'ప్రాణమిత్రులు' (1967) కథాంశం
చిన్నా, బాబు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, ఒక తల్లి పాలు తాగి పెరిగారు. ఆ ఇంట చిన్నా నౌకరే అయినా బాబే అతని సర్వస్వం. మూడు తరాలుగా నౌకా వ్యాపారం చేస్తున్న వాళ్ల ఎస్టేటును చూస్తూ బాబును ఎలాగైనా మోసం చెయ్యాలని కాచుకొని ఉంటాడు దివాను. ఈ వ్యవహారమంతా కనిపెడుతూ తెలివిగా తప్పిస్తాడు చిన్నా. అది సహించలేక బాబు, చిన్నా మీద దివాను విరుచుకుపడతాడు. దాంతో వెంటనే దివానును తొలగించి ఆ స్థానంలో చిన్నాను నియమించి, తన యావదాస్తినీ చిన్నాకే రాసిస్తాడు బాబు. ఈ విషయం తెలుసుకున్న తల్లి జగదాంబ, చిన్నా దగ్గర లేకపోతే బాబు దారిలోకి వస్తాడనుకుంటుంది. ఎంత డబ్బయినా సరే తీసుకొని బాబును విడిచి వెళ్లమని చిన్నాను బతిమాలుతుంది. బాబు కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డ చిన్నా ఇల్లు విడిచి వెళ్లేందుకు నిశ్చయించుకుంటాడు. తర్వాత బాబు, చిన్నా అన్యోన్యతను ఆమె అర్థం చేసుకుంటుంది.
హార్బర్ ఆఫీసుకు చిన్నా మేనేజరవుతాడు. అయితే అక్కడి వ్యవహారాలన్నీ అగమ్యగోచరంగా ఉన్నాయి. చదువుకొని విజ్ఞానం సంపాదించాలని పంతులమ్మ పార్వతి దగ్గరకు వెళ్లి రాత్రిపూట చదువుకుంటూ, పగలు ఆఫీసుపని చేస్తుంటాడు. అతడి మంచితనానికీ, అమాయకత్వానికీ ఆకర్షితురాలై అతనికి మనసిస్తుంది పార్వతి.
వాళ్ల ప్రేమను కనిపెట్టిన బాబు పరిహాసానికి పార్వతిని తనకిచ్చి పెళ్లిచెయ్యమంటాడు. చిన్నా నోట ఈ విషయం విన్న పార్వతి ఖిన్నురాలవుతుంది. అవమానంతో కుంగిపోతుంది. బాబు పశ్చాత్తాపపడతాడు. కానీ, ఏం లాభం. విరిగిన మనసు అతకలేదు. తన పరిహాసం ఇంత ప్రమాదానికి దారితీసిందని బాధపడి వాళ్లను నమ్మించడానికి గాను పద్మ అనే అమ్మాయిని పెళ్లాడతాడు బాబు.
అటు అదను కోసం కాచుకొన్న దివాన్ బోనస్ తగాదాల్ని లేపి పనివాళ్లను రెచ్చగొడతాడు. బాబు, చిన్నా కలిసి ఆఫీసులో ఒక చిన్న నాటకం ఆడతారు. చిన్నా పనివాళ్లలో చేరి వాళ్లకు నాయకుడై బోనస్ ఇప్పిస్తాడు. బాబుకూ, అతని వ్యాపారానికీ మేలు చేద్దామని గూడెం చేరిన చిన్నా, పార్వతి బోధనల వల్లా, అక్కడి అమాయకులైన కార్మికుల కష్టాల్ని కళ్లారా చూస్తుండం వల్లా నిజంగానే బాబుకు దూరమవుతాడు.
అది సహించలేని బాబు వెర్రికోపంతో హార్బర్‌కు వెళ్లి అక్కడ సింహాలు అనే కార్మికునిపై చేయి చేసుకుంటాడు. దాంతో పంతాలు పెరిగి ఈ సంఘటన సమ్మెకు కారణమవుతుంది. చిన్నా ఔన్నత్యాన్ని గుర్తిస్తుంది పార్వతి. చివరకు చిన్నా నాయకత్వంలో ఊరేగింపు జరుగుతుంది. తనవైపుకు రాకుండా వారిస్తూ రివాల్వర్ పైకెత్తి అడుగు ముందుకేస్తే ప్రాణం తీస్తానంటాడు బాబు. చిన్నా అడుగుముందుకేస్తాడు. 'అమ్మా' అని కేకపెట్టి పడిపోతాడు. అయితే గుండు పేల్చింది బాబు కాదు. దివాన్ అనుచరుడు. జనం విరుచుకుపడతారు. బాబు అందర్నీ క్షమాపణ వేడుకుంటాడు. "చిన్నా నువ్వు చిరంజీవివి. ధర్మానికీ, న్యాయానికీ, మంచికీ, మానవత్వానికీ ప్రాణాలు విడిచిపెట్టావు" అని విలపిస్తాడు.
తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, సావిత్రి, కాంచన, గీతాంజలి, గుమ్మడి, రేలంగి, శాంతకుమారి, అల్లు రామలింగయ్య, చదలవాడ కుటుంబరావు, గిరిజ
సంగీతం: కె.వి. మహదేవన్
నిర్మాత: వి. వెంకటేశ్వర్లు
దర్శకుడు: పి. పుల్లయ్య
బేనర్: పద్మశ్రీ పిక్చర్స్
1 comment:
It's a good story about what is friendship really meaning sir
Post a Comment