Showing posts with label chandrakala. Show all posts
Showing posts with label chandrakala. Show all posts

Thursday, October 1, 2015

Beginning Days: Actress Chandrakala

తొలి రోజుల్లో.. చంద్రకళ


చంద్రకళ తల్లిదండ్రులు ఉడిపికి చెందినవారైనా, ఆమె విశాఖపట్నంలో 1947 డిసెంబర్ 25న జన్మించింది. రెండో యేట నుంచే నటరాజ రామకృష్ణ వద్ద నాట్యంలో శిక్షణ తీసుకుంది. ఐదో యేట నుంచే ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత విఖ్యాత నర్తకి బాలసరస్వతి శిక్షణలో నృత్యశాస్త్రంలోని వివిధ పదరీతులను అభ్యసించి, 1959లో మద్రాసులో అరంగేట్రం ఇచ్చింది. ఓ వైపు నర్తకిగా పేరు మారుమోగిపోతుంటే, మరోవైపు సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. తొలిగా 'శ్రీరామాంజనేయ యుద్ధం'లో యయాతి కుమార్తెగా నటించి చిత్రరంగానికి పరిచయమైంది. 'సతీ సుకన్య' చిత్రంలో బాల యముని పాత్ర పోషించింది. 1962 ప్రాంతంలో హిందీ సినీ నిర్మాత, దర్శకుడు రమేశ్ సైగల్ తాను నిర్మించే 'షోలా ఔర్ షబ్నం' సినిమాలో యంగ్ హీరోయిన్ కేరక్టర్ ఇచ్చారు. బేబీ చంద్రకళ నుంచి కుమారి చంద్రకళగా మారాక కన్నడ చిత్రం 'ఔన్‌గూడు'లో నటించి ఉత్తమ సహాయనటి అవార్డును అందుకుంది. అప్పుడే వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. గోకుల్ ఆర్ట్ థియేటర్స్ నిర్మించిన 'విశాల హృదయాలు' చిత్రంలో నటించి రాణించింది. 'ఆడపడుచు' సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. అదివరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే, ఈ సినిమా మరో ఎత్తు. ఆ సినిమా విడుదలయ్యాక ఆమెకు ఫ్యాన్ మెయిల్ విపరీతంగా పెరిగింది. ఎన్ఏటీ వారి 'వరకట్నం' చిత్రం ఆమెకు మరింత పేరుతెచ్చి, మరో పది సినిమా అవకాశాలను తీసుకొచ్చింది. 'అన్నదమ్ములు', 'ప్రతీకారం', 'ఆత్మీయులు', 'మాతృదేవత' వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. కన్నడ, తమిళ, మరాఠీ సినిమాల్లోనూ ఆమె నటించింది. ఓ వైపు నటిస్తూనే, మరోవైపు చెన్నైలోని ఎస్.ఐ.ఇ.టి. విమెన్స్ కాలేజీ విద్యార్థినిగా ఆమె బి.ఎ. పూర్తి చేయడం విశేషం.

Thursday, April 4, 2013

'స్త్రీ' (1973) రివ్యూ


ఆస్తులు, అంతస్థులు, అయినవాళ్లని కాదని ఆత్మీయత, అప్యాయత నిండిన మనసు కలిగిన ఓ ఆదర్శ వ్యక్తిని వివాహమాడి, జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా ఎదురీదిన ఓ ధీరవనిత గాథ 'స్త్రీ'. కె. ప్రత్యగాత్మ రూపొందించిన ఈ చిత్రాన్ని శ్రీ పూర్ణా మూవీస్ బేనర్‌పై అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం. చంద్రశేఖర్ సంయుక్తంగా నిర్మిచారు.
ఈ సినిమాలో తల్లీ కూతుళ్లుగా చంద్రకళ ద్విపాత్రాభినయం హైలైట్. ఆడంబరం, అహంకారం లేని ఉత్తమురాలు తల్లి అయితే, అవే కూతురి లక్షణాలు. సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా తల్లి భావిస్తే, సొంత కోరికలు తీర్చుకోవడమే తన ధ్యేయంగా కనిపిస్తుంది కూతురు. ఈ రెండు పాత్రల్లోన్ని వ్యత్యాసాన్ని ప్రతి సన్నివేశంలో ప్రతిభావంతంగా ప్రదర్శించింది చంద్రకళ. చదువు, సంస్కారం ఉన్న ఉత్తమునిగా, నలుగురి కోసం పాటుపడే కార్మిక నాయకునిగా, తనను నమ్ముకొని వచ్చిన స్త్రీని చేరదీసి, అర్ధాంగిగా స్వీకరించిన గుణవంతునిగా కృష్ణంరాజు మంచి నటనని ప్రదర్శించాడు.
ధూళిపాళ, చంద్రమోహన్, రమణారెడ్డి, మాడా, వల్లం నరసింహారావు, కె.కె. శర్మ, వై.వి. రావు, రాళ్లపల్లి, శరత్‌బాబు, విజయభాను, సాయికుమారి, మమత, బేబీ గౌరి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
నిజానికి ఈ సినిమాకి అసలైన హీరో దర్శకుడు ప్రత్యగాత్మ. సన్నివేశాల కల్పన, వాటి చిత్రీకరణ, కథనం వంటి విషయాల్లో ఆయన పనితనం అడుగడుగునా గోచరిస్తుంది. మహదేవన్ సంగీతం, రావిశాస్త్రి సంభాషణలు, శేఖర్-సింగ్ సినిమాటోగ్రఫీ, బి.ఎన్. కృష్ణ కళా దర్శకత్వం ఈ సినిమాకి మంచి ఆకర్షణని తీసుకొచ్చాయి. అయితే దీనికి 'ఎ' సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారనేది అర్థం కాదు.