Showing posts with label charan raj. Show all posts
Showing posts with label charan raj. Show all posts

Saturday, June 2, 2012

'యథార్థ ప్రేమకథ'తో ఎన్ని ఇబ్బందులు పడ్డానో

"ఈ సినిమాని ఎలా పూర్తి చేయగలిగానో, దీని కోసం ఏమేం ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. ఆర్థిక వనరులు సరిపోక, మధ్యలోనే ఈ సినిమాని ఆపేద్దామనుకున్నా'' అని చెప్పారు చరణ్‌రాజ్. 'ప్రతిఘటన'తో నటునిగా పరిచయమై, తొలి చిత్రంతోటే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన చరణ్‌రాజ్ ఇప్పుడు దర్శకునిగా మారి 'యథార్థ ప్రేమకథ'ను రూపొందించారు. సి.ఆర్. క్రియేషన్స్ పతాకంపై ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఆ సినిమా గురించి చరణ్‌రాజ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...
టీవీలో 'అనితా ఓ అనితా' పాట చూసి, నాగరాజు కథ విని ఎమోషనల్ అయిపోయి ఆ కథపై సినిమా తీస్తానని అప్పటికప్పుడు ప్రకటించా. చెప్పినట్లుగానే తీశా. నాగరాజు పాత్రలో అమర్‌నీ, అనిత పాత్రలో చిరినీ పరిచయం చేస్తున్నాం. ఇద్దరూ చక్కగా చేశారు. వాళ్లిద్దరి ప్రేమనూ సఫలం చేయాలని ప్రయత్నించే పాత్రను నేను చేశా. ఈ నెల 25 మా చిన్నబ్బాయి దేవేందర్‌రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాని సొంతంగానైనా రిలీజ్ చేస్తున్నానంటే మల్టీడైమన్షన్ వాసు సహకారం వల్లే. వాళ్లకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే.

సినిమా అంతా హైలైటే
నా దృష్టిలో కథే మొదటి హీరో. ఈ కథ మీద నాకు బాగా నమ్మకం. ప్రేమ అంటే సెక్స్ కాదు, గొడవలు పడ్డం కాదు, అదో పవిత్ర భావన అని ఈ సినిమా ద్వారా చెబుతున్నా. ఇందులో ఫలానాది హైలైట్ అని చెప్పలేను. సినిమా మొత్తంగా హైలైటే. ఫస్టాఫ్ బాగుంటుంది. సెకండాఫ్ ఇంకా బాగుంటుంది. బిగువైన స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపించాం. ఎంవీఎస్ హరనాథరావు దేవుడిలా నాకు దొరికారు. ఈ సినిమా స్క్రిప్టు విషయంలో ఆయన చేసిన సహాయం మరచిపోలేనిది. డైలాగ్స్ అద్భుతంగా రాశారు. ఈ సినిమా కథ కానీ, సన్నివేశాలు కానీ ప్రేక్షకుల హృదయాల్ని స్పృశిస్తాయి. తప్పకుండా వారు ఈ సినిమాని ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నా. ఈ సినిమా విడుదల సందర్భంగా పది ప్రేమ జంటలకి పెళ్లి చేస్తామని ప్రకటించా. ఇటీవలే ఆర్యసమాజ్‌లో కులం, మతంతో సంబంధం లేకుండా ఆ పెళ్లిళ్లు జరిపించాం. ఇది మనసుకి ఎంతో సంతృప్తినిచ్చింది.

ఆ సంగతి తెలుసుకున్నా
నటుడిగా ఎంత అనుభవం ఉన్నా నిర్మాతగా ఇదే తొలి అనుభవం. దీని వల్ల ఇండస్ట్రీ అంటే ఏమిటో తెలుసుకున్నా. నటుడిగా 20 సినిమాల ఆఫర్లను పక్కనపెట్టి దీన్ని చేశా. ఈ సినిమాని ఎలా పూర్తి చేయగలిగానో, దీని కోసం ఏమేం ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. ఆర్థిక వనరులు సరిపోక, మధ్యలోనే ఈ సినిమాని ఆపేద్దామనుకున్నా. కానీ మనసు ఒప్పుకుంటేగా. వడ్డీ ఎంతనేది చూసుకోకుండా అప్పులు చేసి, ఈ సినిమా పూర్తిచేశా. ఎవర్నీ గుడ్డిగా నమ్మకూడదనే సంగతి తెలిసింది. కొంతమంది నన్ను మోసం చేశారు. నటుడిగా అవకాశాలు వదలుకొని ఎందుకు ఈ సినిమా చెయ్యాలి అని ఎన్నోసార్లు అనిపించింది. తామున్నామని ధైర్యం చెప్పినవాళ్లు తర్వాత ఏమయ్యారో తెలీలేదు. 400 సినిమాల్లో నటించిన నాకే ఇలాంటి స్థితి ఉందంటే కొత్తగా వచ్చే నిర్మాతలకి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందే. తొలి కాపీ చూసుకున్న రోజు నేను పడ్డ కష్టాన్నంతా మరిచిపోయా.
కృష్ణవంశీ సినిమా చేస్తున్నా
నాని హీరోగా కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ఓ మంచి పాత్ర చేస్తున్నా. అలాగే 'జెంటిల్‌మన్ పోలీస్' అనే సినిమాని త్వరలో డైరెక్ట్ చేయబోతున్నా. ఇందులో పోలీసాఫీసర్‌గా టైటిల్ రోల్ నేనే చేస్తున్నా. ఈ సినిమాని మంత్రాలయం పోలీసులకు అంకితమిస్తాను. కథ నాదే. ఎంవీఎస్ హరనాథరావు రచయిత.


Sunday, September 18, 2011

ప్రివ్యూ: యథార్థ ప్రేమకథ

కొంతకాలం క్రితం 'అనితా ఓ అనితా' అనే ప్రైవేట్ సాంగ్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. నాగరాజు అనే యువకుడు తన ప్రేయసిపై రాసి, స్వరాలు కూర్చి పాడిన పాట అది. అప్పట్లో ఆ పాట వెనుక కథ మీడియాలో ప్రముఖంగా రావడంతో కన్నడ నటుడు చరణ్‌రాజ్ దృష్టి దానిపై పడింది. తెలుగులో 'ప్రతిఘటన'తో విలన్‌గా పరిచయమై పాపులర్ అయిన అతను ఇప్పుడు నాగరాజు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా 'యథార్థ ప్రేమకథ' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూ సి.ఆర్. క్రియేషన్స్ బేనర్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు చరణ్‌రాజ్. అంతేకాదు కథ, స్క్రీన్‌ప్లేని కూడా తనే సమకూర్చి, చిత్రంలో ఓ కీలక పాత్ర సైతం చేస్తున్నాడు.
"హృదయాన్ని స్పృశించే సంఘటనలు, సన్నివేశాలతో ఈ సినిమా తయారవుతోంది. ఇందులోని ప్రేమకథతో పాటు, వినోదం కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అక్టోబర్ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనేది మా సంకల్పం'' అని చరణ్‌రాజ్ తెలిపాడు.
అమర్, చిరి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సుత్తివేలు, నళిని, సుమన్‌శెట్టి, నర్సింగ్ యాదవ్, శరత్, చిన్నా, హర్ష, కీర్తి, చంద్రశేఖర్, ఫణి, గోపాలకృష్ణ, చందు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: ఎం.వి.ఎస్. హరనాథరావు, పాటలు: సురేందర్, నాగరాజు, సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం: వంశీకృష్ణ పి., కూర్పు: వి. నాగిరెడ్డి, కళ: బాబా, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: చరణ్‌రాజ్ ఎన్.వై.