Tuesday, February 8, 2011

కథ: మిలట్రీ నరసింహులు

చూరు తగలకుండా కిందికి వొంగి గుడిసెలోంచి బయటకు వొచ్చాడు నున్నా నరసింహులు. తలకి రెండు రెట్లు పెద్దదిగా ఉన్న పెద్ద తలపాగా, వెండి దారప్పోగుల్లా మెరుస్తున్న తెల్లటి బుర్ర మీసాలు, ఆ మీసాల కింద గుప్పున పొగ వొదులుతూ పొడవాటి చుట్ట. వొంటిమీద మరకలతో దుమ్ముకొట్టుకుని ఖాకీ చొక్కా, ఆ చొక్కా కింద మురికిమురిగ్గా పాతబడిపోయిన తెల్ల పంచె, కుడి భుజాన అతుకులు వేసిన పురాతన కాలంనాటి నూలు సంచి, ఎడమ చేతిలో కర్ర.. ఇదీ నరసింహులు వేషం.
"వొచ్చేప్పుడు మర్సిపోకుండా బిళ్లలు తేయ్యా" అని లోపల్నించి బలహీనమైన గొంతు వినిపించింది. అది అతడి భార్య యానాదమ్మది. ఆయాసం, దగ్గుతో బాధపడుతూ తెగిపోతున్న నులక మంచం మీద పడుకుని వుంది. ఆమె నడవలేదు కూడా.
"తెత్తాలెయ్యే" అంటా బాట మీదికొచ్చాడు నరసింహులు. ఆ బాట అవతల నేల కనిపించడంలేదు. ఎటు చూసినా విరగ్గాసిన మొక్కజొన్న కంకులే. అప్పుడే ఒక ఎడ్లబండి ఆ చేల మధ్యలోంచి బాట మీదికొచ్చింది. ఆ బండినిండా పొత్తులు. బండెనక నలుగురు పిల్లకాయలు కూర్చుని చేతుల్లో వున్న మొక్కజొన్న పొత్తుల మీది మట్టల్ని వొలుస్తా కబుర్లాడతా వున్నారు. మధ్యమధ్యలో పెద్దపెద్దగా నవ్వుతున్నారు.
ఎడ్లబండి నరసింహుల్ని దాటింది. అతన్ని చూడంగాల్నే "ఇగో మీసాల్తాతా. నీ టోపీ ఇత్తావా. ఇదిత్తా" అని ఓ పిల్లాడు ఎకసెక్కం చేశాడు చేతిలోని పొత్తుని వూపుతా. మిగతా పిల్లకాయలు బిగ్గరగా నవ్వారు.
నరసింహులు చేయి టక్కున తలపాగా మీదికెళ్లింది. గట్టిగా దాన్ని అదిమి పట్టుకున్నాడు.
"పోండిరా భడవల్లారా. ఈ మూసలాణ్ణి చూత్తంటే ఎగతాళిగా ఉంటంది మీకు. మిలట్రీలో పనిచేసినోణ్ణిరా. నాతో పెట్టుకోకండ్రోయ్" అన్నాడు కర్రని వాళ్లకేసి ఊపుతా.
"అబ్బో మిలట్రీ తాత మనల్ని కొట్టేట్టున్నాడ్రోయ్. పారిపోదాం పదండి" అని ఇంకో పిల్లకాయ్ అనేసరికి, మిగతావాళ్లు మళ్లా పెద్దగా నవ్వారు.
"రేయ్ ఆపండ్రా పరాచికాలు. ఆ ముసలోడితో మీకెందుకు" అని కసురుకున్నాడు బండి తోలుతున్నతను. దాంతో పిల్లకాయల నోళ్లు మూతపడ్డాయి.
ఎద్దుల గిట్టల బలానికి లేచిన దుమ్ము ఎడమ కంట్లో పడింది. కన్ను నులుముకున్నాడు నున్నా నరసింహులు. అతడి కుడి కన్ను దాదాపుగా పాడైపోయింది. ఎప్పుడూ పుసులు కారుతూ ఉంటుంది. ఆ కంట్లో ఏం పడినా అతడికి తెలీదు.
నడుస్తున్నాడు నరసింహులు. పందిళ్లపల్లిలో ఊరి చివర గుడిసెలో ఇరవై ఏళ్లుగా ఉంటున్నాడు. అయినా అయినవాళ్లెవరూ అతని దగ్గిర లేరు. ఒక్క రాజేంద్ర మాత్రమే నరసింహులుతో దయగా మాట్లాడుతుంటాడు. అతను రైసుమిల్లు ఓనరు పట్టాభి కొడుకు. సాయంత్రం పూట నరసింహులు గుడిసె మీదుగా తమ పొలానికి వెళ్తుంటాడు రాజేంద్ర. ఆ రోజు నరసింహులుకి అతను కనిపించలేదు.
ఊళ్లోకి వచ్చాడు. కాస్త దర్జాగా కనిపించినోళ్లనల్లా "ఒక్క పావలా ధర్మం చెయ్యండి బాబయ్యా" అని అడుక్కోవడం మొదలుపెట్టాడు భుజానికి తగిలించుకున్న సంచిని తెరిచిపెట్టి. కొంతమంది పావలో, అర్థరూపాయో వేస్తుంటే, కొంతమంది చీదరించుకుని అవతలకి పోతున్నారు. ఇంకొంతమంది "చిల్లర లేదు పో.. పో.." అని చీత్కరిస్తున్నారు. అప్పుడు నరసింహులు పెద్ద గొంతుతో ఎవరినో ఉద్దేశించి తిడుతూ "బాంచెత్. మీవొల్లనే కదంట్రా నాకిట్లాంటి గతి పట్టింది. మీరు పురుగులుపట్టి పోతారా దొంగనాయాళ్లార్రా.." అంటూ ఏడ్పు మొదలుపెట్టాడు.
