Wednesday, April 17, 2013

తల్లీబిడ్డలు (1963) - రివ్యూ


దురాశకు లోనైన మనిషి ఎంతటి నీచానికైనా పాల్పడతాడు. జంకు, గొంకు లేకుండా ఎన్ని ఘోర కృత్యాలైనా చేస్తాడు. పచ్చని కాపురంలో నిప్పులు పోస్తాడు. దురాశ అతడిలోని మానవత్వాన్ని హరించివేసి, కిరాతకునిగా మార్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతడి అంతరాత్మ నశిస్తుంది. దీనిని ఆధారం చేసుకొని పి.ఎస్. శ్రీనివాసరావు రూపొందించిన చిత్రం 'తల్లీబిడ్డలు'.
జమీందార్ కేశవరావు (నాగయ్య)కు సకల సంపదలు ఉన్నా, సంతానం లేదు. దాంతో ఆయనా, ఆయన భార్యా తీరని వ్యధకు లోనవుతారు. ఈ సంగతి గ్రహించిన కారు డ్రైవర్ వెంకన్న (లింగమూర్తి)కి దురాశ కలుగుతుంది. భార్య లక్ష్మి (హేమలత) కంటికీ మంటికీ ఏకధారగా విలపిస్తున్నా లెక్కచెయ్యక దిక్కులేనివాడని అబద్ధం చెప్పి తన ఒక్కగానొక్క కొడుకును కేశవరావుకు అప్పగిస్తాడు. కొద్ది రోజుల్లోనే కేశవరావు భార్య గర్భవతై మగ పిల్లాణ్ణి కంటుంది. తన పథకం విఫలమవడంతో రాక్షసుడిగా మారతాడు వెంకన్న. ఒక రాత్రివేళ్ల పురిటిబిడ్డను ఎత్తుకుపోయి చంపేందుకు ప్రయత్నిస్తాడు. అతడికి అడ్డు తగిలి లక్ష్మి ఆ పసివాడితో సహా ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. లేకలేక కలిగిన బాబు మాయమవడంతో కేశవరావు భార్య మనోవ్యధతో మరణిస్తుంది. జమీందార్ ఇంట్లో పెరిగిన వెంకన్న కొడుకు కుమార్ (హరనాథ్) పోకిరిగానూ, లక్ష్మి పెంపకంలో పెరిగిన ప్రకాశ్ (బాలయ్య) బుద్ధిమంతుడిగానూ తయారవుతారు.
పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగంలో చేరడానికి పట్నానికి వెళ్తున్న ప్రకాశ్‌కు గీత (కృష్ణకుమారి) పరిచయమవుతుంది. కుమార్ వ్యసనాలు హద్దుమీరుతాయి. పుష్ప (రాజశ్రీ)తో అతడికి సంబంధం ఏర్పడుతుంది. అతణ్ణి మంచిదారిలో పెట్టడానికి పెళ్లి చెయ్యడమొక్కటే మార్గమని కేశవరావుకు నచ్చజెబుతాడు వెంకన్న. కుమార్ ఆస్తి మీద కన్నేసిన పుష్ప ఒక రాత్రివేళ అతడికి మత్తు మందు ఇచ్చి తెల్ల కాగితం మీద సంతకం చేయించుకుంటుంది. ఆ రాత్రే ఆమె హత్యకు గురవుతుంది. కుమార్ మీద హత్యానేరం పడుతుంది. అతణ్ణి రక్షించడానికి ఆ నేరం తానే చేసినట్లు చెప్పి అరెస్టవుతాడు కేశవరావు. దీంతో పశ్చాత్తాపానికి గురైన వెంకన్న మొదట్నించీ తాను చేసిన ఘోరాల్ని బయటపెట్టి, పుష్పని హత్య చేసింది తానేనని ఒప్పుకుంటాడు. లక్ష్మికి కుమార్, కేశవరావుకు ప్రకాశ్ దక్కుతారు. గీతా ప్రకాశ్‌లకు పెళ్లవుతుంది.
కథనంలో మరికొంత శ్రద్ధ చూపినట్లయితే సినిమా ఇంకా బాగుండేదనిపిస్తుంది. రిలీఫ్ కోసమంటూ అక్కడక్కడా కావాలని హాస్యం చొప్పించడం రాణించలేదు. పుష్ప హత్యానంతరం కథలో మలుపు వచ్చింది. అలాంటి సందర్భంలో శివరావు, మీనాకుమారి మధ్య హాస్య సన్నివేశం రిలీఫ్ నివ్వకపోగా విసుగు కలిగించింది. జమీందార్ ఇంటికి లక్ష్మి వెళ్లినప్పుడు గీత అక్కడ ఎందుకుందో అర్థం కాదు. ఇలాంటివే ఒకట్రెండు సన్నివేశాలు అసందర్భంగా కనిపించినా మొత్తం మీద సినిమా ఫర్వాలేదనిపిస్తుంది.
నటులలో అందరికంటే ఎక్కువ మార్కులు లింగమూర్తి, హేమలతకే పడతాయి. నాగయ్య, బాలయ్య, హరనాథ్, కృష్ణకుమారి పాత్రోచితంగా నటించారు. చేసింది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో రాజశ్రీ చక్కగా నటించింది. శివరావునూ, పేకేటినీ సరిగ్గా ఉపయోగించుకోలేదు. కె.ఎస్. ప్రసాద్ ఛాయాగ్రహణం నయనానందకరం. ఈ చిత్రంతో పరిచయమైన శంకరరావు సంగీతం రెండు మూడు పాటల్లో వినసొంపుగానే ఉంది.

No comments: