Saturday, August 21, 2010
Youth: Don't postpone your work
Youth is a period of missed opportunities
-Cyril Connolly
ప్రపంచ చరిత్రలో ఎంతో కీర్తి సంపాదించుకున్న ప్రముఖులు ఎన్నో విజయాల్ని సులువుగా సాధించగలిగారంటే అందుకు కారణం తమ వైఫల్యాల్ని అధిగమించడం చేతనేనని అర్థమవుతుంది. వారంతా ఏవో గమ్యాల్ని నిర్దేశించుకుని తమ శక్తిసామర్థ్యాల్ని పూర్తిగా వాటిపై కేంద్రీకరించడం వల్ల విజయం వారిని వరించింది.
ఉన్నతమైన, విజయవంతమైన జీవితాన్ని అందుకుని అనుభవించాలంటే యువకులు తమ గమ్యాన్ని తామే స్పష్టంగా నిశ్చయం చేసుకోవాలి. ఆ గమ్యం మీద పూర్తి అవగాహన వుండాలి. మీ మనసులో కలిగే ఆలోచనల్ని ఓ క్రమ పద్ధతిలో పేర్చేందుకు, మీరు సాధించగలరనే నమ్మకమున్న గమ్యాల్ని ఎంచుకుందుకు రోజుకు ఓ 30 నిమిషాలు వెచ్చించండి. వాటినన్నిటినీ, అవి ఎలాంటివయినా ఓ పేపరుపై రాసుకోండి. ఆ గమ్యాల్లో మీకు అతి ప్రధానమైనదేదో నిశ్చయించుకోండి. ఆ గమ్యాన్ని సాధించేందుకు మీ మనసుని సిద్ధం చేసుకోండి. సాధించలేక ఓడిపోతామేమో అనే భయం మాత్రం వదిలివేయండి. మీలో ఎన్నో ప్రత్యేక అర్హతలు, శక్తి సామర్థ్యాలు పుష్కలంగా వున్నాయి. అయినా వాటి విషయం మీకు తెలీకుండా వుండిపోతుంది. వాటిని సరిగా గుర్తించడానికి, అంచనా వేసుకోడానికి మీకిష్టమైన పద్ధతిని అవలంబించవచ్చు. మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలియాలంటే ఏదో ఓ పనిని మొదలుపెట్టండి. ఫలితం అతి త్వరలోనే మీకు అందుతుంది. ఏ పనినైతే చేయాలని తాము అభిలషిస్తున్నారో ఆ పని పూర్తయిన తర్వాత కంటే కూడా ఆ పని చేస్తున్నప్పుడే ఆనందమూ, సంతృప్తీ కలుగుతాయి. గమ్యసాధనలో ఒక అడుగు ముందుకు వేశాక అమితమైన విశ్వాసం కలుగుతుంది. అదెంతటి క్లిష్టమైన, కఠినమైన గమ్యమైనప్పటికీ!
ఇన్స్పిరేషన్
చాలామంది యువకులు ఏ పనినైనా చేయాల్సి వచ్చినప్పుడు 'ఇన్స్పిరేషన్' కోసం ఎదురుచూస్తుంటారు. ఉదాహరణకి ఒక రచయితనే తీసుకుందాం. ఇటీవలే అతను రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టాడు. 'ఇన్స్పిరేషన్' వచ్చినప్పుడు రాద్దాంలే అని పేపర్, పెన్ను పక్కనపెట్టి ఊరుకున్నాడు. ఎంతకాలం గడిచినా 'ఇన్స్పిరేషన్' కలగలేదు. ఈలోగా మధ్యలో విలువైన కాలమెంతో వృథా అయిపోయింది. ఇన్స్పిరేషన్ కోసం ఎదురుచూస్తూ కాలాన్ని వృథాచేయక ప్రతిరోజూ తమ పనులపై డృష్టిని కేంద్రీకరిస్తూ వుండాలి. ఏకాంతంగా కూర్చుని క్రమబద్ధంగా ఆలోచించగల సామర్థ్యం అలవరచుకుంటే అది మీలోని ఆత్మవిశ్వాసాన్ని గాఢతరం చేస్తుంది. మీ గమ్యాన్ని సాధించగల శక్తిని మీకు సమకూరుస్తుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోగలిగినప్పుడు మీ గమ్యానికి మీరు ఎంచుకున్న మార్గాలు సరైనవి అవునో కాదో బేరీజు వేసుకునే అవకాశం ఏకాంతం వల్ల కలుగుతుంది. మీలో వున్న అసమర్థత, చేతకానితనం గురించి ఆలోచించకుండా ఆ సమయాన్నంతా మీలో వున్న ప్రతిభను వెలికి తీసుకునేందుకు ఉపయోగిస్తే మీరో ప్రముఖమైన వ్యక్తిగా పేరును సంపాదించుకోవచ్చు. అందుకని మీలో దాగివున్న శక్తిని వికసింపజేస్తూ మీరు ఏదైతే సాధించదలచుకున్నారో దానిని వేరే యోచన లేకుండా ముందుకు తీసుకునిపొండి. ఆ ఆలోచనే ఇన్స్పిరేషన్ కావాలి.
టైమ్ లేదంటారా?
చాలామంది ఏ పనైనా చేయడానికి సమయం లేదని చెప్పబోతుంటారు. ఇది వారిలోని చొరవ లేనితనానికీ, సోమరితనానికీ చిహ్నంగా భావించవచ్చు. అందుచేత కొత్త ఆలోచన ఏదైనా మీకు కలిగినప్పుడు సమయం లేదని మాత్రం అనుకోకండి. ఆ ఆలోచనను అప్పటికప్పుడు ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించండి. ఎన్నో సమస్యలు తలెత్తుతూ వుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ సాగిపోవడమే యువకుల పని. అయితే ప్రతి విషయం తాలూకు మంచీ చెడులను, సాధ్యాసాధ్యాలను కచ్చితంగా అంచనా వేయాలనే విషయం మాత్రం మరవకండి. మీలోని ప్రతిభకు పదును పెట్టాలంటే మీ దృష్టికి వచ్చిన ఏ విషయం గురించైనా గట్టిగా ఆలోచించి, సమగ్రంగా పరిశీలించడం అలవాటు చేసుకోండి. దానిని గురించిన వివరాల్ని సేకరించండి. మీ శక్తిని మాత్రం మీరు సాధించాలనుకుంటున్న విషయాలమీద, మీకు ఆసక్తి వున్న విషయాల మీద కేంద్రీకరించండి.
సందేహమే సగం బలహీనత
కొంతమంది ఏ పనినైనా ప్రారంభించే ముందు 'ఈ పని చేయగలమో లేదో, మనకు చేతనవుతుందో లేదో' అనే సందేహంతో ప్రారంభిస్తారు. ఫలితంగా ఎదురయ్యేది అపజయమే. అలా కాకుండా విజయం సాధించి తీరాలన్న దృఢనిశ్చయాన్ని ముందుగా అలవరచుకుంటే ఆ పనిని మీరు ఎన్ని అవరోధలెదురైనా సాధించగలరు. మనం మనుషులం కాబట్టి పని మధ్యలో ఒక్కోసారి నీరసం ఆవహించవచ్చు. అప్పుడే నిజమైన పరీక్ష మనకు ఎదురవుతుంది. ఏమాత్రం సడలింపు ధోరణి కనపరచకుండా మరింతటి కృత నిశ్చయంతో పని పూర్తిచేసేందుకు సిద్ధం కావాలి.
వాస్తవిక దృష్టి
యువకులకు వాస్తవిక దృక్పథం వుండటం చాలా ముఖ్యం. మనల్ని గురించి మనం తక్కువగా ఎలా అంచనా వేసుకోకూడదో అదేవిధంగా మనల్ని మనం లేనిపోని అతిగా కూడా అంచనా వేసుకోకూడదు. మనపట్ల మనకు వాస్తవిక దృక్పథం గనక లోపిస్తే ఏ విషయాన్ని కూడా సవ్యంగా అంచనా వేయలేం. అందుకని మీ శక్తి సామర్థ్యాలను, అభిరుచులను స్పష్టంగా అంచనా వేసుకోకుండా మీరొక గమ్యాన్ని ఏర్పరచడం వలన ఏమంత ఉపయోగం వుండదు. మీరు ఏం సాధించాలన్నా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. ఏ గమ్యాన్నైనా నిశ్చయించుకునే ముందు ఆ గమ్యంపట్ల సవ్యమైన అవగాహనను పెంపొందించుకోవాలి. మనం సాధించలేని పనులను గురించి తపించడం మాత్రం సరైన పద్ధతి కాదు. మన అభిలాషలు, అభిరుచులు మన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వుండాలి. తమ గమ్యంపట్ల, తాము చేస్తున్న పనిపట్ల నిజమైన ఆసక్తి వున్న యువకులకు ఒకవేళ పరాజయం ఎదురైనా ఏమీ నిరుత్సాహం కలగదు. పరాజయాన్ని విజయంగా మార్చుకోవడం వారికి పెద్ద పని కాబోదు. కాబట్టి ఓటమి గురించి భయపడుతూ ఇప్పటివరకు మీరు వాయిదా వేస్తూ వచ్చిన కార్యక్రమాల్ని వెంటనే ప్రారంభించండి. మీ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని నిర్ద్వంద్వంగా అమలులో పెట్టండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment