Saturday, August 28, 2010

Youth: Hyderabad's dissolute culture


యువత మీద నేడు అనేక ప్రభావాలు పడి వారిని పెడమార్గం పట్టిస్తున్నాయి. విలువలు క్షీణిస్తున్నాయి. విశృంఖలత్వం పెచ్చరిల్లుతున్నది. సిద్ధాంతాలు, విధానాలు తారుమారవుతున్నాయి. సెక్స్, హింస రాజ్యమేలుతున్నాయి. నేర ప్రవృత్తి పెరిగింది. ఈ నిజం మనకు నిత్యం బార్లు, పబ్బులు, స్టార్ హోటళ్లు, కార్పొరేట్ సంస్థల్లో కనిపిస్తోంది. యువత బలహీనతలను సొమ్ము చేసుకుంటూ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయల్లా అభివృద్ధి చెందుతున్నాయి. ఢిల్లీ, ముంబై, లక్నో, పూణే, బెంగళూరును మించిపోతున్నాయి మన రాష్ట్రంలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి నగరాలు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే దాదాపు వెయ్యి బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్బులు, స్టార్ హోటళ్లు, వైన్ షాపుల్లో మద్యం వరదలై ప్రవహిస్తోంది. మద్యం మత్తులో మునిగి తేలుతున్న వాళ్లలో 64 శాతం 18-26 ఏళ్ల మధ్య యువకులే. ప్రతి స్టార్ హోటల్, క్లబ్బు, పబ్బు, రిసార్టు రోజుకో ఈవెంట్ పేరిట అసభ్యతను, అశ్లీలాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఇటీవల బయటపడిన డ్రగ్స్, సెక్స్ రాకెట్లు ఇందుకు మంచి ఉదాహరణ. టూరిజం ప్రోత్సాహం పేరిట అనేక చట్టవిరుద్ధ కారక్రమాలకు ప్రభుత్వం తెరలేపడంతో అశ్లీలతకు, అసభ్యతకు పట్టపగ్గాలు లేకుండా తయారయింది. ఆ పర్యవసానమే రాష్ట్రాన్ని ఎయిడ్స్ లో రెండో స్థానానికి తీసుకెళ్లింది. ఆందోళన కలిగించే సంగతేమంటే కార్పొరేట్, సాఫ్టువేర్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న 20-30 ఏళ్ల మధ్య యువతీ యువకులు సాయంత్రమయ్యేసరికి పబ్బులు, క్లబ్బుల్లో చెట్టాపట్టాల్ వేసుకుని మందుకొట్టి మజా చేస్తుండటం. ఇదివరకు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, బరోడా, లక్నో నగరాలకు పరిమితమైన ఈ విష సంస్కృతి నేడు హైదరాబాదుని కబళించివేయడం. ఇందుకు సమాజమే బాధ్యత వహించాలి. తల్లిదండ్రులే ఈ బరువు మోయాలి.

No comments: