Saturday, August 28, 2010
Interview: MS Reddy
"చిత్రసీమలో మిగతావాళ్లు హాయిగా జీవిస్తుంటే ప్రొడ్యూసర్లు మాత్రం నానా బాధలూ పడ్తున్నారు. సినిమాల వల్ల సర్వం కోల్పోయి, చనిపోయిన నిర్మాతల్ని తలుచుకుంటే కన్నీళ్లు వస్తుంటాయి'' అని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు సినీరంగ దిగ్గజాల్లో ఒకరైన నిర్మాత, కవి, రచయిత అయిన మల్లెమాల సుందరరామిరెడ్డి (ఎం.ఎస్. రెడ్డి). ఆయన తమ సినీ జీవిత అనుభవాలనూ, ప్రస్తుత వ్యాపకాలనూ ప్రత్యేకంగా పంచుకున్నారు. స్ఫూర్తినివ్వడంతో పాటు పాఠాలనూ బోధించే ఆ అనుభవాల మాలిక ఆయన మాటల్లోనే..
నాది ప్రత్యేకమైన దృక్పథం. ఎన్ని అపజయాలు, సుఖాలు, సంతోషాలు, కష్టాలు వచ్చినా ప్రత్యేకంగా వెళతాను. సంతోషాన్నీ, విషాదాన్నీ సమానంగా స్వీకరిస్తా. నేను అభిమానించిన వాళ్లనుంచి ఎంత నేర్చుకున్నానో, అవమానించిన వాళ్లనుంచీ అంత నేర్చుకున్నా. ఒకళ్ల నుంచి స్ఫూర్తిపొందితే, ఇంకొకళ్ల నుంచి పాఠాలు నేర్చుకున్నా.
ఏకలవ్యుడితో పోలిక ఉంది
రచయితగా నాకు బాగా తృప్తినిచ్చిన సినిమా కృష్ణ, జయప్రద, గుమ్మడి నటించిన 'ఏకలవ్య'. ఆ సినిమాకి కథ, మాటలు కొండవీటి వెంకటకవి రాస్తే, పాటలు, పద్యాలు, దండకాలు నేను రాశా. ఆ సినిమా గురించి మాట్లాడుతూ 'తెలుగులో ఇంతటి సాహిత్య విలువలున్న సినిమాని ఇంతదాకా చూడలేదు' అన్నారు బెజవాడ గోపాలరెడ్డి. 'ఏకలవ్య' నా జీవితానికి సంబంధించిన చిత్రం. ఏకలవ్యుడికీ, నాకూ పోలికలున్నాయి.
నేను కోరుకునేది అదే
నిర్మాతగా నాకు బాగా తృప్తినిచ్చిన చిత్రం శోభన్‌బాబు నటించిన 'కోడెనాగు'. నేను రాసిన 'సంగమం సంగమం అనురాగ సంగమం' పాట పెద్ద హిట్. ఆర్థికంగా కూడా ఆ సినిమా సంతృప్తినిచ్చింది. ఇక నాకు నచ్చని నా సినిమాల్లో 'ముత్యాల పల్లకి' ముఖ్యమైంది. ఆ సినిమాలోనూ నా పాటలు హిట్. బయ్యర్లు ఆ సినిమా కోసం పోటీపడ్డారు. వాళ్లు అడిగిన రేటుకే ఇచ్చా. నాకు లాభం వచ్చినా, వాళ్లంతా నష్టపోయిన బాధ ఇప్పటికీ నాలో ఉంది. 'నేనొక్కణ్ణి బాగుంటే చాలదు. అందరూ బాగుండాలి' అని కోరుకుంటా. ఎందుకంటే ఆ అందరిలో నేనూ ఉంటా కాబట్టి.
అదే గొప్ప పిక్చర్
మా అబ్బాయి శ్యాంప్రసాద్‌రెడ్డికి 'సినిమా నిర్మాణం వద్దు నాయనా' అని చెప్పా. 'మీ అడుగుజాడల్లోనే నడవాలనుకుంటున్నా. నన్ను వదిలేయండి' అన్నాడు. అలా తొలి ప్రయత్నంగా 'తలంబ్రాలు' తీశాడు. తను తీసిన సినిమాలన్నింట్లోకీ అది గొప్ప పిక్చర్. దాన్ని చూసి 'ఇలాంటి సినిమా నేను తీయలేకపోయానే' అనుకున్నా. తర్వాత ఆహుతి, అంకుశం, ఆగ్రహం, అమ్మోరు, అంజి, అరుంధతి సినిమాలు తీశాడు. 'అంజి' కోసం చిరంజీవి చాలా కష్టపడ్డారు. అయినా ఆ సినిమాలో వచ్చిన నష్టం వల్ల మా ఆస్తుల్లో 80 శాతం గాలికి కొట్టుకుపోయాయి. ఎన్ని సక్సెసులు తీసినా ఒక ఘోరమైన ఫ్లాప్ వస్తే ఫలితం ఎలా ఉంటుందనే దానికి అది ఓ ఉదాహరణ.
మా అబ్బాయి గొప్పవాడు
'అరుంధతి'లో హీరో లేడు. 'అంజి'లో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని, ఆ తప్పులు లేకుండా 'అరుంధతి' తీశాడు. అది గొప్ప సబ్జెక్టు కాదు. స్క్రీన్‌ప్లే, పాత్రల గొప్పతనంతో అది సంచలనాత్మక విజయం సాధించింది. ఆ సినిమాతో చేతికందనంత ఎత్తు ఎదిగిపోయింది అనుష్క. మా అబ్బాయి అని గొప్పలు చెప్పడం కాదు. వాడు దేనికీ రాజీపడడు. వ్యక్తిగా గొప్పవాడు. సినిమా తీసేముందు నా పాదాలకు దణ్ణం పెడతాడు. ఇవాళ వాడు లేకపోతే నేను లేను. వరుస విజయాలు వచ్చినప్పుడు ఎలా చూసినా, ఇప్పుడు పువ్వులా చూసుకుంటున్నాడు.
బాధలు పడుతోంది ప్రొడ్యూసర్లే
ఇవాళ సినిమా రంగంలో ఎవరు పచ్చగా ఉన్నారు? హిందీ తర్వాత మనమే ఎక్కువ సినిమాలు తీస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు. కానీ సినిమావాళ్లలో హాయిగా జీవిస్తోంది టెక్నీషియన్లు, డైరెక్టర్లు, చిన్నా పెద్ద ఆర్టిస్టులే. ప్రొడ్యూసర్లు మాత్రం నానా బాధలూ పడ్తున్నారు. సినిమాల వల్ల సర్వం కోల్పోయి, చనిపోయిన నిర్మాతల్ని తలుచుకుంటే కన్నీళ్లు వస్తుంటాయి.
నా ధ్యాసంతా దాని మీదే
నేను బతికి ఉన్నానని చిత్రసీమలోని 90 శాతం మందికి గుర్తు ఉండదనుకుంటా. ఇప్పుడు నా ధ్యాసంతా నేను రాస్తున్న 'ఇదీ నా కథ' అనే నా జీవిత చరిత్ర మీదే ఉంది. పది నెలల నుంచీ రాస్తున్నా. అదే తపస్సు నాకు. ఇప్పటికి ఐదు వెర్షన్లు రాసినా తృప్తి కలగలేదు. ఆరో వెర్షన్ రాస్తున్నా. ఆత్మకథ అనేది కత్తిమీద సాము. మనిషి జీవితంలో చెప్పేవి, చెప్పకూడనివి ఉంటాయి. మంచీ చెడూ నిజాయితీగా చెప్పగలిగితేనా జీవిత చరిత్ర రాయాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు నాకు 87 వచ్చింది. తుదిశ్వాస విడిచేదాకా కాగితం, కలం ఉండాలనేది నా ఆశ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment