Monday, August 23, 2010

Movies: 'Agni Varsha' sorrowful episode


ఎనిమిదేళ్ల క్రితం నాగార్జున బాలీవుడ్ లో నటించిన 'అగ్నివర్ష' సినిమా తెలుగులో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమాని 'అగ్నివర్షం' పేరుతో తెలుగులో రిలీజ్ చెయ్యాలని తైలం నాగవర్మ అనే చిన్న డబ్బింగ్ నిర్మాత ఆశించాడు. కొన్ని సినిమాలకు పీఆర్వోగా పనిచేసిన నాగవర్మ సినిమా సర్కిల్స్ లో చాలామందికి తెలిసినవాడే. నాగార్జున నటించిన బాలీవుడ్ సినిమా అనేసరికి బిజినెస్ బాగా జరుగుతుందనీ, తనకు ఎంతోకొంత లాభం వస్తుందనీ అతను ఆశించాడు. అందుకని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమే కాక, ఆంధ్రజ్యోతిలో యాడ్ కూడా ఇచ్చాడు. వెంటనే ఆ సినిమాని కొనేందుకు బయ్యర్లు చాలామంది ఎంక్వైరీలు చేశారు. కానీ రెండు రోజుల్లోనే అదే ఆంధ్రజ్యోతిలో నాగార్జున తన లాయరు ద్వారా ఒక నోటీసుని ప్రకటించారు. 'అగ్నివర్ష' నిర్మాతలతో తను చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం తన అనుమతి లేనిదే ఆ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడానికి వీలులేదని ఆ ప్రకటనలో ఆయన తెలిపారు. దీంతో నాగవర్మ హతాశుడయ్యాడు. ఇలాంటి ఫిటింగ్ ఒకటి ఆ సినిమాకి ఉంటుందని అతనికి తెలీదు. ఇప్పటికే లక్షలు పోసి ఆ సినిమా తెలుగు రైట్స్ ని అతను కొన్నాడు. చిన్న నిర్మాత కావడాన ఆ డబ్బు అతనికెంతో విలువైనది. ఈ వివాదం వల్ల అతను బాగా నష్టపోయే పరిస్థితి తలెత్తింది. అసలు సంగతేమంటే హిందీ 'అగ్నివర్ష' నిర్మాతలతో నాగార్జున ఒప్పందం చేసుకోవడం నిజమే. అయితే ఆ నిర్మాతలు ఆ సినిమా వరల్డ్ వైడ్ హక్కుల్ని ముంబైకి చెందిన మరో నిర్మాతకి అమ్మేశారు. దాని ప్రకారం ఆ సినిమాని వారు ఏ భాషలోనైనా, ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు. అలా ఆ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని చెన్నైకి చెందిన ఓ నిర్మాతకి అమ్మారు. అతని వద్దనుంచి నాగవర్మ డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు. అయితే అసలు నిర్మాతలకి తప్ప మిగతావాళ్లకి ఎవరికీ నాగార్జున అగ్రిమెంట్ సంగతి తెలీదు. ఇప్పుడు 'అగ్నివర్షం' తెలుగులో రిలీజ్ కావాలంతే అసలు నిర్మాతలు రంగంలోకి రావాలి. బెంగుళూరుకి చెందిన ఆ నిర్మాతలు ఎక్కడున్నారో, వాళ్లు సీనులోకి వస్తారో, లేదో తెలీదు. మొత్తానికి ఈ ఎపిసోడులో బలయ్యింది మాత్రం నాగవర్మే. నాగార్జున పెద్ద మనసు చేసుకుని రిలీజుకి ఒప్పుకుంటే అతను గండం గట్టెక్కుతాడు. అయితే సినిమాలో ప్రభుదేవా చేతిలో నాగార్జున పాత్ర చనిపోతుంది. ఇది తెలుగులో తన ఇమేజికి భంగకరమని నాగార్జునకి బాగా తెలుసు. అందువల్ల ఆయన దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది అత్యాశే.

No comments: