెద్ద ఫీలింగ్' అని కూడా అన్నాడు. బలవంతాన కోపం అణచుకుంటూ, పళ్లు బిగించి "నువ్వు నడుం చూశావా లేదా?" అని మళ్లీ గటిగా అడిగింది మధు. దానికి సమాధానం చెప్పకుండా "నువ్వు నన్ను లవ్ చేశావా, లేదా?" అడిగాడు సిద్ధు. "లేదు" అంది మధు. "నేనూ నీ నడుం చూడలేదు" అని జవాబిచ్చాడు సిద్ధు. మళ్లీ పోట్లాట. "అసలిలాంటి అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేయను. ఒకవేళ చేసినా అది లవ్ దాకా రాదు. వచ్చినా మ్యారేజ్ దాకా వెళ్లదు. ఖర్మకాలి నన్ను బలవంతంగా పెళ్లికి దింపినా కానీ, 'ఇలాంటమ్మాయి వొద్దు' అని లెటర్ రాసి పారిపోతా" అన్నాడు సిద్ధు. దాంతో ఏడుస్తూ "సిద్ధు అనేవాణ్ణి లైఫ్‌లో కలవలేదనే అనుకుంటా. మనమధ్య ఏమీ లేదు. నథింగ్ బిట్వీన్ యు అండ్ మి" అని అక్కణ్ణించి విసవిసా వెళ్లిపోయింది మధు.
'ఇగో' (అహం) అనేది ఇద్దరు యువతీ యువకుల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుందనే దానికి చక్కని ఉదాహరణ ఈ సన్నివేశం. 'ఖుషి' చిత్రం మొత్తానికీ కీలకమైన సన్నివేశం ఇది. మిగతా సినిమా అంతా ఆధారపడింది ఈ సన్నివేశం మీదే. ఈ సన్నివేశం వల్లే మధు, సిద్ధు ఎడమొహం పెడమొహం అయ్యారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ ఎలా ఒకటయ్యారనేదే మిగతా కథ.
ఈ సన్నివేశాన్ని రాసిన తీరూ, తెరమీద దాన్ని చిత్రీకరించిన తీరూ ఉన్నత స్థాయికి చెందుతాయి. అప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో నాయికా నాయకుల మధ్య గొడవలకు ఇతరేతర గొడవలెన్నో కారణంగా కనిపిస్తూ వచ్చాయి. హీరోయిన్ 'బెత్తెడంత నడుము'ని హీరో చూసినందువల్ల గొడవ వచ్చి, వాళ్లు దూరమవడమనేది కొత్త. లాజికల్‌గా చూస్తే, హీరో మీద ప్రేమవున్న (నోరుతెరచి చెప్పకపోయినా) నాయిక తన నడుముని నాయకుడు చూశాడని కోప్పడి, అతడికి దూరమవ్వాలనుకోవడం హాస్యాస్పదం అనిపిస్తుంది. అయితే అలాంటి భావన సగటు ప్రేక్షకుడికి కలగకపోవడమే ఈ సినిమా సాధించిన విజయం. అందుకు దోహదం చేసినవి బిగువైన స్క్రీన్‌ప్లే, ఉలాసభరితమైన సన్నివేశాల కల్పన. ఆ ఘనత స్క్రీన్‌ప్లేనీ సమకూర్చిన దర్శకుడు ఎస్.జె. సూర్యదే. అంతేకాదు, ఆ సన్నివేశం ఏమాత్రం అసభ్యకరంగా లేకుండా 'క్యూట్'గా రావడానికి కారణం, పి.సి. శ్రీరాం ఛాయాగ్రహణ ప్రతిభ. ఆ సన్నివేశంతో పాటు ఆద్యంతం తన కెమెరా పనితనంతో చిత్రాన్ని 'విజువల్ ఫీస్ట్'గా తయారుచేశాడు శ్రీరాం. ఆయా సన్నివేశాల్లో సందర్భానుసారం చక్కగా అమరిన సంభాషణలనీ తక్కువ చేయలేం. రాజేంద్రకుమార్ రాసిన సంభాషణలు కథనంలో కావలసినంత 'టెంపో'ని తీసుకొచ్చాయి.
ఇక సిద్ధు, మధు మధ్య దూరం మరింత పెరిగే సన్నివేశంలో పవన్ కల్యాణ్ నోటివెంట పలికే డైలాగుల్ని ప్రేక్షకులు ఎంతగా అస్వాదించారో! గుడుంబా ప్యాకెట్ల కోసం మోషే (అలీ) బయటకు వెళితే అప్పటికే గుడుంబా మత్తులో ఉన్న సిద్ధు గోడమీది బొమ్మలో మధుని చూస్తూ "ఏంటి చూస్తున్నావ్ చెప్పు. నాకు చెప్పాల్సిందే. బాగా.. పెద్ద పెద్ద రెండు గుడ్లగూబల్లాంటి కళ్లు పెట్టుకుని ఎందుకలా చూస్తున్నావో చెప్పవే. (నడుము సైజు చేతితో కొలుస్తూ) బెత్తెడంత చోటు లేదు. దీన్ని మేం చూశామంట. నువ్వు పెద్ద అందగత్తెవి. పిడతంత ముఖం, చుంచులాంటి ముక్కు, గండుచీమ కుట్టి వాచినట్లుండే చిన్ని పెదిం. ఆ.. ఏదో.. చూడాలనిపించే చిన్ని నడుం. నల్ల చీర కట్టుకుని ఒళ్లంతా కప్పుకుని కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు రంగులో.. ఓ.. నిమ్మపండు పసుపురంగులో ఉంటుంది కదూ. ఓ.. ఎరుపు, పసుపు మిక్సయిపోయి చిన్ని రొమాంటిక్ కలర్లో.. చిన్ని ఏరియా కనిపించినప్పుడు కళ్లు ఆటోమేటిగ్గా చూస్తాయి. అది దాని ('అవి వాటి' అని వుండాలి) నైజం. అది నువ్వు చూపించకుండా వుండాల్సింది. ముఖం నీ వొంట్లో భాగమే. నడుం నీ వొంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు. నడుం చూస్తే కోపం వచ్చింది. ఎందుకు? ఎందుకని నేను ప్రశ్నిస్తున్నానంతే. ఇప్పుడు నీ నడుమే కాదు. నీ ఫుల్ బాడీ చూస్తాను. అసలు నువ్వు నా పక్కన నిల్చునే అర్హత కోల్పోయావ్' అని మధు బొమ్మని చింపేస్తాడు. దాన్ని మధు చూసి కోపంతో వెళ్తున్నప్పుడే మెళ్లో గుడుంబా పాకెట్ల దండ వేసుకుని ఎదురు వస్తుంటాడు మోషే.
"ఓరి బాబూ మోషయ్యో. కుత్తే. నా బతుకును బుగ్గిపాలు చేశావు కదరా నీయయ్య. నా ప్రేమను బుగ్గిపాలు చేశావు కదరా.. రాయ్యా రారా.. ఈ సచ్చినోడు కలకత్తా నుంచి నా ప్రేమను పాడు చేయడానికొచ్చాడు సచ్చినోడు.. నీ జిమ్మడిపోను.." అంటూ బాధపడతాడు సిద్ధు. ఈ సన్నివేశాన్నీ, సిద్ధు పాత్ర పలికే డైలాగుల్నీ, ఆ డైలాగుల్ని కృష్ణా జిల్లా యాసలో పవన్ కల్యాణ్ చెప్పే తీరునీ ఆస్వాదించని వాళ్లెవరు? ప్రేక్షకుల్ని బాగా అలరించిన సన్నివేశాల్లో ఇది ముఖ్యమైన సన్నివేశం. కథ అత్యధిక భాగం సిద్ధు, మధు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రల్లో పవన్ కల్యాణ్, భూమిక అలవోకగా ఇమిడిపోయారు. నిజమైన ప్రేమికులే గొడవ పడుతున్నంత సహజంగా పాత్ర పోషణ చేశారు ఆ ఇద్దరూ. కల్యాణ్‌కి సిద్ధు పాత్రలాగా అంత బాగా అమరిన పాత్ర 'ఖుషి'కి ముందు కానీ, తర్వాత కానీ మరొకటి లేదు. మధు పాత్రలో భూమిక కూడా అంతే. అందుకే 'క్యూట్ పెయిర్' అనిపించుకుంది ఆ జంట.
ఇక సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన మరో అంశం సంగీతం. మణిశర్మ బాణీలు అందించిన ఆరు పాటలూ ఇప్పటికీ ప్రేక్షకుల పెదాలపై ఆడుతూనే ఉన్నాయి. 'యే మేరా జహా యే మేరా ఘర్ మేరా ఆషియా', 'ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా', 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా', 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే', 'చెలియ చెలియా చిరుకోపమా', 'గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో' పాటలు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్. వీటిలో పింగళి పాట 'ఆడువారి మాటలకు అర్థాలే'తో పాటు తొలి రెండు పాటల కాన్సెప్టు కల్యాణ్‌దే. ఇక సన్నివేశాలకి ఇచ్చిన నేపథ్య సంగీతాన్నీ ప్రశంసించకుండా ఉండలేం. హీరో హీరోయిన్లతో పాటు మిగతా నటుల హావభావాలతో సైతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కచ్చితంగా సింక్ అవడం ముచ్చటగా అనిపిస్తుంది. ఇన్ని అంశాలు పక్కాగా కుదిరినందునే కుర్రకారుని అంతగా ఆకట్టుకుంది 'ఖుషి'. చివరకు ముసలాళ్లు కూడా ఈ సినిమా చూస్తూ తమ కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోయి, కుర్రాళ్ల మాదిరిగా ఆస్వాదించారన్నది నిజం.

