Showing posts with label country. Show all posts
Showing posts with label country. Show all posts

Saturday, March 19, 2016

Poetry: Nippu Kanam (Fire Cell)

నిప్పుకణం

నీది ఆత్మహత్య అయినా
రాజ్యం చేసిన హత్య అయినా
నీది సాదాసీదా మరణం కాదు
దేశం దేశాన్నే జ్వలింపజేసిన 
నిప్పుకణిక నీ మరణం

మొదట్లో నేనూ అనుకున్నాను
యుద్ధం మధ్యలో వెన్నుచూపిన భీరువువని
చావు తప్ప పరిష్కారం లేదనుకున్న పిరికివాడివని
ఇప్పుడు కళ్లకు కడుతోంది వీరుడా
యుద్ధం మధ్యలో ఆత్మాహుతి అంటే ఏమిటో
ప్రత్యర్థి వెన్నులో చలి పుట్టించడమంటే ఏమిటో

పుట్టుక నుంచే పెరిగిన ఇంటినుంచే
వివక్షను ఎదుర్కొన్నవాడివి
విశ్వవిద్యాలయంలో వివక్ష
నీకు పెద్దలెక్కలోనిది కాదు
అయినా నీ ఊపిరి నువ్వే తీసుకున్నావంటే
అన్యాయపు వేర్లు ఎక్కడిదాకా విస్తరించాయో
తెలిసొచ్చి నిర్లిప్తుడవై నిస్పృహుడవయ్యావేమో
కట్టలుగా పుట్టలుగా అడ్డుపడుతున్న
అవరోధాల్ని ఈడ్చిపారేయలేనని అనుకున్నావేమో

నువ్వు లేకపోయినా 
నీ మరణం ఎట్లాంటి జ్వాలను రేపిందో చూడు
ఎన్ని ప్రశ్నల్ని లేవనెత్తిందో చూడు
విద్యాలయాల్లో విద్యకు బదులు మితిమీరుతున్న 
రాజకీయాల జాడలు దిగ్భ్రాంతిపరుస్తున్నాయి
దుర్మార్గ దోపిడీ శక్తులు దట్టంగా అల్లుతున్న 
కులసూత్రాలు సాలెపురుగులా చంపుకుతింటున్నాయి 
చదువు కోసం వెళ్లిన కొడుకులు
క్షేమంగా ఇంటికొస్తాడో లేదోనని
అమ్మలు ఆందోళనపడుతున్నారు

నువ్వు అర్ధంతరంగా లోకాన్ని వదిలేశావు
పడమటి సూర్యుడిలా మాయమయ్యావు
నీకు తెలీదు.. నువ్విప్పుడు ఎంతమంది గుండెల్లో చిరంజీవివో
ఎంతమందిని ధీరులుగా మార్చేస్తున్నావో
నీకు తెలీదు.. నువ్వు గోడలో పాతుకొన్న రావిమొక్కవు
ఎన్నిసార్లు తుంచినా తిరిగి చిగురిస్తావు
నువ్విప్పుడు ఓటమిని ఒప్పుకున్న పరాజితుడివి కాదు
సహచరులకు యుద్ధాన్ని కొనసాగించే తెగింపునిచ్చిన విజేతవు

- 'స్వాప్నికుడి మరణం' పుస్తకం నుంచి

Friday, January 1, 2016

Society: We and Our Responisibility

మనం - మన బాధ్యత

ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వాన్ని ప్రజలే నిర్మించుకుంటారు. మాతృదేశాన్ని సంరక్షించుకుంటూ ప్రపంచంలో తమ దేశానికి మహోన్నతమైన స్థానాన్ని సంపాదించి పెట్టేందుకు కృషి చేస్తారు. ఇదే ప్రజల బాధ్యత. కానీ మనదేశంలో ప్రజలు చాలావరకు తమ బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. లంచగొండితనం, బంధుప్రీతి, స్వకుల పక్షపాతం, పార్టీ నియంతృత్వం విస్తృతమైపోతున్నది. లంచాలిస్తున్న వాళ్లెవరు? ఓట్లకు నోట్లు తీసుకుంటున్న వాళ్లెవరు? నాయకుల్ని ఎన్నుకుంటున్న వాళ్లెవరు? ప్రజలే!
అసమర్థులైన నాయకుల్ని ఎన్నుకోకుండా నీతీ నిజాయితీ కలిగినవాళ్లను ఎన్నుకుంటే మేలు జరక్కపోయినా వ్యవస్థకు ప్రమాదమైతే ఉండదు. నోట్లు తీసుకొని ఓట్లు వేసే జనం, లంచాలిచ్చి పనులు చేయించుకునే పెద్ద మనుషులు, లంచాలు తీసుకోవడమే వృత్తిగా పెట్టుకొని, నాయకులకు నీడలాగా తిరుగుతూ అయిన దానికీ, కాని దానికీ రాజకీయ ఏజెంట్లుగా బతుకుతున్న చెంచాలూ, ఈ చెంచాల అడుగులకు మడుగులొత్తే ఉప నాయకులూ ప్రజల్లోనే ఉన్నారు. కాబట్టే ప్రజలు కష్టాలకు గురవుతున్నారు. దేశమంతటా జరుగుతున్న అన్యాయాల్నీ, అక్రమాల్నీ, అరాచకాల్నీ, అత్యాచారాల్నీ, అవినీతినీ కళ్లారా చూస్తూ నిర్లక్ష్యంతో, నిర్లిప్తంతో ఉన్నవాళ్లూ ప్రజలే.
ప్రజల ప్రతిబింబమే ప్రభుత్వం. వాళ్లు సృష్టించుకున్నదే ప్రభుత్వం. కాబట్టి ప్రజలు తమ బాధ్యతల్ని గ్రహించుకొని ప్రవర్తించినప్పుడే నీతీ నిజాయితీ కలిగిన పార్టీలు ఏర్పడతాయి. అప్పుడే మహోన్నతమైన నాయకత్వం లభిస్తుంది. మహా శక్తిమంతమైన ప్రభుత్వం నెలకొంటుంది. దేశం బాగుపడుతుంది. ప్రజల్లో నైతిక శక్తి కొరవడితే ప్రజలెన్నుకొన్న పార్టీల్లో అవినీతి పెరిగిపోతుంది. అవినీతికి ఆశ్రయమిచ్చే పార్టీలు నెలకొల్పే ప్రభుత్వాలు అన్యాయాన్ని అవలంబిస్తాయి. దీనివల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుంది. దేశం అధోగతిలోకి వెళ్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తన బాధ్యతను గుర్తించి, తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.