Monday, June 4, 2012

పవన్‌కల్యాణ్ షో గబ్బర్‌సింగ్

"ఒన్‌మ్యాన్ షో 'గబ్బర్‌సింగ్'. పవన్‌కళ్యాణ్ కాకుండా మరొకర్ని 'గబ్బర్‌సింగ్'గా ఊహించలేను. అన్ని రికార్డుల్నీ క్రాస్‌చేసి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్‌వన్ సినిమా అయ్యింది'' అని చెప్పారు బండ్ల గణేశ్. పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్‌శంకర్ డైరెక్ట్ చేసిన 'గబ్బర్‌సింగ్'ను ఆయన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సందర్భంగా తమ సంస్థ కార్యాలయంలో మాట్లాడారు గణేశ్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
కల్యాణ్ దేనికీ ఎగ్జయిట్ అవరు. సినిమా చూశాక ఆయన నోటినుంచి వచ్చిన ఒకే మాట 'బాగుంది' అని. రికార్డుల గురించీ, కలెక్షన్ల గురించీ ఒక్కసారీ అడగలేదు. మానవ అనుబంధాలకీ, మోరల్స్‌కీ నిలబడే మనిషి కల్యాణ్. సినిమాలో 'రౌడీలతో అంత్యాక్షరి' ఎపిసోడ్ ఆలోచన కల్యాణ్‌ది. అది మినహాయిస్తే 'దబాంగ్'లో లేని సన్నివేశాలు కానీ, ఇతర మార్పులు కానీ అన్నీ హరీశ్‌వే. చాలా గొప్పగా చేశాడు. హరీశ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు 'అతను చెప్పినట్లు తీస్తే ఇండస్ట్రీ రికార్డులు కొడుతుంది' అన్నాడు మా అన్నయ్య శివబాబు. అది నిజమైంది. హరీశ్ స్క్రిప్టు తయారుచేసిన విధానం, అతని డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శ్రుతీహాసన్ పాత్ర వంటివి కూడా ఈ సినిమా విజయంలో తమ వంతు పాత్ర నిర్వహించాయి.
నా జీవితమే లేదు
'గబ్బర్‌సింగ్'ను తానే సొంతంగా నిర్మిస్తానని ప్రకటించిన తర్వాత నాకివ్వడం నా అదృష్టం. పవన్‌కల్యాణ్ ఎప్పటికీ నాకు వ్యసనమే. ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆయన రెమ్యూనరేషన్ ఎంతనేది మేం మాట్లాడుకోలేదు. చరణ్ పెళ్లయ్యాక విజయోత్సవ సభ పెడదామనుకుంటున్నా. దానికి కల్యాణ్ ఒప్పుకోవాలి. త్వరలో ఆయనతో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను నిర్మాతని చేసింది పవన్‌కల్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు.
భయమేస్తోంది
నేనెవరికీ బినామీని కాను. ఇప్పటికే దీనిపై వచ్చిన ప్రచారాన్ని ఖండించా. ఓవర్‌నైట్ ప్రొడ్యూసర్‌ని అయ్యేప్పటికి ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. సినిమా హిట్ కాకపోతే నిర్మాత పరిస్థితి ఘోరం. అందుకని హిట్ సినిమానే తియ్యాలి. 'తీన్‌మార్'తో హిట్ రాలేదని భయపడ్డ నేను 'గబ్బర్‌సింగ్' హిట్‌తో ఇంకా భయమేస్తోంది. రాబోయే సినిమా ఇంకెంత బాగా తియ్యాలనేదే ఆ భయం. తెరపై ఇక నటించాలని నేను అనుకోవడం లేదు. మాస్ నుంచి వచ్చినవాణ్ణి కాబట్టి మాస్ ఎంటర్‌టైనర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం.
పెద్ద సినిమాలే చేస్తా
చిన్న సినిమాలు తీసే గట్స్ నాకు లేవు. అందరు అగ్ర హీరోలతోటి పెద్ద సినిమాలే చేస్తా. నేనెవరితో పనిచేసినా, అదే భక్తితో ఆ సినిమా సూపర్‌హిట్ కావాలనే లక్ష్యంతోనే పనిచేస్తా. నేను పవన్‌కల్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు. ఎన్టీఆర్, శ్రీను వైట్ కాంబినేషన్ సినిమా 'బాద్‌షా' సినిమా షెడ్యూలు జూన్ 15 నుంచి ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. కృష్ణానగర్‌లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్‌సింగ్' హిట్‌కి తను ఎంతో ఆనందపడ్డాడు. అక్టోబర్ నుంచి ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నా. హీరో ఎవరనేది ఆయనే చెబుతాడు.

No comments: