టీవీలో 'అనితా ఓ అనితా' పాట చూసి, నాగరాజు కథ విని ఎమోషనల్ అయిపోయి ఆ కథపై సినిమా తీస్తానని అప్పటికప్పుడు ప్రకటించా. చెప్పినట్లుగానే తీశా. నాగరాజు పాత్రలో అమర్‌నీ, అనిత పాత్రలో చిరినీ పరిచయం చేస్తున్నాం. ఇద్దరూ చక్కగా చేశారు. వాళ్లిద్దరి ప్రేమనూ సఫలం చేయాలని ప్రయత్నించే పాత్రను నేను చేశా. ఈ నెల 25 మా చిన్నబ్బాయి దేవేందర్‌రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాని సొంతంగానైనా రిలీజ్ చేస్తున్నానంటే మల్టీడైమన్షన్ వాసు సహకారం వల్లే. వాళ్లకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే.
సినిమా అంతా హైలైటే
నా దృష్టిలో కథే మొదటి హీరో. ఈ కథ మీద నాకు బాగా నమ్మకం. ప్రేమ అంటే సెక్స్ కాదు, గొడవలు పడ్డం కాదు, అదో పవిత్ర భావన అని ఈ సినిమా ద్వారా చెబుతున్నా. ఇందులో ఫలానాది హైలైట్ అని చెప్పలేను. సినిమా మొత్తంగా హైలైటే. ఫస్టాఫ్ బాగుంటుంది. సెకండాఫ్ ఇంకా బాగుంటుంది. బిగువైన స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపించాం. ఎంవీఎస్ హరనాథరావు దేవుడిలా నాకు దొరికారు. ఈ సినిమా స్క్రిప్టు విషయంలో ఆయన చేసిన సహాయం మరచిపోలేనిది. డైలాగ్స్ అద్భుతంగా రాశారు. ఈ సినిమా కథ కానీ, సన్నివేశాలు కానీ ప్రేక్షకుల హృదయాల్ని స్పృశిస్తాయి. తప్పకుండా వారు ఈ సినిమాని ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నా. ఈ సినిమా విడుదల సందర్భంగా పది ప్రేమ జంటలకి పెళ్లి చేస్తామని ప్రకటించా. ఇటీవలే ఆర్యసమాజ్‌లో కులం, మతంతో సంబంధం లేకుండా ఆ పెళ్లిళ్లు జరిపించాం. ఇది మనసుకి ఎంతో సంతృప్తినిచ్చింది.
ఆ సంగతి తెలుసుకున్నా
నటుడిగా ఎంత అనుభవం ఉన్నా నిర్మాతగా ఇదే తొలి అనుభవం. దీని వల్ల ఇండస్ట్రీ అంటే ఏమిటో తెలుసుకున్నా. నటుడిగా 20 సినిమాల ఆఫర్లను పక్కనపెట్టి దీన్ని చేశా. ఈ సినిమాని ఎలా పూర్తి చేయగలిగానో, దీని కోసం ఏమేం ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. ఆర్థిక వనరులు సరిపోక, మధ్యలోనే ఈ సినిమాని ఆపేద్దామనుకున్నా. కానీ మనసు ఒప్పుకుంటేగా. వడ్డీ ఎంతనేది చూసుకోకుండా అప్పులు చేసి, ఈ సినిమా పూర్తిచేశా. ఎవర్నీ గుడ్డిగా నమ్మకూడదనే సంగతి తెలిసింది. కొంతమంది నన్ను మోసం చేశారు. నటుడిగా అవకాశాలు వదలుకొని ఎందుకు ఈ సినిమా చెయ్యాలి అని ఎన్నోసార్లు అనిపించింది. తామున్నామని ధైర్యం చెప్పినవాళ్లు తర్వాత ఏమయ్యారో తెలీలేదు. 400 సినిమాల్లో నటించిన నాకే ఇలాంటి స్థితి ఉందంటే కొత్తగా వచ్చే నిర్మాతలకి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందే. తొలి కాపీ చూసుకున్న రోజు నేను పడ్డ కష్టాన్నంతా మరిచిపోయా.
కృష్ణవంశీ సినిమా చేస్తున్నానాని హీరోగా కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ఓ మంచి పాత్ర చేస్తున్నా. అలాగే 'జెంటిల్‌మన్ పోలీస్' అనే సినిమాని త్వరలో డైరెక్ట్ చేయబోతున్నా. ఇందులో పోలీసాఫీసర్‌గా టైటిల్ రోల్ నేనే చేస్తున్నా. ఈ సినిమాని మంత్రాలయం పోలీసులకు అంకితమిస్తాను. కథ నాదే. ఎంవీఎస్ హరనాథరావు రచయిత.
No comments:
Post a Comment