Thursday, April 4, 2013
'స్త్రీ' (1973) రివ్యూ
ఆస్తులు, అంతస్థులు, అయినవాళ్లని కాదని ఆత్మీయత, అప్యాయత నిండిన మనసు కలిగిన ఓ ఆదర్శ వ్యక్తిని వివాహమాడి, జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా ఎదురీదిన ఓ ధీరవనిత గాథ 'స్త్రీ'. కె. ప్రత్యగాత్మ రూపొందించిన ఈ చిత్రాన్ని శ్రీ పూర్ణా మూవీస్ బేనర్‌పై అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం. చంద్రశేఖర్ సంయుక్తంగా నిర్మిచారు.
ఈ సినిమాలో తల్లీ కూతుళ్లుగా చంద్రకళ ద్విపాత్రాభినయం హైలైట్. ఆడంబరం, అహంకారం లేని ఉత్తమురాలు తల్లి అయితే, అవే కూతురి లక్షణాలు. సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా తల్లి భావిస్తే, సొంత కోరికలు తీర్చుకోవడమే తన ధ్యేయంగా కనిపిస్తుంది కూతురు. ఈ రెండు పాత్రల్లోన్ని వ్యత్యాసాన్ని ప్రతి సన్నివేశంలో ప్రతిభావంతంగా ప్రదర్శించింది చంద్రకళ. చదువు, సంస్కారం ఉన్న ఉత్తమునిగా, నలుగురి కోసం పాటుపడే కార్మిక నాయకునిగా, తనను నమ్ముకొని వచ్చిన స్త్రీని చేరదీసి, అర్ధాంగిగా స్వీకరించిన గుణవంతునిగా కృష్ణంరాజు మంచి నటనని ప్రదర్శించాడు.
ధూళిపాళ, చంద్రమోహన్, రమణారెడ్డి, మాడా, వల్లం నరసింహారావు, కె.కె. శర్మ, వై.వి. రావు, రాళ్లపల్లి, శరత్‌బాబు, విజయభాను, సాయికుమారి, మమత, బేబీ గౌరి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
నిజానికి ఈ సినిమాకి అసలైన హీరో దర్శకుడు ప్రత్యగాత్మ. సన్నివేశాల కల్పన, వాటి చిత్రీకరణ, కథనం వంటి విషయాల్లో ఆయన పనితనం అడుగడుగునా గోచరిస్తుంది. మహదేవన్ సంగీతం, రావిశాస్త్రి సంభాషణలు, శేఖర్-సింగ్ సినిమాటోగ్రఫీ, బి.ఎన్. కృష్ణ కళా దర్శకత్వం ఈ సినిమాకి మంచి ఆకర్షణని తీసుకొచ్చాయి. అయితే దీనికి 'ఎ' సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారనేది అర్థం కాదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment