Saturday, August 28, 2010

Movies: Trend of Remix Songs


ఇది రీమిక్స్ యుగం. రీమేక్స్ యుగం. ఒక భాషలో హిట్టయిన సినిమాల్ని మరో భాషలో రీమేక్ చేస్తుండటం సర్వ సాధారణం. అట్లా వేరే భాషల్లో హిట్టయిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయితే, ఎన్నో తెలుగు హిట్ సినిమాల్ని వేరే భాషల్లో తీశారు. అదొక పద్ధతి. ఇంకో పద్ధతేంటంటే.. పాత హిట్ పాటల్ని రీమిక్స్ చేయడం. అంటే పల్లవిని అలాగే ఉంచి, చరణాల్ని కొత్తగా రాసి, పాటని కొత్తగా కంపోజ్ చేయడం.
తెలుగులో ఈ రీమిక్స్ సాంగ్స్ ఒక ట్రెండుగా మారింది పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన 'ఖుషి'తో అని చెప్పాలి. 2001లో వచ్చిన ఆ సినిమాలో 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' అంటూ భూమికని పవన్ కల్యాణ్ టీజ్ చేయడం ఇంకా మన కళ్లముందు మెదులుతూనే ఉంది. అలనాటి చిత్రరాజం 'మిస్సమ్మ'లో ఈ పాట మాతృక ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్, సావిత్రిపై తీసిన ఈ పాటని ఆడవాళ్లపై మగవాళ్లు ఇప్పటికీ ఓ ఆయుధంగా వాడుతున్నారు.
ఎన్టీఆర్ సూపర్ హిట్ పాటలే ఎక్కువగా రీమిక్స్ కావడం ఇక్కడ గమనించాలి. పెద్ద ఎన్టీఆర్ పాటల్ని రీమిక్స్ చేయడానికి చిన్న ఎన్టీఆర్ తెగ ఉత్సాహం చూపిస్తున్నాడు. 2002లో అతను హీరోగా నటించిన 'అల్లరి రాముడు'లో పెద్ద ఎన్టీఆర్ 'వేటగాడు'లోని వానపాట 'ఆకుచాటు పిందె తడిసె'ని రీమిక్స్ చేశారు. అప్పటి సినిమాలో ఎన్టీఆర్, శ్రీదేవిపై తీసిన ఈ పాట ఏ స్థాయిలో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిందో తెలిసిందే. 'అల్లరి రాముడు'లో ఈ సాంగ్ రీమిక్స్ ని ఎన్టీఆర్, ఆర్తీ అగర్వాల్ పై తీశారు. అప్పటి 'యమగోల'లో జయప్రదని టీజ్ చేస్తూ ఎన్టీఆర్ పాడిన 'ఓలమ్మీ తిక్కరేగిందా' పాట, 2007లో 'యమదొంగ'లో రీమిక్స్ రూపంలో దర్శనమిచ్చింది. ఇందులో ఈ పాటకి ఎన్టీఆర్, మమతా మోహన్ దాస్ స్టెప్పులేశారు. ఇప్పుడు 'మిస్సమ్మ'లోని మరో తీయని పాట 'బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే'ని జూ. ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా 'బృందావనం'లో రీమిక్స్ చేసినట్లు సమాచారం.

No comments: