మనం - మన బాధ్యత
ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వాన్ని ప్రజలే నిర్మించుకుంటారు. మాతృదేశాన్ని సంరక్షించుకుంటూ ప్రపంచంలో తమ దేశానికి మహోన్నతమైన స్థానాన్ని సంపాదించి పెట్టేందుకు కృషి చేస్తారు. ఇదే ప్రజల బాధ్యత. కానీ మనదేశంలో ప్రజలు చాలావరకు తమ బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. లంచగొండితనం, బంధుప్రీతి, స్వకుల పక్షపాతం, పార్టీ నియంతృత్వం విస్తృతమైపోతున్నది. లంచాలిస్తున్న వాళ్లెవరు? ఓట్లకు నోట్లు తీసుకుంటున్న వాళ్లెవరు? నాయకుల్ని ఎన్నుకుంటున్న వాళ్లెవరు? ప్రజలే!అసమర్థులైన నాయకుల్ని ఎన్నుకోకుండా నీతీ నిజాయితీ కలిగినవాళ్లను ఎన్నుకుంటే మేలు జరక్కపోయినా వ్యవస్థకు ప్రమాదమైతే ఉండదు. నోట్లు తీసుకొని ఓట్లు వేసే జనం, లంచాలిచ్చి పనులు చేయించుకునే పెద్ద మనుషులు, లంచాలు తీసుకోవడమే వృత్తిగా పెట్టుకొని, నాయకులకు నీడలాగా తిరుగుతూ అయిన దానికీ, కాని దానికీ రాజకీయ ఏజెంట్లుగా బతుకుతున్న చెంచాలూ, ఈ చెంచాల అడుగులకు మడుగులొత్తే ఉప నాయకులూ ప్రజల్లోనే ఉన్నారు. కాబట్టే ప్రజలు కష్టాలకు గురవుతున్నారు. దేశమంతటా జరుగుతున్న అన్యాయాల్నీ, అక్రమాల్నీ, అరాచకాల్నీ, అత్యాచారాల్నీ, అవినీతినీ కళ్లారా చూస్తూ నిర్లక్ష్యంతో, నిర్లిప్తంతో ఉన్నవాళ్లూ ప్రజలే.
ప్రజల ప్రతిబింబమే ప్రభుత్వం. వాళ్లు సృష్టించుకున్నదే ప్రభుత్వం. కాబట్టి ప్రజలు తమ బాధ్యతల్ని గ్రహించుకొని ప్రవర్తించినప్పుడే నీతీ నిజాయితీ కలిగిన పార్టీలు ఏర్పడతాయి. అప్పుడే మహోన్నతమైన నాయకత్వం లభిస్తుంది. మహా శక్తిమంతమైన ప్రభుత్వం నెలకొంటుంది. దేశం బాగుపడుతుంది. ప్రజల్లో నైతిక శక్తి కొరవడితే ప్రజలెన్నుకొన్న పార్టీల్లో అవినీతి పెరిగిపోతుంది. అవినీతికి ఆశ్రయమిచ్చే పార్టీలు నెలకొల్పే ప్రభుత్వాలు అన్యాయాన్ని అవలంబిస్తాయి. దీనివల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుంది. దేశం అధోగతిలోకి వెళ్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తన బాధ్యతను గుర్తించి, తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
No comments:
Post a Comment