Thursday, August 26, 2010

Society: Reality Shows - A Bad Phase


రియాలిటీ షోల పేరిట పిల్లల చేత చేయిస్తున్న నృత్యాలు హద్దు మీరుతున్నాయనడంలో సందేహం లేదు. దీనిని పిల్లలను కళారంగంలో ప్రోత్సహించడంగా చెప్పుకోవడమూ సబబుగా లేదు. ఈ కార్యక్రమాలలో పాల్గొనేదే పన్నెండేళ్ల లోపు పిల్లలు. వీరి చేత అసభ్య నృత్యాలు చేయించడమే అభ్యంతరకరం. చిన్నారి బాలిక హావ భావాలు ఒలికిస్తూ ఒళ్ళు విరుస్తూ ఒక మగాడి చూట్టూ ఎగరడం, అతడి ఒళ్ళో చేరి అసభ్య విన్యాసాలు చేయడం వంటి జుగుప్సాకర రీతిలో ఈ కార్యాక్రమాలు సాగుతున్నాయి. ఉల్లాసంగా సాగాల్సిన బాలల కళా కార్యక్రమాన్ని పోటీ సంస్కృతి మరింత అమానుషంగా మార్చింది. పోటీలో నెగ్గడం కోసం పిల్లల చేత వయసుకు మించిన, కటువైన మాటలు మాట్లాడిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిక కావడం మాత్రమే కళా నైపుణ్యానికి గీటురాయి కాదనీ, వీరు చిన్న పిల్లలు కనుక అందరికీ ఎంతో భవిష్యత్తు ఉందనీ బోధించాలి. కానీ తిరస్కృతులైన బాలలు, వారి తల్లిదండ్రులు కంటతడి పెట్టడాన్ని బాదాకరమైన రీతిలో చూపిస్తున్నారు. దీనివల్ల కార్యక్రమం రక్తికడుతుందని నిర్వాహకులు భావిస్తున్నట్టుంది. కానీ ఈ క్రమంలో బాలలు అనుభవించే క్షోభను వారు గుర్తించడం లేదు. జుగుప్సాకర చేష్టలు పిల్లల చేత చేయించడం, వారి హావభావాలను, విన్యాసాలను 'పెద్దలు' ప్రశంసించడం - బాల వీక్షకులపై కూడా ప్రభావం చూపుతుంది. స్త్రీని భోగవస్తువుగా చూపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పసికూనల చేత కూడా అసభ్య నృత్యాలు చేయించడం భావ్యం కాదు. ఆ ఆటపాటలకు అర్థమేమిటో ఆ పిల్లలకూ తెలీదు. ఇతరుల వినోదం కోసం వారు తైతక్కలాడవలసి వస్తున్నది.
అసభ్య విన్యాసాలైనా, శాస్త్రీయ నృత్యమైనా పిల్లలకు వారి వయసుకు మించి నేర్పడం కూడా అభ్యంతరకరమే. తల్లిదండ్రులు తమ చదువు సంద్యలపై, కళానైపుణ్యంపై గొప్పగా చెప్పుకోవడం కోసం పిల్ల్లకు కఠోర శిక్షణ ఇప్పించడం బాలల హక్కులను హరించడమే. జంతువుల చేత సర్కస్ ఫీట్లు చేయించడం కూడా నేరమని భావిస్తున్న కాలంలో చిన్నపిల్లల చేత ఇంతగా విన్యాసాలు చేయించడం వికృత వినోదమే.

No comments: