డైరెక్టర్ కె.బి. తిలక్ రూపొందించిన 'ముద్దుబిడ్డ' సినిమాలోని 'చుక్కల చీర కట్టుకుని/పట్టుగుడ్డ రైక తొడుక్కొని/బుర్ర నున్నగా దువ్వుకుని/ఒంటిగ వస్తిని మామయ్యా/జంటగ ఉందము రావయ్యా' పాటని రాసింది ఆచ్చి వేణుగోపాలాచార్యులు అలియాస్ ఎ. వేణుగోపాల్. ఈ పాటకి పెండ్యాల నాగేశ్వరరావు బాణీలు కడితే, జిక్కి పాడారు.
సి. పుల్లయ్య డైరెక్ట్ చేసిన 'శ్రీ వెంకటేశ్వర మహత్యం' సినిమాలో 'చిలకా చిక్కావో ఈనాడు', 'పదవే పోదాము గౌరీ' పాటలు రాశారు వేణుగోపాల్. వీటిలో మొదటిదాన్ని రమణారెడ్డి, సురభి బాలసరస్వతిపై తీశారు. అలాగే 'జయ జయ జయ శ్రీవెంకటేశా.. జయ జయ జయ శ్రితజన పోషా' పాటని రాశారు కానీ దాన్ని సినిమాలో వాడుకోలేదు.
'తిరుపతమ్మ కథ'లో 'శ్రీవెంకటేశా దయాసాగరా' పాట రచయిత వేణుగోపాలే.
హిందీలో రాజ్ కపూర్ నటించిన 'అనాడీ'ని తెలుగులో రీమేక్ చేశారు వేణుగోపాల్. ఆ సినిమాని ఆయనతో పాటు ఆయన మిత్రుడు శంకరయ్య, మరికొంతమంది కలిసి నిర్మించారు. ఆ సినిమా కృష్ణ, జమున నటించిన 'అమాయకుడు'. అందులో వేణుగోపాల్ రాసిన 'పట్నంలో శాలిబండ/పేరైనా గోలుకొండ/చూపించు సూపునిండా../పిసల్.. పిసల్.. బండ' పాట ఎంత హిట్టో మనకి తెలుసు. ఎల్.ఆర్. ఈశ్వరి దాన్ని పాడారు.
వేణుగోపాల్ 'యాదగిరి మహత్యం' సినిమాకి దర్శకత్వం వహించారు. కన్నడంలో రాజ్ కుమార్ నటించిన 'రాఘవేంద్ర మహత్యం' సినిమాని తెలుగులో తీసినప్పుడు ఆయన మాటలు, పాటలు రాశారు.
ప్రస్తుతం చిక్కడపల్లిలో ఉంటున్న వేణుగోపాలాచార్యులు వయసు 80 యేళ్లు.
No comments:
Post a Comment