"నాకేం తెల్వదు.. నాకేం పాపం తెలీదు. అయినా గానీ నామీద నింద మోపారు కదర్రా" అన్నాడు ఏడుస్తూనే. కొత్తవాళ్లు నరసింహులు మాటలు విని, అవి అర్థమయ్యీ అవక, అతను తమని ఉద్దేశించి ఆ మాటలంటున్నాడా అని సందేహపడ్తున్నారు. నరసింహులు గురించి ఏ కాస్తో తెలిసినోళ్లు "ఆ ముసలాడంతే. అడుక్కుంటూ ఎవర్నో తిడుతుంటాడు. ఒకప్పుడు మిలట్రీలో పనిచేశాడంట. పాపం ఇప్పుడు అడుక్కుంటున్నాడు గతిలేక" అని పక్కవాళ్లకి చెబుతున్నారు.
* * *
నున్నా నరసింహులు ఒకప్పుడు ఓ మోస్తరుగానే బతికాడు. మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ కింద ఆర్మీలో పనిచేశాడు. 1952లో సైన్యంలో డ్రైవరుగా చేరిన అతను బర్మా, ఇటలీ, నేపాల్, ఇరాన్ వంటి దేశాలు తిరిగాడు ఉద్యోగంలో భాగంగా. పదిహేడు సంవత్సరాల తర్వాత 1969లో రిటైరయ్యాడు. అతని కుడికన్ను దెబ్బతినడమే అందుకు కారణం. ఆ తర్వాత జీవన భృతి కోసం అతను డ్రైవరుగా, వాచ్‌మన్‌గా ఉద్యోగాలు చేశాడు.
ఆర్మీనుంచి వొచ్చాక నెలకు 350 రూపాయలు పెన్షను కింద వొచ్చేవి. దీంతో నరసింహులు జీవితం సాఫీగానే నడిచేది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపేశాడు. ఇక ఇంట్లో ఉండేది అతనూ, భార్య యానాదమ్మే.
బుర్ర మీసాలు, దెబ్బతిన్న కంటితో నరసింహులు చూడ్డానికి కాస్త భీకరంగా అవుపించినా, మనిషి వెన్నలాంటివాడు.
సైన్యంలో పనిచేసినా అతని మాటల్లో, చేతల్లో కరకుదనం కనిపించదు. అందుకే చిన్నపిల్లలకి అతడు 'మీసాల తాతయ్య' అయిపోయాడు. మంచి మంచి కథలు చెబుతుంటాడు కాబట్టి 'కథల తాతయ్య'గానూ చేరువయ్యాడు. అదే అతనికి తర్వాత కాలంలో చేటు తీసుకొచ్చింది.
*  *  *
పర్చూరులో ఒక పెద్ద ఆసామి ఇంట్లో డ్రైవరుగా పనిచేస్తున్నాడు అప్పట్లో. ఆ ఇంట్లో చాలామంది మనుషులు. వాళ్లకి చాలామంది పిల్లలు. వీలు దొరికినప్పుడల్లా ఆ పిల్లలకి కథలు చెబుతున్నాడు నరసింహులు. వాటిలో పౌరాణికాలు, జానపదాలు ఎక్కువ. మళ్లీ వాటిలో వీరరసం ఎక్కువ. సహజంగానే ఆ కథలు పిల్లల్ని బాగా ఆకట్టుకునేవి. అలరించేవి. కథ చెప్పేప్పుడు ఎవరన్నా నరసింహులుని పిలిచి, పనిచెబితే ఆ పిల్లలు తెగ బాధపడేవాళ్లు.
'తాతయ్య కథ చెబుతున్నాడు. కాసేపు ఆగమ'ని పెద్దల్ని బతిమిలాడేవాళ్లు. దాంతో "ఇదిగో నరసింహులూ, ఈ కథలూ, కాకరకాయలూ అంటా పిల్లల్ని చెడగొట్టమాక" అని విసుక్కునేవోళ్లు పెద్దలు. నరసింహులు నవ్వి ఊరుకునేవోడు. "మళ్లీ వొచ్చాక చెబుతాలే" అని పిల్లల్ని ఊరడించి, కారు తియ్యడానికి వెళ్లేవోడు. అట్లా అతడి కథలకి ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు. సెలవు వొచ్చిందంటే కథల తాతయ్య కోసం వెతుక్కునేవోళ్లు. కథ చెప్పడంలో అంత మహత్తుంది నరసింహుల్లో. పిల్లలే కాదు, అతడు కథ చెబుతుంటే విన్నారా పెద్దలు, వాళ్లు కూడా కథ అయిపోయేదాకా అట్లా వింటూ వుండి పోవాల్సిందే.
అప్పుడు జరిగింది ఆ విషాదకర సంఘటన. ఆ రోజు సెలవు కావడంతో తమ మామిడి తోటల్ని చూడాలని పిల్లలు గొడవ గొడవ చేశారు. దాంతో ఆ పిల్లల్ని తీసుకెళ్లే బాధ్యత నరసింహులు మీద పడింది. మధ్యలో ఆకలైతే తినడం కోసం మినమ్ముద్దలు, కజ్జికాయలు ఒక టిపినులో పెట్టిచ్చారు ఆ ఇంటి ఆడోళ్లు. ఎనిమిది మంది పిల్లల్ని తీసుకుని రెండు మైళ్ల దూరంలో జాగర్లమూడి దగ్గరున్న మామిడి తోటకి వెళ్లాడు నరసింహులు.
(ఇంకావుంది) 

No comments: