Tuesday, April 2, 2013
'చట్టానికి వేయికళ్లు' రివ్యూ
మనిషికీ, కోరికలకీ ఉన్న సంబంధం ఎలాంటిదో, సమాజానికీ, చట్టాలకీ ఉన్న సంబంధం కూడా అలాంటిదే. కోరికలని అదుపులో పెట్టగలిగిన వ్యక్తి జీవితం, చట్టాల్ని చక్కగా పాటించే సమాజం సాఫీగా సాగిపోతాయి. కానీ వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటుంది కాబట్టే సమాజంలో రకరకాల అవాంఛనీయ సంఘటనలు, సంఘర్షణలు తటస్థిస్తుంటాయి. వాటి ద్వారా పాఠాలు నేర్చుకోవాలని చెప్పే సినిమా 'చట్టానికి వేయికళ్లు'.
విజయనిర్మల దర్శకత్వంలో రంజిత్ ఆర్ట్స్ బేనర్‌పై కానూరి రంజిత్‌కుమార్ నిర్మించిన ఈ సినిమాలో ద్విపాత్రల్లో కృష్ణ నటన, పరుచూరి బ్రదర్స్ సంభాషణలు, ఆదుర్తి హరనాథ్ ఎడిటింగ్ చెప్పుకోదగ్గ అంశాలు. కథలోకి వెళ్తే... పోలీస్ కమీషనర్ అయిన ప్రతాప్‌కుమార్, సావిత్రి ప్రేమించుకుంటారు. గురునాథం అనే కామాంధుని కాటుకి సావిత్రి బలవుతుంది. ఆమె శీలానికి వెల కడుతుంది సమాజం. నలిగిన పువ్వును ఆఘ్రాణించలేని ప్రతాప్ హృదయం కుంగిపోతుంది. ఆమెతో పెళ్లి తలంపుని విరమిస్తాడు. తల్లికీ, పోలీస్ ఇన్‌స్పెక్టర్ అయిన తమ్ముడు ఆనంద్‌కుమార్‌కీ, చెల్లికీ దూరమైపోతాడు కానీ పోలీసు అధికారిగా తన కర్తవ్యాన్ని మరచిపోడు. ప్రతాప్, ఆనంద్‌లపై రెండు దొంగల ముఠాలు పగబడతాయి. ఈ ముఠాలు జరిపే అత్యాచారాలకు ఎన్నో నిండు ప్రాణాలు బలైపోతుంటాయి. గురునాథం మృతితో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ప్రతాప్, ఆనంద్ మధ్య సంఘర్షణ చెలరేగుతుంది. ప్రతాప్ ప్రాణాలు కాపాడేందుకు సావిత్రి తన జీవితానికి తానే ముగింపు పలుకుతుంది. ప్రతాప్ విధి నిర్వహణలో ప్రాణాల్ని త్యాగం చేస్తాడు.
ప్రతాప్, ఆనంద్ పాత్రల్ని కృష్ణ, సావిత్రిగా జయసుధ ప్రతిభావంతమైన అబినయాన్ని ప్రదర్శించారు. జర్నలిస్టుగా మాధవి, కె.డి. స్వామిగా రావుగోపాలరావు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు. చక్రవర్తి సంగీతం ఆకట్టుకుంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment