Wednesday, August 25, 2010
Interview: AS Ravikumar Chowdary
"ఇక్కడ (సినీ రంగంలో) కెరీర్ గ్రాఫ్‌కి కొలమానం సక్సెస్ రేటే. అయినప్పటికీ ఈ రంగంలోకి వచ్చినప్పుడు ఏ స్థాయిని ఆశించానో ఆ స్థాయికి వెళతాననే నమ్మకం ఉంది'' అని చెప్పారు దర్శకుడు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి. ఇటీవలే ఈతరం ఫిలిమ్స్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మించిన 'ఏం పిల్లో ఏం పిల్లడో' సినిమాతో ఆయన విజయాన్ని చవిచూశారు. బుధవారం (25న) పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని పత్రికలవారితో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
'ఏం పిల్లో ఏం పిల్లడో'కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నా మాతృసంస్థ అయిన ఈతరం ఫిలిమ్స్‌లో చేసిన రెండో సినిమా కూడా విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజుకి పోకూరి బాబూరావుగారు నాకిచ్చిన కానుకగా దాన్ని భావిస్తున్నా.
ఇక ఏడాదికి రెండు సినిమాలు
ఇదివరకు రెండేళ్లకో సినిమా చేసేవాణ్ణి. ఇప్పుడు ఏడాదికి రెండు సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నా. సినిమా సినిమాకీ గ్యాప్ లేకుండా చూసుకుంటా. నా తదుపరి సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మొదలవుతుంది. జగపతిబాబు, మరో యువ హీరో నటిస్తారు. ఈ సినిమాలో మానవ భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చిన్న సెంటిమెంట్ కూడా ఉంటుంది. సబ్జెక్టు చాలా బాగా వచ్చింది. దాని తర్వాత సి. కల్యాణ్ నిర్మించే సినిమాని డైరెక్ట్ చేస్తా. దానికి కథ దాదాపు ఓకే అయింది. నటీనటుల సంగతి ఇంకా ఫైనలైజ్ కాలేదు.
కథ వరకే ఆయన జోక్యం
బాబూరావు గారు కథాచర్చల్లో విస్తృతంగా పాల్గొంటారు. కథ విషయంలో మంచి జడ్జిమెంట్ ఉన్న వ్యక్తి. డైరెక్టర్‌కి అది ప్లస్సే కానీ మైనస్ కాదు. ఒకసారి కథ ఓకే అయ్యి, సెట్స్ మీదకు వెళ్లాక ఆయన ఎలాంటి జోక్యం చేసుకోరు. పూర్తి స్వేచ్ఛనిస్తారు.
'యజ్ఞం' ద బెస్ట్
ఇప్పటివరకు నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో నాకు డైరెక్టర్‌గా కెరీర్‌నిచ్చిన 'యజ్ఞం' బాగా నచ్చిన సినిమా. అయితే బాలకృష్ణగారితో చేసిన 'వీరభద్ర' జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్‌ని ఇచ్చింది. ఆ తర్వాత 'ఆటాడిస్తా'. 'ఏం పిల్లో ఏం పిల్లడో'తో ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా బాగా తియ్యగలడనే పేరు తెచ్చుకున్నా.
డైరెక్టర్‌గా ఎదుగుతా
నా మిత్రులు, సన్నిహితులు అంటుంటారు.. 'డైరెక్టర్‌గా మంచి స్థాయిలో ఉండాల్సినవాడివి, ఇంకా ఇలాగే ఉన్నావు' అని. ఇక్కడ కెరీర్ గ్రాఫ్‌కి కొలమానం సక్సెస్ రేటే. ఒక్కోసారి మనం బాగా నమ్మినవి మిస్‌ఫైర్ అవుతుంటాయి. అయినప్పటికీ ఈ రంగంలోకి వచ్చినప్పుడు ఏ స్థాయిని ఆశించానో ఆ స్థాయికి వెళతాననే నమ్మకం ఉంది. నా స్నేహితులు శ్రీను వైట్ల, వి.వి. వినాయక్ టాప్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకోవడం హ్యాపీ. కచ్చితంగా వాళ్ల పక్కన చోటు సంపాదించుకుంటా.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment