Showing posts with label kamalakara. Show all posts
Showing posts with label kamalakara. Show all posts

Thursday, December 10, 2015

Synopsis of the movie KALASINA MANASULU (1968)

'కలసిన మనసులు' (1968) చిత్ర కథాంశం


రామాపురం గ్రామంలో మోతుబరి వెంకటరత్నం (రేలంగి). కొడుకు శేఖర్ (జగ్గయ్య), మనవరాలు లక్ష్మి (బేబీ శంతికళ) తప్ప ఆ ఇంట్లో మరో ప్రాణి లేదు. లక్ష్మి బాగోగులు చూసేందుకు ఆయాగా నిర్మల (వాణిశ్రీ) వస్తుంది. నిర్మల అన్నయ్య రాము (శోభన్‌బాబు) పట్నంలో వెంకటరత్నం దయాధర్మాలతో చదువుతుంటాడు. ఆ ఊళ్లోనే ఉండే రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోరికల కొండలరావు (అల్లు రామలింగయ్య) ఏకైక పుత్రిక లీల (భారతి) పంతులమ్మగా పనిచేస్తుంటుంది. రాము, లీల చిన్ననాటి చెలిమితో పెద్దయ్యాక ప్రేమలో పడ్డారు. కోరికల కొండలరావుకు కోరికలు జాస్తి. తనకు కాబోయే అల్లుడు అర్హతలంటూ బ్లాక్‌బోర్డుపై ఓ దండకం రాసి వాటిని కూతురి చేత నిత్య పారాయణం చేయిస్తూ ఉంటాడు.
పట్నంలో బీకాం పరీక్ష రాసిన రాము ఇంటికి వస్తూ దారిలో మూర్తీ అండ్ కంపెనీ మేనేజర్ ఆనంద్ (రామ్మోహన్)ను దొంగల బారి నుండి కాపాడటమే కాక ఆస్పత్రిలో తన రక్తం ఇచ్చి ప్రాణదానం చేస్తాడు. రాము నిజాయితీకి, త్యాగనిరతికి ఆకర్షితుడైన ఆ కంపెనీ యజమాని రాముకు తన కంపెనీలో ఉద్యోగం ఇస్తాడు.
రాము ఆహ్వానంపై అతని ఇంటికి వచ్చిన ఆనంద్, అక్కడ లీలను చూసి, ఆమెను రాము చెల్లెలు నిర్మలగా భ్రమించి ప్రేమిస్తాడు. ప్రేమ పర్యవసానం - ఆనంద్, నిర్మల వివాహం. తీరా తాళికట్టబోయే సమయంలో నిర్మలను చూసిన ఆనంద్ 'ఇదంతా మోసం' అంటూ పెళ్లిపీటల మీదనుంచి లేచిపోతాడు. ఆ అవమానం కలిగించిన దుఃఖంతో నిర్మల తల్లి మరణిస్తుంది. పచ్చని కల్యాణమంటపం శోకానికి నిలయం కాగా, నిర్మలకు పెళ్లి చేశాకే తను వివాహం చేసుకుంటానని చివరి క్షణాల్లో తల్లికి మాటిస్తాడు రాము.
ఎందుకిలా చేశావని ఆనంద్‌ను నిలదీస్తాడు రాము. పేరు ఏదైనా తను చూసిందీ, ప్రేమించిందీ లీలననీ, ఆమె కూడా తనను ప్రేమించిందనీ, దానికి నిదర్శనం కూడా ఉందనీ దబాయిస్తాడు ఆనంద్. దీంతో నిర్ఘాంతపోయిన రాము భగ్న ప్రేమికుడిలా బాధను అనుభవిస్తుంటాడు. లీలను ఆనంద్ ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న అతని తల్లి కోర్కెల కొండలరావుతో మాట్లాడి లీల, ఆనంద్ పెళ్లి నిశ్చయం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న లీల తన హృదయంలో రాముకు తప్ప మరొకరికి చోటులేదని ఆనంద్‌కు తేల్చిచెప్పి, ఆనంద్ తన ప్రేమకానుకను ఇచ్చింది నిర్మలకేనని రుజువుచేస్తుంది. దాంతో కథ సుఖాంతం.

తారాగణం: శోభన్‌బాబు, భారతి, వాణిశ్రీ, జగ్గయ్య, రామ్మోహన్, రేలంగి, అల్లు రామలింగయ్య, హేమలత, రావి కొండలరావు, గుంటూరు వెంకటేశ్, బేబీ శాంతికళ
సంగీతం: మాస్టర్ వేణు
నిర్మాత: ఎమ్మెస్ రెడ్డి
దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు
బేనర్: కౌముది పిక్చర్స్
విడుదల తేదీ: 11 అక్టోబర్

Monday, November 23, 2015

Narthasala: The Award Winning Movie

'నర్తనశాల' (1963) అందుకున్న పురస్కారాలు

కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రాజ్యం పిక్చర్స్ నిర్మించిన 'నర్తనశాల' చిత్రం 11వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ద్వితీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి బహుమతి పొందింది. జకార్తాలో జరిగిన ఆసియా చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. కీచక పాత్రధారి ఎస్వీ రంగారావు ఉత్తమ నటుడిగా, అద్భుతమైన సెట్టింగ్స్‌తో 'నర్తనశాల' అందంగా కనిపించడానికి కారణమైన టీవీఎస్ శర్మ ఉత్తమ కళా దర్శకునిగా పురస్కారాలు అందుకున్నారు. అలాగే 1963 సంవత్సరపు ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తం తెలుగు చిత్రం అవార్డును సాధించింది 'నర్తనశాల'.

Sunday, May 22, 2011

ఫ్లాష్‌బ్యాక్: 'మహాకవి కాళిదాసు'కు జాతీయ అవార్డు

'మహాకవి కాళిదాసు' చిత్రం 1961 మార్చి 31న న్యూఢిల్లీలో 1960లో విడుదలైన తెలుగు చిత్రాల్లో ఉత్తమమైందిగా రాష్ట్రపతి రజత పతకం పొందింది. నిర్మాత సూరిబాబుకు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ బహుమతి అందజేశారు. ఆయన తమ భవనానికి దర్శకుడు కమలాకర కామేశ్వరరావునూ, ఇతర బృందాన్నీ ఆహ్వానించి ఉదయం పూట తాము వినేందుకు కాళిదాసు శ్లోకాల రికార్డును వేయించారు. ఉత్తమ నటిగా జూనియర్ శ్రీరంజనికి వెండి ప్లేటు బహూకరించారు.