"ఇందులో నేను నా తరానికి చెందిన నాకిష్టమైన హీరో ప్రభాస్‌ని ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా. ఆ డైలాగ్స్‌కి ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెబుతున్నాడు '' అని చెప్పారు మంచు విష్ణు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా. మోహన్‌బాబు నిర్మిస్తున్న 'దేనికైనా రెడీ'లో ఆయన హీరోగా నటిస్తున్నారు. హన్సిక నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. మంగళవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా జరిపిన సంభాషణలో ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలతో పాటు, మరికొన్ని ఆసక్తికర విషయాల్ని తెలియజేశారు విష్ణు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
'దేనికైనా రెడీ' మూడు పాటలు మినహా సినిమా పూర్తయింది. తమ్ముడు మనోజ్ సినిమా 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' విడుదలయ్యాక ఆ మూడు పాటలూ తీస్తాం. జూలై చివరలో పాటల్నీ, ఆగస్టులో సినిమానీ విడుదల చేస్తాం. యూరప్‌లో రెండు పాటల్నీ, హైదరాబాద్‌లో ఓ పాటనీ తీద్దామనుకుంటున్నాం. ఒకవేళ యూరప్‌కి వెళ్లకపోతే, వాటిని కేరళలో తీస్తాం.
అమ్మ సెంటిమెంట్
ఇది ఫ్యామిలీ నేపథ్యంలో నడిచే వినోదాత్మక చిత్రం. కథంతా కర్నూలులో జరుగుతుంది. ఈ సినిమా లైన్ బీవీఎస్ రవి చెబితే, అతనితో కలిసి కోన వెంకట్, గోపి మోహన్ స్క్రిప్టు డెవలప్ చేశారు. మాటలు మరుధూరి రాజా రాశారు. 'ఢీ'కి తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతో దానికి ట్యాగ్‌లైన్‌గా ఉపయోగించిన 'దేనికైనా రెడీ'నే టైటిల్‌గా పెట్టాం. ఈ సినిమాకి ప్రధాన బలం హ్యూమర్. దానితో పాటు చక్కని సెంటిమెంట్ కూడా ఉంది. అది తల్లీ కొడుకుల సెంటిమెంట్. నా తల్లిగా సీత, తండ్రిగా సుమన్ చేశారు. నా తల్లి హిందు అయితే, తండ్రి ముస్లిం. హన్సిక తండ్రిగా ప్రభు చేశారు. విలన్‌గా కోట శ్రీనివాసరావు చేశారు.
ఇందులోనూ బ్రహ్మానందమే
ఈ సినిమాని 'ఢీ'కి సీక్వెల్ అనొచ్చు. 'ఢీ' కంటే పది రెట్లు ఎక్కువ కామికల్‌గా ఉంటుంది. 'ఢీ'కి బ్రహ్మానందం కేరక్టర్ ఎంత ఎస్సెట్ అయ్యిందో తెలిసిందే. ఇందులోనూ ఆయన నాతో పాటే ఉంటారు. 'ఢీ' కంటే పది రెట్లు ఎక్కువ కామెడీ ఆ కేరక్టర్‌లో ఉంది. అందులో 'రావుగారూ నన్ను ఇన్‌వాల్వ్ చెయ్యకండి' అనే మేనరిజమ్‌తో నవ్వించిన ఆయన ఇందులోనూ ఓ మేనరిజమ్‌తో తెగ నవ్విస్తారు. హన్సికతో మొదటిసారి పనిచేశా. ఇప్పటివరకూ నేను పనిచేసిన హీరోయిన్లందరిలోకీ బ్యూటిఫుల్ గర్ల్. ప్రొఫెషనల్‌గా బ్రిలియంట్. ఆమెతో పనిచేయడం నాకెంతో సౌకర్యంగా అనిపించింది. శ్రీను వైట్ల తర్వాత అంత కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి అని చాలామంది అన్నారు. ఆయన్ని అనుకున్నప్పుడు శ్రీను వైట్ల కూడా 'వెరీగుడ్ చాయిస్ విష్ణు. ఆయన బ్రిలియంట్‌గా చేస్తారు' అని చెప్పారు. ఆయనకు మ్యూజిక్ సెన్స్ కూడా బాగా ఎక్కువ. 'ఢీ'కి శ్రీను గారితో ఎంతగా ఎంజాయ్ చేశానో, ఆయన తర్వాత ఇప్పటివరకు నేను ఎంజాయ్ చేసిందీ, అంత కాన్ఫిడెంట్‌గా ఉందీ ఈ సినిమాకే.
ఆశ్చర్యపరిచే విషయాలున్నాయి
ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలున్నాయి. ఇందులో నేను నా తరానికి చెందిన నాకిష్టమైన హీరోని ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా. ఆ డైలాగ్స్‌కి ఆ హీరోనే డబ్బింగ్ చెప్పబోతున్నాడు. అతనెవరో కాదు ప్రభాస్. అలాగే కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన విక్రమ్ (ఎమ్మెస్ నారాయణ కుమారుడు)ను యంగ్ విలన్‌గా పరిచయం చేస్తున్నాం. సినిమాలో ఆరు పాటలుంటాయి. ఇప్పటికి రెండు పాటల్ని తీశాం. ఒకటి మాంటేజ్ సాంగ్‌గా వస్తుంది. చక్రి మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా సన్నిహిత మిత్రుడు, దేశంలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన యువన్‌శంకర్ రాజా రెండు పాటలకు ట్యూన్లు ఇచ్చారు. అందుకు ఆయనకి థాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక యాక్షన్ సన్నివేశాల్ని సెల్వ మాస్టర్ ఆధ్వర్యంలో చేశాం. నేనెంతో ఇష్టపడి చేశా. ఇటీవలే క్లైమాక్స్ ఫైట్ చేశాం. చాలా గొప్పగా వచ్చింది. మొత్తం నాలుగు ఫైట్లు. ఒకటి తిరుపతిలో, ఒకటి కాళహస్తిలో, రెండు హైదరాబాద్‌లో తీశాం.
తమిళంలోనూ అడుగేస్తున్నా
ఈ సినిమా నుంచి తమిళంలోకి అడుగు పెట్టబోతున్నా. ఇక ప్రతి సినిమా తమిళంలోనూ రిలీజ్ చేస్తాం. బాలీవుడ్‌లోకి ఇప్పుడే వెళ్లే అవకాశం లేదు. ఇంట గెలిచాక అప్పుడు రచ్చ సంగతి చూద్దాం. నాలుగేళ్ల తర్వాత ఇతను తెలుగు నటుడనీ, అతను తమిళ నటుడనీ, హిందీ నటుడనీ భేదాలు ఉండవు. నటుడికి భాషాభేదం అనేది తొలగిపోతుంది. ఉత్తరాది వాళ్లు కూడా కేరక్టర్లకి ఇక్కడి నటుల్ని తీసుకోవాల్సిందే. నా కెరీర్‌లో 'ఢీ' ఒక్కటే బిగ్ హిట్. 'వస్తాడు నా రాజు' రాంగ్ టైమ్‌లో రిలీజ్ కావడం వల్ల ఫెయిలైంది. 'దేనికైనా రెడీ' మీద చాలా నమ్మకంతో ఉన్నాం. దీని తర్వాత నాన్నగారి సలహాలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా నా కెరీర్‌ను ప్లాన్ చేసుకోబోతున్నా.
నలుగురు హీరోల సినిమా
'దేనికైనా రెడీ' తర్వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మరో సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నా. ఇందులో నేను కాకుండా మరో ముగ్గురు నా తరానికి చెందిన హీరోలుంటారు. అంటే మొత్తం నలుగురు హీరోలు. విలన్ కేరక్టర్‌ను నాన్నగారు చేస్తారు. సురేందర్‌రెడ్డి సినిమాలకి సహ దర్శకుడిగా పనిచేసిన తూప్రాన్ శ్రీను చెప్పిన స్క్రిప్టు చాలా బాగా నచ్చింది. అతన్ని శ్రీను వైట్ల పంపించారు. ఇది కామెడీ యాక్షన్ ఫిల్మ్. రెగ్యులర్ సినిమాల తరహాలో హీరోయిన్‌తో డ్యూయెట్లు పాడుకోవడం వంటివి ఇందులో ఉండవు. ఇలాంటి స్క్రిప్టులు అరుదుగా వస్తాయి. రెండు వారాల్లోగా మిగతా ముగ్గురు హీరోలెవరో ప్రకటిస్తాం. వాళ్లు నా స్నేహితులే.
బాలయ్యకు హ్యాట్సాఫ్
నేను, మనోజ్ కలిసి నటించడం ఇప్పుడల్లా జరగదు. అది కష్టం. ఏమన్నా అవకాశాలుంటే అది కె. రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసే పౌరాణిక చిత్రం 'రావణ'లో ఉన్నాయి. కచ్చితంగా చెప్పలేను. అందులో నాన్నగారు టైటిల్ రోల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. హీరోగా మనోజ్ కెరీర్‌కీ, నిర్మాతగా లక్ష్మి కెరీర్‌కీ 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమా చాలా ముఖ్యం. అందుకే దాని మీద చాలా కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనోజ్ చేసినవి సన్నని లైన్‌మీద నడిచిన కథలే. అంతా అతని షోనే కనిపిస్తుంది. తొలిసారి అద్భుతమైన కథలో చేస్తున్నాడు. బాలకృష్ణ గారి కేరక్టర్ హైలైట్ అవుతుంది సినిమాకి. ఆయన ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకూ, ఆ పాత్రని చేసిన విధానానికీ హ్యాట్సాఫ్. ఈ తరహా పాత్ర చెయ్యడం ఆయనకు ఇదే తొలిసారి.
No comments:
Post a Comment