
నవ్వించడంలోనే కాక హృదయం ద్రవింపజేయడంలో కూడా పద్మనాభంది అందె వేసిన చెయ్యి. 1931లో కడప జిల్లా సింహాద్రిపురంలో జన్మించిన ఆయన పూర్తిపేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. 1943లో విడుదలైన 'మాయాలోకం' ఆయన తొలి చిత్రం. ప్రేక్షకులకి దగ్గరయ్యింది మాత్రం విజయా వారి 'పాతాళ భైరవి'లో వేసిన సదాజపుని పాత్రతో. రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, ఛాయాదేవి వంటి మేటి నటీనటులతో నటించి తనదైన ప్రత్యేకతను నిలుపుకున్నారు.
పద్మనాభం మంచి గాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. పొట్టి ప్లీడరు, ఆజన్మ బ్రహ్మచారి, శ్రీశ్రీ మర్యాద రామన్న, కథానాయిక మొల్ల, మాంగల్యబలం, దేవత వంటి గొప్ప చిత్రాలు నిర్మించారు. 'కథానాయిక మొల్ల', 'శ్రీరామకథ' సినిమాలకి దర్శకత్వం వహించారు. పాండవ వనవాసంలో లక్ష్మణ కుమారుడిగా, పొట్టి ప్లీడరులో ప్లీడరుగా, పాతాళభైరవిలో సదాజపునిగా, దేవతలో సినిమా పిచ్చోడిగా, దసరా బుల్లోడులో ఏఎన్నార్ స్నేహితునిగా, ఆజన్మ బ్రహ్మచారిలో చాటుమాటు ప్రేమికునిగా.. ఇలా అనేక పాత్రలు వేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కృష్ణవంశీ సినిమా 'చక్రం'లో 'జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది' అన్నట్లు ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 20న చెన్నైలో గుండెపోటుతో ఏకాకిగానే ఈ లోకాన్ని వీడి వెళ్లారు.
No comments:
Post a Comment