అది అద్భుతమైన సీన్
-రాజేంద్రకుమార్
తమిళంలో ఈ సినిమా చేసేప్పుడే నన్ను పిలిపించారు. సెట్స్ మీదే సూర్య నాతో చర్చించేవారు. సంభాషణల్లో తెలుగుదనం ఉట్టిపడాలని చెప్పేవారు. తెలుగు నుడికారంతో మాటలు రాయగలిగా. క్లుప్తమైన సంభాషణలు బాగా వర్కవుట్ అయ్యాయి. కథనాన్ని సూర్య అద్భుతంగా నడిపారు. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌కి కూడా ప్రాధాన్యతనివ్వడం చిత్రానికి జీవాన్ని తెచ్చింది. దానికి కాంప్రమైజ్ కాని నిర్మాణం తోడైంది.
'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి' చేసిన పవన్ కల్యాణ్‌కి యూత్‌లో గొప్ప ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ 'ఖుషి'కి బాగా హెల్పయ్యింది. ఫైట్స్, సాంగ్స్ అతనే కంపోజ్ చేశాడు. ఒరిజినల్ తమిళ సినిమాలో కోల్‌కతా ఎపిసోడ్ లేదు. తెలుగులో దాన్ని తెచ్చింది కల్యాణ్. గుళ్లో దీపం ఆరిపోతుంటే హీరో హీరోయిన్లు ఒకేసారి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం అద్భుతమైన సీన్. అలాగే భూమిక నడుముని కల్యాణ్ చూసే సన్నివేశం ఎలాంటి అసభ్యతకి తావులేకుండా సున్నితంగా తీయడం గొప్ప విషయం. ఇలాంటి స్క్రిప్టు అంతదాకా రాలేదు. రీ-రికార్డింగ్ కూడా అద్భుతం. చివరలో ట్రైన్‌లో వెళ్లేప్పుడు రాజ్‌కపూర్ 'మేరా నాం జోకర్'లోని మ్యూజికల్ బిట్‌ని ఉపయోగించారు. అది బాగా కుదిరింది.
రైటర్‌గా నేను చెప్పుకోదగ్గ సినిమా. ఈ సినిమాకి భాగస్వామిని కావడం నా అదృష్టం.

నా పాట గ్రాండ్ హిట్
-సుద్దాల అశోక్‌తేజ
ఓ పాట కోసం నిర్మాత రత్నం చెన్నైకి పిలిపించారు. అక్కడే దర్శకుడు సూర్యనీ కలిశా. సందర్భం చెప్పి పాట ఎరోటిగ్గా ఉండాలన్నారు సూర్య. ఓ పాట రాసిచ్చి వచ్చేశా. దాన్ని హీరో పవన్ కల్యాణ్ విని, మళ్లీ చెన్నై పిలిపించారు. బాగుందని చెబుతూనే 'మొదలు నుంచి చివరి దాకా అమ్మాయి శరీరాన్ని ఎక్కడా మీ 'నిబ్' టచ్ చేయకుండా పాట రాయగలరా? ఆ ఊపు, కవ్వింపు మాత్రం తప్పనిసరిగా ఉండాలి' అన్నారు. దాంతో పాటు ఏదైనా హిట్ సాంగ్ తీసుకుని దాన్ని అనుసరించి రాయమన్నారు. అప్పుడు మళ్లీ రాశా. 'హోలి.. హోలిలో రంగ హోలీ.. చమకేళిల హోలీ' అనే జానపద పాట పల్లవిని తీసుకుని 'ఏకవీర', 'రోషనార' వంటి పదాలు మధ్యమధ్యలో ఉపయోగిస్తూ 'గజ్జె ఘల్లుమన్నాదిరో.. గుండె ఝల్లుమన్నాదిరో' అంటూ రాశా. గ్రాండ్ హిట్. దాని చిత్రీకరణ కూడా అంత బాగానూ వచ్చింది. కల్యాణ్ సినిమాకి నేను రాసిన తొలిపాట ఇదే. ఇప్పటి దాకా మళ్లీ రాయలేదు.
(వచ్చేవారం 'నువ్వు నాకు నచ్చావ్' విశేషాలు) 

No comments: