Showing posts with label padmanabham. Show all posts
Showing posts with label padmanabham. Show all posts

Friday, December 25, 2015

Synopsis of the movie VAGDANAM (1961)

'వాగ్దానం' (1961) చిత్ర కథాంశం

జమీందారు విశ్వనాథం, దివాన్ రంగనాథం (గుమ్మడి), పరిస్థితుల వల్ల తాగుబోతుగా మారిన జగన్నాథం బాల్య మిత్రులు. జగన్నాథాన్ని విశ్వనాథం ప్రాణంగా చూసుకుంటుంటే, రంగనాథం దురాలోచన, దూరాలోచనతో జగన్నాథాన్ని ద్వేషిస్తుంటాదు. కులంలేని స్త్రీని పెళ్లి చేసుకున్నాడని వెలివేయబడిన జగన్నాథం కొడుకు సూర్యానికి విదేశాల్లో డాక్టర్ కోర్సు చెప్పించడమే కాకుండా తన కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు విశ్వనాథం. ఆయన ఏకైక పుత్రిక విజయను తన కొడుకు చంద్రం (చలం)కు ఇచ్చి పెళ్లిచేసి జమీందారు ఆస్తిని కాజేయాలని చూస్తుంటాడు రంగనాథం. ఇంతలో జగన్నాథం చనిపోవడంతో, విశ్వనాథం కూడా సానుభూతితో మరణిస్తాడు.
చదువు పూర్తిచేసుకొని పల్లెకు వచ్చిన సూర్యం (అక్కినేని నాగేశ్వరరావు) డాక్టరుగా మంచి పేరు తెచ్చుకుంటాడు. సునాయాసంగా విజయ (కృష్ణకుమారి) ప్రేమను  పొందుతాడు. కానీ రంగనాథం చెడుబుర్ర కారణాన అనేక అవాంతరాలొస్తాయి. వాటిని తొలగించడంలో సూర్యం సఫలమవడంతో విజయ అతనికే దక్కుతుంది. జగన్నాథానికి విశ్వనాథం ఇచ్చిన వాగ్దానం నిలబడుతుంది.

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, గుమ్మడి, రేలంగి, చలం, సూర్యకాంతం, గిరిజ, పద్మనాభం, కె. వెంకటేశ్వరరావు, మల్లాది, మద్దాలి, సురభి కమలాబాయి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాతలు: కె. సత్యనారాయణ, డి. శ్రీరామమూర్తి
దర్శకత్వం: ఆత్రేయ
బేనర్: కవితా చిత్ర
విడుదల తేదీ: 5 అక్టోబర్ 1961

Thursday, May 24, 2012

టర్నింగ్ పాయింట్: రమాప్రభ


నేను సినిమాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు. మాది మధ్య తరగతి కుటుంబం. నేను ఊటీ, చెన్నైలో పెరిగాను. మా పిన్ని వాళ్లతో ఉండటం వల్ల వాళ్లతో పాటు తిరిగాను. దాంతో నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. మా బాబాయి ఆకస్మిక మరణంతో మా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. దాంతో బతకడం కోసం నేను సినిమాల్లోకి వచ్చా. క్లాసికల్ డాన్సర్‌గా స్టేజీ మీద నేనిచ్చిన ఓ ప్రదర్శన చూసిన డైరెక్టర్ ప్రత్యగాత్మ తన 'చిలకా కోరింక' (1966) సినిమాలో హీరో కృష్ణంరాజు చెల్లెలిగా చేసే ఛాన్స్ ఇచ్చారు. 
అందులో నేను పద్మనాభం సరసన చేశా. అప్పటికే గొప్ప కమెడియన్ అయిన ఆయన నన్ను తన జోడీగా ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేను. అప్పట్లో ఆయనా, గీతాంజలి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. నిజానికి పద్మనాభం నన్ను బాగా ప్రోత్సహించారు. ఆ తర్వాత నేనెక్కువగా రాజబాబు సరసన నటించాను. చలం, రమకృష్ణ, శోభన్ బాబు, కృష్ణ వంటి ఎంతోమంది హీరోల సినిమాల్లో చేసిన నేను ఒక్క రాజబాబుతోటే 100 సినిమాల దాకా చేశా. తను నాకు మంచి స్నేహితుడు.
నా పరిమితులేమిటో నాకు తెలుసు. నా ముఖం గానీ, నా ఫ్రేంవర్క్ గానీ గ్లామర్‌ని కురిపించలేవనీ, అందువల్ల హీరోయిన్‌గా నేను పనికిరాననీ తెలుసు. అందుకే కమెడియన్ల సరసనా, కేరక్టర్ ఆర్టిస్టుగా సెటిలయ్యా. దాంతో భిన్నమైన కేరక్టర్లు చేయగలిగా. ఇన్నేళ్లపాటు ఫీల్డులో ఉండగలిగా.

Monday, August 30, 2010

Nostalgia: Great Comedian Padmanabham


నవ్వించడంలోనే కాక హృదయం ద్రవింపజేయడంలో కూడా పద్మనాభంది అందె వేసిన చెయ్యి. 1931లో కడప జిల్లా సింహాద్రిపురంలో జన్మించిన ఆయన పూర్తిపేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. 1943లో విడుదలైన 'మాయాలోకం' ఆయన తొలి చిత్రం. ప్రేక్షకులకి దగ్గరయ్యింది మాత్రం విజయా వారి 'పాతాళ భైరవి'లో వేసిన సదాజపుని పాత్రతో. రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, ఛాయాదేవి వంటి మేటి నటీనటులతో నటించి తనదైన ప్రత్యేకతను నిలుపుకున్నారు.
పద్మనాభం మంచి గాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. పొట్టి ప్లీడరు, ఆజన్మ బ్రహ్మచారి, శ్రీశ్రీ మర్యాద రామన్న, కథానాయిక మొల్ల, మాంగల్యబలం, దేవత వంటి గొప్ప చిత్రాలు నిర్మించారు. 'కథానాయిక మొల్ల', 'శ్రీరామకథ' సినిమాలకి దర్శకత్వం వహించారు. పాండవ వనవాసంలో లక్ష్మణ కుమారుడిగా, పొట్టి ప్లీడరులో ప్లీడరుగా, పాతాళభైరవిలో సదాజపునిగా, దేవతలో సినిమా పిచ్చోడిగా, దసరా బుల్లోడులో ఏఎన్నార్ స్నేహితునిగా, ఆజన్మ బ్రహ్మచారిలో చాటుమాటు ప్రేమికునిగా.. ఇలా అనేక పాత్రలు వేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కృష్ణవంశీ సినిమా 'చక్రం'లో 'జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది' అన్నట్లు ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 20న చెన్నైలో గుండెపోటుతో ఏకాకిగానే ఈ లోకాన్ని వీడి వెళ్లారు.

Sunday, August 29, 2010

Movies: Silver screen Narada


తెలుగు సినిమాల్లో నారదుడి పాత్రను ఇప్పటివరకు ఎంతోమంది పోషించారు. ముఖ్యంగా నారదుడి పాత్ర అనగానే గుర్తుకువచ్చే పేరు కాంతారావు. ఆయనలా ఆ పాత్రలో ఒదిగిపోయిన నటులు ఇంకొకరు అవుపించరు. 'గంగా గౌరీ సంవాదం' (1958), 'దీపావళి' (1960), 'సతీ సులోచన' (1961), 'సీతారామ కల్యాణం' (1961), 'శ్రీకృష్ణార్జున యుద్ధం' (1963), 'శ్రీకృష్ణ పాండవీయం' (1966), 'శ్రీకృష్ణ తులాభారం' (1966) వంటి చిత్రాతో ఆయన అభినవ నారదుడిగా సినీ చరిత్రలో నిలిచిపోయారు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, హరనాథ్, పద్మనాభం, చంద్రమోహన్ కూడా ఆ పాత్రకు వన్నె తెచ్చారు. ఇటీవలి కాలంలో నారదుడి పాత్ర అంటే నరేశ్ వేస్తున్నారు.
ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ 'భక్త ప్రహ్లాద' (1967)లో నారదుడిగా మెప్పించారు. హాస్యనటులైన రేలంగి 'చెంచులక్ష్మి', 'భీష్మ' సినిమాల్లో, రమణారెడ్డి 'పార్వతీ కల్యాణం' (1962)లో, నూతన్ ప్రసాద్ 'కనకదుర్గా మహాత్మ్యం'లో నారద పాత్ర వేశారు.
విశేషమేమంటే ఒక నటి కూడా తెరమీద నారదుడిగా నటించడం. 'కృష్ణప్రేమ' (1943) సినిమాలో నారద పాత్రని టంగుటూరి సూర్యకుమారి పోషించారు. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఆ పాత్రని చేసిన ఏకైక నటి ఆమే.