Friday, June 1, 2012
ఏడు పదుల యువకుడు
కమర్షియల్‌గా తెలుగు సినిమాని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన అగ్రగణ్య దర్శకుల్లో కె. రాఘవేంద్రరావు ముందు వరుసలో ఉంటారనే సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ తొలినాళ్లలో 'జ్యోతి', 'ఆమె కథ', 'ప్రేమలేఖలు', 'కల్పన' వంటి నాయిక ప్రధాన చిత్రాలతో విజయాలు సాధించిన ఆయన అనంతర కాలంలో టాప్ కమర్షియల్ డైరెక్టర్‌గా ఎదిగారంటే నిరంతరం తనలోని ప్రతిభను మెరుగు పరచుకుంటూ రావడం వల్లే.
1977లో ఎన్టీ రామారావు హీరోగా ఆయన రూపొందించిన 'అడవిరాముడు' సాధించిన సంచలనాలతో ఆయన ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ అయిపోయారు. అప్పట్లో ఆ సినిమా సాధించిన కలెక్షన్లు అందర్నీ అబ్బురపరిచాయి. మరీ ముఖ్యంగా అందులోని 'ఆరేసుకోబోయి పారేసుకున్నా' పాట అనంతర కాలంలో తెలుగు సినిమా పాట స్థితిగతుల్నే మార్చేసింది. 'పదహారేళ్ల వయసు', 'వేటగాడు', 'కొండవీటి సింహం', 'జస్టిస్ చౌదరి', 'దేవత', 'బొబ్బిలి బ్రహ్మన్న', 'అగ్నిపర్వతం', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'మేజర్ చంద్రకాంత్', 'పెళ్లి సందడి', 'గంగోత్రి' వంటి సినిమాలు కమర్షియల్ డైరెక్టర్‌గా ఆయన ప్రతిభకు తార్కాణాలు. అటువంటి డైరెక్టర్ దృష్టి కొంతకాలం క్రితం భక్తిరసం వైపు మళ్లింది.
ఫలితంగా చారిత్రక కథలకు కమర్షియల్ హంగులద్ది ఆయన రూపొందించిన భక్తిరస చిత్రాలు 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' ఆయన కీర్తిని మరింత పెంచాయి. ప్రస్తుతం ఆయన కోట్లాది భారతీయుల ఆరాధ్యదైవమైన 'శిరిడి సాయి'ని తెరమీద చూపించే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నారు. అన్నమయ్య, రామదాసు పాత్రల్ని పోషించిన అక్కినేని నాగార్జునే సాయి పాత్రనూ పోషిస్తున్నారు. ఇప్పటికే సాయిపై పలు సినిమాలు వచ్చినా, కేవలం రాఘవేంద్రరావు రూపొందిస్తున్నందునే 'శిరిడి సాయి'కి ప్రత్యేకత వచ్చిందనడంలో సందేహం లేదు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సొంతం చేసుకున్న రాఘవేంద్రరావు భవిష్యత్తులో ఇంకేం అద్భుతాలు చేయనున్నారో...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment